
స్టీరింగ్ వద్ద ఉన్న అద్దం పగలడంతో బయపడిన ఓ మహిళా ప్రయాణికురాలు
'పల్లె వెలుగు' బస్సు ప్రయాణం భద్రమేనా?
అనంతపురం జిల్లాలో పల్టీకొట్టిన బస్సు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణికులకు అందుబాటులోని పల్లెవెలుగు బస్సుల కండీషన్ పదిలంగా ఉందా? అనంతపురం జిల్లాలో మలుపు తిరగడానికి స్టీరింగ్ మొరాయించడంతో పొలాల్లోకి పల్టీ కొట్టిన సంఘటన శుక్రవారం జరిగింది. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులు స్టీరింగ్ ఎదురుగా ఉన్న అద్దం ధ్వంసం చేసి, బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు.
"స్టీరింగ్ సరిగా పనిచేయని కారణంగానే బస్సు అదుపుతప్పిందని డ్రైవర్ కమ్మరి అంజి చెప్పారంటూ" ఆయన మాటలు వైరల్ అయ్యాయి. అంటే డిపో గ్యారేజీలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలనే విషయం అనంతపురం జిల్లా రాయదుర్గం వద్ద జరిగిన సంఘటన స్పష్టం చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
చికిత్స తీసుకుంటున్న కండక్టర్ రమేష్
రాయదుర్గం డిపోకు చెందిన ఏపీఎస్ఆర్టీసీ బస్సు (AP03Z- 5208) రాయదుర్గం నుంచి 15 మంది ప్రయాణికులతో బెలుగుప్ప మీదుగా అనంతపురానికి ఆర్టీసీ బస్సు బయలుదేరింది. ఈ బస్సు బెలుగుప్ప మండలం నక్కలపల్లి వద్ద మలుపు తీసుకుంటూ పొలాల్లో బోల్తా పడింది. దీంతో బస్సులోని ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. బోల్తా పడిన బస్సులో డ్రైవర్ సీటు ముందు ఉన్న అద్దం పగులగొట్టి చాలా మంది బయటపడ్డారు. బస్సులోని సుంకమ్మ, కండక్టర్ హెచ్. మహేష్ గాయపడ్డారు. వారిని వెంటనే బెలుకుప్ప ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఈ సమాచారం తెలియగానే రాయదుర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు.
"ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించండి" అని మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశించారు. ఆస్పత్రి వద్ద బస్సు డ్రైవర్ కమ్మరి అంజి మాట్లాడుతూ, ఆర్డినరీ బస్సు స్టీరింగ్ మొరాయించడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పారని తెలిసింది. దీంతో రాయదుర్గం ఆర్టీసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. బస్సుల కండిషన్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, మెకానిక్కులతో మాట్టాడినట్లు తెలిసింది. ఇదిలాఉండగా, వర్షాలు కురుస్తున్నందువల్ల నల్లరేగడి నేలల కావడం వల్ల బస్సు కంట్రోల్ కాలేదని ఘటనా స్థలంలో ప్రయాణికులు కూడా చెప్పారని తెలిసింది.
ఈ సంఘటనపై రాష్ర్ట రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాదరెడ్డి కూడా స్పందించారు. ప్రమాదం జరగడం దురదృష్టం అన్నారు.
"గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి చర్యలు తీసుకోండి. ప్రమాదానికి దారితీసిన ఘటనపై వివరాలు తెలుసుకోండి" అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు కూడా వెంటనే స్పందించారని సమాచారం అందింది.
వర్షాలు కురుస్తున్నందున డ్రైవర్లు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని రాయదుర్గం డిపో మేనేజర్ శ్రీనివాసరావు గుర్తు చేశారు. నక్కలపల్లి వద్ద బస్సు ప్రమాదంపై ఆయనతో ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి మాట్లాడారు. ఉచిత బస్సు పథకం అమలులోకి రావడానికి రెండు నెలల ముందు నుంచే బస్సుల కండీషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. తాజా సంఘటనను ప్రస్తావిస్తూ,
"ఆ మార్గంలో రోడ్డు కొత్తగా వేశారు. వర్షం కురుస్తున్నందున చిత్తడిగా మారింది. మలుపు వద్ద బస్సు టైర్ కిందికి దిగినట్లు ప్రాథమికంగా గుర్తించాం. చిత్తడితో కూడిన నల్లరేగడి నేల కావడంతో బస్సు అదుపులోకి రాలేదు" అని డిపో మేనేజర్ శ్రీనివాసరావు వివరించారు. బస్సు చక్రం రోడ్డు గేడి దిగడం వల్ల జారిపోయిందని ఆయన విశ్లేషించారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదని చెప్పారు.
Next Story