
తిరుపతిలో మద్యంపై మహిళల సమరం
మహిళా దినోత్సవం రోజు మహిళలు కొంగు బిగించారు. వైన్ షాప్ బ్యానర్లు దగ్ధం చేశారు. దుకాణం షట్టర్లు మూసివేసి నిరసన వ్యక్తం చేశారు.
జనవాసాల మధ్య మద్యం దుకాణం తొలగించాలని మహిళా సంఘం నేతలు డిమాండ్ చేశారు. తిరుపతి నగరంలో ర్యాలీ నిర్వహించడంతో పాటు వైన్ షాప్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మహిళా దినోత్సవం రోజు శనివారం తిరుపతిలో జరిగింది.
తిరుపతి నగరం సాయినగర్ లో నివాస ప్రాంతంలో ఏర్పాటు చేసిన వైన్ షాప్ వద్ద శనివారం మహిళల ఆందోళనతో ఉద్రిక్తతకు దారితీాసింది.
అంతకుముందు బైరాగిపట్టెడ సిపిఐ కార్యాలయం నుంచి తొలుత మహిళలు ప్రదర్శనగా వైన్ షాప్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కొద్దిరోజులుగా ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నప్పటికీ వైన్ షాప్ అక్కడే కొనసాగిస్తుండడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. షాపు బ్యానర్లు చించి వేసి దగ్ధం చేశారు. వైన్ షాప్ షట్టర్లు మూసి వేసి నిరసనకు పూనుకున్నారు.
అడ్డుకున్న పోలీసులు
వైన్ షాపు వద్ద బ్యానర్లు దగ్ధం చేయకూడదంటూ మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైన్ షాప్ యజమానులకు పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలకు రక్షణ కల్పించాలని, నివాసాలు, బ్యాంకులు, విద్యార్థుల హాస్టల్, ఆసుపత్రి మధ్య ఏర్పాటుచేసిన దుకాణాన్ని ఎత్తివేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నదియా మాట్లాడుతూ,
తిరుపతి సాయి నగర్ పంచాయతీ జయనగర్ మెయిన్ రోడ్డులో మద్యం షాపు ఏర్పాటు చేయడం దారుణం అన్నారు. వైన్ షాప్ ఆనుకొని ఆసుపత్రి, మహిళా సంఘాలకు సంబంధించిన బ్యాంకు లు ఉన్నాయని, ఇక్కడికి వచ్చే రోగులకు మహిళలకు చాలా ఇబ్బంది కరం అని ఆవేదన వ్యక్తం చేశారు. వైన్ షాప్ చుట్టుపక్కల వందలాది ఇళ్లు ఉన్నాయని, మద్యం దుకాణం వల్ల ప్రశాంతంగా మహిళలు ఇంటికి చేరే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వైన్ షాప్ ఎదురుగానే విద్యార్థుల హాస్టల్ ఉందని, మద్యం దుకాణం వల్ల మందుబాబుల ప్రభావం వారిపై పడుతుందని అన్నారు. దుకాణాన్ని వేరే ప్రాంతానికి మార్చాలని నిరసన వ్యక్తం చేస్తుండగా.. పోలీసులు వైన్ షాప్ యజమానులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉద్యమాన్ని అణిచివేయాలని చూడడం శోచనీయం అన్నారు. ఎక్సైజ్ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికైనా జోక్యం చేసుకొని సాయి నగర్ పంచాయతీ వద్ద ఏర్పాటుచేసిన వైన్ షాప్ ని తరలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు మంజుల, రత్నమ్మ, ప్రమీల, లక్ష్మీ, విజయ, అవనాక్షి, కవిత, అలివేలు, తదితరులు పాల్గొన్నారు.