తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆంక్షలు ఎందుకు..?
x

తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆంక్షలు ఎందుకు..?

పార్లమెంటును తాకిన ఘటన. మీడియూపై అప్రకటిత నిషేధం.


సెంట్రల్ యూనివర్శిటీల్లో విద్యార్థినులకు రక్షణ కరువు. ఉన్నత స్థాయి విచారణకు తిరుపతి ఎంపీ గురుమూర్తి డిమాండ్. ఒడిశాకు వెళ్లిన పోలీస్ బృందం

తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయం (Tirupati Sanskrit University)లో బీఎడ్ మొదటి సంవత్సరం విద్యార్థిని లైంగిక వేధింపుల ఘటన పార్లమెంటును తాకింది. జరిగిన ఘటనపై పూర్వపరాలు వివరించడం మరిచిన విశ్వవిద్యాలయం ఇన్ చార్జీ వీసీ మీడియా ప్రతినిధులకు హెచ్చరించే ధోరణిలో ప్రకటన జారీ చేశారు. అటానమస్ విశ్వవిద్యాలయం ( Autonomous University ) కావడం వల్ల ఎవరినీ అరెస్టు చేయలేదని కూడా పోలీసులు చెబుతున్నారు. ఘటనపై వెస్టు డీఎస్సీ భక్తవత్సలం సారధ్యంలో విచారణకు పోలీసు అధికారుల బృందాన్ని తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఏర్పాటు చేశారు.

మీడియాపై ఆంక్షలు

సంస్కృత విశ్వవిద్యాలయంలో బాధితురాలి ఫిర్యాదు మేరకు తిరుపతి వెస్ట్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. బాధితురాలిని విచారణ చేయడానికి ఓ పోలీసు బృందం తిరుపతి నుంచి ఒడిశాకు వెళ్లింది. ఈ ఘటన నేపథ్యంలో విశ్వవిద్యాలయం యంత్రాంగం పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించింది. మీడియాను దరిదాపులకు రానివ్వకుండా ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని మోహరించారు.
"మీడియాను లోపలికి అనుమతించవద్దని మాకు ఆదేశాలు ఇచ్చారు" అని సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు ప్రధాన ద్వారాల వద్ద కాపలా ఉన్న సిబ్బంది వ్యాఖ్యానించారు. సిబ్బంది, విద్యార్థులు మినహా ఎవరినీ లోనికి అనుమతించలేదు. గేట్లు కూడా తెరవలేదు.
జాతీయ స్థాయి దృష్టిలో...
తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటనపై ఒడిశా రాష్ట్రం కోరాపుట్ ఎంపీ సప్తరిగి శంకర్ ఉలాక ( MP Saptigiri Shankar Ulaka ) తో కలిసి తిరుపతి వైసీపీ (YCP ) ఎంపీ మద్దెల గురుమూర్తి లోక్ సభలో వాయిదా తీర్మానం కోరడం వల్ల ఈ కేసుకు జాతీయ స్థాయి దృష్టిని ఈ అమానవీయ ఘటన ఆకర్షించింది.
"విద్యార్థినిపై ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్దా దాష్టీక ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్, కేంద్ర విద్యాశాఖ మంత్రితో పాటు మహిళా కమిషన్ దృష్టికి కూడా తీసుకుని వెళ్లాం" అని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి తెలిపారు.
ఘటన ఇదీ..
తిరుపతిలో ఉన్న జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఒడిశాకు చెందిన ఓ విద్యార్థిని బీఎడ్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ విశ్వవిద్యాలయవంలో విద్యాశాఖ లైంగికంగా వేధించాడనే ఇన్ చార్జి రిజిస్ట్రార్ రాంచంద్ శుక్లా ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్టు పోలీసు స్టేషన్ లో . Cr.No.183/2025 U/s 75(1), 77, 79, 351(2) r/w 3(5) BNS:- 06-12-2025 సీఐ వి. మురళీమోహనరావు కేసు నమోదు చేశారు.
ఇన్ చార్జి రిజిస్ట్రార్ రజనీకాంత్ శుక్లా ఫిర్యాదులో..
"తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో బీ.ఎడ్ చదువుతున్న 22 సంవత్సరాల విద్యార్థినిపై విద్యా శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ లైంగికంగా వేధించడంతో పాటు ఫొటోలు, వీడియాలు తీసి బెదిరించారు. బ్లాక్ మెయిల్ కూడా చేశారు. మానసికంగా ఒత్తిడికి గురి చేసి, భయం కలిగించారు. ఆమె విశ్వవిద్యాలయంలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీ (Anti-Sexual Harassment Committee ) కి ఫిర్యాదు చేసింది" అని ఇన్చార్జి వీసీ ఇన్ చార్జి రిజిస్ట్రార్ రజనీకాంత్ శుక్లా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై ఈ నెల ఆరో తేదీ రాత్రి ఎనిమిది గంటలకు వెస్టు సీఐ మురళీమోహనరావు కేసు నమోదు చేశారు.
ఇంతకీ ఏమి జరిగింది?
తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఒడిశా రాష్ట్రం జోజ్ పూర్ ప్రాంతానికి చెందిన బి.ఎడ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని (22)ని విద్య శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ లైంగికంగా వేధించడం గమనించిన మరో అసిస్టెంట్ రాజశేఖరరెడ్డి ప్రొఫెసర్ వీడియోలు తీసి, బెదిరించారనే విషయం మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ ఘటనపై మొదటి విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ కృష్ణమూర్తికి పది రోజుల కిందట ఫిర్యాదు చేసిన స్పందన లేదనే కూడా ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆమె సహచర విద్యార్థులతో కలిసి ఇన్ చార్జి వీసీ రజనీకాంత్ శుక్లాకు ఫిర్యాదు చేయగానే ఆయన వెస్టు పోలీస్ స్టేషన్ లో రిపోర్టు చేశారు.
ఈ ఘటన నేపథ్యంలో ఆరోపణలు ఎదొర్కొటున్న ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ లక్ష్మణ్ కుమార్, రాజశేఖరరెడ్డి ఫోన్లను సీజ్ చేసి, ఫొరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్లు సీఐ వి. మురళీమోహనరావు వెల్లడించారు.
తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ల వేధింపుల నేపథ్యంలో బాధిత విద్యార్థిని సొంత ఊరు ఒడిశాలోని జోజ్ పూర్ కు వెళ్లిందని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో ఆమెతో లైంగికంగా దాడికి పాల్పడిన ప్రొఫెసర్ వల్ల ఆమెను పంపించేశాడనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.
ఇన్ చార్జి వీసీ

తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటనపై వివరాలు చెప్పడానికి వైస్ చాన్సులర్, ఇన్ చార్జి రిజిస్ట్రార్ మొఖం చాటేశారు. మీడియాను అనుమతించకపోవడమే ఇందుకు సాక్ష్యం. ఇదిలావుంటే,
"జరిగిన సంఘనపై మీడియా అనవర కథనాలతో బాధిత యువతిని అవమాన పరుస్తున్నారంటే ఇన్ చార్జి రిజిస్ట్రార్ రజనీకాంత్ శుక్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత ప్రొఫెసర్ ను సస్పెండ్ చేశాం. అంతర్గత విచారణ జరుగుతోంది" అని రజనీకాంత్ శుక్లా జారీ చేసిన ప్రకటన ఇది.
ఒడిశాకు పోలీస్ బృందం
తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయం అటానమస్ హోదా ఉండడంతో దర్యాప్తు అధికారిగా డీఎస్పీ మోపూరి భక్తవత్సలం సారధ్యంలో ముగ్గురికి కేసు అప్పగించారు. బాధితురాలిని విచారణ చేయడానికి ఒ బృందం ఒడిశాకు కూడా బయలుదేరినట్లు సమాచారం.
మీడియాకు నో ఎంట్రీ..

తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయ ఆవరణలోకి సోమవారం ఉదయం నుంచి మీడియాను మీడియాను అనుమతించవద్దని వీసీ కృష్ణమూర్తి, ఇన్ చార్జి రిజిస్ట్రార్ రజనీకాంత్ శుక్లా ఆదేశాలు జారీ చేశారు. విశ్వవిద్యాలయానికి వెళ్లడానికి ఉన్న రెండు ప్రధాన గేట్ల వద్ద ప్రయివేటు సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేశారు.
"మీడియాను లోపలకి అనుమతించవద్దు" అని మాకు సూచనలు ఇచ్చారని సెక్యూరిటీ గార్డులు సమాధానం చెప్పారు. మీరే సమాచారం అందిచడం అని కోరినా స్పందన లేదు. అప్పటికే వెస్టు పోలీసులు విశ్వవిద్యాలయంలో మోహరించారు. కొందరు సివిల్ డ్రస్సులో కూడా ఉన్నారు. 22 సంవత్సరాల విద్యార్థికి ఏమి జరిగిందనే విషయంలో దర్యాప్తు చేస్తున్నట్లు అక్కడి సిబ్బంది ద్వారా తెలిసిన సమచారం.
జాతీయ స్థాయిలో చర్చ

పార్లమెంటులో ఈ అంశంపై తిరుపతి వైసీపీ పార్లమెంటు సభ్యుడు మద్దెల గురుమూర్తి సోమవారం ప్రస్తావించిన నేపథ్యంలో తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో జరిగిన సంఘటన జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది.
"నవంబర్ 24వ తేదీ యూనివర్శిటీ యాంటీ సెక్సువల్ హెరాష్మంట్ కమిటీ (University Anti-Sexual Harassment Committee)కి ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం. ఆ తరువాత కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణం" అని ఎంపీ గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. సంస్కృత విశ్వవిద్యాలయంలో చోటుచేసుకున్న లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిల్‌, డ్రగ్స్ ఘటనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు.
"బీఈడీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని అదే వర్సిటీలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగికంగా వేధించడం, వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను అడ్డుపెట్టుకుని బెదిరించడం అత్యంత హేయం" అని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాల్సిన గురువులే ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడటం తిరుపతి ప్రతిష్టకు దెబ్బతీస్తోందని ఎంపీ గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు.
"విశ్వవిద్యాలయం హాస్టళ్లలో తనిఖీల సమయంలో 20 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. క్యాంపస్ భద్రతా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది" అని కూడా ఎంపీ గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. సెంట్రల్ యూనివర్శిటీల్లో బాలికలు, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు రక్షణ లేకపోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Read More
Next Story