Seaplane | మొగ్గ తొడిగిన నీటి విమానానికి రెక్కలు కట్టేదెప్పుడు?
x

Seaplane | మొగ్గ తొడిగిన నీటి విమానానికి రెక్కలు కట్టేదెప్పుడు?

సీప్లేన్ ప్రయోగాత్మక పరిశీలనకే పరిమితమైంది. గుజరాత్ నుంచి పాఠం నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. అధికారుల అభిప్రాయం మరోలా ఉంది.


పర్యాటకంలో సీ ప్లేన్ (Sea Plane)లో విహరించే కొత్త అనుభవం రాష్ర్ట ప్రజలకు పరిచయమైంది. గత ఏడాది చివరిలోలో పూర్తిస్థాయిలో సర్వీసులు ప్రారంభం అవుతాయని ప్రకటించారు. ఈ వినూత్న ప్రయోగం ట్రయల్ రన్ కే పరిమితమైంది. డీపీఆర్ (Detail Project Report- DPR) సిద్ధం చేయకుండానే చేపట్టిన ఈ ప్రాజెక్టు బాలారిష్టాలు దాటలేదు. దేశంలో మొదటిసారి అమలు చేసిన గుజరాత్ ప్రభుత్వం నుంచి పాఠాలు కూడా నేర్చుకోలేదు. ఇదే విషయాన్ని కొందరు విమానయాన శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

2024 డిసెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పౌరవిమానయాన శాఖ సంయుక్తంగా సీప్లేన్ ట్రయల్ రన్ దిగ్విజయంగా నిర్వహించింది. కృష్ణా బ్యారేజీ సమీపంలోని పున్నమి ఘాట్ నీటిలో టేకాఫ్ (Take Off) తీసుకుని ఆకాశంలో నల్లమల అటవీప్రాంతంపై విహరిస్తూ, శ్రీశైలం డ్యాంలో (Srisaialm) పాతాళగంగ వద్ద నీటిపై ల్యాండింగ్ అయ్యే విధంగా ప్రయోగాత్మకంగా పరిశీలించారు.

2020 అక్టోబర్ 31న సీప్లేన్ ( Sea Plane) దేశంలో మొదటిసారి గుజరాత్ ప్రభుత్వం ప్రారంభించింది. సబర్మతి నది నుంచి సర్దార్ పటేల్ ఐక్యతా విగ్రహం (Statue of Unity) వరకు ఈ విమానం విహరించింది. ఆ తరువాత ఆ ప్రాజెక్టు చతికిలబడింది.
రాష్ట్రంలో సీ ప్లేన్..
2014లో సీప్లేన్ ప్రారంభానికి సీఎం చంద్రబాబు ఆలోచనే చేశారు. ఆ తరువాత అధికారం కోల్పోవడంతో ఆయన కలల ప్రాజెక్టుగా సీప్లేన్ మిగిలిపోయింది. అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కొత్త ఆలోచనలు చేయడమే కాదు. ప్రయోగాత్మక పథకాలు అమలు చేయడానికి సీఎం చంద్రబాబు ఆసక్తి చూపుతారు. అందులో భాగంగానే..
2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే పరిపాలన వ్యవహారాలు చక్కదిద్దడంలో తలమునకలుగా ఉన్నారు. ఇదే సమయంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగానే కాకుండా, కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఆ పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా ఉండడం ఓ విధంగా కలిసి వచ్చింది. దీర్ఘకాలంలో మదిలో ఉన్న ఆలోచనకు పదును పెట్టిన సీఎం చంద్రబాబు పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించే లక్ష్యంగా సీప్లేన్ తెరమీదకు తీసుకుని రావడమే కాదు. ట్రయల్ రన్ దిగ్విజయంగా నిర్వహించారు. అందులో మంత్రివర్గ సహచరులతో కలిసి సీఎం చంద్రబాబు కూడా ప్రయాణించడం ద్వారా పర్యాటకులకు భరోసా కల్పించారనడంలో సందేహం లేదు. ఈ ప్రాజెక్టు నిర్ణీతకాలంలో పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చి ఉంటే, సీప్లేన్ సేవలు మరింతగా విస్తృతం చేసేందుకు కూడా ఆస్కారం ఉండేది.
ప్రాజెక్టు ప్రారంభానికి ముందే కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా ఆ విషయం ప్రకటించిన విషయం తెలిసిందే.
సీప్లేన్ ప్రత్యేకత
ఈ సీప్లేన్ లో 14 లేదా 19 మంది మాత్రమే ప్రయాణించడానికి వీలు ఉంటుంది. విమానాలు ఆకాశంలో 15 వేల నుంచి 20 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి. ఈ సీప్లేన్ విజయవాడ నుంచి శ్రీశైలం వరకు 150 కిలోమీటర్ల దూరం 1,500 అడుగుల ఎత్తు నుంచి విహరించింది. "పర్యాటలకు కొత్త అనుభవం, అనుభూతి కలిగించాలనే లక్ష్యంగా" ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు సీఎం చంద్రబాబుతో పాటు అధికారులు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
డీపీఆర్ ఏదీ?
విజయవాడ కృష్ణా బ్యారేజీ నుంచి శ్రీశైలం డ్యాం వరకు విహరించిన సీ ప్లేన్ ట్రయల్ రన్ మాత్రమే అనే విషయం ఆ తరువాత తేలిపోయింది.
"పూర్తి స్థాయిలో విమానాలు నడపడానికి డీపీఆర్ (Detail Project Report) సిద్ధం చేయలేదు" అని కొందరు విమానయాన శాఖాధికారులు "ఫెడరల్ ఆంధ్రప్రదేశ్" ప్రతినిధికి చెప్పారు. అంతేకాకుండా, సీప్లేన్ ఎక్కడి నుంచి తీసుకుని వస్తారు. అందులో ఎంతమంది ప్రయాణించేందుకు వీలు ఉంటుంది? టికెట్ ధర? అనే విషయాలు ఖరారు చేయలేదు. వీటన్నింటికంటే ముందు ఈ సీప్లేన్ ప్రభుత్వమే నిర్వహిస్తుందా? లేకుంటే మిగతా ప్రాజెక్టుల ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్వహిస్తారా! అనేది కూడా నిర్ణయించక పోవడం సీప్లేన్ సేవలు ఒక రోజుకే పరిమితం అయ్యారు.
గుజరాత్ ఓ పాఠమే కదా..
గుజరాత్ ప్రభుత్వం దేశంలో మొదటిసారి సీప్లేన్ నడిపింది. ఖర్చు తడిసి మోపెడు కావడంతో ఏడాదిలోపల ఆ విమానాలు అటకెక్కించారు. "ఈ విషయాన్ని పూర్తిగా అధ్యయనం చేయలేదు" అని విమానయాన శాఖ కీలక అధికారులు స్పష్టం చేశారు.
గుజరాత్ కథేమిటంటే..
గుజరాత్ ప్రభుత్వం దేశంలో మొదటిసారి అహ్మదాబాద్ లోని సబర్మతి నది నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహం (Statue Of Unity) విగ్రహం పై విహరించడానికి నీటిపై తేలియాడుతూ ఎగిరే విమానాన్ని ప్రారంభించింది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం మాల్డీవుల నుంచి తెప్పించిన ఈ సీప్లేన్ ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. అప్పట్లో రక్షణ శాఖ సమాచారం మేరకు... M/s స్పైస్ జట్ టెక్నిక్ పేరుతో రిజిస్టర్ అయిన ఈ విమానం స్పైస్ జట్ (Spice Jet) నడుపుతుందని ప్రకటించింది.
ఇంకా ఏమి చెప్పారంటే..
సీప్లేన్ గంటకు 290 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ ప్లేన్ నెమ్మదిగా నడిపితే, నాలుగు గంటలపాటు విహరించగలదని కూడా స్పష్టం చేశారు. పర్యాటకం కోసం నడిపితే మాత్రం రెండు గంటల తరువాత విరామం ఇవ్వాల్సి ఉంటుంది. మాలే నుంచి కోచి తీరానికి రావడానికి 750 కిలోమీటర్ల ప్రయాణానికి నేరుగా గుజరాత్ కు రావడానికి వీలులేక ఆగుతూ, మళ్ళీ ప్రయాణం సాగించినట్లు స్పష్టం చేశారు. 19 మంది యాత్రికుల సామర్థ్యం కలిగిన ఈ విమానంలో ప్రయాణించడానికి ఒక్కొక్కరికి రూ. 4,800 ఛార్జీగా నిర్ణయించారు. అంటే ఈ సీప్లేన్ స్థితి, గమనం, సామర్థ్యాన్ని పూర్తిగా అధ్యయనం చేశారనే విషయం స్పష్టం అవుతుంది.
ఆగిన సేవలు...
పర్యాటక రంగంలో సరికొత్త అధ్యాయానికి గుజరాత్ ప్రభుత్వం సీప్లేన్ ద్వారా శ్రీకారం చుట్టినట్లు అర్థం అవుతుంది. అయితే, వెచ్చిస్తున్న ఖర్చు, రాబడిని పరిశీలించిన తరువాత 13.15 కోట్ల రూపాయాలు ఖర్చు అయిన తరువాతే, పరిస్థితి గుజరాత్ ప్రభుత్వానికి అర్థమైందనడంలో సందేహం లేదు. నిర్వహణ భారం కావడంతో 2020లో ప్రాజెక్టు ప్రారంభించిన ఏడాదికే సీప్లేన్ సేవలు ఆగాయి.
"ఆర్థిక కారణాలకు తోడుగా, ఆపరేషన్, వ్యయం భారమైంది" అందుకే సీప్లేన్ సేవలు ఆపేయాల్సి వచ్చిందనే విషయం గుజరాత్ అసెంబ్లీలో ప్రకటించారు.
ఈ విషయాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నట్లు లుదు. దీంతోనే సీప్లేన్ సేవలు ట్రయల్ రన్ కు పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి విధివిధానాలు కూడా ఖరారు చేయలేదు. తమకు కూడా స్పష్టమైన సూచనలు, ఆదేశాలు లేవనే కొందరు విమానయాన శాఖ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ తరహా సేవలు ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించడం ద్వారా ప్రభుత్వంపై భారం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు. వేసవికాలంలోనే ఈ తరహా సేవలకు ఆదరణ లభించే అవకాశం ఉంటుందని కూడా అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టుకు శాశ్వత ప్రణాళికతో ఈ కొత్త పథకానికి ఎప్పుడు రెక్కలు తొడుగుతుందనేది వేచిచూడాల్సిందే.
Read More
Next Story