వైఎస్సార్ సీపీ ఎంఎల్సీపై ఎందుకు కేసు నమోదైంది?
x

వైఎస్సార్ సీపీ ఎంఎల్సీపై ఎందుకు కేసు నమోదైంది?

వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీపై గుంటూరులో కేసు నమోదైంది. ఆయన పీఆర్ఓని కూడా నిందితుడిగా ఫిర్యాదులో ఆరోపించారు. ఇంతకీ ఎంఎల్సీ భరత్ ఏమి చేశారు. ఆయన స్పందన ఏమిటి?


చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ గుంటూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. టీడీపీ నేత చిట్టిబాబు అనే వ్యక్తి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. తిరుమల శ్రీవారి తోమాలసేవ దర్శన టికెట్ల కోసం తన పీఆర్ఓ ద్వారా సిఫారసు లేఖ విక్రయించి, మోసం చేశారని ఆ వ్యక్తి ఫిర్యాదులో ఆరోపించారు.

విపక్ష వైఎస్ఆర్ సీపీకి చెందిన నేత కావడం వల్ల ఈ కేసు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. గుంటూరుకు చెందిన టీడీపీ నేత చిట్టిబాబు ఫిర్యాదుతో గుంటూరు జిల్లా అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు వివరాలు పరిశీలిద్దాం.

చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ స్థానం నుంచి 2024 ఎన్నికల్లో సీఎం ఎన్. చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన భరత్ ఓటమి చెందారు. 2019 లో కూడా ఓటమి చెందిన భరత్ కు మాజీ సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన విషయం తెలిసిందే. తాజా సార్వత్రిక ఎన్నికల తరువాత కుప్పంలో అద్దెగదిలో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ సీపీ కార్యాయాన్ని మూసేశారు. మళ్లీ అక్కడ హోటల్ ప్రారంభించడానికి హోర్డింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఫలితాల అనంతరం ఎంఎల్సీ భరత్ తన మకాం హైదరాబాద్లోని నివాసానికి మకాం మార్చేశారు. దీంతో కుప్పంలో కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో ఉంటే.. ద్వితీయశ్రేణి నేతలు అధికార టీడీపీలోకి వెళ్లడానికి దారులు వెదుక్కుంటున్నారు. ఇదిలావుండగా,
ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్

సాధారణంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టీటీడీ ముద్రించిన లేఖల పుస్తకాలు అందిస్తుంది. వారికి కల్పించే ప్రోటోకాల్ లో ఇది భాగం. కాగా, మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యతగా ప్రజా ప్రతినిధులు ఇచ్చే లేఖలకు టీటీడీ వసతి సదుపాయం తోపాటు దర్శనాలకు ప్రాధాన్యత ఇవ్వడం దీర్ఘకాలంగా జరుగుతున్న వ్యవహారమే. అయితే,
కుప్పం నుంచి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి, ఓటమి చెందిన ఎమ్మెల్సీ హోదాలో ఉన్భన రత్ కు కూడా ప్రోటోకాల్ ఉంది. తిరుమల శ్రీవారి తోమాలసేవలో పాల్గొనేందుకు టికెట్లు కేటాయించాలని ఆయన సిఫారసు లేఖ ఇచ్చారనే ప్రచారం సాగుతోంది. గుంటూరు ప్రాంతానికి చెందిన భక్తులకు ఎంఎల్సీ సిఫారసు లేఖ ఇచ్చిన ఆయన పీఆర్ఓ రూ. మూడు లక్షలు తీసుకున్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఆ లేఖ ద్వారా టికెట్లు లభించాయా? లేదో..? తెలియదు కానీ, మూడు లక్షల తీసుకుని మోసం చేశారు. అని ఎమ్మెల్సీ భరత్, ఆయన పీఆర్ఓ మల్లికార్జునపై టీడీపీ నేత చిట్టిబాబు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై గుంటూరు అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్సీ భరత్ పీఆర్ఓ మల్లికార్జునకు లేఖ ఎప్పుడు ఇచ్చారు? ఆ.. పీఆర్ఓ మల్లికార్జున గుంటూరుకు చెందినవారిగా చెబుతున్న వ్యక్తులు ఎవరు? యాత్రికులు కాకుండా, టీడీపీ నేత చిట్టిబాబు ఫిర్యాదు చేయడం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు లేవు.
పోలీసులపై తీవ్ర ఒత్తిడి..!
ఈ వ్యవహారంపై ఫెడరల్ ప్రతినిధి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు.
గుంటూరు అరండల్ పేట సీఐ శ్రీనివాసరావుకు ఫోన్ చేయగా, "ఆ వివరాలు నా దగ్గర లేవు. నేను బయట ఉన్న. అయినా వివరాలు చెప్పను" అని వ్యాఖ్యానించారు. "అసలు మీరు ఎవరు? మీ అక్రిడేషన్ వాట్సాప్ లో పంపండి. అప్పుడే వివరాల చెప్తా" అని తేల్చి వేశారు.
"వీడియో కాల్ చేస్తా. వివరాలు చెప్పండి" అంటే కూడా.. ఎమ్మెల్సీ భారత్ పై నమోదైన కేసు వివరాలు చెప్పను" అని తిరస్కరించారు.
"ఉదయం నుంచి నాకు విపరీతమైన కాల్స్ వస్తున్నాయి. ఎవరు ఫోన్ చేస్తున్నారో అర్థం కావడం లేదు" అని వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్సీ భరత్ వైఎస్ఆర్ర్సి సీపీ నేత కావడంతో ఆ పార్టీకి చెందిన నేతల నుంచి పోలీసులకు విపరీతంగా ఫోన్ కాల్స్ వస్తున్నాయనే విషయం దీనిని బట్టి అర్థం అవుతోంది. వారికి సమాధానాలు చెప్పలేక పోలీసులు సతమతం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఆ ఒత్తిడి భరించలేక ఎవరు.. ఎవరో అర్థం కాని స్థితిలో సీఐ శ్రీనివాసరావు ఒత్తిడికి గురవుతున్నట్లు కనిపించింది.
ఈ కేసుపై గుంటూరు డీఎస్పీ మాట్లాడుతూ, "కేసు దర్యాప్తులో ఉంది. అని మాత్రమే చెప్పారు. ఇందులో వాస్తవికత ఎంత ఉంది అనేది విచారణలో తేలుతుందన్నారు.
వేధింపులేనా..?
రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో, అధికార పార్టీ తమను టార్గెట్ చేసిందని ప్రతిపక్ష వైయస్సార్సీపి నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు. ఈ పరంపరలో ఎమ్మెల్సీ భరత్ పై కేసు నమోదు కావడం కూడా పోలీసులపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా, ఎమ్మెల్సీ భరత్ పై కేసు నమోదు కావడం, దానిపై ఆయన స్పందన తో కూడిన వీడియో రెండు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నేను అంతలా దిగజారలేదు..


గుంటూరు అరండల్ పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంపై ఎమ్మెల్సీ భరత్ తీవ్రంగా స్పందించారు. ఆ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. అసలు "ఈ పీఆర్ఓ మల్లికార్జున ఎవరో నాకు తెలియదు" అని ఎమ్మెల్సీ భరత్ స్పష్టం చేశారు. అతని ఎవరో తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
"భగవంతుడి దర్శన టికెట్లు అమ్ముకుని బతకాల్సిన అవసరం నాకు లేదు" అని ఎమ్మెల్సీ భరత్ వ్యాఖ్యానించారు.
కుప్పం అసెంబ్లీ స్థానం నుంచి సీఎం ఎన్. చంద్రబాబునాయుడుకు దీటుగా నిలబడ్డాను. నిలబడతాం. అని ఎమ్మెల్సీ భరత్ తేల్చి చెప్పారు. సీఎం చంద్రబాబుపై పోటీ చేశాననే కక్షతోనే నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. అని ఆయన ఆరోపించారు.
"మా తండ్రి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. మాది స్థితివంతమైన కుటుంబమే. నాకు ఇలాంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడాల్సిన అగత్యం పట్టలేదు" అని ఎమ్మెల్సీ భరత్ తేల్చి చెప్పారు. నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి జరుగుతున్న పన్నాగం ఇది అని ఆయన అన్నారు.
తన పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అని కూడా ఆయన హెచ్చరించారు. ఈ వ్యవహారంపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి, వాస్తవాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుందనేది వేచిచూడాల్సిందే.
Read More
Next Story