ప్రమాదంలో మహిళల రక్షణ.. జాతీయ కమిషన్లకు వైసీపీ ఫిర్యాదు
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని వైసీపీ ఆరోపించింది. హత్యలు, అత్యాచారాలు ఎక్కువయ్యాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని జాతీయ హక్కుల కమిషన్లకు ఫిర్యాదు చేసింది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు అత్యాచారం, హత్యా సంఘటలపై 77 కేసులు నమోదు అయ్యాయి. మహిళలకు రక్షణగా ఉన్న దిశ పోలీస్ స్టేషన్లు రద్దు చేశారు. కోర్టుల్లో పీపీలను కూడా తొలగించారు. దీనిపై జోక్యం చేసుకోవాలని జాతీయ మానవ హక్కులు, మహిళా కమిషన్ కు ఢిల్లీలో మంగళవారం ఫిర్యాదు చేశారు. అరకు ఎంపీ తనూజారాణి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణితో కలిసి ఎన్ హెచ్ఆర్సీ (NHRC), జాతీయ మానవహక్కుల కమిషన్ (National Human Right's Commission) చైర్మన్లకు ఫిర్యాదు చేశారు.
ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి. శాంతిభద్రతలు క్షీణించాయి. అందువల్ల పరిస్థితి పరిశీలించడానికి మహిళల రక్షణ కోసం జాతీయ మహిళా కమిషన్ జ్యోక్యం చేసుకోవాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి, అరకు ఎంపీ గుమ్మా తనూజా రాణి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కమిషన్లను కోరారు.
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 77 మంది అత్యాచారం, హత్యలకు గురైన కేసులు నమోదైన విషయాన్ని వారు కమిషన్ చైర్మన్లకు ఫిర్యాదు చేశారు.
"ఘోరమైన సంఘటనల్లో బాధితులకు న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం నిబద్దతతో వ్యవహరించడం లేదు" అని ఫిర్యాదు చేసినట్లు తిరుపతి ఎంపీ గురుమూర్తి తెలిపారు. సీఎం, హోం మంత్రితో సహా ప్రభుత్వంలోని ముఖ్యనేతలు ఇసుక, మద్యం అక్రమ దోపిడీ వ్యాపారం, ప్రతిపక్షాలను అణచివేయడం వంటి ఇతర కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు" అని కూడా కమిషన్ దృష్టకి తీసుకుని వెళ్లినట్లు వివరించారు.
"మహిళలకు రక్షణ, సత్వర న్యాయం అందించే దిశ చట్టాన్ని నిర్వీర్యం చేసి, దీని అమలులో కీలకమైన పోలీస్ స్టేషన్లు, కోర్టుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను (Public Prosecutor- PP) తొలగించిన విషయం కూడా కమిషన్లకు వివరించాం" అని తెలిపారు. మహిళలకు ఎంతో ఉపయోగంగా ఉన్న దిశ యాప్ కూడా రద్దు చేశారని ఫిర్యాదులో తెలిపారు.
మహిళలకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకుంటూ, , దిశ (Disa) కార్యక్రమాలను పునరుద్ధరించాలని అభ్యర్థించామన్నారు. ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్ ను కోరామని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి వివరించారు.
Next Story