పోలీసులకు వెర్రెత్తించిన ఈ వర్రాతో జగన్ కి లింకేమిటి?
x

పోలీసులకు వెర్రెత్తించిన ఈ 'వర్రా'తో జగన్ కి లింకేమిటి?

రాజకీయాలను సోషల్ మీడియా కుదిపేస్తోంది. వైసీపీ విభాగం వర్కర్లతో తలనొప్పులు తప్పడం లేదు. ఈ ఎపిసోడ్ లో 'వర్రా' వ్యవహారం పీక్ కు చేరింది.


అధికార కూటమి ప్రభుత్వం వర్రా రవీంద్రారెడ్డిని మోస్ట్ వాంటెడ్ వైసీపీ సోషల్ మీడియా వర్కర్ గా భావిస్తోంది. అతనిని పట్టుకుని వచ్చిన కడప తాలూకా పోలీసులు స్టేషన్లో విచారణ చేస్తున్నారు. 41 ఏ నోటీసులు ఇచ్చారు. వర్రాకు జామీగా ఓ సర్పంచ్ సంతకం చేశాడు. వర్రా కోసమే అప్పటికే మరో ప్రాంత పోలీసులు మాటు వేశారు. అదే సమయంలో వర్రా బయటకి వచ్చాడు. అతను ఎలా ఉంటాడనేది తెలియని ఆ పోలీసులు అడ్డగించారు. అశ్వద్ధామ అత:కుంజరహ అన్నట్లు "సోషల్" అనే పదాన్ని మింగేసిన వర్రా "మీడియా" అనడంతో వదిలేశారు. ఇలా పోలీసులను బురిడీ కొట్టించి చల్లగా జారుకున్నాడు. ఈ వ్యవహారం కాస్తా.. కడప ఎస్పీ హర్షవర్ధనరాజుపై బదిలీ వేటు పడేలా చేసింది. ఇందులో పోలీసుల సహకారం లేకపోలేదనేది ఆరోపణ. ఎస్పీ హర్షవర్ధనరాజు ముక్కుసూటితనం కిందిస్థాయి సిబ్బంది వైసీపీకి సహరించేలా చేస్తోందనే ఆరోపణలు కూడా తెరమీదకు వచ్చాయి.


కడప జిల్లా కేంద్రంగా రెండు రోజుల కిందట సాగిన ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వాన్ని షేక్ చేసింది. అంతేకాదు. "హోం మంత్రి తీరు. లా అండ్ ఆర్డర్ గతి తప్పింది. పోలీసుల తీరు మారలేదు" అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కూడా ఊతం ఇచ్చిందనడంలో సందేహం లేదు.
వర్రా... తీరుతో కూటమి వర్రీ..
అతను ఓ వైసీపీ సోషల్ మీడియా వర్కర్. వైసీపీ అండతో తనకు తాను సంధించుకున్న బాణం. వాళ్లు.. వీళ్లు అనే తేడా లేదు. సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్, జనసేన నేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం శాఖ మంత్రి, వంగలపూడి అనిత.. ఇలా ఒకరు కాదు. చివరాఖరికి తాను ఆరాధించే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు షర్మిల, ఆమె తల్లి వైఎస్. విజయమ్మను కూడా వదలలేదు. అయినా, వైసీపీ అతనికే అండగా నిలిచింది. కారణం.
ఇదే సాక్ష్యం..

వైసీపీ సోషల్ మీడియాలో పోస్టుల నేపథ్యంలో వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన కుటుంబీకులు చింతకొమ్మదిన్నె (CK Dinne) పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారనే విషయం డిప్యూటీ మాజీ సీఎం అంజాద్ బాషా, మాజీ సీఎం వైఎస్. జగన్ మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి. రవీంద్రనాథరెడ్దికి తెలిసింది. వారందరూ తమ అనుచరులతో పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారంటే వర్రా రవీంద్రారెడ్డికి ఇస్తున్న ప్రాధాన్యం ఏ స్థాయిలో ఉందనేది అర్థం చేసుకోవచ్చు.
ఇంతకీ ఎవరీ 'వర్రా'..?

కడప జిల్లా పులివెందుల తాలూకా వేముల మండలం కొండ్రెడ్డిపల్లెకు చెందిన వ్యక్తి వర్రా రవీంద్రారెడ్డి, ఆయన తండ్రి మాజీ సర్పంచ్. దివంగత సీఎం వైఎస్ఆర్ తో వర్రా తండ్రికి సత్సంబంధాలుం ఉండేవని పులివెందుల ప్రాంతానికి చెందిన వ్యక్తులు చెప్పిన సమాచారం. సాధారణంగా తన నియోజకవర్గంలోని నేతలందరికీ వైఎస్ఆర్ మంచి గుర్తింపు ఇచ్చేవారు. అదే సత్సంబంధాలు మాజీ సీఎం వైఎస్ జగన్ తో కూడా వర్రా రవీంద్రారెడ్డి తండ్రికి ఉన్నాయి. దీంతో వర్రా రవీంద్రారెడ్డికి భారతి సిమెంట్స్ కర్మాగారంలో ఉద్యోగం ఇప్పించాడు. ఇంతవరకు బాగానే ఉన్నా..
పులివెందులలో తనకు మంచి గుర్తింపు ఉండాలని వర్రా రవీంద్రారెడ్డి కలలుగనేవాడని ఆ ప్రాంత సంబంధీకులు చెబుతున్నారు. ఆ కోవలో వైఎస్ కుటుంబంలో ప్రధానంగా మాజీ సీఎం వైస్. భారతి మన్ననలు పొందడం, కడప ఎంపీ వైఎస్. అవినాష్ తో కూడా దగ్గరగా మెలిగాడని చెబుతున్నారు. దీంతో..
2014 నుంచి వైసీపీ సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరిస్తూ, టీడీపీ చీఫ్ ఎన్. చంద్రబాబు ఆయన కుటుంబీకులు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, ఆయన వ్యక్తిగత జీవితంపై దారుణంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ విషయంలో "నేను బాధితురాలినే" అని సాక్షాత్తూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేసిన విషయం గమనించదగిన విషయం.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వర్రా రవీంద్రారెడ్డి భారతీ సిమెంట్ పరిశ్రమలో ఉద్యోగం వదిలేశాడు. అతని స్వామి భక్తికి మెచ్చిన వైసీపీ చీఫ్ వర్రాకు ప్రభుత్వం, పార్టీ పరంగా ప్రతినెలా వేతనం అందే ఏర్పాట్లు చేశారని తెలిసింది. ఈ పరిస్థితుల్లో ..
మాజీ మంత్రి వైఎస్. వివేకానందరెడ్డి హత్యానంతరం వైఎస్ఆర్ కుటుంబంలో తేడాలు వచ్చాయి. దీంతో తాను ఆరాధించే వైఎస్. జగన్ స్వయాన తల్లి వైఎస్. విజయమ్మ, చెల్లి షర్మిళపై కూడా సోషల్ మీడియాలో వర్రా పోస్టులు పెట్టాడనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై వైఎస్. షర్మిల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా,
2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ ఏర్పడిన తరువాత వర్రా రవీంద్రారెడ్డిని అనంతపురం జిల్లా కదిరి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రముఖంగా వార్తలు వెలువడ్డాయి. అయితే వైసీపీ పెద్దల నుంచి అందిన ఆదేశాలతో వర్రాను వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి. కదిరి సమీపంలోని కూటాగల్లు గ్రామం వద్ద అక్కడి ఎమ్మెల్యేను ధిక్కరించి, భూ సెటిల్ మెంట్ కోసం వెళ్లారనే విషయంలో ఆరోపణలు ఉన్నాయి. కాగా,
రెండు రోజుల కిందట ఏమి జరిగింది?
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యపై తీవ్ర స్థాయిలో స్పందించారు. అదే రోజు ఆర్ కే. వ్యాలీ సీఐ సారధ్యంలో కడప తాలూకా పోలీసులు వేముల మండలం కొండ్రెడ్డిపల్లెలో వైసిపి సోషల్ మీడియా వర్కర్ వర్రా రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వేంపల్లెకు, తర్వాత కడప సమీపంలోని చింతకొమ్మదిన్నె (ck Dinner) పోలీస్ స్టేషన్, మళ్లీ కడప తాలూకా పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరుసటి రోజు అంటే గురువారం ఉదయం వర్రా రవీంద్రారెడ్డి భార్య, కుటుంబీలకు సమాచారం అందించారు. వారు వేముల మండల పోలీస్ స్టేషన్ వద్దకు బయలేదేరారు. మళ్లీ పోలీసులు సమాచారం ఇవ్వడంతో సీకే దిన్నె పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు.
వైసీపీ నేతల అండ..
ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ మాజీ సీఎం, కడప మాజీ ఎమ్మెల్యే షేక్ అంజాద్ బాషా, మాజీ సీఎం వైఎస్. జగన్ మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి. రవీంద్రారెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. వర్రా రవీంద్రరెడ్డి భార్యకు మద్దతుగా నిలిచారు. ఈ వ్యవహారం ఇక్కడ సాగుతుండగానే...
తాలూకా స్టేషన్ వద్ద..
తమ పార్టీ సోషల్ మీడియా వర్కర్ వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే సమాచారం అందుకున్న వైసీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి పోలీసులపై ఒత్తిడి వచ్చినట్లు తెలిసింది. దీంతో వర్రా రవీంద్రారెడ్డికి 41-A నోటీసులు జారీ చేయడం, అతనికి బెయిల్ కోసం పెండ్లూరు సర్పంచ్ సాక్షి సంతకం చేశారని తెలిసింది. అంతకుముందే... సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు చేసిన కేసులో వర్రా రవీంద్రారెడ్డిని అరెస్టు చేయాలని అన్నమయ్య జిల్లా రాజంపేట పోలీసులు తాలూకా పోలీస్ స్టేషన్ వెలుపల వేచి ఉన్నారు. ఆ సమయంలో, బయటికి వచ్చిన వర్రా రవీంద్రారెడ్డిని ప్రశ్నించారు. "నేను మీడియా ప్రతినిధిని" అని బురిడీ కొట్టించి గర్తు లియని ప్రాంతానికి పారిపోయాడని చెబుతున్నారు.
వర్రా మహా ఇంటెలిజెంట్..
పోలీసుల వల నుంచి చాకచక్యంగా తప్పించుకున్న వర్రా రవీంద్రారెడ్డి సురక్షిత ప్రదేశానికి వెళ్లినట్లు తెలుస్తోంది. లేదంటే, సోషల్ మీడియాలో అసభ్యకరం, అభ్యంతర పోస్టులు పెట్టిన వ్యవహారంలో రాష్ట్రంలోని స్టేషన్లలో నమోదైన కేసుల్లో అరెస్టు చేసే పరిస్థితి నుంచి బయటపడినట్లు కనిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తైతే, తన భార్య, కుటుంబీకులు సీకే. దిన్నె పోలీస్టేస్ వద్దకు రావడం, వారిని వైసీపీ నేతలు పరామర్శిస్తున్న ఫొటోలు, వివరాలు తన ఫోస్ బుక్ (Face Book) ఖాతాలో కూడా ప్రత్యక్షమయ్యాయి. కాగా,
వైసీపీ మోస్ట్ వాంటెడ్ సోషల్ మీడియా వర్కర్ వర్ర రవీంద్రారెడ్డి వ్యవహారంలో కడప జిల్లా ఎస్పీ హర్షవర్థనరాజుపై బదిలీ వేటు పడింది. ఆయన ఎక్కడ పనిచేసిన ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరు సంపాదించుకున్నారు. ఆ నిజాయితీనే తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏర్పాటైన "సిట్"లో కూడా కడప ఎస్పీ హర్షవర్ధనరాజు దర్యాప్తు అధికారి కావడం గమనార్హం.
కడప జిల్లాలో ఎస్పీ హర్షవర్ధనరాజు "అసాంఘిక కలాపాలను అడ్డుకోవడం, ఇసుక మాఫియాకు చెక్ పెట్టడం, మట్కా జూదాన్ని అణిచివేయాలని భావించడం" వంటి అంశాలు జీర్ణించుకోలేని కొందరు క్షేత్రస్థాయి పోలీసు అధికారులు గుర్రుగా ఉండడం ఒక కారణమైతే, తాము చెప్పినట్లు వినడం లేదని టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆయన బదిలీపై ప్రొద్దుటూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రాదరెడ్డి కూడా స్పందించారు. "అసాంఘిక కలాపాలను ఎస్పీ అణిచివేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పిన మాట వినడం లేదని బదిలీ చేయడం సరికాదు" అని శివప్రసాదరెడ్డి వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే..
కడపలో రెండు రోజుల కిందట జరిగిన డీఆర్సీ మీటింగ్ కు వచ్చిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవితమ్మకు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారని విశ్వసనీయంగా తెలిసింది. రాష్ర్ట క్యాబినెట్ సమావేశంలో కూడా ఇదే అంశంపై చర్చకు వచ్చిన నేపథ్యంలో... వర్రా రవీంద్రారెడ్డిన కడపలో పోలీసులు వదిలేసిన మరుసటి రోజు జిల్లా ఎస్పీ హర్షవర్థనరాజుపై బదిలీ వేటు వేయడానికి దారి తీసినట్లు భావిస్తున్నారు. హర్షవర్ధనరాజు నిక్కచ్చి అధికారి అని సీఎం చంద్రబాబుకు తెలిసినా, ఎమ్మెల్యేలు, మంత్రుల ఒత్తిడికి తలొగ్గారా? అనేది సందేహమే. కాగా,
ఈ అవకాశాన్ని వైసీపీ రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తమ పార్టీకి సానుకూలంగా మలుచుకునే రీతిలో స్పందించారు. "పోలీస్ అధికారులను సస్పెండ్, బదిలీలతో వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు" అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై ఎక్కడెక్కడో కేసులు పెడుతున్నారంటూ, తమ వైసీపీ సోషల్ మీడియా వర్కర్లను సమర్థించుకున్నారు. కాగా వర్రా ఎపిసోడ్ లో ఓ సీఐని కూడా సస్పండ్ చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆ తరువాత కూడా పోలీస్ వ్యవస్ధ వైసీపీ వాసనలు వదులుకోవడం లేదనేది టీడీపీ కూటమి నేతల అభిప్రాయం.
"సోషల్ మీడియాకు కళ్లెం వేయడానికి జిల్లాకు ఓ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం" అని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. అదే సమయంలో ఇటీవల డీపీజీ ద్వారకా తిరుమలరావు చేసిన వ్యాఖ్యలు కూడా పోలీస్ వ్యవస్థలో ఉన్న లోపాలు, తప్పులు ఎత్తిచూపాయి. ఈ పరిస్థితుల్లో "పోలీసు వ్యవస్థను నెలలోపు సంస్కరిస్తా" అని సీఎం చంద్రబాబు ప్రకటించడం గమనార్హం. వీరందరూ కలిసి ఎటువంటి సంస్కరణలు తీసుకుని వస్తారనేది వేచిచూడాల్సిందే.
Read More
Next Story