చంద్రబాబు అరెస్ట్ చెప్పిన పాఠమేంటీ..?
x
విజయవాడ కోర్టు ఆవరణలో నారా చంద్రబాబు (ఫైల్)

చంద్రబాబు అరెస్ట్ చెప్పిన పాఠమేంటీ..?

ఒక అరెస్ట్.. ఓ ఓటమి.. మరో అధికారం.. చంద్రబాబు అరెస్ట్ కు రెండేళ్లు


మనసులో కల్లోలం. వ్యక్తీకరించలేని భావన. మౌనంగా శూన్యంలో వెతుకులాట. చంద్రబాబు మదిలో ఏముంది? ప్రపంచదేశాల్లోని తెలుగువారిని కదిలించిన చంద్రబాబు చిత్రం.

స్కిల్ డెవలప్ మెంట్ (Skill Development) కేసులో అక్రమాల ఆరోపణలపై ఏపీ సీఐడీ పోలీసులు సీఎం నారా చంద్రబాబు (అప్పటి ప్రతిపక్ష నేత)ను అరెస్టు చేసి రెండుళ్లు అయ్యాయి. గత ఎన్నికలకు తొమ్మిది నెలల ముందు జరిగిన అరెస్టు వల్ల రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. సమీకరణలు కూడా మారిపోయాయి. ఈ సంఘటన దేశ, విదేశాల్లోని తెలుగు వారిని ప్రధానంగా టీడీపీ శ్రేణులను రోడ్లపైకి వచ్చేలా చేసింది. ఇదంతా ఒక ఎత్తైతే, అరెస్టు తరువాత విజయవాడ ఏసీబీ కోర్డు ఆవరణలో చంద్రబాబు కుర్చీలో కూర్చున్న ఫొటో చాలా మందిని కదిలించింది.

"మాజీ సీఎం చంద్రబాబును అరెస్టు చేయించడం ద్వారా వైసీపీ ప్రభుత్వం ప్రధానంగా వైఎస్. జగన్ తన పతనానికి తానే ఉరి వేసుకున్నాడు" అని టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీఎం చంద్రబాబు కొడుకు నారా లోకేష్ ఘాటుగా వ్యాఖ్యానించడం, ట్విట్టర్లో పోస్టు కూడా చేశారు.
కర్నూలు మాజీ ఎమ్మెల్యే, సీపీఎం (CPM) సీనియర్ నేత ఎంఏ. గఫూర్ విశ్లేషణ ఎలా ఉందంటే..
"వైసీపీ రాక్షస పాలనతో అన్నివర్గాలు విసిగిపోయాయి. బటన్ నొక్కుడు తప్ప మరే అభివృద్ధి లేదు. ఉద్యోగ వర్గాలతో పాటు వేతన జీవులకు కష్టాలు తప్పలేదు" అని గఫూర్ వ్యాఖ్యానించారు.
"జగన్ పరిపాలనలో చాలా అంశాలను నిర్లక్ష్యం చేశారు. తన ఓటమికి తానే శాసనం రాసుకున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు అరెస్టు వల్ల ఇంకొంత అపఖ్యాతి మూటగట్టుకుని అధికారం కోల్పోయారు" అని గఫూర్ విశ్లేషించారు.

ఎన్నికలకు తొమ్మిది నెలల ముందు..
2023వ సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదో తేదీ "బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ" కార్యక్రమంలో 2024 ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి టీడీపీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు రాష్ట్ర పర్యటనక శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల పర్యటనకు వచ్చారు. రాత్రి బస్సులోనే సేదదీరుతున్నారు.
9వ తేదీ వేకువజామున ఆరు గంటలకు డీఐజీ రఘురామిరెడ్డి సారధ్యంలోని ఏపీ సీఐడీ పోలీసులు రంగప్రవేశం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ లో జరిగిన అక్రమాలపై నమోదైన కేసులో క్రైం నంబర్ 29/ 2021 కింద అరెస్టు చేస్తున్నట్లు సీఆర్పీపీసీ సెక్షన్ 50 (1)(2) కింద నోటీసు ఇచ్చారు.
"ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా అరెస్టు చేస్తారు" అని చంద్రబాబు తరఫు లాయర్లు సీఐడీ పోలీసులను నిలదీశారు.
"ఎఫ్ఐఆర్ లో తన పేరు ఎక్కడుందో కూడా చెప్పాలి" అని చంద్రబాబు కూడా గట్టిగానే నిలదీశారు.
"ఆధారాలు అన్నీ హైకోర్టుకు సమర్పించాం. రిమాండ్ రిపోర్టులో అన్నీ ఉన్నాయి" అని డీఐజీ రఘురామిరెడ్డి సమాధానం చెప్పడం ద్వారా చంద్రబాబును ఆయన కాన్వాయ్ లోనే విజయవాడకు తరలించారు. దారి పొడవునా టీడీపీ శ్రేణులే కాదు. పౌరులు కూడా రోడ్ల వెంట బారులుదీరారు.
వైసీపీ సాగించిన దమనకాండ పీక్ చేరుకున్నదనడానికి ఇది నిదర్శనం అని మదనపల్లె బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, బీసీ సంఘం నేత డివి. రమణ అభివర్ణించారు.
"దమనకాండ అని నేను ఎందకు అనాల్సి వచ్చిందంటే.. ప్రాజెక్టుల సందర్శనకు చంద్రబాబు అనంతపురం నుంచి సొంత జిల్లా చిత్తూరు బయలుదేరారు. తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు వద్ద చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సు, కాన్వాయ్ పై రాళ్లు రువ్వించిన సంఘటన రాష్ట్ర ప్రజలను ఆలోచనలో పడేసింది. టీడీపీ శ్రేణులను మరింత అప్రమత్తం చేసింది" అని న్యాయవాది రమణ గుర్తు చేశారు. ఈ సంఘటనకు ముందు, ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం అణిచివేత ధోరణే జగన్ పతనానికి దారి తీసింది" అని రమణ విశ్లేషించారు. తన తండ్రి నారా చంద్రబాబును అరెస్టును నిరసిస్తూ, కొడుకు నారా లోకేష్, కోడలు నారా బ్రహ్మణి కూడా పార్టీ కార్యకర్తలుగా చేతులకు సంకేళ్లు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు.

భార్య నారా బ్రహ్మణితో కలిసి నిరసన వ్యక్తం చేస్తున్న నారా లోకేష్ (ఫైల్)

మలుపు తిరిగిన రాజకీయం
2029 ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ స్థానాలతో అధికారం సాగిస్తున్న పరిస్థితుల్లో..
2024 ఎన్నికలకు సరిగ్గా తొమ్మది నెలలకు ముందు చంద్రబాబు అరెస్టు రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు గట్టి దెబ్బతగిలింది. అంతకుముందు ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు. Skill Development కేసులో ఆయన అరెస్టు కావాల్సిన అనివార్యమైన పరిస్థితి ఎదురైంది. అదే జనసేన చీఫ్ కొణిదెల పవన్ కల్యాణ్ టీడీపీకి మళ్లీ దగ్గరకావడం. తిరిగి బీజేపీతో మైత్రిని కుదర్చడంలో కూడా కీలకపాత్ర పోషించారు. రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.
ఈ పరిస్థితిని గుర్తు చేస్తూ, ప్రతీకార రాజకీయాలు సాగించిన ఆరోపణ లు చంద్రబాబుపై లేవని టీడీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ జీ. నరసింహయాదవ్ గుర్తు చేశారు. ఆయన ఏమంటారంటే..
"ఎఫ్ఆర్ఓలో పేరు లేని చంద్రబాబును అరెస్టు చేయడం వైసీపీలోనే చాలా మందికి మింగుడు పడలేదు. పిచ్చాపాటీగా నాతోనే చాలా మంది అన్నారు" అని నరసింహయాదవ్ గుర్తు చేసుకున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందనే విషయంలో మాకు క్లారిటీ ఉండేది. జగన్ పాలన రాక్షసుడిని తలపించింది. వాళ్ల పార్టీ వాళ్లే ఆయనపై అసంతృప్తిగా ఉన్నారు. దీనికి తోడు చంద్రబాబును అరెస్టు చేయడం మరింత కలిసి వచ్చింది. అది కాదబ్బా అధికారంలో ఉండి, ఎన్నికలకు వెళ్లిన పార్టీ కనీసం ప్రతిపక్ష హోదాకు తగిన స్థానాలు కూడా దక్కించుకోలేదు. అక్కడే అర్థం అయిపోలా వైసీపీ వాళ్లే జగన్ పార్టీకి ఓట్లు వేయలేదు" అని నరసింహయాదవ్ విశ్లేషించారు.
అసలు కేసు ఏమిటి?
రాష్ట్ర విభజన తరువాత ఎపీఎస్ఎస్డీసీ (స్కిల్ డెవలప్మెంట్)తో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్ మెంట్ లో యువతకు శిక్షణ ఇవ్వడం, ఆ తరువాత ఉపాధి కల్పించడం అనేది స్కిల్ డెవలప్మెంట్ కొర్పొరేషన్ ప్రధాన లక్ష్యం. దీనికోసం అనేక ఐటీ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఢిల్లీ సమీపంలోని నోయిడా కేంద్రంగా పనిచేసే సీమెన్స్ ఇండస్ట్రియల్ సాప్ట్వేర్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లో స్కిల్ ఎక్సలెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీని ఖర్చులో పది శాతం ప్రభుత్వం భరించే విధంగా ఒప్పందం కూడా జరిగింది. మిగతా 90 శాతం సీమెన్స్ భరించడానికి అంగీకారం కుదిరింది. ఆ మేరకు 2017 నుంచి స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సీమెన్స్తో కలిసి పనిచేసింది.
రాష్ట్రంలో ఆరు క్లస్టర్లు ఏర్పాటు చేయడం ద్వారా ఒకో క్లస్టరుకు రూ.560 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. అందుకు ప్రభుత్వం తన వాటా కింద 371 కోట్ల రూపాయలు చెల్లిస్తుందని ఆ నాటి సీఎం హోదాలో ఎన్. చంద్రబాబు ప్రకటించారు.
2021లో ఆ నిధులు దుర్వినియోగం అయ్యాయని వైసీపీ ప్రభుత్వ కాలంలో కేసు నమోదు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కృత్రిమంగా 3,300 కోట్ల రూపాయలకు పెంచారని సీమెన్స్ సంస్థ ప్రతినిధి జీవిఎస్. భాస్కర్ తోపాటు కొందరిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఏపీ ప్రభుత్వం 371 కోట్లు చెల్లించినా సీమెన్స్ అందించిన సాఫ్ట్ వేర్ విలువ 58 కోట్ల రూపాయలుగా సీఐడీ తన కేసు దర్యాప్తులో ప్రస్తావించింది. 26 మందిపై కేసు నమోదు చేసినా, వారిలో పది మంది వరకు అరెస్టు అయిన విషయం తెలిసిందే.
ఈ వ్యవహారంపై అప్పట్లో మాజీ సీఎం వైఎస్. జగన్ స్పందిస్తూ..
"సీమెన్స్ స్థానంలోని ఉన్నతోద్యోగిని అడ్డుపెట్టుకుని కుంభకోణానికి పాల్పడ్డారు. డీపీఆర్ లేకుండా, టెండర్ పిలవకుండా నిధులు పక్కదారి పట్టించారు. విదేశాలకు నిధులు మళ్లించి తరువాత హైదరాబాద్ వరకు తరలించారు" అని కూడా జగన్ ఆరోపించారు.
ఈ కేసు పెట్టడం వల్ల గొప్ప పరిణామం చోటుచేసుకున్నదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన్ తాజ్ వ్యాఖ్యానించారు.

అమెరికాలోని డౌన్ టౌన్ నగరంలో తెలుగు రాష్ట్రాల టెకీల నిరసన (ఫైల్

"ఐటీకి పునాదుల వేసిన చంద్రబాబు వల్ల కులాలు, పార్టీలు, మతాలకు అతీతంగా యువకులు విద్యావంతులయ్యారు. వారిలో వేలు, లక్షల సంఖ్యలో వారి కుటుంబాలను ఉన్నత స్థితికి తీసుకువచ్చారు. చంద్రబాబును అరెస్టు చేసిన నేపథ్యంలో దాదాపు 53 దేశాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన టెకీలు పార్టీలకు అతీతంగా స్పందించి, నిరసనలకు దిగడం, ఎన్నికల్లో సొంత ఖర్చులతో వచ్చి ఓటు వేసి, తిరిగి వెళ్లారు" అని పర్వీన్ తాజ్ గుర్తు చేశారు. అంటే యువత జీవితాలకు దిశ చూపిన చంద్రబాబుకు అండగా, నిలిచిన ఈ ఘటన చారిత్రాత్మకం అన్నారు.
బాబు అరెస్టుతో...
నంద్యాలలో అరెస్టు చేసిన ఎన్. చంద్రబాబును విజయవాడకు తరలించారు.
2023 సెప్టెంబర్ 9వ తేదీ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. రాజమండ్రి కేంద్ర కారాగారానికి రిమాండ్ కు తరలించారు. కోర్టులో వాదనలు జరిగే సమయంలో ఆవరణలోనే కుర్చీలో కూర్చొన్న చంద్రబాబు ఎదురుగా ఉన్న కిటికీ శూన్యంలోకి చూస్తు ఉండిపోయారు. ఆ సమయంలో ఆయన మదిలో ఎన్నో ఆలోచనలు గింగిరాలు తిరుగుతున్నట్లు ఆయన ముఖంలోని భావాలు వ్యక్తం చేశాయి. ఈ ఫోటో మరింతగా వైరల్ గా మారిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల్లోని ఐటీ ఉద్యోగులు నల్లజెండాలు, దుస్తులు ధరించి నిరసనలకు దిగారు. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న 53 రోజులు టీడీపీ శ్రేణులకు మంచి, ఐటీ ఉద్యోగులు, ఎన్ఆర్ఐలు నిరసనలు సాగించడం ద్వారా మద్దతు ప్రకటించారు.
చంద్రబాబు అరెస్టు సంఘటన, టీడీపీ కూటమి అధికారంలోకి రావడంపై సీఐటీయూ రాష్ట్ర నేత కందారపు మురళీ మాటల్లో చెప్పాలంటే..
"ప్రజలకు వైసీపీ రౌడీయిజం పాలన నచ్చలేదు. నగదు బదిలీ మినహా, వ్యవస్థలను దుర్వినియోగం చేశారు. కాస్త రాజకీయ పరిజ్ణానం ఉన్న వారందరికీ అర్థం అయింది" అని కందారపు మురళీ వ్యాఖ్యానించారు. జగన్ పార్టీపై ఉన్న అసంతృప్తకి చంద్రబాబు అరెస్టు ఘటన మరింత ఆజ్యం పోసింది. ఈ రెండు అంశాలే కూటమికి అవకాశం కలిసిరావడానికి ఆస్కారం ఏర్పడింది" అని మురళీ అభిప్రాయపడ్డారు.
మళ్లీ కలిసిన బంధం
2024 మే 13వ తేదీ సార్వత్రికల ఎన్నికలు జరిగాయి. స్కిల్ డెవలప్ మెంటు కేసు టీడీపీతో జనసేన, బీజేపీని మళ్లీ కలిపింది. ఈ ఎన్నికల ఫలితాలు
జూన్ నాల్గవ తేదీ ఓట్ల లెక్కింపుతో వెలువడిన ఫలితాలతో కూటమికి తిరుగులేని మెజారిటీ దక్కింది. టీడీపీ 144 సీట్లలో పోటీ చేసి, 135 స్థానాల్లో గెలిస్తే, జనసేన 21 సీట్లలో పోటీ చేసి వంద శాతం స్ట్రైకింగ్ రేటు సాధించింది. బీజీపీ పది స్థానాల్లో పోటీ చేసి ఎనిమిది సీట్లు దక్కించుకుంది.
2019 అధికారం సాధించి, ఎన్నికలకు వెళ్లిన వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కడం రాజకీయ పరిశీలకులను కూడా ఆశ్చర్యానికి గురి చేశాయి.
కర్నూలు జిల్లా నంద్యాల వద్ద అరెస్టు చేసిన తరువాత కోర్టు ఆవరణలో మౌనమునిలా శూన్యంలోకి చూస్తూ కూర్చున్న చంద్రబాబు మదిలో ఎన్నో ఆలోచనలు గింగిరాలు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. రాజమండ్రి సెంట్రల్ జైలులో 53 రోజుల పాటు రిమాండ్ లో ఉన్నారు. ఆ సమయంలో ఏమి ఆలోచనలు సాగించారో తెలియదు. కానీ, అధికారంలోకి వచ్చాక గతానికి భిన్నంగా ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడడం, జిల్లాల పర్యటనల్లో ప్రజలతో వ్యక్తిగతంగా మాట్లాడే తీరు ద్వారా మారిన మనిషిగా ప్రచారం దక్కింది.
Read More
Next Story