
సంస్కృతిని మరిచిన ప్రొఫెసర్లకు కటకటాలు..
విద్యార్థినిపై లైంగిక దాడి కేసులో ఇద్దరి అరెస్టు చేశామన్న తిరుపతి ఎస్పీ
తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో బీఎడ్ మొదటి సంవత్సరం విద్యార్థిని లైంగిక వేధింపుల కేసులో ఇద్దరు ప్రొఫెసర్లను తిరుపతి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయడు ఈ విషయం వెల్లడించారు. తిరుపతి వైసీపీ ఎంపీ మద్దెల గురుమూర్తి ఈ ఘటనను పార్లమెంటులో ప్రస్తావించడంతో జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించింది.
ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇవి.
"తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో 2025–2026 విద్యా సంవత్సరంలో బీఎడ్ మొదటి సంవత్సరం చదువుతున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన 27 ఏళ్ల యువతి పై జరిగిన అత్యంత ఘోర సంఘటనపై చర్యలు తీసుకున్నాం" అని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు చెప్పారు.
తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన 27 యువతి బి.ఎడ్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇదే యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మణ్ కుమార్ విద్యార్థినిని ప్రలోభపెట్టి, ఆమె ఇష్టానికి విరుద్ధంగా తన ఆఫీస్ గదిలో బలవంతంగా లైంగిక దాడి చేశారు. ఆ సమయంలోనే అదే విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న డాక్టర్ ఏ. శేఖరరెడ్డి ఫోటోలు, వీడియోలు తీసినట్లు తెలిసింది.
డాక్టర్ లక్ష్మణ్ కుమార్ , ఏ. శేఖరరెడ్డి
"ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విడుదల చేస్తామని శేఖరరెడ్డి బెదిరించారు. ఆ విద్యార్థనిని శారీరకంగా, మానసికంగా వేధించి బ్లాక్‌మెయిల్ చేసినట్లు తేలింది" అని ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడించారు.- ఈ ఘటనపై నేషనల్ సంస్కృత యూనివర్సిటీ రిజిస్ట్రార్ రజనీకాంత్ శుక్లా ఫిర్యాదు మేరకు తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో Cr.No.183/2025, U/S 75(1), 77, 79, 351(2) r/w 3(5) BNS ప్రకారం కేసు నమోదు చేశారు. జరిగింది.
ఒడిశాలో విచారణ
సంస్కృత విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ల దాష్టీకానికి గురైన బాధిత విద్యార్థిని స్వప్రాంతం ఒడిశాలోని జోజ్ పూర్ కు వెళ్లిపోయేలా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో విశ్వవిద్యాలయం ఇన్ చార్జి రిజిస్త్రార్ శుక్ల ఫిర్యాదు నేపథ్యంలో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు స్పందించారు. ఈ కేసులో విచారణ బాధ్యతలు తిరుపతి భక్తవత్సలం కు అప్పగించారు. బాధితురాలిని విచారణ చేయడానికి తిరుపతి వెస్టు సీఐ వి. మురళీమోహన్ రావు ఆధ్వర్యంలోని బృందం బాధితురాలి స్వగ్రామానికి వెళ్లింది. ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. ఘటనా స్థలం పరిశీలన, సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, బాధితురాలి వివరణ ఆధారంగా కేసులో అదనంగా సెక్షన్లు 63, 68 BNS చేర్చారు.
ఓ నిర్థారణకు వచ్చి..
సంస్కృత విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటనపై ఫిర్యాదు అందుకున్న వెస్టు డివిజన్ పోలీసులు దర్యాప్తులోకి దిగారు.ఈ కేసును తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు స్వయంగా పర్యవేక్షించారు. బాధితురాలి వాంగ్మూలం నమోదు చేయడం, విశ్వవిద్యాలయంలో సేకరించిన వివరాల ఆధారంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్, డాక్టర్ ఏ. శేఖరరెడ్డిను సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు.
తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు ఏమన్నారంటే..
మహిళల భద్రత, రక్షణ కల్పించడంలో రాజీ పడబోమని తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు స్పష్టం చేశారు.
"విద్యాసంస్థలు, కార్యాలయాలు, ఎక్కడైనా సరే మహిళలపై జరిగే వేధింపులు, దాడులు, బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్, డిజిటల్ హింస వంటి నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని ఎస్పీ సుబ్బారాయుడు హామీ ఇచ్చారు. బాధితులు భయపడకుండా పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు. చూసిన ఘటనను తెలిపిన, ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచుతామని కూడా ఆయన చెప్పారు.
Next Story

