తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వారంలో దర్శించుకోవడానికి టోకెన్లు జారీ చేసేందుకు తిరుపతిలో ఏర్పాటుచేసిన కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. ఇందులో ఐదుగురు మహిళలు ఉన్నారు. ఇందులో పలువురు గాయపడటంతో పాటు ఇంకొందరు స్పృహ కోల్పోయారు. వారందరినీ టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది అంబులెన్సులలో రూయా, స్విమ్స్ ఆసుపత్రులకు తరలించారు. రూయా ఆసుపత్రిలో 20 మంది, స్విమ్స్ లో 9 మంది చికిత్సపొందుతున్నట్లు సమాచారం.
తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కోసం గురువారం ఉదయం 5 నుంచి టోకెన్లు జారీ చేయాల్సి ఉంది. టోకెన్లు ఉన్నవారికే తిరుమలలో దర్శనం ఉంటుంది. తిరుపతిలో 8 చోట్ల ప్రత్యేకంగా టోకెన్లు జారీకి 90 కౌంటర్లు ఏర్పాటు చేశారు. శ్రీవారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు తమిళనాడు నుంచి భారీగా యాత్రికులు తరలివచ్చారు. తిరుపతిలోని అలిపిరి సమీపంలో ఉన్న భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం, విష్ణు నివాసం, బైరాగి పట్టెడతో పాటు ఇంకొన్ని కేంద్రాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. తిరుపతి నగరంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలన్నీ బుధవారం ఉదయం నుంచి యాత్రికులతో కిక్కిరిశాయి. బుధవారం సాయంత్రం నుంచే ఈ టోకెన్ల కోసం కౌంటర్లు వద్ద భక్తులు గుమికూడటం ప్రారంభించారు.
టోకెన్ల కోసం వచ్చిన భక్తులు రోడ్ల మీద కు చేరితే ట్రాఫిక్ సమస్య వస్తుందని తిరుపతి బైరాగి పట్టడం వద్ద ఉన్న రామానాయుడు జడ్పీ హైస్కూల్ వద్ద పద్మావతి పార్కులో ఉంచారు. అయితే, ఇందులోని ఒక వ్యక్తి అస్వస్తతకు గురి అయ్యారు. అతన్ని ఆసుపత్రికి తరలించేందుకు క్యూలైన్ ను తెరిచారు. అయితే, టోకెన్లు ఇచ్చేందుకే క్యూలైన్ తెరిచారని భావించిన భక్తులు ఒక్క సారిగా దూసుకురావడంతో తొక్కిసలాట జరిగిందని తెలిసింది. బుధవారం రాత్రి 9:30 సమయంలో ఇది జరిగింది. ఉదయం నుంచి విసిగి వేసారి పోయి ఉన్న యాత్రికులు అందరూ ఒక్కసారిగా దూసుకు రావడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. భారీ సంఖ్యలో యాత్రికులు దూసుకుని రావడంతో వారిని నిలువరించడం సెక్యూరిటీ సిబ్బంది కూడా కష్టంగా మారింది. సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో యాత్రికులు చాలా మంది సొమ్మసిల్లారు. తిరుపతి ఎస్పీ ఎల్ . సుబ్బారాయుడు, టీటీడీ సీవీఎస్వీ శ్రీధర్ సంఘటన స్థలంలో ఉండి, పరిస్థితిని చక్కదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నారు.
తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీనివాస యాత్రికుల సముదాయం వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఉదయం నుంచి యాత్రికులు వైకుంఠ ఏకాదశి టోకెన్లు తీసుకోవడానికి భారీగా కీలో పడిగాపులు కాసారు. గేట్లు తిరగడంతో ఒక్కసారిగా దూసుకు వచ్చిన యాత్రికుల తోపులాటలో తమిళనాడుకు చెందిన మల్లికాని మహిళ మృతి చెందినట్లు సమాచారం అందింది. తోపులాటలో గాయపడిన అనేక మందిని కాపాడేందుకు టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.సొమ్మసిల్లిన వారిని సపరిచర్యలు చేయడం ద్వారా, తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి, పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
సీఎం చంద్రబాబు దిగ్ర్భాంతి
తిరుపతి విషాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటి మంత్రి లోకేశ్, హోంమంత్రి వంగల అనిత తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. టోకెన్ల కోసం వెళ్లి పలువురు భక్తులు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు అధికారులకు జారీ చేశారు. బాధితులకు వెంటనే మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతాలు, ఇతర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.