YCP | చిత్తూరులో భూకంపం రాలేదే..?!
x
కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణంలో జనం మధ్య ఎంపీ మిథున్ రెడ్డి (ఫైల్)

YCP | చిత్తూరులో 'భూకంపం' రాలేదే..?!

చిత్తూరు జిల్లాను పాలించిన యువరాజును అరెస్టు చేస్తే చీమ చిటుక్కుమనేలేదెందుకు?


చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకమైన నాయకుడు. అజాతశత్రువుగా కూడా ఆయన ఇప్పటివరకు రాజకీయాలు సాగించారు. ఆయన కొడుకు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని లిక్కర్ స్కాంలో స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం అధికారులు అరెస్ట్ చేశారు.

జిల్లాలో పెద్దిరెడ్డి ఆశీస్సులతో ఎదిగిన నేతల్లో ఒకరిద్దరు వీరవిధీయులు మినహా ఎవరు కిమ్మనడం లేదు. పుంగనూరు, పలమనేరు నేతలు మాత్రం విజయవాడలో ఉన్నారు.
2015 టిడిపి అధికారంలో ఉంది. రాజంపేట నుంచి తొలిసారి ఎంపీగా గెలిచిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రేణిగుంట విమానాశ్రయం ఢిల్లీకి బయలుదేరడానికి వెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి బోర్డింగ్ పాస్ ఆలస్యం కావడం వల్ల స్టేషన్ డైరెక్టర్ తో ఘర్షణ జరిగింది. ఆ సమయంలో మొదటిసారి నమోదైన కేసుతో మిథున్ రెడ్డి అరెస్టు అయ్యారు. దీంతో
వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి వర్గం సునామీ సృష్టించింది. వారందరినీ పోలీసులు హౌస్ అరెస్టు చేసిన సంఘటన ఇక్కడ చర్చనీయాంశం. ఈ సంఘటన వివరాల్లోకి వెళ్లే ముందు..
ఆయనదే శాసనం
2004 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, అభిమానుల మధ్య పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (ఫైల్)
2019లో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లపాటు చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏకపక్షంతో పరిపాలన సాగించారు. ఆయన చెప్పింది వేదం. చేసింది శాసనంగా నడిచింది.
చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డికి వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ అండదండలు అందించారు. పార్టీ వ్యవహారాలు ఆయన సారధ్యంలోనే జరిగాయి. ys జగన్ కు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ఎంత అవసరమో, మంది మార్బలం అన్ని నియోజకవర్గాల్లో నెట్వర్క్ ఉన్న పెద్దిరెడ్డికి కూడా జగన్ అంతే అవసరమైంది. అంటే మొత్తానికి జగన్ మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై డిపెండ్ అయ్యారు.
****************
ఇది కూడా చదవండి
చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబును ఓడించాలనేది జగన్ లక్ష్యం. కుప్పం బాధ్యతలు పెద్దిరెడ్డికి అప్పగించడానికి కూడా ఓ ప్రధాన కారణం ఉంది. ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్థి రాజకీయాల నుంచి చంద్రబాబుతో పెద్దిరెడ్డికి వైరం ఉంది.
జగన్ ఆశయం ఒకటే...
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబును ఓడించాలనేది జగన్ ప్రధాన ఆశయం. మొదటి నుంచి తన రాజకీయ ప్రత్యర్థి నీ దెబ్బతీయాలి అనేది కూడా పెద్దిరెడ్డికి ఉన్న లక్ష్యం. అందువల్లే
2024 ఎన్నికల్లో "వై నాట్ కుప్పం" అనే నినాదం తెరపైకి తీసుకువచ్చారు.
"175కు 175 సీట్లు గెలుస్తున్నాం" అని వైసిపి మితిమీరిన విశ్వాసం వ్యక్తం చేసింది.
చిత్తూరు జిల్లాలో చంద్రబాబును ఓడించాలనే లక్ష్యంతోనే రాజకీయంగా బలమైన వ్యక్తి, నెట్వర్క్ ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి కి జిల్లా బాధ్యతలు పూర్తిగా అప్పగించారు. కుప్పం నియోజకవర్గ ఇన్చార్జ్ గా కూడా ఆయననే నియమించారు.
వైసిపి అధికారంలో ఉండగా చిత్తూరు నుంచి ఎంపీగా గెలిపించుకున్న ప్రధాన అనుచరుడు ఎన్. రెడ్డప్పను మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుప్పంలో ఎక్కువ కాలం గడిపేలా కార్యాచరణ అమలు చేశారు. పెద్దిరెడ్డి కూడా తరచూ కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలలో మమేకం అయ్యేవారు.
కుప్పం ఎమ్మెల్యేగా 8సార్లు చంద్రబాబు విజయం సాధించారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు "చంద్రబాబును కుప్పంలోకి పాదం మోపకుండా చేయాలి" అని అడ్డుపడడం తీవ్ర దుమారం రేపింది.
ఈ పరిస్థితుల్లో చంద్రబాబును ఓడించాలని లక్ష్యం కోసం ys జగన్ తన అస్త్రంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డిని ప్రయోగించారు. ఎలాగూ యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాల నుంచి చంద్రబాబుతో ఉన్న వైరం నేపథ్యంలో పెద్దిరెడ్డి కూడా 'సై అంటే సై' అన్నారు. చంద్రబాబును కుప్పంలో ఓడించాలని శతవిధాల ప్రయత్నం చేశారు.
బాబునే కదిలించారు..
2024 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోబోతున్నారనే విధంగా రాజకీయ వ్యవహారాలు సాగించారు.
గతంలో ఎప్పుడూ లేనివిధంగా చంద్రబాబుతో పాటు ఆయన కొడుకు నారా లోకేష్, భార్య నారా భువనేశ్వరి కూడా ప్రచారం కోసం పదేపదే రావాల్సిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో..
రాష్ట్రంలో అధికారం మారింది. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. వైసీపీ పాలనలో జరిగిన పనులపై టీడీపీ కూటమి ఫోకస్ (TDP Focus) పెట్టింది. ఒక్కొక్క అంశంగా అక్రమాలను బయటికి తీసుకువచ్చింది. న్యాయ వ్యవస్థ ద్వారా నిందితులకు శిక్ష పడే విధంగా సీఎం చంద్రబాబు కేసులకు తెర తీశారు. అందులో భాగంగానే
ఏపీ లిక్కర్ స్కాం లో ఊహించని విధంగా అనేక అంశాలను తెరపైకి తీసుకురావడంలో టిడిపి కూటమి చురుగ్గా పనిచేస్తుందని చెప్పవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం (special investigative team SIT) లిక్కర్ స్కాం మూలాలను శోధించింది. అంతర్జాతీయ స్థాయికి నెట్వర్క్ విస్తరించారని అంశాలను తెరపైకి పైకి తెచ్చి అన్ని వర్గాలను, పార్టీలను విస్మయానికి గురిచేసింది.
అదును చూసి వేటు
విద్యార్థి రాజకీయాల నుంచి విరోధిగా మారిన మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై రాజకీయ యాక్షన్ కు సీఎం చంద్రబాబుకు మంచి అవకాశం దొరికింది. ఎస్వీయూలో పైచేయి సాధిస్తూ వచ్చిన పెద్దిరెడ్డిని దెబ్బ కొట్టే అవకాశం చంద్రబాబు ఇన్నాళ్లకు లభించింది. అది స్వయంకృతమా? రాజకీయ క్రీనీడలో భాగమా? అనేది పక్కకు ఉంచితే..
ఏపీ లిక్కర్ స్కామ్ లో వైసిపి చీఫ్ వైఎస్ జగన్ కోటరీలో కీలకంగా వ్యవహరిస్తున్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి A-4 నిందితుడుగా విచారణ అనంతరం ఆదివారం విజయవాడలో అరెస్ట్ చేశారు.
కనిపించని ప్రకంపనలు
చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ద్వారా కొడుకు ఎంపీ మిథున్ రెడ్డికి పరిచయాలు, అనుచరులు లేని గ్రామాలు లేవంటే అతిశయోక్తి కాదు.
రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి అరెస్టు తర్వాత ఆ ప్రాంతాల్లో ఎక్కడ ప్రకంపనలు కనిపించలేదు. మిథున్ రెడ్డి తండ్రికి రాజకీయ జీవితం ఇచ్చిన పీలేరు నియోజకవర్గంలో చడి చప్పుడు లేదు. పెద్దిరెడ్డి రాగానే భారీ సంఖ్యలో ఎగబడే మదనపల్లిలో అంతా సైలెంట్ గా ఉన్నారు.
చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి సామాజిక వర్గం కంటే ఎస్సీలు, బీసీ నేతల ఎదుగుదలకు ఊతమిచ్చారు. కీలక రాజకీయ పదవులకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు.
తమకు రాజకీయ ఆశ్రయం ఇచ్చిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత అంత సైలెంట్ గా ఉన్నారు. ఆ కోవలో
మదనపల్లె సల్లంగా..
మదనపల్లిలో పెద్దిరెడ్డి అండదండలతో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా (ప్రస్తుతం మాజీ) విజయం సాధించిన డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యే షేక్ నవాజ్ భాషా, గత ఎన్నికల్లో పెద్దిరెడ్డి వల్ల టికెట్ దక్కించుకునీ ఓటమి చెందిన షేక్ నిస్సార్ అహ్మద్ తో పాటు ఇంకొందరు కుడి ఎడమ భుజాలుగా పనిచేసిన వారు, పదవుల కోసం లక్షల కోట్ల రూపాయలు మంచి ఇండ్లప్రాయంగా ఖర్చు చేసిన నాయకుల్లో ఇలాంటి స్పందన లేదు.
పలమనేరులో పెద్దిరెడ్డి నీడన ఎదిగి 2019లో ఎమ్మెల్యేగా గెలిచి, గత ఎన్నికల్లో ఓటమి చెందిన వెంకటే గౌడ, వి.కోట నుంచి పెద్దిరెడ్డి వర్గంలో కీలకంగా వ్యవహరించిన పిఎన్. నాగరాజు, బాలగురునాథ, ప్రస్తుత ఎంపీపీ యువరాజ్, పలమనేరులో మున్సిపల్ చైర్మన్ గా పని చేసిన శారద, పీవీ కుమార్ దంపతులు మిథున్ రెడ్డి అరెస్టుపై ఏమాత్రం స్పందించలేదు. వారి తర్వాత మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన పవిత్ర ఆమె భర్త మురళీకృష్ణ మాత్రమే
"రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు అక్రమం. ఇది రాజకీయ వేధింపులకు పరాకాష్ట" అని మాత్రమే మున్సిపల్ మాజీ చైర్మన్ పవిత్ర మురళీకృష్ణ స్పందించారు.
విజయవాడలో మకాం..
పెద్దిరెడ్డికి పుట్టినిల్లు లాంటి పుంగనూరులో చిత్తూరు మాజీ ఎంపీ ఎన్. రెడ్డెప్ప, మున్సిపల్ మాజీ చైర్మన్ కొండవీటి నాగభూషణం, జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్ మాత్రమే విజయవాడలో మిథున్ రెడ్డి వెంట ఉన్నారు. ఆయన అరెస్టు తరువాత కూడా వారు అక్కడే ఉన్నారు. కాగా, మైనార్టీ నాయకుడు షరీఫ్ (ఈయన భార్య మున్సిపల్ చైర్మన్) తో పాటు ఎవరు కూడా ప్రకటన ఇవ్వడానికి కూడా సాహసించడం లేదు. టిడిపి కూటమి ప్రభుత్వంలో తమకు రక్షణ లేదు అని వారు భావిస్తున్నారా? నోరు తెరిస్తే కేసులు బనాయిస్తారని భయపడుతున్నారా? తాము రాజకీయ పదవుల్లో ఉన్నప్పుడు జరిగిన లోటుపాట్లను బయటికి తీస్తారా,? అని భావించి సైలెంట్ గా ఉన్నారా అనేది చర్చనీయాంశంగా మారింది.
అనుకూల శత్రువులు పెరిగారా?
చిత్తూరు జిల్లా పీలేరు నుంచి 1975లో రాజకీయ అరంగటం చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటివరకు పీలేరు తర్వాత పుంగనూరులో తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆరుసార్లు విజయం సాధించారు. ఈ నియోజకవర్గాలకు మాత్రమే ఆయన పరిమితం కాలేదు.
జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో రెండు మినహా మిగతా 12 నియోజకవర్గాల్లో అభ్యర్థులను కాంగ్రెస్లో ఉన్నప్పుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్ణయించిన వారే అభ్యర్థులు అయ్యారు. ప్రతి నియోజకవర్గం లోని మండలాలు గ్రామాల్లో అనుచరులను విస్తృతం చేసుకోవడంలో ఎస్సీలు, బీసీలు, మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంలో రాజకీయ ఎత్తుగడ మరెవరికి సాధ్యం కాలేదు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత పెద్దిరెడ్డి వల్ల రాజకీయ పదవులు అనుభవించిన వారిలో మాల సామాజిక వర్గానికి చెందిన చిత్తూరు మాజీ ఎంపీ ఎన్ రెడ్డప్ప, పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎన్. రెడ్డమ్మ ఆమె భర్త కృష్ణమూర్తి, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ మాత్రమే స్పందించారు.
ఏదీ ఆనాటి స్పందన
2015లో రేణిగుంట విమానాశ్రయంలో బోర్డింగ్ పాసు చూపించే వ్యవహారంలో విమానాశ్రయ అధికారి పై చేయి చేసుకున్నారు అనే ఆరోపణపై ఆనాటి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తో పాటు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పై కూడా కేసు నమోదు చేశారు. కొన్ని రోజులకు
ఢిల్లీ నుంచి చెన్నై చేరుకున్న మిథున్ రెడ్డిని రేణిగుంట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం ముందుగానే తెలియడంతో చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి అనుచర వర్గం నాయకులు భారీగా బయలుదేరి వెళ్లారు. కొందరిని హౌస్ అరెస్ట్ కూడా చేశారు.
నెల్లూరు జైలులో రిమాండ్ లో ఉన్న మిథున్ రెడ్డికి మెయిల్ రావడంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్దిరెడ్డి అనుచరులు, వైసీపీ నాయకులు భారీగా తరలి వెళ్లి స్వాగతించారు. దారి పొడవునా వైసీపీ నాయకుల కాన్వాయ్ ఓ సునామీ సృష్టించింది అని చెప్పడంలో సందేహం లేదు. ఆ సమయంలో కూడా చిత్తూరు, పలమనేరు, మదనపల్లి ప్రాంతాలలోని రాజకీయ పదవుల్లో ఉన్న నాయకులను కూడా పోలీసులు ఇళ్లకే పరిమితం చేశారు.
తాజా పరిస్థితిని ఒకసారి సమీక్షిస్తే, 10 ఏళ్లలోనే పెద్దిరెడ్డి కూటమిలో బీటలు వచ్చాయా? అసంతృప్తితో ఉన్న నాయకులు అంతర్గతంగా సంబరపడుతున్నారా అనే మాటలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం..
పెద్దిరెడ్డిపై ఆగ్రహమా?
2024 ఎన్నికల్లో కూడా వైసిపి అభ్యర్థులను ఎంపికలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తుది నిర్ణయం గా నిలిచింది.
జిల్లాలోని గంగాధర నెల్లూరులో డిప్యూటీ మాజీ సీఎం కే. నారాయణస్వామికి బదులు ఆమె కూతురికి టికెట్ ఇవ్వడం. చిత్తూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు ( ఇప్పుడు ఆయన తిరుపతి జనసేన ఎమ్మెల్యే) టికెట్టు ఇవ్వకపోవడం.
సత్యవేడు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో ఆదిమూలం (ప్రస్తామైన టిడిపి ఎమ్మెల్యే)ను పక్కన ఉంచడం.
నగరి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆర్కే రోజా పోటీ చేసిన పెద్దిరెడ్డి వరకు మొత్తం టిడిపికి వెళ్లడం. తనకు రాజకీయ జన్మ ఇచ్చిన పీలేరులో పెద్దిరెడ్డి పాచిక పారని స్థితిలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఓటమి చెందారు.
ఈ పరిస్థితుల్లో తమకు టికెట్లు దక్కకుండా చేసిన పెద్దిరెడ్డి పై అంతర్గతంగా మాజీ ఎమ్మెల్యేలు, మొదటిసారి పోటీ చేసి ఓడిన నాయకుల్లో అంతర్గతంగా రగిలిపోతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
చిత్తూరు జిల్లాలో విస్తృత రాజకీయపరిచయాలు, నెట్వర్క్ ఉన్నప్పటికీ పెద్దిరెడ్డి కొడుకు ఎంపి మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత కూడా ఇలాంటి స్పందన లేకపోవడానికి ఇవే కారణాలుగా భావిస్తున్నారు. ఈ పరిణామాలు వైసీపీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయి అనేది కూడా చర్చ జరుగుతోంది.
Read More
Next Story