Tirumala| తిరుమల కొండపై ఆ విగ్రహానికి ఏమైంది..?
x

Tirumala| తిరుమల కొండపై ఆ విగ్రహానికి ఏమైంది..?

తిరుమలలో జరిగిన ఒక అపచారం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు


తిరుమలలో భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారంలో నిర్లక్ష్యం చేశారు. అది కూడా పూజలు అందుకునే విగ్రహాలకు అపచారం జరిగినా ఆలస్యంగా స్పందించారు. సంప్రోక్షణ చర్యల్లోనూ అదే తీరు. భక్తుల మనోభావాలతో ముడివడిన ఈ విషయంలో కూడా పండితులు, టీటీడీ అధికారులు తాత్సారం చేశారు. మూడేళ్ల కిందట చేయాల్సిన కార్యక్రమం తాజాగా నిర్వహించడమే. ఈ వ్యవహారం అధికారికంగానే ఆలస్యంగా వెలుగు చూసింది.

టీటీడీ అధికారులు ఏమి చెబుతున్నారంటే...

శ్రీరామచంద్ర ఉత్సవమూర్తికి అంగుళీ సంధాన సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించామని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల ఆలయంలో బుధవారం ఉదయం శ్రీసీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు పూజాది వస్తువులు తీసుకుని వచ్చారు. ఈ కార్యక్రమాన్ని టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి పర్యవేక్షించారు.


ఈ వివరాల్లోకి వెళితే..

2021లో శ్రీరాముల వారి విగ్రహం ఎడమచేయి మధ్య వేలి భాగంలో చిన్నపాటి భిన్నం (రంద్రం) ఏర్పడినట్లు గుర్తించారు. అప్పట్లో ఈ వేలుకు బంగారు కవచాన్ని తొడిగి ఏర్పడిన భిన్నాన్ని సవరించారు. సాధారణంగా ఇటువంటి చిన్నపాటి భిన్నాలు ఉత్సవమూర్తులకు ఏర్పడినప్పుడు 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహా సంప్రోక్షణ కార్యక్రమంలో సవరించడం పరిపాటి. అయితే,
2018లో టీటీడీ మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించింది. మళ్లీ ఈ మహా సంప్రోక్షణ కార్యక్రమం 2030లో జరగనుంది. ఇందుకోసం ఐదు సంవత్సరాలు వేచి ఉండే పరిస్థితి. దీంతో టీటీడీ జీయర్ స్వాములు, ఆగమ సలహాదారులు, అర్చకులతో కూడిన కమిటీ ఇటీవల బ్రహ్మోత్సవ సమయంలో ప్రస్తుత అధికారుల దృష్టికి ఈ విషయం తీసుకుని వచ్చింది. ఉత్సవమూర్తికి సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులు కోరారు .
ఈ కమిటీ నిర్ణయించిన మేరకు చిన్నపాటి భిన్నాలను ఆగమోక్తంగా సవరించేందుకు మంగళ, బుధవారాల్లో శ్రీరాములవారి ఎడమ చేయి అంగుళీ సంధాన సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రస్తుత టీటీడీ యాజమాన్యం కూడా అంగీకరించింది. ఈ కార్యక్రమం ద్వారా ఉత్సవ విగ్రహాలకు ఎటువంటి దోషం ఉండదని కూడా కమిటీ తెలిపింది.
అధికారుల అనుమతితో
తిరుమల శ్రీవారి ఆలయం సంపంగి ప్రాకారంలో నిర్వహించిన ఈ క్రతువుల్లో భాగంగా మంగళవారం రాత్రి వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం కళాపకర్షణ, బింబ వాస్తు, మహాశాంతి తిరుమంజనం, శయనాధివాసం పూజలు నిర్వహించారు.
బుధవారం ఉదయం ప్రత్యేక హోమం నిర్వహించి పూర్ణాహుతి, కళావాహన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తి లో ఉన్న చిన్నపాటి భిన్నాన్ని శాస్త్రోక్తంగా సవరించారు. అని ఆ ప్రకటనలో వివరించారు.
తిరుమల జీయర్ స్వామీజీల సమక్షంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య తిరుమల ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు, గోవిందరాజ దీక్షితులు ఈ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలు టీటీడీ అడిషనల్ ఈఓ వెంకయ్యచౌదరి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆ తరువాత సాయంత్రం సహస్ర దీపాలంకార సేవలో సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర మూర్తి భక్తులను అనుగ్రహించారు.
Read More
Next Story