మహిళాభివృద్ధి, బాలల సంక్షేమమే వికసిత్ భారత్‌ ధృక్కోణం
x
తిరుపలి మహిళా పార్లమెంటీరియన్ల సదస్సులో మాట్లాడుతున్న స్పీకర్ ఓంబిర్లా

మహిళాభివృద్ధి, బాలల సంక్షేమమే వికసిత్ భారత్‌ ధృక్కోణం

ప్రజాస్వామ్యంలో మహిళలకు సరైన స్థానం కల్పించే చారిత్రక అడుగు కోసమే నారీ శక్తి వందన్ చట్టం: పార్లమెంట్ స్పీకర్


మహిళలకు గౌరవం ఇవ్వడం ఆది నుంచి వస్తున్న భారత సంప్రదాయమని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా (Om Birla) అన్నారు. దేశంలో ఆధ్యాత్మిక, సామాజిక ఉద్యమాల్లో స్త్రీలు కీలక పాత్ర పోషించారని చెప్పారు. మహిళల ఆధ్వర్యంలోని అభివృద్ధి, బాలల సంక్షేమమే 2047 నాటికి వికసిత్ భారత్‌ దృష్టి కోణానికి పునాది అని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు.


తిరుపతిలో ఆదివారం పార్లమెంట్‌, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల మహిళా సాధికారత కమిటీల చారిత్రక మొదటి జాతీయ సదస్సును ప్రారంభించారు. పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలు దగ్గబాటి పురందేశ్వరి, రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్, ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు, రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాలశాఖా మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర మహిళా సంక్షేమ కమిటీ చైర్పర్సన్ గౌరు చరితారెడ్డి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్య దేవరతో కలిసి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

బాలలం సంక్షేమంతోనే వికసిత భారత్
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ వికసిత్ భారత్‌గా మారాలంటే మహిళా సాధికారత, బాలల సంక్షేమమే పునాది కావాలని అన్నారు. “మన కుమార్తెలు చదువుకొని స్వయం ఆధారితులైతేనే భారతదేశం సమగ్ర, అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది” అని స్పష్టంచేశారు. జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్ (లింగానుసార అనుకూల బడ్జెట్‌), కొత్త సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు మహిళలకు సాధికారత అంశాలపై ప్రత్యేక చర్చలు జరుగుతున్నాయన్నారు. మహిళల సాధికారత అనేది ఒకేసారి జరిగే కార్యాచరణ కాదని, నిరంతర ప్రక్రియన్నారు. గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్‌ వరకు మహిళల ప్రాతినిధ్యం పెరగాలని సూచించారు. “అమృత్ కాలంలో నారీ శక్తి దేశాన్ని సమగ్రత మరియు శక్తివంతమైన భవిష్యత్తు వైపు నడిపించే అప్రతిహత శక్తిగా రూపుదిద్దుకుంటోంది” అని అన్నారు. మహిళల సమానత్వం, నాయకత్వం, భాగస్వామ్యం - న్యాయం మాత్రమే కాకుండా, సమగ్ర, స్థిరమైన అభివృద్ధికి పునాది అని స్పష్టం చేశారు.
మహిళా శక్తి అజేయం..
మహిళల కృషి, చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగం, ధైర్యం భారత సమాజాన్ని సమానత్వ దిశగా నడిపిందన్నారు. రాజ్యాంగ సభలో 15 మంది మహిళలు పాల్గొని భారత రాజ్యాంగాన్ని లింగ సమానత్వానికి అనుగుణంగా రూపొందించారన్నారు. గార్గి, అనసూయ వంటి పండితులు, రాణి రుద్రమాదేవి, రాణి లక్ష్మీబాయి వంటి యోధులు, నేటి శాస్త్రం, క్రీడలు, సాంకేతికం, రాజకీయ రంగాలలోనూ మహిళల పాత్రను గర్వంగా గుర్తుచేశారు. నారీ శక్తి వందన్ అధినియమం (మహిళలకు శాసనసభలలో రిజర్వేషన్) చారిత్రక చట్టంగా పేర్కొన్నారు. సదస్సు ప్రాముఖ్యతను వివరిస్తూ పార్లమెంట్‌, రాష్ట్ర శాసనసభల మహిళా సాధికారత కమిటీల ప్రతినిధులు, 20కి పైగా రాష్ట్రాల నుంచి నాయకులు పాల్గొన్నారన్నారు. ఈ కమిటీలు అపార్టీ విధానంలో పని చేస్తూ, మహిళలు, పిల్లలు చివరి గ్రామం వరకూ లబ్ధి పొందేలా చట్టాలు, పథకాలు అమలు అయ్యేలా పర్యవేక్షిస్తాయని చెప్పారు.
Read More
Next Story