"తిరుపతి"లో ఆ అమాయకుల మరణానికి బాధ్యులెవ్వరు?

ఎవరి నిర్లక్ష్యం వల్ల బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న వారు ప్రాణాలు కోల్పోయారు. పునరావాస కేంద్రం నిర్వాహకుల తీరు ఎలా ఉంది. అసలు ఏమి జరిగింది. అంతమంది ఎందుకు అస్వస్థతకు గురయ్యారు. తిరుపతిపై డయేరియా పంజా విసిరిందా?


"నిన్న ఏమిటో వారికి తెలియదు. రేపటిపై ఆలోచన లేదు. తల్లిదండ్రులు ఉన్నారా? లేరా? అనేది వారికి అస్సలు తెలియదు"

వారు బుద్ధిమాంద్యంతో ఉన్న మానసిక వికలాంగులు కావడమే. అతిసార వ్యాధికి గురైన వారికి సకాలంలో వైద్య సేవలు అందించడంలో స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుల తీరు, అధికారుల పర్యవేక్షణ నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలు తీశాయి. మరో 16 మందిని ఆస్పత్రి పాల్జేశాయి. ఈ వ్యవహారంపై తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ సీరియస్ అయ్యారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులపై చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన చికిత్స అందించడానికి కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
ఈ సంఘటన ద్వారా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పునరావాస కేంద్రాల్లో నిర్లక్ష్యం మరోసారి చర్చకు వచ్చింది. అధికారుల పర్యవేక్షణ, వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణ లేదనే విషయం స్పష్టమైంది.

తిరుపతి నగరం పద్మావతిపురం సమీపంలో పీపుల్స్ ఆక్షన్ ఫర్ సోషల్ సర్వీసెస్ (పీఏఎస్ఎస్- పాస్ మనోవికాస్) సంస్థ మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారి కోసం పునరావాస కేంద్రం నిర్వహిస్తోంది. రాష్ట్ర చట్టం, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్ఆర్ సీఏ) కింద అనుమతి తీసుకుని 1987 నుంచి ఈ కేంద్రం నిర్వహిస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి 75 శాతం నిధులు కూడా అందుతున్నట్లు సమాచారం.


ఇంతకూ ఏమి జరిగింది?
పద్మావతిపురంలో పీఏఎస్ఎస్ సంస్థ 26 ఏళ్లుగా సేవలు అందిస్తోంది. శనివారం ఇక్కడి కేంద్రంలోని వివిధ 71 మందికి బోండాలు, ఇతర కూరలతో కూడిన వంటకాలు వడ్డించారు. అవి తిన్నవారిలో కొందరు అస్వస్థతకు గురయ్యారు. సంస్థ ప్రతినిధులు నియమించున్న బీఏఎంఎస్ అర్హత ఉన్న ప్రైవేటు డాక్టర్ వారికి చికిత్స చేశారు. ఆదివారం ఉదయం వాంతులు, విరేచనాలకు గురయిన కొందరిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే గణపతి (30) తీవ్ర అస్వస్థతతో మరణించాడని డాక్టర్లు నిర్థారించారు. ఈ విషయం గోప్యంగా ఉంచారు.
ఆ తరువాత ఇంకొందరు అస్వస్థతకు గురికావడం, ఆస్పత్రికి తీసుకుని రావడంతో చికిత్స పొందుతూ, శేషాచలం (16) మరణించాడు. దీంతో ఈ విషయం వెలుగుచూసింది. కాగా, వారికి ఎందుకు అలా జరిగిందనే విషయంలో పాస్ సంస్థ, నిర్వాహకులు, లేదా అక్కడి సిబ్బందికి వివరించలేకపోయారని చెబుతున్నారు. ఈ సమాచారం మంగళవారం ఉదయం తనకు రుయా ఆస్పత్రి ఆర్ఎంఓ సమాచారం అందించిన వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లానని డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ శ్రీహరి తెలిపారు. దీంతో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి రుయా ఆస్పత్రిని సందర్శించారు. చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.


కలెక్టర్ సీరియస్
"అస్వస్థతకు గురై ఇద్దరు మరణించడం, మరో 16 మంది రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం" పై జిల్లా డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ సీరియస్ అయ్యారు. దీనిపై చర్యలు తీసుకుంటానని ఫెడరల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఈ సంఘటన జరగడం దురదృష్టకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అందించిన చికిత్సపై ఆయన రుయా ఆస్పత్రి డాక్టర్లతో సమీక్షించారు.
"నాకు సమాచారం అందగానే ఆర్డీఓ, డీఎం అండ్ హెచ్ఓ ను పాస్ సంస్థ వద్దకు పంపించాను. అక్కడ 54 మంది ఇంకా ఉన్నారు. వారందరి ఆరోగ్యానికి ఇబ్బంది లేదు" అని రుయా ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ, కలెక్టర్ వెంకటేశ్వర్ చెప్పారు.
" సోమవారం ఉదయం పది నుంచి 12 మంది అస్వస్థతకు గురైన వారిని రుయా ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. వారికి అలా కావడానికి కారణం ఏమిటనేది సంస్థ కేర్ టేకర్లు ఆస్పత్రిలో డాక్టర్లకు వివరించలేకపోయారు. సంస్థ సిబ్బంది కూడా సరిగా సమాచారం ఇవ్వలేదు" అని చెప్పారు. రుయా ఆస్పత్రికి తీసుకుని వచ్చిన వారిలో ఇద్దరు మరణించారు. మరో ఇద్దరిని అబ్జర్వేషన్ లో ఉంచాం. మరో 14 మంది చికిత్స పొందుతున్నారు. వారందరినీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉన్న " స్విమ్స్" ఆస్పత్రికి తరలిస్తున్నట్లు తెలిపారు.
" జిల్లాలో అతిసారం నివారణకు ఇప్పటికే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, చైతన్యం చేశాం. వైద్య బృందాలు కూడా సంసిద్ధంగా ఉన్నాయి" అని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు.
ఉలిక్కిపడిన అధికారులు
స్వచ్ఛంద సంస్థలో చోటుచేసుకున్న ఘటనపై కలెక్టర్ వెంకటేశ్వర్ స్పందనతో వివిధ శాఖల అధికారులు ఉలిక్కిపడ్డారు. తిరుచానూరు పోలీసులతో పాటు ఐసీడీఎస్ అధికారులు రంగ ప్రవేశం చేశారు. సంస్థ ఫౌండర్ బాలకృష్ణ, ప్రిన్సిపల్ పున్నమరాజు మరళీకృష్ణ తీరు విభిన్నంగా కనిపించింది. వారి సంస్థ సెల్ నంబర్ 923471 18447కు కాల్ చేసినా వారిద్దరిలో ఎవరు అందుబాటులోకి రాలేదు.
ఆత్మీయుల ఆందోళన...
మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారిని సంబంధీకులు పీఏఎస్ఎస్ సంస్థ నిర్వహణలోని పునరావాస కేంద్రంలో చేర్చారు. ఇద్దరు మరణించిన ఘటన తెలుసుకుని ఆందోళనకు గురయ్యారు. ఈ సంస్థ ప్రతినిధులతో మాట్లాడేందుకు ఫెడరల్ ప్రతినిధి చేసిన ప్రయత్నాలతో వార్డెన్ శ్రీరాములురెడ్డి కాంటాక్ట్ లోకి వచ్చారు. "కేంద్రంలో 22 నుంచి 24 మంది అనాథలే. వారికి వైకల్య పింఛన్ కూడా రావడం లేదు. ఆధార్ కార్డులు కూడా లేవు" అని చెప్పారు. "మిగతా వారికి వారి కుటుంబీకులు ఉన్నారు. వారికి వచ్చే వికలాంగ పింఛన్లో కొంత మొత్తం సంస్థకు ఇస్తుంటారు. మిగతాది వారే తీసుకుంటారు" అని శ్రీరాములు రెడ్డి వివరించారు. కేంద్రం ఆర్థికసాయంపై ప్రస్తావించగా, ఆ విషయాలు తనకు తెలియవని చెప్పారు.
ఈ స్వచ్ఛంద సంస్థ విదేశీ విరాళాల సేకరణకు చట్ట ప్రకారం అనుమతితో రిజిస్టర్ చేశారు. సంస్థకు 75 శాతం నిధులు వస్తున్న విషయాన్ని స్పష్టం చేసిన కలెక్టర్ వెంకటేశ్వర్ ఆ విషయాన్ని కూడా సమీక్షిస్తామని ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు. కానీ, సంస్థ వార్డెన్ శ్రీరాములురెడ్డి మాత్రం ఆ విషయాలు మాట్లాడేందుకు నిరాకరించారు.
ఫెడరల్ ప్రతినిధి ఆయనతో మాట్లాడే సమయంలోనే కేంద్రంలో ఉన్న అరుణ అనే మానసిక వికలాంగురాలి సోదరి కాల్ చేసి, మాట్లాడారు. ఇంటికి తీసుకుని వెళ్లి, సంరక్షించే స్థోమత లేదని రోధించడం వినిపించింది. కేంద్రంలో పునరావాసం పొందుతున్న వారిలో వారి సంబంధీకుల వద్దకు పంపించడానికి నిర్వాహకులు సమాచారం అందించిన విషయాన్ని వార్డెన్ శ్రీరాములు రెడ్డి స్పష్టం చేశారు.

వాస్తవానికి ఈ తరహా పునరావాస కేంద్రాలు నిర్వహించే సంస్థలకు కేంద్రం కూడా ఆర్థిక సహకారం అందిస్తుందని మరో సంస్థ ప్రతినిధి ద్వారా తెలిసింది. అందులో ప్రధానంగా మానసిక వైకల్యంతో బాధపడే వారికి విద్య, వైద్యం, శిక్షణ, ఆహారం, కాస్మోటిక్స్, బోర్డింగ్, డే స్కాలర్లకు ఆర్థికసాయం అందిస్తుందని తెలుస్తోంది. అన్నీ సవ్యంగా సాగినంత వరకు ఫరవాలేదు. అయితే అనుకోని సంఘటనలు జరిగినప్పడు కూడా సమాచారం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విషయం స్పష్టమైంది.
సంగీత ప్రపంచంలో ప్రిన్సిపల్
సంస్థ ప్రిన్సిపల్ పున్నమరాజు మురళీకృష్ణ సంగీత సామ్రాజ్యంలో ఓలలాడుతుంటారని తెలిసింది. స్వతహాగా సంగీత కళాకారుడైన ఆయన కచేరీలు నిర్వహించడం, సంస్థలో కూడా పిల్లలు, పెద్దల మానసిక ఉల్లాసం కోసం కార్యక్రమాలు నిర్వహించిన ఫొటోలు వారి వైబ్ సైట్లో ఎక్కువగా ఉన్నాయి. ఆయనతో మాట్లాడేందుకు సాధ్యం కాలేదు. అధికారులతో ఆయన బిజీగా ఉన్నారనే సమాచారం వచ్చింది.

తాజాగా ఇద్దరు అమాయకులు మరణించిన నేపధ్యంలో పీఏఎస్ఎస్ సంస్థకు మొదటిసారి మరక అంటిందనేది అక్కడి వార్డెన్ శ్రీరాములురెడ్డి మాటలతో అర్థం అవుతుంది. తరచూ ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల తనిఖీలు లేవనే విషయం కూడా వెలుగు చూసింది. వీటన్నింటిని డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ స్వయంగా గమనించారనే విషయం ఆయన మాటలే స్పష్టం చేశాయి. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచిచూడాలి.
Read More
Next Story