CHRISTANS / TTD | టీటీడీలో అన్య మతస్తులను తప్పిస్తాం..
తిరుమలను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. దేశంలోని 61 అనుబంధ ఆలయాలను కన్సల్టెన్సీల ప్రణాళికలతో అభివృద్ధికి విజన్-2047 అమలు చేస్తామని టీటీడీ ప్రకటించింది.
తిరుమల తిరుపతి దేవస్థానంలోని అన్యమత ఉద్యోగులను తప్పించడానికే టీటీడీ కసరత్తు చేస్తోంది. న్యాయసంబంధమైన వివాదాలు ఎదురుకాకుండా, ముందుకు వెళుతున్నట్లు టీటీడీ ఈఓ జే. శ్యామలరావు స్పష్ట చేశారు. దీనిపై విచారణ, వివరాల సేకరణ ప్రక్రియ సాగుతున్నట్లు ఆదివారం ఉదయం ఆయన మీడియాకు వెల్లడించారు. బోర్డు నిర్ణయం మేరకు టీటీడీలోని 31 మంది అన్యమతస్తులకు వీఆర్ఎస్ లేదా ఇతర ప్రభుత్వ శాఖలకు పంపించాలనే వ్యవహారంై చర్యలు తీసుకుంటామన్నారు.
తిరుమల క్షేత్రాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే తిరుమల విజన్-2047 లక్ష్యమని టీటీడీ ఈఓ జె.శ్యామలరావు అన్నారు. ఆరు నెలల్లో జరిగిన అభివృద్ధిపై ఆయన తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆదివారం ఉదయం మీడియా సమావేశంలో వివరించారు. టీటీడీ అదనపు ఈఓ సిహెచ్.వెంకయ్య చౌదరి, జేఈఓ గౌతమి, సీవీఎస్వో శ్రీధర్, సీఈ సత్య నారాయణతో కలిసి ఈఓ శ్యామలరావు మాట్లాడారు. విజన్ డాక్యూమెంట్ కు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
గత ఆరు నెలల్లో తిరుమలలో అనేక మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. భక్తులకు మరింత నాణ్యంగా అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. నాణ్యమైన నెయ్యితో లడ్డూ ప్రసాదాల తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్డీడీబీ విరాళంగా ఇచ్చిన రూ.70 లక్షల పరికరాలతో టీటీడీ సొంతగా కల్తీ పరీక్షల ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తిరుమల, తిరుచానూరు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడంతో పాటు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. క్యూ ల నిర్వహణ, భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా అదనపు ఈఓ వెంకయ్య చౌదరి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. 45 అతిథి గృహాలకు వారి సొంత పేర్లను తొలగించి, ఆధ్యాత్మిక పేర్లు ఉండేలా చర్యలు చేపట్టామన్నారు.
సీఎం స్వర్ణాంధ్ర విజన్ కు అనుగుణంగా...
స్వర్ణాంధ్ర విజన్-2047కు అనుగుణంగా తిరుమల విజన్-2047 కోసం ప్రతిపాదనలు ఆహ్వానించినట్లు తెలిపారు. తిరుమలను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. 2019 తుడా మాస్టర్ ప్లాన్ లో భాగంగా తిరుమల జోనల్ ప్లాన్ ను తయారు చేశాన్నారు. 2017 సమాచారం ఆధారంగా చేసిన ప్రతిపాదనలను ఆధునీకరించినట్లు తెలిపారు. దేశంలోనే ఇతర ఆలయాలకు ఆదర్శవంతంగా తిరుమల క్షేత్రాన్ని తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు. సుమారు 18 ప్రాజెక్టులకు ప్రణాళికల కోసం చేసేందుకు 9 సంపూర్ణ నివేదికలను తయారు చేస్తున్నట్లు చెప్పారు.
తిరుమల విజన్-2047 లక్ష్యాలు
- తిరుమల నడక మార్గాల ఆధునీకరణ, బహుళస్థాయి పార్కింగ్, స్మార్ట్ పార్కింగ్, నూతన లింక్ రోడ్డుల నిర్మాణం, సబ్ వే ల నిర్మాణం, రామ్ భగీచ, బాలాజీ బస్టాండులను పునర్నిర్మాణం.
- భక్తులకు వసతి కోసం అలిపిరి దగ్గర 40 ఎకరాల్లో బేస్ క్యాంప్ ఏర్పాటు, ఆధ్యాత్మికత ప్రతిబింబించేలా తిరుమలలో భవనాల రూపకల్పన.
- టీటీడీలో ఉన్న 31 మంది హిందూయేతర ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు పంపడం, లేదా వీఆర్ఎస్ ఇవ్వాలని బోర్డు నిర్ణయం మేరకు చర్యలు.
- తిరుమలలో రోడ్ల ఆక్రమణ చేస్తూ భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్న దుకాణదారులు, హాకర్ లైసెన్సుదారుల, అనధికార తట్టలపై కఠిన చర్యలు.
- తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ, అవసరమైన పార్కింగ్, మౌలిక సదుపాయాలు, మాడ వీధుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి.
- ఆకాశగంగ, పాపవినాశనం ప్రాంతాల్లో అభివృద్ధికి చర్యలు.
- సనాతన హిందూ ధర్మ ప్రచారం, పరిరక్షణలో యువతను భాగస్వామ్యం చేసేందుకు కృషి. ప్రభుత్వ సలహాదారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు సహకారంతో యువతలో ఆధ్యాత్మికత పెంచేలా చర్యలు.
- ఇప్పటి వరకు చేపట్టిన హెడీపీపీ కార్యక్రమాలపై ఆడిట్ నిర్వహించి మరింత మెరుగ్గా కార్యక్రమాలు నిర్వహణ.
- తిరుమలలోని ప్రైవేట్ క్యాంటీన్లలో ధరలు నియంత్రించి, పేరొందిన సంస్థలకు నిర్వహణా బాధ్యతలు అప్పగించి నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు.
- తిరుమలలో వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక చర్యలు, వర్షపు నీరు, మురుగు నీరు వేరు వేరుగా వెళ్లేలా డ్రెయిన్లు నిర్మాణం.
- సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం, వసతి అందించేలా చర్యలు.
- చాట్ జీపీటీ తరహాలో వాయిస్ ఆధారిత టీటీడీ చాట్ బాట్ అభివృద్ధికి ప్రయత్నం.
- గతంలో ఉన్న వ్యవస్థపరమైన లోపాలను అడ్డుపెట్టుకుని భక్తులను మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు. ఎప్పటికప్పుడు పోలీసులు, విజిలెన్స్ సహకారంతో దళారుల నియంత్రణ.
- టిటిడి ఆధ్వర్యంలో ఉన్న 61 ఆలయాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
Next Story