
YCP | పెద్దిరెడ్డికి పెద్ద కష్టం
వెంటాడుతున్న కేసులతో వైసిపి ఎంపీ మిథున్ అజ్ఞాతం లోకి వెళ్ళారా?
పెద్దిరెడ్డి కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చింది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మొదటిసారి కేసులు ఎదుర్కొంటున్నారు. పెద్దిరెడ్డి పై భూములు, గనుల వ్యవహారంపై విచారణ జరుగుతోంది. ఆయన కొడుకు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఏకంగా భారీ లిక్కర్ కుంభకోణంలో చిక్కుకున్నారు. ముందస్తు బెయిల్రా కపోవడం, లుక్ అవుట్ నోటీసు జారీ అయిన నేపథ్యంలో ఎంపీ మిథున్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం.
"అక్రమ కేసులకు భయపడం. దీటుగా ఎదుర్కొంటాం" అని ఎంపీ మిథున్ రెడ్డి, ఆయన తండ్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పదే పదే చెబుతున్నారు.
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తప్పదనే వార్తలు జిల్లాలో తీవ్ర చర్చకు ఆస్కారం కల్పించాయి. పెద్దిరెడ్డి మద్దతుదారులు కూడా ఇదే విషయంలో ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది.
చిత్తూరు జిల్లాలో పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియర్ రాజకీయ నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం సాగించిన పెద్దిరెడ్డికి కేసులు, జైలు ముఖం తెలియదంటే అతిశయోక్తి కాదు.
ఏ పార్టీ అయినా సరే అజాత శత్రువుగా వ్యవహరించిన పెద్దిరెడ్డి, ఆయన కొడుకు, రాజంపేట ఎంపీ వెంకట మిథున్ రెడ్డిని కేసులు వెంటపడ్డాయి.
ఎంపీ మిథున్ కు సంకటమేనా..
రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి కష్టాలు తప్పడం లేదు.
"లిక్కర్ స్కాం లో సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ లభించకపోవడం వల్ల అరెస్టు తప్పదు" అనే విషయం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గుర్తుతెలియని వాహనంలో ఆయన బెంగళూరుకు పారిపోయినట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏపీ లిక్కర్ స్కాం (AP liquor scam) లో జరిగిన లావాదేవీల కు సంబంధించి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి A-4 నిందితుడుగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు నమోదు చేశారు. ఈ అంశంపైనే సుప్రీంకోర్టులో ప్రభుత్వం న్యాయవాది ప్రస్తావించిన నేపథ్యంలో ఆయనకు ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురైంది. దీనికి తోడు..
రెండు రోజుల కిందటే రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పై లుక్ అవుట్ నోటీసులు జారీ కూడా అయినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలోనే మిథున్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తోంది.
గతంలో మొదటిసారి
2016 జనవరిలో రేణిగుంట విమానాశ్రయంలో బోర్డింగ్ పాస్ జారీ చేసే విషయంలో ఎయిర్ ఇండియా మేనేజర్ తో జరిగిన గొడవ కారణంగా ఎంపీ మిథున్ రెడ్డి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అదే నెల 17వ తేదీ వారు బెయిల్ పై విడుదలయ్యారు. ఢిల్లీ నుంచి వస్తున్న ఆయనను చెన్నైలో పోలీసులు అదుపులో తీసుకొని నెల్లూరు జైలుకు రిమాండ్ తరలించారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ ప్రస్థానంలో వారి కుటుంబం నుంచి ఆయన కొడుకే మొదటిసారి జైలు జీవితం కొన్నాళ్లు అనుభవించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కాగా,
2024 ఎన్నికల్లో వారిద్దరు తమ నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో
"తమపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు" అని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న కేసులు ప్రస్తావించారా లేదా అనేది స్పష్టత లేదు.
కింగ్ మేకర్ ఇలా అయ్యారు..
చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పెద్దన్న పాత్ర పోషించే పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా కీలకంగా వ్యవహరించారు.
ఇతర జిల్లాల్లోని నాయకులకు కూడా ఆయనకు సన్నిహితంగా మెలిగారు. పి ఎల్ ఆర్ కంపెనీ నుంచి సబ్ కాంట్రాక్టర్ తీసుకున్న చాలామంది తెర వెనక ఆయనకు మద్దతుగా నిలిచారు.
1978లో పీలేరు నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. తొమ్మిది సార్లు పోటీ చేసిన ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి మొదట సన్నిహితంగా మెలిగిన తర్వాత విరోధిగా మారారు. ఆ తరువాత
2009 ఎన్నికల్లో వైఎస్సార్ కు చేరువైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ శాఖ మంత్రిగా బాధ్యత నిర్వహించారు. ysr అకాల మరణం తర్వాత కే రోశయ్య క్యాబినెట్లో కూడా అటవీ, పర్యావరణ, గనుల శాఖామంత్రిగా పనిచేశారు.
ఆ రోజుల్లో దగ్గరికి రాజకీయ పరిస్థితిని సమీక్షిస్తే, జిల్లాలోని ప్రతి మారుమూల గ్రామంలో అభిమానులు, మద్దతుదారులు సంపాదించుకున్న ఆయన వారికి పనులు చేయడంలోనే శ్రద్ధ తీసుకున్నారు. కుప్పం, పలమనేరు, పుంగనూరు, నగరి, చిత్తూరు నియోజకవర్గాల్లో ఎస్, బీసీ నేతలకు బాగా చేరదీశారని మాట వినిపిస్తుంది.
ఆ తర్వాత ఏమైంది..
రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు నేపథ్యంలో పెద్దిరెడ్డి కుటుంబం వైయస్ జగన్ సారథ్యంలోని వైసీపీలోకి చేరింది.
చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ తర్వాత వైసీపీలో కూడా ఆయనే కీలకంగా రాజకీయాలు సాగిస్తున్నారు.
పుంగనూరు నుంచి ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీగా ఆయన కొడుకు మిథున్ రెడ్డి, తంబళ్లపల్లె నుంచి. ఆయన సోదరుడు ద్వారకానాథరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగతా నియోజకవర్గాల్లో కూడా పెద్దిరెడ్డి శాసనకర్తగా మారారు. తాను చెప్పిన వారికే టికెట్లు ఇప్పించుకున్నారు.
"వైసీపీలో చేరిన తర్వాత 14 ఏళ్ల ప్రస్థానంలో అనుచర నాయకులు ఎవరికి జైలు కష్టాలు తగలలేదు"
పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డికి మాత్రం రేణిగుంట ఎయిర్పోర్ట్ వ్యవహారంలో మొదటిసారి ఎదురు దెబ్బ తగిలింది.
ప్రభుత్వంలోకి వచ్చాక..
2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మళ్ళీ అడవి పర్యావరణ, గనుల శాఖ దక్కించుకోవడం ద్వారా చక్రం తిప్పారు.
"రాయలసీమలోనే కాకుండా, రాష్ట్రంలో గనుల నిర్వహణ వ్యవహారంలో ఇష్టం రాజ్యంగా వ్యవహరించారు" అని ప్రతిపక్షంలో ఉండగా టిడిపి నేతలు ఆరోపించారు.
కూటమి అధికారంలోకి రాగానే విచారణకు ఆదేశించిన ప్రభుత్వం అనేక కేసులు తెరపైకి తీసుకువచ్చింది.
చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు దగ్ధమైన వ్యవహారం మొత్తం పెద్దిరెడ్డి చుట్టూనే పరిభ్రమించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా, కడప నుంచి విభజించిన అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి ప్రాంతంలో ప్రభుత్వ భూములు ఆక్రమణ, డీకేటీ భూములు, నిషేధిత భూములను పట్టాలు చేయించుకున్న వ్యవహారం తెరపైకి వచ్చింది. దీనిపై కేసరి కూడా సాగుతుంటే, పెద్దిరెడ్డి కీలక అనుచరులు కూడా అరెస్టయ్యారు వారిలో ఇద్దరు ఆర్డీవో ఇస్తాయి అధికారులు కూడా ఉండడం గమనించదగిన విషయం.
అజ్ఞాతంలోకి వెళ్ళాడా?
ఏపీ లిక్కర్ స్కామ్ లో బెయిల్ లభించని స్థితిలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పెద్దిరెడ్డి వర్గీయులు కలవరం రేకెత్తింది. ఈ పరిస్థితిని ఎలా ఎదురుకోవాలి అనే విషయంపై కూడా మల్ల గుర్రాలు పడుతున్నారు. లిక్కర్ కుంభకోణంలో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయనేది వేచి చూడాల్సిందే.
Next Story