నెయ్యి కొనుగోలులో టీటీడీ ఆ కమిటీ బాధ్యత ఎంత?
తిరుమలలో ప్రతి పనికీ ఓ శాస్త్రీయ నియమం ఉంటుంది. ఉప్పు నుంచి పప్పు వరకు కొనుగోలుకు ఓ విధానం ఉంది. టీటీడీ బోర్డు పర్ఛేజింగ్ కమిటీ బాధ్యత ఎంత?
టీటీడీకి అవసరమైన పదార్థాలు, వస్తువుల కొనుగోలులో జరిగిన వ్యవహారాలపై ముగ్గురి పాత్ర తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం టీడీపీ కూటమిలో మంత్రి, ఓ ఎమ్మెల్యే గత వైసీపీ పాలనలో బోర్డు సభ్యులు. తమిళనాడు బీజేపీ నేత కూడా ఒకరు. వారి సారధ్యంలోని పర్ఛేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయాలు జరిగాయి. వారు ఇద్దరు టీటీడీ చైర్మన్ల కాలంలో పాలక మండలి సభ్యులుగా వ్యవహరించారు. లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి కొనుగోలుకు కూడా వారే ఆమోదముద్ర వేశారా? అనేిది చర్చకు వచ్చింది.
అన్నింటికీ ఓ లెక్క ఉంది...
టీటీడీలో ప్రతిపనికీ ఓ శాస్త్రీయత, చట్టబద్ధత ఉంటుంది. అన్నీ పూజాదికాలు ఆగమశాస్త్రానికి అనుగుణంగా నిర్వహిస్తారు. ఇది పక్కన ఉంచితే, టీటీడీకి అవసరమైన వస్తువుల కొనుగోలుకు పాలక మండలి తీసుకునే నిర్ణయమే శిరోధార్యం. అంతకుముందే పర్ఛేజ్ కమిటీ తీసుకునే నిర్ణయాన్ని బోర్డు ఆమోదిస్తుంది. ఇవన్నీ జరిగినా తనకు ఉన్న విచక్షణాధికారంతో ఈఓ వాటిని సమీక్షించడానికి వెసులుబాటు ఉంది.
ఆ నిర్ణయం సంచలనం
2004 కాంగ్రెస్ పాలన: టీటీడీ చరిత్రలో విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారి, ఈఓ డాక్టర్ కేవీ. రమణాచారి మాత్రమే అమలు చేశారు. ఆ ఇది టీటీడీలో నిరసనాగ్ని రాజేసింది. అప్పటి బోర్డు చైర్మన్ తనకు ఉన్న విచక్షాధికారంతో ఈఓ నిర్ణయాన్ని రద్దు చేసిన అరుదైన ఘటనకు కూడా తిరుపతిలోని టీటీడీ ప్రధాన పరిపాలనా భవనం వేదికగా మారింది. డాలర్ల కుంభకోణంలో ఇద్దరు డిప్యూటీ ఈఓలతో పాటు డాలర్ శేషాద్రిని కూడా సస్పెండ్ చేశారు. ఆ సమయంలో టీటీడీ చైర్మన్ గా ఉన్న తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నగరంలో లేరు. ఈ విషయం తెలియగానే మరుసటి రోజు తిరుపతికి చేరుకున్నారు. అందరి అభిప్రాలు తెలుసుకున్న చైర్మన్ పాలక మండలికి ఉన్న ప్రత్యేక విచక్షణాధికారాన్ని వినియోగించారు. అధికారులపై సస్పెన్షన్ ఎత్తి వేశారు. ఇదంతా గతం.
వైసీపీ అధికారంలోకి వచ్చాక
2019 ఎన్నికల తరువాత తిరుమల లడ్డూ ప్రసాదం నాసిరకంగా ఉంది. నాణ్యత కొరవడింది. అనే అసంతృప్తి గత మూడేళ్లుగా వినిస్తున్న మాట. దీనిపై ఫిర్యాదులు అందినా, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ అదనపు ఈఓగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఏవీ. ధర్మారెడ్డి ఖాతరు చేయలేదంటారు.
ఇదే అంశంపై శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు కూడా పునరుద్ఘాటించారు. "మొదటి నుంచి ఈఓ, చైర్మన్లకు చెప్పినా చెవిలో వేసుకోలేదు. ఇలాంటి పాపాలు చూడడానికి జీవించి ఉన్నామా? " అని గద్గద కంఠంతో వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ పాలక మండలిని నియమిస్తుంది. ఇందులో రాష్త్రంలోని తమ పార్టీ ప్రతినిధులతో పాటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణతో పాటు ఉత్తరాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర ప్రతినిధికి కూడా చోటుకల్పించడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. ఇదిసర్వసాధారణంగా జరిగేదే. కానీ,
అసెంబ్లీ కమిటీల తరహాలోనే..
టీటీడీలో పారదర్శక విధానాలు పాటించే విధంగా పాలక మండలి సభ్యుల ఆమోదముద్రతో నిర్ణయాలు జరుగుతాయి. అసెంబ్లీ తరహాలో టీటీడీ బోర్డు సభ్యులను వివిధ కమిటీ సభ్యులుగా నియమిస్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత..
జూన్ 21
వైసీపీ పాలనలో టీటీడీ చైర్మన్ గా వైవీ. సుబ్బారెడ్డిని అప్పటి సీఎం వైఎస్. జగన్ నియమించారు. తరువాత బోర్డు సభ్యులను కూడా నియమించారు. రెండోసారి కూడా ఆయననే పదవిలో కొనసాగించారు. మిగతా వారితో పాటు ఇందులో అప్పట్లో వైసీపీ పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్ధసారథి కూడా సభ్యుడు.
2023 ఆగష్టు 25
తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ కమిటీలో టీడీపీ రాజ్యసభ మాజీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బోర్డులో సభ్యురాలు కావడం గమనార్హం. అదే సమయంలో తమిళనాడు నుంచి బీజేపీ నేత వైద్యనాథన్ కృష్ణమూర్తి కూడా బోర్డు సభ్యుడే.
వారి బాధ్యత ఎంత?
వైసీపీ ఐదేళ్ల పాలనలో ఇద్దరే టీటీడీ బోర్డు చైర్మన్లుగా పనిచేశారు. రెండు దశల్లో వైవీ. సుబ్బారెడ్డి, తాజా సార్వత్రిక ఎన్నికలకు ముందు నియమితులైన మాజీ ఎమెల్యే కరుణాకరరెడ్డి కావడం గమనార్హం. ఇంకా ఏడాదికి పైగానే గడువు ఉన్నా, వైసీపీ ఓటమి చెంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భూమన కరుణాకరరెడ్డి టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా,
టీటీడీ చైర్మన్లుగా వారిద్దరి సారధ్యంలోని బోర్డులో ప్రస్తుతం రాష్ట్ర సమాచార మంత్రి శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అప్పట్లో వైసీపీలో బోర్డు సభ్యులుగానే కాకుండా, కీలక పర్ఛేజింగ్ కమిటీ సభ్యులుగా కూడా ఉన్నారు. వారితో పాటు తమిళనాడుకు చెందిన బీజేపీ నేత వైద్యనాథన్ కృష్ణమూర్తి కూడా షభ్యుడే. ఈయన చాలా పవర్ ఫుల్ అంటారు.
టీటీడీలో సాధారణంగా ఉప్పు నుంచి పప్పు వరకు కొనుగోలుకు వివిధ దశలు ఉంటాయి. అన్నదానం, ప్రసాదాలు, ఇంజనీరింగ్, విద్య, వైద్యం వంటి అనేక విభాగాలకు అవసరమైన వస్తువుల కోసం టెండర్లు పిలుస్తారు. వాటిని ఖరారు చేయాలంటే టీడీపీ పాలక మండలి నుంచి నియమించే కమిటీలు ఉంటాయి. వాటిలో కీలకమైన పర్ఛేజింగ్ కమిటీ సభ్యులుగా ప్రస్తుతం టీడీపీ మంత్రి కొలుసు పార్ధసారధి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి (అప్పట్లో వైసీపీ) ఉన్నారు.
కమిటీ ఏమి చేస్తుంది?
తాజాగా రగులుతున్న నెయ్యి కొనుగోలు వ్యవహారం నేపథ్యంలో కమిటీ వ్యవహారం తెరమీదకు రావడమే కాదు. చర్చకు కూడా ఆస్కారం కల్పించింది.. ఆ కమిటీలో పార్థసారధి, ప్రశాంతి రెడ్డితో పాటు బీజేపీ నేత వైద్యనాథన్ కృష్ణమూర్తితో పాటు మార్కెటింగ్ జీఎం, వేర్ హైజింగ్, ఎఫ్ఏ అండ్ సీఓ సభ్యులుగా కమిటీ కీలకంగా వ్యవహరిస్తుంది. టెండర్ దాఖలు చేసిన సంస్థలో వారంతా కలసి పరిశీలిస్తారు.
ఉదా: నెయ్యి సరఫరాకు ముందుకు వచ్చిన పాల కర్మాగారం స్థాయి, సమర్ధత, అవసరమైన మేరకు సరఫరా చేసే సామర్థ్యం ఉందా? లేదా? అని పరిశీలిస్తారు. అన్నీ సవ్యంగా ఉంటే కొనుగోలుకు అవసరమైన ధరల వివరాలపై మరోసారి సంస్థ ప్రతినిధులతో చర్చించిన మీదట కొనుగోలుకు వీలుగా ఆమోదముద్ర వేస్తారు. దీనిని పూర్తి స్థాయి పాలక మండలిలో ఆమోదించిన తరువాత నాణ్యతా ప్రమాణాల ఆధారంగా కొనుగోలుకు మార్గం ఏర్పడుతుంది.
ఇప్పుడు ఎందుకీ చర్చ
సీఎం చంద్రబాబు పేల్చిన మాటల బాంబు ద్వారా..
"టీటీడీ లడ్డూ ప్రసాదాల తయారీలో గొడ్డు, పంది కొవ్వు కలిసింది. చేప నూనె ఆనవాళ్లు, పామోలిన్ కూడా ఉంది" అనే మాటను టీటీడీ ఈఓ జే. శ్యామలరావు కూడా నిర్ధారించారు. దీనివల్ల గత ప్రభుత్వం, పాలక మండలిలో ఇవన్నీ గమనించారా? లేదా? ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించారా? లేదా ఇందులో తిరకాసు ఏమైనా ఎందా? అనే సవాలక్ష ప్రశ్నలు తెరమీదకు వచ్చాయి. ఈ వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయనేది వేచిచూడాలి.
Next Story