సీమ ఆదరిస్తే.. సింహమే..
x

" సీమ" ఆదరిస్తే.. సింహమే..

రాయలసీమ జిల్లాల్లో అధిక సీట్లు సాధించే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. 2024 ఎన్నికల్లో సీమ ఓటరు ఎవరిని గద్దెనెక్కిస్తారో?


రాయలసీమలో అధిక ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకునే పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడుతుంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. గతంలో రాష్ట్రంలోని జాతీయ, ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలకు నాయకత్వం వహించేది సీమవాసులే. పాలనా పగ్గాలు చేపట్టేది కూడా ఈ ప్రాంతానికి చెందిన నాయకులే. దశాబ్దాల కాలంగా ఇదే కొనసాగుతోంది. 2004 ఎన్నికల నుంచి ఈ సెంటిమెంట్ రిపీట్ అవుతోంది.

2024 సార్వత్రిక ఎన్నికల్లో సమరంలో కూడా అధికార వైఎస్ఆర్సిపి అధ్యక్షుడుగా ఉన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ఈసారి ఎన్నికల తెరపైకి వచ్చిన పిసిసి అధ్యక్షురాలు వైఎస్. షర్మిలారెడ్డి కూడా కడప జిల్లా పులివెందులకు చెందిన మహిళ కావడం గమనార్హం. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్‌కు నెల్లూరు జిల్లా మూలాలు ఉన్నాయి. అందువల్ల రాయలసీమతో పాటు, నెల్లూరు జిల్లాలో అధిక స్థానాలు సంపాదించుకున్న పార్టీ మిగతా జిల్లాల్లో కూడా ప్రవహితం చూపించి అధికార పగ్గాలు చేపడుతూ వస్తోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత నవ్యాంధ్ర రాష్ట్రంలో దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని రీతిలో 2024 సార్వత్రిక ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరిగాయనేది జగద్వితం. రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్న మూడవ ఎన్నిక ఇది. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కైవసం చేసుకుంది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అధికారం చేజిక్కించుకుంది. గడిచిన ఐదేళ్లలో జరిగిన వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో, కొన్ని వర్గాల నుంచి సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకతను మూటగట్టుకున్నప్పటికీ తాను అందించిన సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయనే నమ్మకంతో ఉన్నారు.

ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు సాధారణ ప్రజలు, ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని ఇది తమకు లభిస్తుందని టిడిపి చీఫ్ ఎన్. చంద్రబాబు నాయుడు, కూటమిలోని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, బిజెపి నాయకులు విశ్వసిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పీసీసీ సారథిగా తెరమీదకి వచ్చిన వైఎస్. షర్మిలా రెడ్డికి ఆమె తండ్రి దివంగత సీఎం వైఎస్సార్ చరీష్మా కూడా మిగతా పార్టీలపై ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తున్నారు.

2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈనెల 13వ తేదీ ముగిసింది. ఓటర్లు కూడా పోటెత్తారు. ఇది తమ విజయానికి సంకేతం అని టిడిపి కూటమి బలంగా నమ్ముతోంది. సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయని తిరిగి మళ్లీ అధికారంలోకి రానున్నామని వైఎస్ఆర్సిపి శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి. కుటుంబంలో ఏర్పడిన వివాదాలు, ఇతరత్రా కారణాలతో సొంత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థిగా మారిన స్వయానా చెల్లెలు వైఎస్. షర్మిల రెడ్డి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి దివంగత సీఎం డా. వైఎస్ఆర్ చరిష్మా ఎంత మేరకు పనిచేస్తుంది అనేది చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలన్నీ నేపథ్యంలో రాయలసీమలో ఓటర్లు ఎవరికి అధిక స్థానాలు అందివ్వనున్నారు? రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సెంటిమెంట్ అస్త్రంగా భావిస్తున్న ఈ ప్రాంతంలో ఓటరు ఎవరికి పట్టని కట్టనున్నారు అనేది ప్రస్తుతం చర్చకు వచ్చింది. గతంలో జరిగిన ఎన్నికల్లో అధికారాన్ని చలాయించిన పార్టీలకు లభించిన సీట్లను ఒకసారి పరిశీలిస్తే..

2004: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికలకు ముందు అప్పటి సీఎల్పీ నాయకుడు డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు అవిశ్రాంతంగా సాగించిన పాదయాత్ర రాజకీయ చరిత్రను మలుపు తిప్పింది. ఉచిత కరెంట్, అది కూడా నాణ్యమైన విద్యుత్ తొమ్మిది గంటల పాటు ఇస్తామని డాక్టర్ వైఎస్ఆర్ హామీని రైతులు బలంగా నమ్మారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది.

రాయలసీమ జిల్లాల్లో 52 అసెంబ్లీ స్థానాలకు గాను 38 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. కడపలో 9 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ, ఒక్క అసెంబ్లీ స్థానంలో టిడిపి అభ్యర్థి గెలుపొందారు. కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 12, కర్నూలు అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి సిపిఎం అభ్యర్థి ఎమ్మే గఫూర్, పత్తికొండ నుంచి టిడిపి అభ్యర్థి ఎస్వి సుబ్బారెడ్డి విజయం సాధించారు. అనంతపురం జిల్లాలో 8 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఆరు అసెంబ్లీ స్థానాల్లో టిడిపి విజయం సాధించింది. చిత్తూరు జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఐదు స్థానాల్లో టిడిపి అభ్యర్థులు గెలుపొందారు.

2009: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ ఎన్నికల్లో కూడా 156 స్థానాలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ. .. 92 స్థానాలతో టీడీపీని ప్రతిపక్షంలో ఉండేటట్లు కట్టడి చేసింది. అంతకుముందు ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ రాయలసీమలో ఆరు సీట్లు కోల్పోయి 32 సీట్లను కైవసం చేసుకుంది. టిడిపి బలం పెంచుకుంది అని చెప్పడానికి ఇది ఉదాహరణ. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. అనంతపురంలో 8, కర్నూల్‌లో 8, కడపలో 9, చిత్తూరులో 7 అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. రెండోసారి సీఎంగా అధికార పీఠం ఎక్కిన డాక్టర్ వైఎస్ఆర్ నెలల వ్యవధిలోనే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

రాష్ట్ర విభజన తరువాత..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత 2014 ఎన్నికల్లో టిడిపి రంగంలోకి దిగింది. అప్పటికే రెండేళ్ల ముందు ఊపిరి పోసుకున్న వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో హోరాహోరీగా మొదటి ఎన్నికలు జరిగాయి. ఇందులో వైయస్ఆర్సీపీ.. టిడిపికి మధ్య గట్టి పోటీ ఇచ్చింది. టిడిపి 22 సీట్లు గెలుచుకోగా, వైఎస్ఆర్‌సీపీకి 30 అసెంబ్లీ స్థానాలను ఓటర్లు కట్టబెట్టి అండగా నిలిచారు. అందులో రాయలసీమలోని అనంతపురం జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు, చిత్తూరులో 6, కర్నూలులో 3, కడపలో ఒక స్థానం మాత్రమే టిడిపి గెలుచుకుంది.

2019: విభజిత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రెండో ఎన్నిక. అంతకుముందే ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సాగించిన పాదయాత్ర ద్వారా వైఎస్. జగన్మోహన్ రెడ్డి జనంతో మమేకమయ్యారు. నవరత్న పథకాలు బాగా ఆకట్టుకున్నాయి. డాక్టర్ వైయస్సార్ మరణం సానుభూతిగా పనిచేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాయలసీమలోని చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్. చంద్రబాబు నాయుడు, అనంతపురం జిల్లా హిందూపురంలో నందమూరి బాలకృష్ణ, ఉరవకొండ అసెంబ్లీ స్థానంలో పయ్యావుల కేశవ్ మినహా మిగతా 49 అసెంబ్లీ స్థానాలలో వైయస్ఆర్సీపీ విజయ ఢంకా మోగించింది. కడప, నెల్లూరు జిల్లాల్లో టిడిపి అసలు ఖాతానే తెరవలేకపోయింది.

2024: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మే 13వ తేదీ ముగిసింది. ఐదేళ్ల కాలంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైయస్సార్సీపి ప్రభుత్వం "రాక్షస పాలనకు పరాకాష్టగా నిలిచిందని" టిడిపి చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు సహా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు తీవ్రంగా దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రచార ఘట్టం జరిగే సమయంలో "ల్యాండ్ టైటిల్ అంశాన్ని" జనంలోకి బలంగా తీసుకువెళ్లారు. ఇవే కాకుండా మిగతా అంశాలు కూటమికి మేలు చేస్తాయని కూటమి నాయకులు విశ్వసిస్తున్నారు. ఐదు సంవత్సరాల కాలంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు నగదు బదిలీ బలంగా ఆదుకుంటుందని వైఎస్సార్సీపీ శ్రేణులు విశ్వసిస్తున్నాయి.

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఆయన మంత్రివర్గ సహచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వచ్చేనెల తొమ్మిదవ తేదీ విశాఖ వేదికగా ప్రమాణ స్వీకారం కూడా జరుగుతుందని జోస్యం చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కుటుంబ వివాదాల నేపథ్యంలో పీసీసీ సారధిరాలుగా తెర మీదికి వచ్చిన వైఎస్. షర్మిలా రెడ్డి తన తండ్రి, ‘‘దివంగత సీఎం వైఎస్సార్ వారసురాలిని నేనే. ఆయన ఆశలను సాకారం చేస్తా’’ అంటూ విస్తృత ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కూడగట్టారు. కొన్ని సెగ్మెంట్లలో బలిమైన శక్తిగా కాంగ్రెస్ పార్టీని నిలిపారు.

వైఎస్. షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీకి దివంగత సీఎం వైయస్సార్ చరిష్మా ఎంత మేరకు పనిచేస్తుంది అనేది ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి బదిలీ అయ్యే ఓట్లు కొన్ని సీట్లలో అధికార వైఎస్ఆర్సిపి, ప్రతిపక్ష టిడిపి అభ్యర్థుల తలరాతలను మార్చే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పోలింగ్ ఘట్టం ముగిసి ఐదు రోజులు అవుతుంది ఆయా పార్టీల నాయకులు, పోటీ చేసిన అభ్యర్థులు అంచనాలలో తలమనకలుగా ఉన్నారు.

ఎవరి లెక్కలు వారివి

పోలింగ్ ముగిసిన తర్వాత రాయలసీమలోని చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు ఈ జిల్లాలకు సమీపంలో ఉన్న నెల్లూరు జిల్లాలకు చెందిన నాయకులు విశ్లేషణలో ఉన్నారు. ఏ పార్టీకి ఏ ప్రాంతంలో ఎలా ఓట్లు పోలయ్యాయి. ఎవరికి మేలు చేయ పరిస్థితి ఉందనే అంశాలపై కూడికలు తీసివేతలు వేసుకుంటున్నారు. ఎవరి పరిధిలో వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని జిల్లాల్లో పార్టీల అభ్యర్థులు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో పోలింగ్ జరిగిన తీరుపై అధికార పార్టీకి చెందిన అభ్యర్థులే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ కోవలో మంత్రులుగా ఉన్న నేతలు కూడా మాట్లాడడం గమనార్హం. ప్రభుత్వంలో ఉండి కూడా, పాలన వ్యవహారాలు సరిచూసిన వ్యక్తులే పోలీసుల వ్యవహార సరళి, ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు సారథ్యం వహిస్తున్న నేతలందరూ రాయలసీమ ప్రాంత వాసులే. ఈ ప్రాంతంలో అధిక సీట్లు సాధించుకునే పార్టీలు సొంత గడ్డపై పట్టు నిలుపుకోవడంతోపాటు పురుగు జిల్లా ప్రభావితం చేసి అధికారం చేజిక్కించుకుంటూ వస్తున్నాయి. రాష్ట్రంలో గత ఐదేళ్లలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఓటరు ఎలాంటి తీర్పు ఇచ్చారు అనేది జూన్ 4వ తేదీ బహిర్గతం కానున్నది

Read More
Next Story