
CM on YCP | అప్పులతో పాటు వైసీపీ చెత్త కూడా వదిలేసింది:సీఎం చంద్రబాబు
అక్బోబర్ నాటికి క్లీన్ చేసి, సంపద సృష్టిస్తాం.
రాష్ట్రానికి అప్పులతో పాటు చెత్తను కూడా వదిలేసి వెళ్లిందని సీఎం ఎన్. చంద్రబాబు వ్యాఖ్యానించారు. చెత్త నుంచి సంపద సృష్టితో అప్పుల నుంచి గట్టెక్కించడానికి యజ్ణం చేస్తున్నట్లు చెప్పారు. అక్టోబర్ నాటికి పేరుకుపోయిన చెత్తను కూడా శుభ్రం చేయడానికి శ్రమిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర సచివాలయాన్ని ఆగస్టు15 నాటికి ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడం తోపాటు సర్క్యులర్ ఎకానమినీ పెంచుతాం అని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
తిరుపతిలో శనివారం విస్తృతంగా పర్యటించిన సీఎం చంద్రబాబు పోలీస్ పరేడ్ మైదానంలో స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక నుంచి సీఎం చంద్రబాబు మాట్లాడారు.
"ఆగస్టు 15 నాటికి రాష్ట్ర సచివాలయాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అక్టోబర్ 2 కల్లా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, డిసెంబర్ నాటికి రాష్ట్రమంతా దీన్ని అమలు చేస్తాం. సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌ను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిషేధించాం. స్వయం సహాయ సంఘాల ద్వారా గుడ్డ సంచులు పంపిణీ చేస్తున్నాం. ఈ ప్రపంచంలో ఏదీ వేస్ట్ కాదు. ప్రతి దాని నుంచి సంపద సృష్టించవచ్చు. స్వచ్ఛతలో తిరుపతికి అవార్డు వచ్చింది. తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రం. దేశవిదేశాల నుంచి ఇక్కడి వస్తారు. ఈ ప్రాంతం పరిశుభ్రంగా లేకుంటే మనపై మంచి అభిప్రాయం ఉండదు" అని సీఎం చంద్రబాబు సూచించారు.
స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర
‘స్వర్ణాంధ్ర సాధించాలంటే ముందు స్వచ్చాంధ్ర సాధించాలి. దీనికోసం సర్య్కలర్ ఎకానమీకి నాంది పలకాలి. సర్క్యులర్ ఎకానమీకి నమూనాగా తూకివాకంలో 300 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు పెట్టాం. వినియోగించిన నీటిని లిక్విడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ కింద పరిశుభ్రం చేసి పొలాలకు పంపుతాం. లక్షలు, కోట్లు పెట్టి కొనుగోలు చేసిన కార్లలో వచ్చి చెత్తను రోడ్లపై వేస్తారు. మనం పీల్చే గాలి బయటనుంచే కదా వచ్చేది? దాన్ని కలుషితం చేస్తే పీల్చి అనారోగ్య పాలవుతాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
అక్టోబర్ 2 నాటికి క్లీన్ ఆంధ్ర
రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను ఈ ఏడాది అక్టోబర్ రెండే తేదీ నాటికి శుభ్రం చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నట్లు సీఎం ఎన్. చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ వేరు వేసే కేంద్రాలు ఏర్పాటు చేశాం. రోజూ 8,899 టన్నుల వ్యర్థాలు వస్తున్నాయి. ఇందులో తడి వ్యర్థాలు 5,496 టన్నులు, పొడి వ్యర్థాలు 3,403 టన్నులుగా ఉంది. వీటి తరలింపు, రీయూజ్ సమర్ధంగా జరుగుతోంది. అని వివరించారు.
సెటైర్ "రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం చెత్త మీద పన్ను వేయడంపై పెట్టిన శ్రద్ధ తొలగింపుపై పెట్టలేదు" అని సీఎం చంద్రబాబు వ్యంగ్యాస్త్రం విసిరారు. వైసీపీ రాష్ట్రంలో 86 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త వేసి పోయింది. అక్టోబర్ 2 నాటికి తొలగించి, ఈ ఏడాది డిసెంబర్‌కు 100 శాతం చెత్త క్లియర్ చేస్తాం" అని సీఎం అన్నారు.
కార్మికుల కృషితోనే అవార్డులు
జాతీయస్థాయిలో రాష్ట్రానికి ఐదు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రావడంపై సీఎం ఎన్. చంద్రబాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
"స్వచ్ఛ్ సూపర్ లీగ్ 2024-25కు తిరుపతి, గుంటూరు, విజయవాడకు గుర్తింపు దక్కింది. ఇందులో విజయవాడ దేశంలోనే 4వ స్థానంలో నిలవడం ఆనందంగా ఉంది. గార్బేజ్ ఫ్రీ సిటీల్లో విజయవాడ 7వ స్థానంలో నిలిచింది. ఫైమిత్ర సురక్షిత్షెహర్ కేటగిరీలో విశాఖపట్నంకు మొదటి ర్యాంక్ వచ్చింది. ప్రామిసింగ్ స్వచ్ఛ షెహర్‌గా రాజమండ్రికి గుర్తింపు దక్కింది. ఈ అవార్డులు రావడానికి కారణమైన పారిశుధ్య కార్మికులు, మున్సిపల్ ఉద్యోగులు, అధికారులు, ప్రజలు అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరే నిజమైన సమాజ సేవకులు. ప్లాస్టిక్‌ను నిర్మూలించాలనే థీమ్‌తో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర నిర్వహిస్తున్నాం’ అని సీఎం అభినందించారు.
ప్లాస్టిక్ భూతానికి బలికావద్దు
ప్లాస్టిక్ భూతం పెను ప్రమాదంగా మారిన విషయాన్ని గుర్తు చేసిన సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
" పర్యావరణానికి ప్లాస్టిక్ అతిపెద్ద భూతంగా తయారైంది. ఈ భూతానికి ఎవరూ బలికాకూడదు. ఉదయం పళ్లు తోముకునే బ్రష్ నుంచి ఆహారం తినే ప్లేట్ వరకు అన్నింటా ప్లాస్టిక్ ఉంది. రోజు వాడి పడేసే బాటిళ్లు, కప్పులు, కవర్లు ప్రమాదకరమైనవి. ఇవి నీటిని, నేలను కలుషితం చేస్తున్నాయి. క్యాన్సర్ రావడానికి ప్లాస్టిక్ కారణం. భూమిలో ప్లాస్టిక్ వ్యర్ధాలు ఎక్కువై వర్షం నీరు భూమిలోకి ఇంకదు. మొక్కలు మొలకెత్తవు. నీటి మూలాలు మూసుకుపోతాయి. భూగర్భ జలాలు పడిపోతాయి. ప్లాస్టిక్ వినియోగం పెరిగే కొద్దీ పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. రోజూ తినే ఆహారం, నీటిలో మనకు తెలియకుండానే మైక్రో ప్లాస్టిక్స్ కలిసిపోతోంది’ అని సీఎం వివరించారు.
విషవాయులతో శ్వాస సంబంధిత వ్యాధులు
ప్లాస్టిక్ తయారీ సమయంలోనూ, వాటిని కాల్చినప్పుడు వెలువడే విష వాయువులు శ్వాస సంబంధిత వ్యాధులకు దారితీస్తున్నాయి. క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు నదులు, కాలువలు, చెరువులకు శాపంగా మారాయి. జలచరాల మనుగడకు ముప్పుగా మారుతోంది. 120 మైక్రాన్ కన్నా తక్కువున్న ప్లాస్టిక్ బాగ్స్, వాడి వదిలే కప్పులు, ప్లేట్ల వాడకాన్ని ప్రతి ఒక్కరూ మానేయాలి. ప్లాస్టిక్ బదులుగా గుడ్డ సంచులు, మెటల్ స్ట్రాలు, కంపోస్టబుల్ ప్లేట్లు వాడకాన్ని ప్రోత్సహించాలి’ అని సీఎం పిలుపునిచ్చారు.
గ్రీన్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి
‘చిన్నప్పుడు కరెంటు లేక లాంతర్ వెలుతురులోనే చదువుకున్నాను. నేడు ఇంటిపైనే సోలార్ కరెంటు ఉత్పత్తి జరుగుతోంది. 20 లక్షల ఇళ్లపై సోలార్ కరెంటు అనుమతించాం. ఇల్లూ, ఆఫీస్, పొలాలు కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రాలుగా తయారవుతున్నాయి. ఒకప్పుడు కరెంటు బొగ్గుతో తయారయ్యేది. నేడు విండ్ కరెంటు వచ్చింది. గ్రీన్ ఎనర్జీపై నేను శ్రద్ధ పెట్టాను. గ్లోబల్ వార్మింగ్ వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. దీనికి పరిష్కారం గ్రీన్ ఎనర్జీనే’ అని ముఖ్యమంత్రి అన్నారు.
ప్రాజెక్టులు పూర్తిచేసి రుణం తీర్చుంటా
రాయలసీమకు నీళ్లు తెచ్చింది టీడీపీనే అని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా ప్రజల రుణం తీర్చుకుంటానని ఆయన ప్రతిజ్ణ చేశారు.
"రాయలసీమలో హంద్రినీవా, నగరి, గాలేరు, తెలుగుగంగ ప్రారంభించింది ఎన్టీఆర్ . తెలుగుగంగ ద్వారా తిరుపతికి నీరు అందించాం. తిరుపతిలో గరుడ వారధి నిర్మించి మేమే. వారధిని అలిపిరి వరకూ తీసుకెళ్తే ఆ దుర్మార్గులు మధ్యలో ఆపే ప్రయత్నం చేశారు. అవిలాల చెరువు సుందరీకరణను అడ్డుకున్నారు. రూ.3,850 కోట్లతో హంద్రీనీవా పనులు చేసి నీళ్లు విడుదల చేశాను. త్వరలో కుప్పం వరకూ నీరు అందిస్తాం. వెంకన్న చెంతకు హంద్రీనీవా నీరు వస్తుంది. మల్లెమడుగు ప్రాజెక్టు, బాలాజీ రిజర్వాయర్ రావాలి. మూలపేట చెరువు, కల్యాణ డ్యామ్‌కు నీళ్లు తీసుకొస్తాం. సోమశిల , స్వర్ణముఖి లింక్ కెనాల్ తీసుకొచ్చి వాటిని బాలాజీ రిజర్వాయర్‌కు కలుపుతాం. వీటిమధ్యలో వేణుగోపాల సాగర్ వస్తుంది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి నేను పుట్టిన చిత్తూరుజిల్లా రుణం తీర్చుకుంటా’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Next Story