
'కడప' జెడ్పీటీసీ ఉపసంగ్రామం ఏ ప్రస్థానానికి నాంది..
పులివెందులో టీడీపీ పట్టు సాధించినట్లేనా..?
కడప జిల్లాలో రెండు జెడ్పిటిసి స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ మినీ ఎన్నికలను తలపించాయి. వైఎస్ఆర్ కుటుంబం, మాజీ సీఎం వైఎస్. జగన్ ఆధిపత్యానికి చెక్ పెట్టే లక్ష్యంగా టీడీపీ నేతల వ్యూహం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
జిల్లాలో జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలను టీడీపీ ఓ అస్త్రంలా వాడుకుంది అనడంలో సందేహం లేదు. టీడీపీ ప్రజాప్రతినిధులను కూడా గృహ నిర్బంధం చేయించడం ద్వారా ఆ పార్టీ నేతలు వ్యూహాత్మకంగానే విమర్శల నుంచి తప్పించుకున్నట్లు కనిపిస్తోంది. ఇదిలావుంటే..
పులివెందుల నియోజకవర్గంలో 30 ఏళ్ల తర్వాత ఓటు హక్కు వినియోగించుకుంటున్నామని కొందరు ఓటర్ల చెబుతున్నారు. ఉదయం నుంచి పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పిటిసి స్థానాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీగా బారులు తీరారు. వైసీపీ శ్రేణులను ఆత్మరక్షణలో పడేయాలనే టీడీపీ వ్యూహం అమలుకు ఈ ఎన్నికలు ఓ అస్త్రంలా మారాయనడంలో సందేహం లేదు.
పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల జెడ్పిటిసి స్థానం, రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట జెడ్పిటిసి అభ్యర్థి ఎంపిక కోసం ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ రెండు నియోజకవర్గాల్లో పులివెందుల నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజంపేట నుంచి ఆకేపాటి అమరనాథరెడ్డి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజంపేట నియోజకవర్గంలోనే ఒంటిమిట్ట జెడ్పిటిసి స్థానం కూడా ఉంది.
వైసీపీ ఆధిపత్యానికి సవాలేనా?
కడప జిల్లాలో పులివెందుల జడ్పిటిసి స్థానం, రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్ట జెడ్పిటిసి స్థానానికి అనివార్యమైన ఉప ఎన్నిక అధికార టిడిపి కూటమికి ఓ అస్త్రంలా దొరికింది. దీంతో పులివెందులలో వైఎస్. రాజశేఖరరెడ్డి కుటుంబ రాజకీయ ఆధిపత్యానికి చెక్ పెట్టాలని టిడిపి వ్యూహ రచన చేసింది.
1972 నుంచి వైఎస్. రాజశేఖరరెడ్డి రాజకీయంగా తెరమీదకు వచ్చారు. అప్పటి నుంచి వారి కుటుంబానిదే ఆధిపత్యం. మొదట వైఎస్ఆర్, ఆ తరువాత ఆయన చిన్నాన్న పురుషోత్తంరెడ్డి, వైఎస్. వివేకానందరెడ్డి, వైఎస్. విజయమ్మ, వైఎస్. జగన్ ఇలా కుటుంబం మొత్తం వరుసగా ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. మినహా మరో నేతకు ఆస్కారం దక్కలేదు. దీంతో ఈ ప్రాంత ప్రజలు కూడా వారి కుటుంబానికి సన్నిహితంగా మారిపోయారు.
ఆరంభం నుంచి పోరాటం
పులివెందుల నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం టీడీపీ ప్రారంభం నుంచి పోరాటం సాగిస్తూనే ఉంది. దీనికోసం అప్పట్లో మాజీ సీఎం ఎన్టీరామారావు కాలంలో డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డికి రాజ్యసభ సభ్యత్వంతో ఎంపీ అవకాశం కల్పించారు.
ఆ తరువాత వేంపల్లెకు చెందిన ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డిని ఎంఎల్సీ చేయడంతో పాటు శాసనమండలి ఉపాధ్యకుడి పదవిని సీఎం ఎన్. చంద్రబాబు కల్పించారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో అనివార్యంగా గత ఎన్నికలకు ముందు వేంపల్లె ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి (సతీష్ రెడ్డి) వైసీపీలోకి వెళ్లారు. అంతకుముందే టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా బీటెక్ రవి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ప్రతినిధిగా విజయం సాధించిన రాంభూపాల్ రెడ్డి ఎంఎల్సీగానే కాకుండా పులివెందులలో టీడీపీ రాజకీయ వ్యవహారాలన్నీ వారిద్దరే పర్యవేక్షిస్తున్నారు.
అందివచ్చిన అస్త్రం
పులివెందుల జెడ్పిటిసి స్థానానికి ఉప ఎన్నిక రావడం టీడీపీ ఓ అస్త్రంలా దొరికిందనడంలో సందేహం లేదు. మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్య లతారెడ్డిని జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీకి దించారు. ఈమెపై వైసీపీ నుంచి హేమంత్ కుమార్ రెడ్డి బరిలో నిలిచారు. టీడీపీ అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా వైసీపీ శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతీయాలనేది టీడీపీ ఆలోచనగా కనిపిస్తోంది. తద్వారా పులివెందులలో వైఎస్. జగన్ ఆధిపత్యానికి చెక్ పెట్టాలని భావిస్తున్నారు.
పక్షపాతం లేదంటున్న పోలీసులు
పులివెందులలో మంగళవారం ఉదయం పోలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందే కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డిని పులివెందులలో ఉన్న ఆయన నివాసం నుంచి ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంలో తన అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ శ్రేణులు కూడా అడ్డుపడి సీన్ క్రియేట్ చేశాయి. విమర్శలకు ఆస్కారం లేని విధంగా టిడిపి ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి ని కూడా హౌస్ అరెస్ట్ చేశారు.
"నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు. నేను ఎలాంటి గొడవలు చేయలేదు ఎన్నికలు జరిగే గ్రామాలకు కూడా వెళ్లను" అని రాంగోపాల్ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు. వేంపల్లిలో ఉన్న మాజీ ఎమ్మెల్సీ, వైసిపి రాష్ట్ర అధికార ప్రతిని ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డిని కూడా హౌస్ అరెస్టు చేశారు.
"పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం" అని ఎన్నికలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ చెప్పారు.
మొత్తానికి ఈ రెండు జెడ్పిటిసి స్థానాల్లో హోరాహోరీ గానే ఎన్నికల ప్రక్రియలో తుది అంకం పోలింగ్ జరుగుతోంది. పెరిగే పోలింగ్ శాతం ఆధారంగా అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని భావిస్తున్నారు. ఈ ఎన్నికల తర్వాత రాజకీయ వాతావరణం ఎలా ఉంటుంది అనేది వేచి చూడాల్సిందే.
Next Story