టీటీడీలో ఎవరి దారి వారిదేనా..?  అందుకేనా సీఎం ఫోకస్..!
x

టీటీడీలో ఎవరి దారి వారిదేనా..? అందుకేనా సీఎం ఫోకస్..!

టీటీడీలో సమన్వయం కొలిక్కి రాలేదా? సమష్టి నిర్ణయాలు జరగడం లేదా? ఇంతకీ ఏమి జరుగుతోంది?



వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించడం దేవుడెరుగు. ప్రస్తుతం టీటీడీ అధికారులు, పాలక మండలి మధ్య ఇంకా సయోధ్య కుదరలేదా? ఇదే కార్యాచరణలో ప్రక్షాళనకు ఇబ్బందికరంగా మారినట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో స్వయంగా సీఎం చంద్రబాబు సమీక్షించడానికి రంగంలోకి దిగనున్నారని భావిస్తున్నారు.
పరిపాలనా వ్యవహారాల్లో సీఎం చంద్రబాబు మాత్రమే కింగ్. ఈసారి అధికారంలోకి వచ్చాక ఆయన కొడుకు నారా లోకేష్ ప్రమేయం అంతర్లీనంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పే సమాచారం. ఆ కోవలోనే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈఓ శ్యామలరావు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, టీటీడీ చైర్మన్ బీఆర్.నాయుడు మధ్య సమన్వయం కుదరలేదని లోగొంతుకతో వినిపించే మాట.

బలమైన కారణాలే...

టీటీడీ అధికారులతో సీఎం చంద్రబాబు భేటీ కావాలనుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలు, నిర్మాణాలు ఓ కారణంగా చెపుతున్నప్పటికీ, రెండు ప్రధాన అంశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అందులో ప్రధానమైనది వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా తిరుపతిలో టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటపై విచారణ మొదటిదశ పూర్తయింది. ఈ అంశంతో పాటు "తిరుమల విజన్"పై ఫోకస్ పెట్టినట్టు చెబుతున్నారు. పైకి మాత్రం ఇవే కనిపస్తున్నా... వైసీపీ ప్రభుత్వ కాలంలో జరిగిన వ్యవహారాల్లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలు, ఆశ్రిత పక్షపాతంపై లోతుగా చర్చించి, దిశానిర్దేశం చేయడానికే అమరావతిలో సమీక్షించనున్నట్లు సమాచారం. వీటికంటే ముందు టీటీడీ అధికారులు, రాజకీయ ప్రతినిధులపై కొరవడిన సమన్వయాన్ని సరిదిద్దడమే ప్రధానలక్ష్యంగా కనిపిస్తోంది.

ఇదే సాక్ష్యం

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టీటీడీ పరిపాలనా భవనంలో సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో ఈఓపై చైర్మన్ బీఆర్. నాయుడు ఆరోపణలు చేయడం. సీఎం సమక్షంలోనే వారిద్దరు గొడవపడిన విషయం తెలిసిందే. దీని ద్వారా భేషజాలకు వెళ్లారనే విషయం స్పష్టమైంది.
ఈ ఘటన తరువాత కూడా టీటీడీ బోర్డులోని ఓ సీనియర్ సభ్యుడు మాట్లాడుతూ, "ఈఓ చాలా విషయాలు చెప్పకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారు" అని వ్యాఖ్యానించారు. "ఈ వ్యవహారం వల్ల సమన్వయం కుదరకపోవడానికి కారణం" అని కూడా ఆయన విశ్లేషించారు. ఇదిలావుంటే...
ఆ తరువాత తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేశంలో "టీటీడీ చైర్మన్, ఈఓ, అదనపు ఈఓ ఐక్యతా రాగాన్ని ఆలపించారు" దీని ద్వారా అందరూ కలిసి పనిచేస్తున్నామనే సంకేతాలు ఇచ్చారు. కానీ
"ఇంకా పొంతన కుదరలేదు. ఇద్దరేమే సీఎం పేరు చెబుతారు. ఒకరేమో మంత్రి నారా లోకేష్ చెబుతారు" అనేది ఈ సీనియర్ బోర్డు సభ్యుడి విశ్లేషణ. ఈ పరిస్థితుల్లో..

టీటీడీ (TTD)లో ప్రక్షాళనకు వేగంగా అడుగులు వేయాలనే టీడీపీ కూటమి ప్రభుత్వ ఆలోచనకు బ్రేకులు పడుతున్నట్లు భావిస్తున్నారు. దీంతోనే పరిపాలన వ్యవహారాలు తిరుమలలో ఇంకా మార్పులు తీసుకుని రావాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు సునిశితంగా దృష్టి సారించినట్టు భావిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఆయన ఇంతగా జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. కొన్నిప్రధాన అంశాలపై టీటీడీ అధికారులు, బోర్డు చైర్మన్ బీఆర్. నాయుడుతో అమరావతిలో సమీక్షించడానికి ఈ పాటికే సంకేతాలు ఇచ్చారు. తేదీ ఇంకా ఖరారు కాలేదని టీటీడీ ఉన్నత స్థాయి అధికారుల సమాచారం.


చెప్పిందే.. చేస్తా..

టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి, సీఎంగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఎన్. చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న విషయం తెలిసిందే. "పరిపాలనా వ్యవహారాల్లో తిరుమల నుంచే ప్రక్షాళన చేపడతా" అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ మేరకు టీటీడీ ఈఓగా జే. శ్యామలరావును నియమించడం ద్వారా సీఎం చంద్రబాబు తన కార్యాచరణ అమలుకు శ్రీకారం చుట్టారు.

టీటీడీలో బాధ్యతలు చేపట్టిన సుమారు 15 రోజుల పాటు శ్యామలరావు తిరుమలలో ప్రతి అంశాన్ని స్వయంగా పరిశీలించి, ఓ అంచనాకు వచ్చాక, ఆహార పదార్థాల తయారీలో నాణ్యత పాటించని వారిపై కొరడా పట్టారు. అందులో భాగంగా లడ్డూ ప్రసాదం, తిరుమలలో తరిగొండ వెంగమాంట నిత్యాన్నదాన సత్రంలో మార్పులు తీసుకురావడంలో ఏమాత్రం రాజీపడలేదు. ఓ సందర్భంలో ఆయన చెప్పిన మాట ప్రస్తావించాలి.
"తిరుమలలో ప్రక్షాళన చేయమని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నాకు టాస్క్ ఇచ్చారు" అని వ్యాఖ్యానించడం గమనించతగిన విషయం. ఏదిఏమైనా దర్శనాలు మినహా తిరుమలలో తీసుకున్న నిర్ణయాలు యాత్రికులకు కాస్త ఊరట ఇచ్చిన అంశమే.

ఇవి చాలవు...

తిరుమల వ్యవహారాలను ఇంకా చక్కదిద్దాల్సిన అవసరం ఉందనేది సీఎం చంద్రబాబు ఆలోచన. అందుకు టీటీడీలో అధికారులు, పాలక మండలి మధ్య సమన్వయం కుదరలేదనేది బహిరంగ రహస్యం. కీలక అధికారులు, రాజకీయ ప్రతినిధుల మధ్య సమన్వయం సాధించడం ద్వారా అనుకున్న పనులు పూర్తి చేయాలనేది సీఎం చంద్రబాబు మదిలో ఆలోచన ఉన్నట్లు భావిస్తున్నారు. అందులో ప్రధానంగా వైసీపీ ప్రభుత్వ కాలంలో తీసుకున్ననిర్ణయాలను సమీక్షించడానికి ప్రత్యేకంగా చర్చించనున్నట్లు సమాచారం. దాదాపు 1,100 కోట్ల రూపాయలతో చేపట్టిన భవనాల నిర్మాణంలో చోటుచేసుకున్న పరిణామాలు కూడా ఇందులో ప్రధాన అంశంగా ఉంటుందని చెబుతున్నారు.
తిరుమల రెవెన్యూ విభాగంలో ఇస్టానుసారంగా వ్యవహరించిన కారణంగా దుకాణాలు, తట్టల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడం. కొన్నింటిని అనధికారికంగా కొనసాగించిన పద్ధతులు వివాదంగా ఉన్నాయి. ఆ కోవలో ఆ విభాగంలోని ఓ ఏఈఓను టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు స్వయంగా పిలిపించి, మందలించినా ఫలితం లేకపోవడంతో ఈఓ కార్యాలయానికి అటాచ్ చేస్తూ, బదిలీ చేసిన విషయం తెలిసిందే.
తిరుమలలో ప్రక్షాళన అంటున్నప్పటికీ పరిపాలనా పరంగా ఈ నిర్ణయాలు తీసుకోలేదు. అంటే, కీలకశాఖల్లో అధికారులు ఎక్కడి వారు అక్కడే ఉంటున్నారనేది అందరికీ తెలిసిందే. దీనిపై కూటమి నేతల మాట ఏమిటంటే... "వైసీపీతో అంటకాగిన అధికారులు ఎక్కడి వారు అక్కడే ఉన్నారు" అనేది ఆరోపణ.
"వాస్తవానికి టీటీడీలో ఆలయ వ్యవహారాలతో పాటు, విద్యా సంస్థలు, దేశంలోని అనేక నగరాల్లో ఉన్న సమాచార కేంద్రాలకు మాత్రమే బదిలీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మినహా ప్రభుత్వ శాఖల మాదిరి బదిలీలకు ఆస్కారం ఉండదు. ఉంటే తిరుమల లేదంటే తిరుపతి. కాదంటే దేశంలోని సమాచార కేంద్రాలకే పరిమితం"

యాత్రికుల సేవలు

తిరుమలలో యాత్రికులు గంటల తరబడి నిరీక్షించకుండా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా గంటలోపు దర్శనం. తిరుమలలో వసతి వంటి అంశాలపై కూడా సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని సమాచారం.

ఆధ్మాత్మక "నగరం"

ప్రపంచంలో టీటీడీ ఆధ్మాత్మిక కేంద్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. తిరుమల పరిస్థితి కూడా అదే స్థాయి. అయితే గత ప్రభుత్వంలో రింగ్ రోడ్డు నిర్మాణంతో ఆధ్యాత్మిక సొబగుల స్థానంలో పట్టణ ప్రాంతానికి పోటీగా మార్చారు. కాగా, టీడీపీ కూటమి రాష్ట్రం కోసం ప్రకటించిన స్వర్ణాంధ్ర విజన్- 2047 ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో గత ప్రభుత్వానికి ఏమాత్రం తీసిపోమంటూ సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని స్ఫూర్తిగా తీసుకున్నట్టు టీటీడీ యంత్రాంగం తిరుమల విజన్ -2029 ప్రకటించింది. అంటే "తాము కూడా తిరుమలను మరింత నగరీకరణ చేయడానికే ముందుకు సాగుతోంది. ఆ మేరకు
" తిరుమ‌ల‌లో అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించాల‌ని టీటీడీ బోర్డు తీర్మానం చేసింది"
దీనిపై గతంలోనే సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులకు స్పష్టమైన సూచనలు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాలన్నీ సవ్యంగా అమలు కావడానికి వీలుగా మొదట అధికారులు, పాలక మండలి మధ్య సమన్వయం సాధించడమే ప్రధాన లక్ష్యంగా సమీక్షించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.



Read More
Next Story