ఒక్కణ్ణి చంపడానికి మంచం కింద ఇన్ని డిటోనేటర్లా: ఉలిక్కిపడిన పులివెందుల
x

ఒక్కణ్ణి చంపడానికి మంచం కింద ఇన్ని డిటోనేటర్లా: ఉలిక్కిపడిన పులివెందుల

ఆదివారం అర్ధరాత్రి పులివెందుల ప్రాంతం ఉలిక్కిపడింది. ఓ కుటుంబాన్ని అంతం చేయడానికే పేలుళ్లు డిటోనేటర్లు పేల్చారా? ఇంతకీ ఏమి జరిగింది..?


పులివెందుల ప్రాంతానికి ఫ్యాక్షన్ గడ్డగా పేరు. బాంబులు, వేటకొడవళ్లు స్వైరవిహారం చేశాయి. అదంతా పాత రోజులు. ఈ ప్రాంతంలో గనులు ఉన్నప్పటికీ పేలుళ్లకు మత్రమే జిలెటిన్ స్టిక్స్ వాడేవారు. వ్యక్తిగత కక్షలకు వాడిన దాఖలాలు లేవు. తాజాగా పేలుళ్లకు జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు వాడడంపై ఉలిక్కిపడ్డారు. వీటిని ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారు. ఎందుకు వాడారనేది తేలాల్సి ఉంది.

అసలు విషయానికి వస్తే..
కడప జిల్లా పులివెందుల ప్రాంతం ప్రశాంతంగా ఉంది. కక్షలు, కార్పణ్యాలు ఎప్పుడో సమసిపోయాయి. ఉన్నట్టుండి వేమల మండలంలో జరిగిన పేలుడుతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓ కుటుంబాన్ని అంతం చేసే లక్ష్యంగానే పేలుడు సాగించినట్లు చెబుతున్నారు. ఇంతకీ అక్కడ డిటోనేటర్లు పేల్చారా? జెలిటిక్స్ పేల్చారా? ఇదే ఇప్పుడు కడప జిల్లాలో చర్చకు దారితీసింది. ఇంతకీ ఆదివారం అర్ధరాత్రి అక్కడ ఏమి జరిగింది?

కడప జిల్లా వేముల మండలం వి. కొత్తపల్లెకు చెందిన యాలంకూరి నరసింహులు (40)కు వీఆర్ఏగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య శివలక్ష్మి, తల్లి, ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. యధావిధిగా తల్లీ, పిల్లలు ఇంట్లో నిద్రిస్తున్నారు. నరసింహులు, ఆయన భార్య ఇంటి బయట రేకుల షెడ్డు కింద వేర్వేరు మంచాలపై పడుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి వారి మంచం కింద భారీ పేలుడు సంభవించింది. ఈ ధాటికి నరసింహులు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన భార్య శివలక్ష్మి స్వల్పంగా గాయపడింది. ఇంట్లో నిద్రిస్తున్న నరసింహులు తల్లికి కూడా స్వల్పంగా దెబ్బలు తగిలాయి.

అందరూ నిద్రిస్తున్న సమయంలో వచ్చిన భారీ పేలుడు శబ్దంతో ఊరంతా ఉలిక్కిపడింది. గాయపడిన నరసింహులు ఆయన భార్య శివలక్ష్మి అరుపులతో చుట్టుపక్కల వారంతా ఆందోళనకు గురయ్యారు. కాసేపటికి గాయపడిన వారి కేకలు విని, ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే రక్తగాయాలతో ఉన్న నరసింహులును సమాచారం అందుకున్న 108 సిబ్బంది వేములలోని పులివెందుల వైఎస్ఆర్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడని సమాచారం అందింది. పేలుడు వల్ల శకలాలు తగలడంతో శివలక్ష్మి మోకాళ్లకు గాయాలయ్యాయి. ఆమెను మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

ఇదిలా ఉండగా, పేలుడు సమాచారం అందుకున్న పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నరసింహులును అంతం చేయాలనే లక్ష్యంగా జిలెటిన్ స్టిక్స్ పేల్చాడనే సందేహంపై సిగ బాబు అనే వ్యక్తని సోమవారం వేకువజామున ఉదయం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. గతంలో నరసింహులుతో బాబుకు ఘర్షణలు జరిగినట్లు తెలిసింది. అసలు పేలుడుకు పాల్పడడానికి దారితీసిన వ్యవహారం ఏంటనే కోణంలో విచారణ సాగిస్తున్నట్లు తెలిసింది.
ఈ సంఘటనపై పులివెందుల ఆర్క్ వ్యాలీ సీఐ వీ. నాగరాజు 'ఫెడరల్ ప్రతినిధి'తో మాట్లాడారు. వేముల మండలంలో సంఘటన జరిగింది వాస్తవం అని నిర్ధారించారు. ఈ ప్రాంతంలో ఈ తరచూ పేలుళ్లు జరగడం కూడా మొదటిసారి అని కూడా ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Read More
Next Story