
తిరుపతికి ఎన్టీఆర్ హెలికాప్టర్ ఎందుకు పంపారు?
తుదిశ్వాస విడిచినఎన్టీఆర్ రాజు పేరు వెనక కథేమిటంటే.
తిరుమల క్షేత్రానికి దిగువన నెహ్రూ మున్సిపల్ హై స్కూల్. ఉదయం 11 గంటలు. ఆకాశంలో చక్కర్లు కొడుతున్న ఓ హెలికాప్టర్ నెమ్మదిగా ల్యాండ్ అయింది. మధ్య వయస్కుడైన ఓ వ్యక్తిని ఎక్కించుకొని వెళ్ళిపోయింది. ఈ సంఘటన తిరుమల తోపాటు తిరుపతిలో తీవ్ర కలకలం రేపింది.
తిరుమలకు దిగువన దిగిన హెలికాప్టర్లో ఎక్కిన వ్యక్తి రామచంద్ర రాజు. పిలిపించుకున్న వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. ఎన్టీఆర్ రాజుగా పరిచితుడైన టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు రాజు బుధవారం తెల్లవారుజామున తిరుపతిలో తుది శ్వాస విడిచారు. ఆ సంఘటనతో తిరుమల రాజుగా రామచంద్రరాజు తెలిసిన ఆయనకు ఎన్టీఆర్ రాజుగా పేరు స్థిరపడిపోయింది. తిరుమలతో ఉన్న అనుబంధం నేపథ్యంలో ఎన్టీఆర్ రాజు భౌతికకాయానికి తిరుమల కాకులమానుగుట్ట శ్మశానవాటికి వద్ద గురువారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ రాజు మరణించారనే సమాచారం తెలియడంతో మాజీ సీఎం ఎన్టీరామారావు కొడుకు నందమూరి రామకృష్ణ కూడా తిరుపతికి చేరుకున్నారు.
Ntr వీరాభిమాని
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి కూడా సిల్వర్ స్క్రీన్ పై రారాజుల వెలిగిన ఎన్టీ రామారావు కు వీరాభిమాని. అఖిలభారత ఎన్టీఆర్ ఫ్యాన్స్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా బీ.రామచంద్ర రాజు అలియాస్ ఎన్టీఆర్ రాజు తన అభిమానాన్ని చాటుకునేవారు. మాజీ సీఎం ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాక ముందు నుంచి కూడా తిరుమల రాజు అత్యంత సన్నిహితంగా మెలిగిన వారిలో ఒకరిగా చెప్పవచ్చు.
ఎన్టీ రామారావు తిరుపతి పర్యటనకు వస్తే, రాజు హెలిపాడ్ వద్ద బారికేడ్ల వెనక నిలబడి ఉంటారు. ఎన్టీ రామారావు కళ్ళు ఎందుకో ఒకరి కోసం వెతుకుతూ ఉంటాయి. రాజును చూడగానే బ్రదర్ అనే పిలుపుతో జనం నుంచి ఎన్టీఆర్ రాజు చేయి ఎత్తగానే అందరి కళ్ళు రాజు వైపు మల్లుతాయి. వెంటనే సెక్యూరిటీ వారు కూడా ఆయన వద్దకు వెళ్లి ఎన్టీ రామారావు సమీపానికి తీసుకుని వచ్చేవారు. ఎన్టీ రామారావు తో తిరుమల రాజుకు ఉన్న అనుబంధం అలా ఉండేది.
రథయాత్ర..
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగింది. తిరుమలలో ఉన్న ఎన్టీఆర్ రాజుకు కూడా వర్తమానం అందింది. చైతన్య రథంలో ఎన్టీ రామారావు రాష్ట్రంలో పర్యటించడానికి ముందే తిరుమల రాజు అలియాస్ ఎన్టీఆర్ రాజు రంగంలోకి దిగారు. తిరుపతి నుంచి రథయాత్ర చేపట్టిన ఎన్టీఆర్ రాజు రాష్ట్రమంతా పర్యటించారు. అప్పటివరకు ఉన్న అఖిలభారత ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంస్థను ఎన్టీఆర్ యువసేనగా మార్పు చేశారు.
"తిరుమల ఎన్టీఆర్ రాజు రథయాత్ర చేపట్టగానే నేను జత కలిశాను. ఎన్టీరామారావుపై ఉన్న అభిమానం మిమ్మల్ని కూడా కదిలించింది" అని రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహయాదవ్ చెప్పారు. ఎన్టీఆర్ రాజుతో కలిసి యువసైన్యంలో తాను కూడా చేరడమే కాకుండా రథయాత్రలో సాగానని నరసింహా యాదవ్ 1983 నాటి రోజులను గుర్తు చేసుకున్నారు.
ఎన్టీఆర్ కుటుంబంతో అనుబంధం..
వయసు మీరడం, అనారోగ్యంతో ఉన్న ఎన్టీఆర్ రాజు బుధవారం తెల్లవారుజామున తిరుపతి ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. మాజీ సీఎం ఎన్టీ రామారావు తోపాటు వారి కుటుంబంలోని అందరిీో ఎన్టీఆర్ రాజుకు ఆత్మీయ అనుబంధం ఉంది. ఎన్టీఆర్ కుటుంబీకులు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన, ఎన్టీ రామారావు అల్లుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఊరు నారావారిపల్లెకు వచ్చినా సరే. తిరుపతిలోని ఎన్టీఆర్ రాజు ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడకుండా తిరిగి వెళ్లరు. ఎన్టీఆర్ రాజుకు ఆరోగ్యం బాగాలేదని తెలిసి ఇటీవల కొన్ని నెలల కిందట ఎన్టీఆర్ కొడుకు రామకృష్ణ తిరుపతిలోని ఎన్టీఆర్ రాజు ఇంటికి వచ్చి పరామర్శించారు.
ఎన్టీఆర్ రాజుకు నలుగురు కొడుకులు. బి శ్రీధర్ వర్మ రెండో కొడుకు. తండ్రి ఎన్టీఆర్ రాజు తర్వాత శ్రీధర్ వర్మ పార్టీలో చురుకుగా మారారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేసిన శ్రీధర్ వర్మ ప్రస్తుతం రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ గా పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబంతో కూడా శ్రీధర్ వర్మకు అనుబంధం ఏర్పడింది. ఎన్టీఆర్ కుటుంబంతో పాత అనుబంధం కొనసాగుతోంది. పదవులు ఆశించకుండా పార్టీ సేవకే తండ్రి ఎన్టీఆర్ రాజు మాదిరే శ్రీధర్ వర్మ కూడా పనిచేయడానికి ప్రాధాన్యత ఇస్తారని పార్టీ నాయకులే స్వయంగా చెబుతారు.
నాకు తెలిసి శ్రీధర్ వర్మ ఇంతవరకు పార్టీ పదవిని అడిగిన దాఖలాలు లేవని యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి నరసింహయాదవ్ అంటున్నారు.
తిరుమలలో ఎన్టీఆర్ రాజుకు మంచి పరిచయాలు అనుబంధం ఉంది. మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి ముందు శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న గొల్లమండపానికి ఎదురుగా ఇరుపక్కల బేడి ఆంజనేయస్వామి ఆలయం వరకు (సన్నిధివీధి) దుకాణాలు ఉండేవి.
"తిరుమలలోని గొల్ల మండపానికి పక్కనే దశాబ్దాల కాలంగా ఎన్టీఆర్ రాజుకు టెంకాయలు విక్రయించే దుకాణం ఉండేది" అని సీనియర్ జర్నలిస్ట్ కేతారి సహదేవ గుర్తు చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్టీ రామారావుతో ఉన్న అనుబంధం ఉన్నా ఎన్టీఆర్ రాజు తన పలుకుబడిని దుర్వినియోగం చేసుకోదంటారు. ఈ ప్రస్తావన ఎందుకంటే..
బోర్డు సభ్యుడుగా...
రాష్ట్రంలో టీడీపీ ఏర్పడిన తరువాత 1985లోనే ఎన్టీ రామారావు తన అభిమాని ఎన్టీఆర్ రాజుకు టీటీడీ బోర్డులో సభ్యుడిగా నియమించార.
"వ్యక్తిగత ప్రయోజనాలకు ఎన్టీఆర్ రాజు తన పరపతిని వినియోగించలేదు" అని సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు కూడా చెప్పారు. ఆ సమయంలో కూడా ఎన్టీఆర్ రాజు తిరుమల లో అభివృద్ధి కార్యక్రమాలు, ఉద్యోగుల సంక్షేమం, కార్మికుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చి సిఫారసు చేశారని చాలామంది చెబుతారు.
తిరుమల రాజుగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ రాజు తుదిశ్వాస విడిచారు.
ఈ సమాచారం తెలిసిన మాజీ సీఎం ఎన్టీ రామారావు కొడుకులు నందమూరి రామకృష్ణ గురువారం ఉదయం తిరుపతికి చేరుకున్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తోపాటు ఎన్టీరామారావు కుటుంబీకులు కూడా హాజరు కానున్నట్లు సమాచారం అందింది. వారు తిరుమల ఆర్బీ సెంటర్ లోని ఎన్టీఆర్ రాజు భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు. ఎన్టీఆర్ రాజు భౌతిక కాయానికి తిరుమల కాకుల మానుగుట్ట ప్రాంతంలోనే అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన కుటుంబీకుల ద్వారా తెలిసింది.
Next Story

