Tirumala Panchayat | తిరుమలలో ఎడతెగని 'లోకల్ పంచాయతీ'
ఇది ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు. లోకల్ అథారిటీ కూడా. పరిపాలన విభిన్నం. కొండపై తిష్టవేసిన సమస్యలు ఎలా ఉన్నాయంటే..
తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రం అనే విషయమే తెలుసు. ఇది ఓ గ్రామ పంచాయతీ కూడా. రాష్ట్రంలో హార్సిలీహిల్స్ (Horseleyhills) , మదనపల్లె సమీపంలోని ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ (Arogyavaram Medical Center - AMC), తిరుమల (Tirumala) మూడు లోకల్ అథారిటీలు చిత్తూరు జిల్లాలోనే ఉన్నాయి. వాటిలో తిరుమలలో కూడా పాలకవర్గం స్థానంలో అధికారులే పర్యవేక్షణ ఉంది. తట్టలు, దుకాణదారుల నుంచి ఏటా 30 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న టీటీడీ రెవెన్యూ, పంచాయతీ కష్టాల్లో చిక్కుకుంది.
పంచాయతీ ఎన్నికలు లేని తిరుమలలో ఎంపీ, ఎమ్మెల్యేకి మాత్రమే ఓటు వేసే హక్కు ఉంటుంది. గ్రామ పంచాయతీ కార్యదర్శి స్థానంలో టీటీడీ ఏఈఓ (Assistent Excutive Officer), ఎస్టేట్ అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీషన్ పై నియమించే ఆర్డీఓ స్థాయి అధికారి వ్యవహారాలు పర్యవేక్షించడం ప్రత్యేకత. ఇంతటి ప్రాధాన్యత కలిగిన తిరుమల పంచాయతీ ఎలా రూపాంతరం చెందిందంటే..
మహంతుల పాలన నుంచి
తిరుమల నిర్వహణ హథీరాంజీ మఠం ఆధ్వర్యంలో ఉన్నప్పుడు యాత్రికులకు సౌకర్యాలు ఏర్పరచాలంటే చాలా కష్టమయ్యేది. ఎందుకంటే అక్కడ ఎవరూ ఉండేవారు కాదు. తిరుమలలోనే ఉందామంటే విపరీతమైన చలి. దానికి తోడు ఆ ప్రాంతమంతా అడవి. జంతువుల భయం సరేసరి. కొండమీద ఒక ఊరు తయారైతే ఈ ఇబ్బందులన్నీ అధిగమించవచ్చన్న ఆలోచనతో 1910-20 కాలం నాటికి జనావాసాలను ఏర్పరచేందుకు ప్రయత్నించారు. వారికి ఆవాసం కల్పించేందుకు హథీరాంజీ మఠం భూములు లీజుకు ఇచ్చింది. నెమ్మదిగా ఆలయం చుట్టూ నాలుగు వీధులతో ఒక ఊరు తయారైంది. మొదట్లో అక్కడి జనాభా 200 నుంచి 300 మంది మాత్రమే. శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులకు ఆ కుటుంబాలే మొదట్లో అన్ని సౌకర్యాలూ కల్పించేవి. 30 ఏళ్ల క్రితం వరకూ కూడా వారంతా రోజూ సరాసరి మహద్వారం నుంచే గుడిలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకునేవారు. 1933లో పాలక మండలి ఏర్పాటు చేయకముందు అంటే 90 ఏళ్ల పాటు మహంతుల పాలనే సాగింది.
తిరుమలలో స్థానికులు
శ్రీవారి ఆలయం వెనుక, మాడవీధులు, శివారు ప్రాంతాల్లోని సూరాపురంతోట, పెరిందేవితోట, మాధవనగర్, పూటకూళ్లమిట్టతో 10.33 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతాల్లో 37, వేల మంది ఓటర్ల ఉండేవారు. తిరుమల 1976 వరకు పంచాయతీగానే కొనసాగింది. అయితే, చివరి సర్పంచ్ కేఎం. కృష్ణయ్య పంచాయతీ పత్రాలు శ్రీవారి హుండీలో వేయడం ద్వారా తిరుమలను టీటీడీ పరిధిలోకి చేరడానికి ఆస్కారం కల్పించారు.
తిరుపతికి తరలింపు
తిరుమలలో అందుబాటులోకి వచ్చిన వసతులకు తోడు యాత్రికుల సంఖ్య కూడా పెరిగింది. ఈ పరిస్థితుల్లో దీంతో తిరుమల విస్తరణకు మాస్టర్ ప్లాన్ అమలు చేయడంతో 1983లో మొదట మాధవనర్ నుంచి తిరుమల వాసులను తిరుపతికి తరలించే ప్రక్రియ చేపట్టి, 2004 నాటికి ఐదు ప్రాంతాల్లో ఖాళీ చేయించారు. మాడవీధులతో పాటు సమీప ప్రాంతాల్లో ఉన్న నివాసితులను 2004లో టీటీడీ దాదాపు 1,200 మందిని తిరుపతికి తరలించి, పునరావాసం కల్పించడంతో పాటు దుకాణాలు కూడా కేటాయించింది. వారితో పాటు తిరుమలలో దాదాపు 500 వరకు టీటీడీ ఉద్యోగులు, 50 టీటీడీ అధికారులు, సుమారు పది మంది పోలీస్ అధికారుల నివాసాలు కూడా ఉన్నాయి. వారికి టీటీడీ ట్రాన్సిట్ అకామిడేషన్ కల్పిస్తుంది. ఇది టీటీడీ పరిపాలన వ్యవహారాలకు సంబంధించిన విషయం.
లోకల్ అథారిటీ
తిరుమల గ్రామ పంచాయతీ రద్దు కావడం వల్ల టీటీడీ ఆధ్వర్యంలో లోకల్ అథారిటీలోకి చేరింది. ఈ వ్యవస్థలో అధికారులు, ప్రభుత్వం నియమించే పాలక మండలి మాత్రమే యాత్రికులతో పాటు తిరుమల వాసుల సమస్యలు తీరుస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం తిరుమలలో 2011 జనాభా లెక్కల ప్రకారం 1,672 కుటుంబాలు నివసిస్తున్నాయి. తిరుమలలో జనాభా 7,741. వారిలో 3,970 మంది పురుషులు కాగా, 3,771 మంది స్త్రీలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వారిలో 5,300 మంది ఓటర్లు ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
తిరుమల పంచాయతీ, రెవెన్యూ శాఖను టీటీడీ నియమించే ఏఈఓ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ). క్షేత్ర పాలనా వ్యవహారాలు ఎస్టేట్ అధికారి పర్యవేక్షిస్తున్నారు. టీటీడీ పాలక మండలి తీసుకునే నిర్ణయాలతో ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నారు. కాగా,
అసలు సమస్య ఇదే...
తిరుమల కొండపై టీటీడీలో కీలక విభాగమైన రెవెన్యూ ,పంచాయతీ విభాగంలో సిబ్బంది సమస్యతో సతమతం అవుతోంది. తిరుమలలో 1310 దుకాణాలు,26 హోటల్లు, 612 హాకరు లైసెన్సులు, వీటన్నిటి రెవిన్యూ రాబడి కి సంబంధించిన అన్ని వ్యవహారాలు టీటీడీ పంచాయతీ రెవెన్యూ విభాగం పరిధిలో ఉంది. వాటి నుంచి టీటీడీకి నెలకు 2.5 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. అంటే ఏడాదికి 30 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తున్నట్లు తెక్క. దుకాణదారులు, స్థానికుల అవసరాలను పరిగణలోకి తీసుకుని, పటిష్టం చేయడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇంతటి కీలకమైన విభాగానికి ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారని డిప్యూటేషన్ పై తీసుకుని వస్తున్నారు. దీనిపై గతంలో
"టీటీడీలో అనుభవం ఉన్న అధికారులకు కొదవ లేదు. ఈ ప్రాంత వ్యక్తులకు సంపూర్ణ అవగాహన ఉంది" అని సీపీఎం నేత కందారపు మురళి గుర్తు చేశారు. టీటీడీకి డిప్యూటేషన్ అధికారులను తీసుకుని రావడంపై స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ కూడా వ్యతిరేకించింది.
అధికారిపై వేటు
తిరుమలలో తట్టల లైసెన్సులు, అద్దె వసూళ్లు, రెన్యూవల్స్ వ్యవహారంలో సర్వాధికారిగా పెత్తనం చలాయించిన ఏఈఓ స్థాయి అధికారిని ఇటీవలే బదిలీ చేశారు. కానీ సిబ్బంది కొరతను టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. 26 మంది సిబ్బంది ఉండాల్సిన ఈ విభాగంలో ప్రస్తుతం పదిమంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారాల వల్ల దుకాణదారులకే కాదు. తిరుమల నివాసితుల సమస్యల పరిష్కారానికి కూడా ఇబ్బందికరంగా మారింది.
తిరుమల పంచాయతీ కార్యాలయంలో ఫైళ్లు కూడా పెరిగిపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. చాలాకాలంగా రెండు సూపరింటెండెంట్ స్థాయి అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఏఈఓ స్థానం కూడా ఖాళీ అయింది. డేటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్, అటెండర్లు, ఇద్దరు క్లర్కులు, పోస్టులు కూడా ఖాళీగా ఉంచేశారు. ఈ విభాగంలో పని ఒత్తిడి అధికంగా ఉండడం, ఎక్కువ భాగం రిస్క్ తో కూడుకున్నదని భావిస్తున్న అనుభవం కలిగిన ఉద్యోగులు ఆసక్తి చూపడం లేదు.
ఐదేళ్లలో ఏమి జరిగిందంటే..
తిరుమలలో దుకాణాలు హాకరు లైసెన్సులు రెన్యువల్స్ పేరిట, అనధికారిక తట్టల పేరిట ఇష్టారాజ్యంగా బోగస్ లైసెన్సులు సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనివల్లే చాలా వరకు తనకంటే కిందిస్థాయిలో ఉద్యోగుల్లో సమర్థత కలిగిన సిబ్బందిని నియమించుకోకుండా చక్రం తిప్పారనే విమర్శలు కూడా ఉన్నాయి. దీనిపై టీటీడీ అధికారులు ఎలా స్పందిస్తారనేది వేచిచూడాల్సిందే.
Next Story