బెంగళూరు రేవ్ పార్టీకి కాకాణి, సోమిరెడ్డి గొడవకి లింకేమిటీ?
x

బెంగళూరు రేవ్ పార్టీకి కాకాణి, సోమిరెడ్డి గొడవకి లింకేమిటీ?

ఓ మాజీ మంత్రి, మరో మంత్రి... పరస్పర నిందారోపణలతో రోడ్డున పడ్డారు. నెల్లూరు జిల్లాకు చెందిన వారిద్దరి మధ్య బెంగళూరు రేవ్ పార్టీ మాటలే యుద్ధం రాజేసింది.


బెంగళూరు రేవ్ పార్టీ ఏమిటో గాని నెల్లూరు జిల్లాలో మాత్రం మంటలు పుట్టిస్తోంది. తిట్లు, శాపనార్ధాలు, నువ్వు దొంగంటే నువ్వు దొంగనే దూషణ భూషణలతో ఇద్దరు ప్రజాప్రతినిధులు జిల్లా ప్రజలకు వినోదం పంచుతున్నారు. ప్రజా ప్రతినిధులు సమాజంలో ఆదర్శంగా ఉండడానికి బదులు రోడ్డున పడడమేమిటంటూనే... వాళ్లలా తిట్టుకుంటేనే కదా ఎవరి బాగోతమేమిటో తెలిసిదనే సరదా పడుతున్నారు. ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి. నువ్వు అవినీతి చక్రవర్తివని సోమిరెడ్డి ఆరోపిస్తే... నువ్వు చరిత్ర హీనుడివంటూ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తిప్పికొడుతున్నారు.

నెల్లూరు జిల్లా సర్వేపల్లి అసెంబ్లీ స్థానం నుంచి రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి, మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో కూడా వారిద్దరూ పరస్పరం అవినీతి బండారాన్ని బట్టబయలు చేసుకున్నారు. వీరి ఆరోపణలు విన్న అన్ని వర్గాల ప్రజలు అవాక్కయ్యారు. పోలింగ్ ముగిసిన తర్వాత పరిస్థితి ప్రశాంతంగా ఉన్నది. అయితే, కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో జరిగిన రేవ్ పార్టీ వ్యవహారం వీరిద్దరి మధ్య మళ్ళీ మాటల యుద్ధం రాజేసింది.

కాకాణి కారు స్టిక్కర్ అక్కడికెలా వెళ్లింది...

బెంగళూరు నగరం హెబ్బగోడిలోని జిఆర్ ఫామ్స్‌లో రేవ్ పార్టీపై పోలీసులు చేసిన దాడుల సెగ నెల్లూరు జిల్లా వరకు తాకింది. అక్కడ ఓ కారుకు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడంతో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణ తూటాలు సంధించారు. "ఈ రేవ్ పార్టీ జరగడం వెనక మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హస్తం ఉంది" అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. కాకాణికి అంతర్రాష్ట్ర మాఫియాతో సంబంధాలు ఉన్నాయని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 518 మంది ఎమ్మెల్యేలు ఉంటే మంత్రి కాకాని ఎమ్మెల్యే స్టిక్కర్ మాత్రమే ఎందుకు ఉంది? అని సోమిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. నేరం చేసిన ప్రతిసారి కాకాణి బుకాయించడం పరిపాటి అని ఎద్దేవా చేశారు.

" మంత్రి కాకాణి కి అంతర్ రాష్ట్ర మాఫియాతో సంబంధాలు ఉన్నాయి. గ్యాంగ్ రేవ్ పార్టీకి ఏర్పాటు చేసింది ఆయనే. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న ఆయన కారుతో పాటు, పాస్పోర్ట్, మాదకద్రవ్యాలు కూడా పార్టీ ప్రదేశంలో దొరికాయి. పార్టీ జరిగిన ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డి కాకాణికి అత్యంత ఆప్త మిత్రుడు" అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. గతంలో జరిగిన సంఘటన ప్రస్తావించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి "2014 ఎన్నికలప్పుడు కల్తీ మద్యం పంపిణీ చేసి ఏడుగురు అమాయకుల చావుకు కారణమైనప్పుడు కోర్టుకు వెళ్లి తెచ్చుకున్నాడు. ఈ కేసులో నిందితులు కాకాణి స్నేహితులు రాజేంద్ర నిర్మల్ కుమార్, ఎస్ఎస్. సంతోష్, కార్గో లోకేష్, కార్గో రమేష్ బెంగళూరు కు చెందినవారే అని ఆరోపించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రిగా ఉంటూనే... కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్ని రకాల గనులను కొల్లగొట్టారని ఘాటుగా ఆరోపించారు.

ఆ వ్యాఖ్యలపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో తీవ్రంగా విరుచుకుపడ్డారు. "సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జీవితం ఎలాంటిదో నెల్లూరులో ప్రతి ఒక్కరికి తెలుసు. అతను ఇళ్లలోకి వస్తున్నారంటే భయపడిపోతారు" అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఓ సినిమా థియేటర్లో మహిళలు చీపుర్లతో కొట్టారు. ఒక లాడ్జిలో పట్టుబడిన సోమిరెడ్డిని విడిపించేందుకు, ఆనాటి మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి నానా పాట్లు పడేలా చేశాడని" సోమిరెడ్డి జీవితాన్ని ఆవిష్కరించారు.

సీబీఐ విచారణకు సిద్ధం

" ఇప్పటికే చెబుతున్నా. నాకు రేవు పార్టీతో ఎలాంటి సంబంధం లేదు. అక్కడ పార్టీ జరుగుతుండగా స్వాధీనం చేసుకున్న కారుకు వున్న స్టిక్కర్ నాది కాదు. దీనిపై నేను సిబీఐ విచారణకు సిద్ధం" అని కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ చేశారు. కోర్టులో ప్రజాప్రయోజన పిటిషన్ దాఖలు చేసి, ఎన్నికల కమిషన్ ద్వారా సిబిఐ విచారణకు విన్నవించాలని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఉచిత సలహా ఇచ్చారు.

" ప్రతి ఎమ్మెల్యేకి శాసనసభ కార్యదర్శి మూడు స్టిక్కర్లు ఇస్తారు. అవి మూడు మాకార్లకే ఉన్నాయి. బెంగళూరులో పట్టుబడిన కారుకు ఉన్న స్టిక్కర్ జిరాక్స్ కాపీ అయి ఉండవచ్చని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై తన పిఏ పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయిందని ఆయన గుర్తు చేశారు. విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు

" వ్యక్తిత్వం లేని సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి లాంటి మనిషిపై నేను పోటీ చేయాల్సి రావడమే.. దౌర్భాగ్యం. అలాంటి నీచుడు మరొకరు ఉండరంటూ" తీవ్ర పరుష పదజాలంతో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విరుచుకుపడ్డారు. "బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదు. దీనిపై ఎలాంటి నిష్పక్షపాతమైన విచారణకు సిద్ధంగా ఉన్నాను" అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు.

రేవ్‌ పార్టీ అంటే ఏంటి,,?

ఈ రేవ్ పార్టీ కల్చర్‌ 1950 లో ఇంగ్లండ్‌లో ప్రారంభమయినట్టుగా వార్తా కథనాలు ఉన్నాయి. 1950 తర్వాత.. ఈ కల్చర్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. ఈ పార్టీలో తొలుత మ్యాజిక్‌, డ్యాన్స్‌ ను ఎంజాయ్‌ చేసేవారు. సంగీత కళాకారులు ఈ పార్టీల్లో ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆ తర్వాత ఈ పార్టీ కల్చర్‌ కొత్త రూపు సంతరించుకుంది. ఒక క్లోజుడ్‌ ప్రదేశంలో చెవులు పగిలిపోయే మ్యాజిక్‌ పెట్టుకుని మద్యం సేవిస్తూ.. పార్టీ చేసుకునే వారు.. వైల్డ్‌ బిహేవియర్‌తో చేసుకునే పార్టీలను ‘రేవ్‌’ అని పిలవడం మొదలుపెట్టారు. సాధారణంగా మద్యం సేవిస్తూ, డ్యాన్స్‌లు వేస్తూ పార్టీలు చేసుకోవడం వేరు.. ఈ రేవ్‌ పార్టీలు వేరు. ఈ రేవ్‌ పార్టీ అని పదం మొదట లండన్‌ లో పుట్టింది. రేవ్‌ పార్టీలో పాల్గొనే వారిని రేవర్స్‌ అని పిలుస్తారు. ప్రముఖ జాజ్ సంగీత విద్వాంసుడు మిక్ ముల్లిగాన్‌ ను “కింగ్ ఆఫ్ ది రేవర్స్” అని అంటారు. క్రమక్రమంగా ఈ రేవ్‌ పార్టీ కల్చర్‌.. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు వేదికైంది. మద్యంతో పాటు అమ్మాయిల డ్యాన్స్‌ అశ్లీల నృత్యాలు చేయడమే కాకుండా.. యాంఫేటమిన్, ఎల్‌ఎస్‌డీ, కెటామైన్, మెథాంఫేటమిన్ , కొకైన్ , గంజాయి వంటి మాదకద్రవ్యాలు వాడటం కామన్ గా మారింది. ఇలాంటి చట్టవ్యతిరేక రేవ్‌ పార్టీలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందితే.. వెంటనే దాడి చేసి.. పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకుని, నిర్వహకులను అరెస్ట్‌ చేస్తారు. ఈ పార్టీలతో డ్రగ్స్‌ వాడకం వివరీతంగా పెరగడంతోనే పోలీసులు ఈ రేవ్‌ పార్టీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా కూడా.. కొంతమంది సెలబ్రేటీలు ఈ రేవ్‌ పార్టీ కల్చర్‌ నుంచి బయటపడలేకపోతున్నారు.

Read More
Next Story