"లడ్డు"లో దిట్టమెంత..? తిరుమల ప్రసాదం వయసెంత..??
తిరుమల లడ్డు భక్తులకు ప్రీతిపాత్రమైన ప్రసాదం. దీని రుచి ఎక్కడా దొరకదు. తయారీకి వాడే పదార్థాలు అలా ఉంటాయి. ఇంతటి చరిత్ర కలిగిన లడ్డూ వయసు ఎంత? ఊహించగలరా?
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం వయసెంత? 300 ఏళ్లా? 40 సంవత్సరాలా? లేదంటే ఇంకా ఎక్కువ ఉందా? సమాధానాలు లేని ప్రశ్నలు ఇవి. ఎందుకంటే, టీటీడీలో చాలా పద్ధతులు, ఆచారాలు వ్యవహారాలకు రికార్డులు ఉన్నాయి. లడ్డూ ఎప్పటి నుంచి తయారు చేస్తారనే విషయానికి మాత్రం ఆధారాలు చూపించే పత్రాలు లేవంట. కొన్ని రోజులుగా ఈ విషయంపై షోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వివరణ ఇచ్చే దిక్కులేరు. మాట్లాడదామంటే టీటీడీ అధికారులకు ఫోన్ లో సమాధానం చెప్పే సమయం కూడా ఉండదు. ఒక పరిశోధకుడి వ్యాసం మాత్రం చిన్న సమాధానం చెబుతోంది.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదాల్లో యాత్రికులు ప్రీతిపాత్రంగా భావించే లడ్డుకు ప్రాధాన్యత ఉంది. ఈ లడ్డూ రుచి, సువాసన ప్రపంచంలో ఏ పదార్థానికి ఉండదు. అందుకే దీనికి భౌగోళిక ఉత్పత్తి అనుమతి ( జీఐ) , పేటెంట్ రైట్స్ కూడా లభించాయి. భారత ప్రభుత్వం కూడా తపాలాబిళ్ల కూడా విడుదల చేసింది.
సముద్రంలో లోతు కనుగొనడానికి కొలమానాలు ఉన్నాయి. ఇంతపెద్ద చరిత్ర కలిగిన లడ్డు ప్రసాదం వయసు ఎంతంటే మాత్రం ఎవరూ నోరు మెదపలేడం లేదు. అందుకు ప్రధాన కారణం లడ్డు ఎప్పుటి నుంచి తయారు చేయడం ప్రారంభించారు? అనేందుకు టీటీడీలో ఇదిమిద్దంగా తేల్చడానికి అవసరమైన రికార్డులు లేవని అధికారులు చెబుతున్నారు.
తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం నుంచి పరిశోధన చేసిన డాక్టర్ వి. తిమ్మప్ప "లడ్డు ప్రాధాన్యత, తయారీ"పై సమర్పించిన పరిశోధనపత్రం గ్లోబల్ జర్నల్ ఫర్ రీసెర్చ్ అనాలిసిస్ (జీజేఆర్ఏ)లో ప్రచురితమైంది.
"పల్లవుల కాలంలో పీఠాధిపతికి ప్రసాదం సమర్పించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి" అని ప్రస్తావించిన డాక్టర్ తిమ్మప్ప లడ్డూ తయారీ విధానాన్ని ప్రస్తావించారు.
"దేవరాయ-2 కాలంలోనే తిరుప్పోంగం అని పిలిచే ప్రసాదంలో మిగిలిన ఆహారం యాత్రికులకు ఉచితంగా పంపిణీ చేసేవారు. ఆ తరువాత సుక్కియం, అప్పం, మనోహరపడి, వడ స్వామివారికి సమర్పించాలని అమాత్య శేఖర మల్లన్న వేంకటేశ్వరస్వామికి నైవేద్యంగా టైంటేబుల్ పరిచయం చేశారు" అని ప్రస్తావించిన తిమ్మప్ప ఆ మేరకు 1554, 1579, 1616 నాటి శాసనాలలో కూడా ఉందనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు.
"తిరుమల ఆలయంలో క్రమంగా ప్రసాదానికి డిమాండ్ పెరిగింది. మద్రాసు ప్రభుత్వం 1803లో సమస్య గుర్తించి, ప్రసాదాల విక్రయాన్ని ప్రారంభించింది" అనే విషయాన్ని కూడా తిమ్మప్ప పరిశోధన వ్యాసంలో ప్రస్తావించారు. ఇతర ప్రసాదాలకంటే, వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది. మద్రాసు ప్రభుత్వం లడ్డూ ప్రారంభరూపమైన తీపి బూందీని విక్రయించడం ప్రారంభించింది..
"1940లో అది లడ్డూగా రూపుదిద్దుకుంది" అని తిమ్మప్ప తన పరిశోధనా పత్రంలో స్పష్టం చేసినట్లు గ్లోబల్ జర్నల్ ఫర్ రీసెర్చ్ అనాలిసిస్ (జీజేఆర్ఏ)ప్రచురితమైన కథనం స్పష్టం చేస్తోంది.
లడ్డూ తయారు ఎప్పటి నుంచి ప్రారంభమైంది? అనే విషయంలో టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడారు.
"లడ్డూ తయారీ అనేది 1940 నుంచే ప్రారంభమైంది" అని మాత్రమే చెప్పారు. "ఇదిమిద్దంగా తేదీ ఏమిటనేది స్పష్టత లేదు" అన్నారు. లడ్డూ ప్రసాదం తయారీపై ఓ జర్నల్ లో ప్రచురితమైన చరిత్రకారుడి వ్యాసం అందించారు. ఈ పరిశోధన ప్రకారం చూస్తే...
చరిత్రలో లడ్డూ ప్రసాదం
తిరుమల ఆలయంలో ఈ లడ్డూ ప్రసాదం 15 నుంచి 20 శతాబ్ది తొలినాళ్ల వరకు.. ఇప్పుడు లడ్డూకు ఉన్న స్థానం వరకు మాత్రమే ఉండేది. అప్పట్లో శ్రీవారికి "సంధి నివేదనలు" ( నైవేద్య వేళలు) ఖరారు చేశారు. ఆ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు ఆలయంలో పంచేవారు. ఎందుకంటే అప్పట్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవి కావు. ఈ ప్రసాదాలే భక్తుల ఆకలిని తీర్చేవి.
ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో మహంతులు తిరుమల ఆలయ నిర్వహణ పర్యవేక్షించే రోజుల్లో .. అంటే 19వ శతాబ్ది మధ్యకాలంలో తీపి బూందీని ప్రవేశపెట్టారు. 1940 నాటికి అదే లడ్డుగా మారింది. కాలక్రమంలో వడ స్థానాన్ని లడ్డు ఆక్రమించింది. ఇప్పుడు లడ్డుకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అందుకే...
ప్రపంచంలో పేరు...
తిరుమల శ్రీవారి ప్రసాదానికి ప్రపంచవ్యాప్తంగా పేరు ఉంది. శ్రీవేంకటేశ్వర స్వామి వారి నివేదనల కోసం ఎన్నో రకాల ప్రసాదాలను టీటీడీ తయారు చేస్తుంది. టీటీడీ తయారు చేస్తున్న లడ్డూ ప్రసాదానికి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ కూడా లభించింది. దేశంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా తిరుమల స్వామివారి లడ్డు ప్రసాదాలకు ఉన్న ఖ్యాతి మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. ఎందుకంటే.. టీటీడీ తయారు చేసే ఒక లడ్డునే కాదు అన్ని రకాల ప్రసాదాల్లో ఒక క్రమ పద్ధతిలో వాడే పదార్థాలు అంత మాధుర్యంగా ఉంటాయి.
రాజుల కాలం నుంచి..
స్వామివారి ప్రసాదం కోసం రాజుల కాలంలోనే ఎన్నో దానాలు అందించారు. భక్తులకు అందజేసే ప్రసాదాన్ని తిరుపొంగం అనేవారు. తరువాత శాలివాహనుల శకం 1455లో సుఖీయం, అప్పం, 1460లో వడ, అత్తిరసం 1468, మనోహర పడి 1547 లో శ్రీవారి ఆలయంలో ప్రసాదాలను ప్రవేశపెట్టినట్లు చరిత్ర చెబుతోంది. అయితే, వడ మినహా మిగతా ప్రసాదాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశాలు లేకపోవడాన్ని గమనించిన అప్పటి మద్రాసు ప్రభుత్వం శ్రీవారి ఆలయంలో తొలిసారిగా 1803లో ప్రసాదాల విక్రయాన్ని ప్రారంభించింది. లడ్డు తయారీకి అవసరమైన బూందీని తీపి ప్రసాదంగా విక్రయించారు. అనేది చరిత్ర చెబుతున్న మాట. ఇలా అనేక విధా రకాలుగా మారుతూ వచ్చిన ప్రసాదాల విక్రయం చివరకు..
1940 నుంచి లడ్డు ప్రసాదంగా..
1940 నుంచి తిరుపతి లడ్డుగా స్థిరపడింది. దీనికి కాస్త వెనక్కి వెళితే తాళ్లపాక పెద్ద తిరుమల ఆచార్యులు శాలివాహన సేవలో 1936లో తిరుమలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి కల్యాణోత్సవం ప్రవేశపెట్టించారనేది ఇతిహాసం చెబుతున్న మాట. ఆ ఆచార వ్యవహారం కొనసాగుతూ ఆధునిక కాలంలో కూడా స్వామివారికి నిత్య కళ్యాణం నిర్వహిస్తున్నారు. పెళ్లిలలో బూందీ లడ్డు ఇవ్వడం తెలుగింటి సంస్కృతి. స్వామి వారికి నిత్యకల్యాణం సమయంలో గృహస్తులకు బూందీ లడ్డు ఉచితంగా ఇవ్వడం ఆచారంగా మారింది.
"దిట్టం" ప్రకారం తయారీ
లడ్డు తయారీకి " పడితర దిట్టం" అంటే లడ్డు తయారీకి కావాల్సిన ముడి సరుకుల మోతాదును టీటీడీ సిద్ధం చేసింది.
పడి అంటే 51 వస్తువులు. పడికి కావలసిన వస్తువుల దిట్టం అని అర్థం. దీనిని టీటీడీ పాలక మండలి మొదటిసారి 1950లో నిర్ణయించింది. అప్పటి నుంచి ఇప్పటి పరిస్థితికి అనుగుణంగా రవాణా వ్యవస్థ అందుబాటులోకి రావడంతో భక్తుల సంఖ్య కూడా పెరిగింది. వీటన్నిటిని పరిశీలించిన టీటీడీ యంత్రాంగం 2001లో సవరించిన దిట్టంతో లడ్డు ప్రసాదాలు తయారు చేస్తున్నారు.
5100 లడ్డూల తయారీకి వివిధ రకాలైన 83 కేజీల సరుకులు వినియోగిస్తారు. 280 కిలోల ఆవు నెయ్యి, 200 కిలోల సెనగపిండి, 400 కిలోల చక్కెర, 35 కిలోల జీడిపప్పు, 17.5 కిలోల ఎండు ద్రాక్ష, 10 కిలోల కలకండ, ఐదు కిలోల యాలకులు అవసరం.
పోటు: వంటశాలలో లక్ష వరకు లడ్డూలను తయారు చేసే సామర్థ్యానికి పెంచారు. కొన్ని సంవత్సరాల కిందట బూందీని పోటులో తయారుచేసి, వెలుపలకు తీసుకొచ్చిన అనంతరం నిత్యం మూడు నుంచి నాలుగు లక్షల వరకు లడ్డూల తయారీ పరిమాణం పెరిగింది.
లడ్డు తయారీ..
తిరుమల శ్రీవారి ప్రసాదంగా అందించే లడ్డూల్లో అనేక రకాలను తయారు చేస్తున్నారు. కల్యాణం తర్వాత టికెట్టు కొనుగోలు చేసిన వారికి 750 గ్రాముల లడ్డూ ప్రసాదంగా అందిస్తారు. సాధారణ లడ్డూ 140 నుంచి 170 గ్రాములు ఉంటుంది. విడిగా కొనుగోలు చేయాలంటే కల్యాణంలడ్డు 200, సాధారణ లడ్డూ రు. 50 వంతున టీటీడీ విక్రయిస్తోంది. ఈ లడ్డూ తయారీకి వాడుతున్న పట్టిక ఆధారంగా టీటీడీ లడ్డూ ప్రసాదానికి 2008 జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) లభించింది. 2009లో జిఐ చట్టం 1999 ప్రకారం టీటీడీ లడ్డూపై పేటెంట్ హక్కులు సాధించింది. దీనివల్ల ఇతరులు అదే పేరుతో ఈ తరహా లడ్డు తయారు చేయకుండా నిరోధించడానికి ఈ హక్కుల వల్ల చట్టబద్ధత లభించింది.
లడ్డూలు.. మూడు రకాలు
తిరుమల శ్రీవారి ఆధ్యాత్మిక క్షేత్రం లడ్డూలు కూడా వివిధ రకాల లో ఉన్నాయి.
ఆస్థానం లడ్డు: ఈ లడ్డూను ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారుచేసి ఆలయ గౌర అతిథులకు మాత్రమే అందిస్తారు. ఈ లడ్డు బరువు 750 గ్రాములు ఉంటుంది. ఈ లడ్డు తయారీలో రూపొందించిన " దిట్టం" పరిమణానికంటే ఎక్కువ పదార్థాలు వాడతారు. అందులో ప్రధానంగా ఎక్కువ నెయ్యి, జీడిపప్పు, కుంకుమపువ్వు అదనంగా వేసి ప్రత్యేకంగా తయారు చేస్తారు.
కల్యాణోెత్సవం లడ్డు: శ్రీవారి ఆర్జిత కళ్యాణోత్సవంలో పాల్గొనే గృహస్థలకు ఈ లడ్డు అందిస్తారు. ఈ లడ్డు కౌంటర్లలో అదనంగా కూడా కొనుగోలు చేసే వెసులుబాటును టిటిడి అందుబాటులోకి తీసుకువచ్చింది.
ప్రోక్తం లడ్డు: పేరు విభిన్నంగా కనిపించినప్పటికీ .. తిరుమల శ్రీవారి పోటులో ఈ లడ్డును తయారు చేస్తారు. సాధారణ భక్తులకు కూడా ఈ లడ్డు రు. 50కి అందుబాటులో ఉంటుంది.
ఎన్ని రకాల ప్రత్యేకతలు ఉన్న తిరుమల శ్రీవారి ప్రసాదాలకు అత్యంత ఆదరణ ఉంది. భక్తుల మనసెరిగిన టీటీడీ ప్రసాదాల తయారీకి ప్రాధాన్యం ఇవ్వడమే కాదు. సామాన్య భక్తులకు కూడా ప్రసాదాలను అందుబాటులో ఉంచింది.
గడచిన కొన్ని దశాబ్దాలకాలంగా తిరుమల లడ్డు నాణ్యత తగ్గిందనే అసంతృప్తి సర్వత్రా వినిపిస్తున్న మాట. బరువు కూడా అదే స్థితిలో పరిమాణం తగ్గినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం టీటీడీ ఈఓగా బాధ్యతలు చేపట్టిన జే. శ్యామలరావు "తిరుమల లడ్డు ప్రసాదం నాణ్యత పెంచడానికి" శ్రద్ధ తీసుకున్నారు. నాణ్యమైన నెయ్యితో పాటు దినుసులు కూడా సక్రమంగా వినియోగించడానికి అంతే సూచనలు చేశారు.
Next Story