ఎవరీ శంకర్ నాయక్..? ఎస్టీ కమిషన్ సభ్యుడెలా అయ్యారు??
x

ఎవరీ శంకర్ నాయక్..? ఎస్టీ కమిషన్ సభ్యుడెలా అయ్యారు??

ఆదివాసీ విద్యార్థులు. ప్రజల సమస్యలే ఆలంబన. ప్రచార ఆర్భాటం. అనంత జిల్లా మాజీ ఎమ్మెల్యేల అండ. సీఎంపై విమర్శలే వైసీపీకి దగ్గర చేశాయి.


తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో విద్యార్థి నేతగా జీవితం ప్రారంభించిన వడిత్యా శంకర్ నాయక్ ది అత్యంత సాదాసీదా కుటుంబం. స్వల్ప వ్యవధిలోనే సంఘాల ఏర్పాటు. మీడియాలో ప్రచారం. అధికారులపై ఒంటికాలితో కయ్యానికి సయ్యనే తీరు. పార్టీ నేతలతో సాంగత్యం వంటి పద్ధతులతో వైసీపీకి దగ్గరయ్యారు. ఇంతకీ శంకర్ నాయక్ ఎవరు? ఏమి చేశారు? క్యాబినెట్ ర్యాంక్ పదవి ఎలా దక్కింది. వైసీపీకి అంత చేరువ ఎలా అయ్యారు.

రాష్ట్రంలోని షెడ్యూల్డ్ తెగల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 2020 డిసెంబర్ 25 నుంచి అమల్లోకి వచ్చింది. 2022 ఫిబ్రవరి ఎనిమిదిన మూడేళ్ల కాలపరిమితితో ఎస్టీ కమిషన్ సభ్యుడిగా అనంతపురం జిల్లాకు చెందిన వడిత్యా సోమశంకర్ నాయక్‌ను నియమించారు. ఆయన పదవి ఈ నెల పదో తేదీతో ముగిసింది. కాగా,

రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడిత్యా శంకర్ నాయక్ విజయవాడ పోలీసులకు మసాజ్ సెంటర్ లో అడ్డంగా దొరికారు. ఆయనతో పాటు 11 మంది విటులు, తొమ్మిది మంది యువతులను మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత వారిని స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు. ఈ విషయాన్ని మాచవరం సీఐ ఎస్. ప్రకాష్ ధృవీకరించారు. విజయవాడ మసాజ్ సెంటర్ దొరికిన తీరుతో రాయలసీమలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. అనేక మంది ఆయన బాధితులు సంబర పడుతున్నారనేది సమాచారం. శంకర్ నాయక్ వ్యవహారాన్ని కాస్త పరిశీలిస్తే...
అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలోని నేలగుట్ట తాండాకు చెందిన వడిత్యా సోమశంకర నాయక్ తల్లిదండ్రులకు ఒకడే కొడుకు. ఇద్దరు చెల్లెళ్లు. 2006లో ఆయన తిరుపతి ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీలో చేరారు. రెండుసార్లు తప్పన తరువాత ఎట్టకేలకు పాసయ్యారు. తరువాత శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో (Sri Venkateswara University) పీజీలో చేరిన శంకర్ నాయక్ చాలా తెలివిగా వ్యవహరించారు. పేదరికం నేర్పని పాఠాలతో వ్యక్తిగతంగా ఎదగాలనే కోరిక ఎక్కువగా ఉండేది. అప్పటికే దళిత, గిరిజన సంఘాల నేతలు సాగిస్తున్న కార్యక్రమాలను దగ్గరగా గమనించిన శంకర్ నాయక్ వేరే జెండాల నీడలోకి వెళ్లలేదు.
ఆదివాసి విద్యార్థులు. ప్రజల హక్కులు. ఇదే అజెండాగా గిరిజన విద్యార్థి సమాఖ్య ( GVS) వ్యవస్థాపక అధ్యక్షుడిగా గుర్తింపు సాధించారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ఎదగడానికి ఊతం ఇచ్చింది.
2008 సంవత్సరం నుంచి ఎస్వీయూలో తన కంటూ ప్రత్యేకంగా గుర్తింపు సాధించుకోవాలని తాపత్రయ పడ్డాడు. తన ఆలోచనలకు పదును పెట్టిన శంకర్ నాయక్ గిరిజన విద్యార్థి సమాఖ్య (GVS) ను స్థాపించి, ఆదివాసీ పిల్లలను చేరదీశాడు. తిరుపతి నగరంలోనే కాదు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వద్ద తన పేరు. సంఘం పేరును ప్రముఖంగా వాల్ రైటింగ్ చేయించడం ద్వారా పబ్లిసిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇవన్నీ సాగిస్తూనే పీహెచ్‌డీ విద్యార్థిగా మారారు. ఓ వీసీ ఆయనకు హాజరు లేకున్నా... పరిశోధక విద్యార్థిగా పరిగణించడానికి అవసరమైన సహకారం అందించారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా,
ప్రచారమే అస్త్రం..
తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో గిరిజన విద్యార్థి సమాఖ్య (GVS) వ్యవస్థాపక అధ్యక్షుడిగా అత్యంత ప్రాచుర్యం సంపాదించుకున్నారు. ఆ తర్వాత గిరిజన ప్రజా సమాఖ్య (Gvps) పేరిట రాయలసీమలో అనేక ప్రాంతాల్లో సంఘాలు ఏర్పాటు చేసి చురుగ్గా వ్యవహరించారు. విద్యార్థి దశ నుంచి కాస్త రాజకీయంగా గుర్తింపు పొందిన శంకర్ నాయక్ ప్రముఖులను కలవడం ఫొటోలు తీసుకోవడం. మీడియాలో ప్రచారం చేసుకోవడం ద్వారా వ్యక్తిగత ప్రాచుర్యాన్ని సంపాదించడంలో సఫలమయ్యారు. ఆ తర్వాత, తిరుపతిలోని తన కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యార్థి, ప్రజా సంఘాల కార్యకలాపాలు సాగించారు. గిరిజన ప్రజా సమాఖ్య ఏర్పాటుతో ఆదివాసి ప్రజలను ఆకట్టుకునే యత్నంలో అనేక ప్రాంతాల్లో జిల్లా, మండల కమిటీలను కూడా ఏర్పాటు చేసి, చురుగ్గా వ్యవహరించారు. ఇదిలావుంటే...
ప్రజల ఫిర్యాదులతో...
విద్యార్థి నేతగానే కాకుండా, గిరిజన సమాఖ్య నేతగా తిరుపతి, అనంతపురం జిల్లాల్లో నిర్వహించిన అనేక సభలతో ఆకట్టుకున్నారు. సమస్యలపై వచ్చే దళితులు, గిరిజనుల వినతిపత్రాల తీసుకోవడం తన బాధ్యతగా ఎంచుకున్నారు. అందులో నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు తీసుకున్నారనే గిరిజనుల ఫిర్యాదులపై రంగంలోకి దిగే శంకర్ నాయక్ దందాలు కూడా సాగించారనేది ఆరోపణ. అవసరమైతే తానే కేసులు కూడా పెట్టిన దాఖలాలు ఉన్నాయి.
ఇదే సాక్ష్యం
గిరిజన విద్యార్థి సంఘం సావనీర్ కోసం టీటీడీ అడ్వర్ టైజ్ మెంట్ కోసం చేసిన ప్రయత్నంలో సానుకూల స్పందన లభించలేదు. దీంతో అప్పటి ఈవో ఎల్వీ. సుబ్రమణ్యంపై వడిత్యా శంకర్ నాయక్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు దాఖలు చేశారు. ఇది తీవ్ర కలకలం రేపింది. ఆ తరువాత రెండు పక్షాల మధ్య కుదిరిన రాజీతో కేసు ఉపసంహరణ వెనుక తెరవెనుక కహానీ నడిచినట్లు వ్యాఖ్యానాలు ఉన్నాయి.
ప్రచారమే అస్త్రంగా
అత్యంత సామాన్యుడిగా తిరుపతిలోకి పాదం మోపిన వడిత్య శంకర్ నాయక్ పై స్వల్ప కాలంలోనే ఎక్కువ ప్రాచర్యం సంపాదించుకునే యుద్ధంలో సఫలం అయ్యారని విషయం బహిరంగ రహస్యం. తిరుపతికి ప్రముఖులు వస్తున్నారు అంటే, విద్యార్థి, ఆదివాసి ప్రజల సమస్యలపై వినతలు ఇవ్వడం. రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో సదస్సులు, సభలు నిర్వహించడం ద్వారా వ్యక్తిగతంగా తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నారు.
తిరుపతి నగరం నుంచి విద్యార్థి నేతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన వడిత్యా సోమశంకర్ నాయక్ సాగించిన వ్యవహారాల్లో అనేక ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అనేకమంది అధికారులు కూడా ఇబ్బందులు పడ్డారని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అందులో అధికారులు, నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నవారు కూడా బాధితులుగా ఉన్నట్లు సమాచారం. ఇదిలాఉండగా,
వైసీపీకి చేరువ

2014 ఎన్నికల తరువాత సీఎం చంద్రబాబుపై విమర్శలు చేయడంతో పాటు అమరావతి నిర్మాణం వ్యవహారంలో వడిత్యా శంకర్ నాయక్ వైసీపీ నేతలను మించిన స్థాయిలో విమర్శలు గుప్పించే వారు. ఆ కోవలో ఒకసారి సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటనకు వచ్చారు. గోబ్యాక్ చంద్రబాబు అంటూ రోడ్డెక్కడానికి విఫలయత్నం చేశారు. ఆ తరువాత కూడా ఆయన కార్యక్రమాలకు సాక్షి దినపత్రికలో ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి, వార్తలు ప్రచురించిన దాఖలాలకు కొదవ లేదు.
అమరావతిలో రాజధాని రైతుల ఆందోళనలకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో వడిత్యా శంకర నాయక్ బైఠాయించారు. రోజులు తరబడి సాగిన నిరసనల్లో తన వెంట తీసుకుని వెళ్లిన వారితో అక్కడి నిరసన కార్యక్రమాలు కూడా సాగించడం ద్వారా ఆ పార్టీ నేతలకు చేరువ అయ్యారు. ఆ తరువాత
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా టీడీపీపై విమర్శలు, చంద్రబాబుకు వ్యతిరేకంగా గొంతు వినిపించడం ద్వారా ప్రచారార్భాటానికి పాల్పడ్డారనేది జగమెరిగిన సత్యం. ఇదే ఊపులో
అనంతపురం జిల్లాలోని అప్పటి ఎంపీ, మరో ఎమ్మెల్యే ద్వారా కర్నూలు నేతల ద్వారా వ్యవహారం నడిపిన శంకర్ నాయక్ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ఛాన్స్ కొట్టేశారు. సుతిమెత్తి మాటలతో, హూందాతనాన్ని ప్రదర్శించడం అలవాటుగా వ్యవహరించే ఆయన రాష్ట్రంలో ఈపాటికే ప్రాచుర్యం సంపాదించుకున్న శంకర నాయక్ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా క్యాబినెట్ హోదా పదవితో విస్తృతంగా పర్యటనలు సాగించారు. ఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీ శాఖల అధికారులు, ప్రధానంగా సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లు కూడా ఇబ్బందులు పడ్డారనే వ్యాఖ్యలు బలంగా ఉన్నాయి.
తిరుపతికి సామాన్యుడిగా రంగప్రవేశం చేసిన వడిత్యా సోమశంకర నాయక్ దర్జాకు తగ్గేదేలేదు అన్నట్టు వస్త్రధారణ, అధికార హోదాను అనుభించిన విషయం ఈ ప్రాంతంలో అందరికి చిరపరిచితమే. ఇదే వ్యవహారం సాగించిన ఆయన అలిపిరి బైపాస్ రోడ్డులోని ఎర్రమిట్ట కాలనీలో దళిత జర్నలిస్టులకు ఇచ్చిన కాలనీ సమీపంలోనే అధునాతన భవనాన్ని నిర్మించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలావుంటే...
విజయవాడ ఘటనతో...
నగరంలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మసాజ్ సెంటర్ లో వడిత్యా శంకర నాయక్ పోలీసులుకు పట్టుబడిన తీరుతో ఆయన ప్రస్థానం, రాజకీయ వ్యవహారాల వెనుక ఉన్న కథనం ఆసక్తికరంగా మారింది. ఈ ఘటనపై వైసీపీ నేతలు స్పందించకపోవడం కూడా ప్రధానాంశంగా మారింది.
విజయవాడ నగరం వెటర్నరీ కాలనీ ఫీడర్ రోడ్డులో గురునానక్ కాలనీకి చెందిన చలసాని ప్రసన్న భార్గవ్ అనే వ్యక్తి స్టూడియో 9 పేరుతో నిర్వహిస్తున్న భవనంపై మాచవరం పోలీసులు దాడులు నిర్వహించారు. అత్యంత కట్టుదిట్టమైన నిఘా మధ్య ఈ మూడంతస్తుల భవనంలోని ఒక ఫ్లోర్లో మసాజ్ సెంటర్ మరో ఫ్లోర్లో యూ ట్యూబ్ కేంద్రం. మూడో అంతస్తులో మరో కాల్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఓ వ్యక్తి చేసిన స్టింగ్ ఆపరేషన్, పోలీస్ కమిషనర్ కు ఆ వీడియోలను అందజేయడం వల్ల మాచవరం సీఐ ఎస్. ప్రకాష్ మూడు బృందాలతో శుక్రవారం రాత్రి స్పా సెంటర్ పై ఆకస్మిక గా సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. పోలీసు రాక గమనించిన స్పా సెంటర్లోని పదిమంది యువతులు పక్కన భవనంలోకి దాటుకోవడం, అక్కడ ఉన్న 11 మంది వీటిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మంచం కింద నక్కి..
పోలీసులు ఆకస్మిక తనిఖీల నేపథ్యంలో దిక్కు తెలియని పరిస్థితిలో కొందరు దొరికిపోయారు. గదిలో నుంచి బయటికి రాలేని స్థితిలో ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్య శంకర్ నాయక్ మంచం కింద నక్కారు. పోలీసుల హెచ్చరికతో శంకర్ నాయక్ వెలుపలికి రావడం కూడా వీడియోలు రికార్డ్ చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే స్పా సెంటర్ కు వీటిలను ఆకర్షించడానికి ప్రత్యేకంగా మరో భవన్లో ముగ్గురు యువతులతో కాల్ సెంటర్ కూడా నిర్వహిస్తున్నారనే విషయాన్ని పోలీసులు కూడా గుర్తించారు. రెగ్యులర్ కస్టమర్లు మినహా, కొత్తవారిని ఇక్కడికి అనుమతించేవారు కాదని తెలిసింది. ఇలాంటి ప్రదేశానికి శంకర్ నాయక్ కు అనుమతి లభించడం అనేది ఆసక్తికరంగా మారింది. అంటే ఈ మసాజ్ సెంటర్ నిర్వహణలో ఎవరెవరి పాత్ర ఉందనేది కూడా చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు శంకర్ నాయక్ ఫోన్ అందుబాటులోకి రాలేదు. మసాజ్ సెంటర్ లో పట్టుబడిన తరువాత శంకర్ నాయక్ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని మాచవరం సీఐ ఎస్. ప్రకాష్ కూడా చెప్పారు.


Read More
Next Story