శ్రీవాణి ట్రస్ట్ ...  తిరుమల.. అమరావతికి లింక్ ఏమిటి?
x

శ్రీవాణి ట్రస్ట్ ... తిరుమల.. అమరావతికి లింక్ ఏమిటి?

శ్రీవాణి ట్రస్టు ద్వారా విరాళాల వసూళ్లలో వివాదం ఎంందుకు వచ్చింది. ఏమి ఆశించి దీనికి రూపకల్పన చేశారు? ధర్మారెడ్డి అత్యుత్సాహం మాజీ సీఎం వైఎస్. జగన్ కు కష్టాలు తెచ్చాయా?


శ్రీవాణి ట్రస్ట్. అందరి నోటా ఇదే మాట. రూ. వందల కోట్లు దారి మళ్లించారనేది ఆరోపణ. ఈ ట్రస్ట్ రూపకర్త ఎవరు? ఆయన ఏమి ఎత్తుగడ వేశారు. అది ఎలా వికటించింది. టీటీడీకి రాజధాని అమరావతికి లింకేమిటి? మాజీ ఈఓ ఏవీ. ధర్మారెడ్డి అత్యుత్సాహం ఎలా చిక్కుల్లో పడేలా చేసింది. ఈ వ్యవహారాలు తిరుమల కొండపై రాజకీయ క్రీనీడకు కేంద్రంగా మారాయనే రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

తిరుమల కొండపై అవినీతి తిమింగలాన్ని పట్టుకోవాలని రాష్ట్ర విజిలెన్స్ విభాగం తవ్వకాలు చేపట్టింది. ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తి చేసిన ఆ విభాగం దర్యాప్తు అధికారిని మార్చింది. పూర్తిస్థాయి నివేదిక తయారు చేయడానికి సుమారు 50 మంది సభ్యుల బృందం లోతుగా దర్యాప్తు చేస్తోంది. చివరాఖరికి ఏమి తేలుస్తారు. ఎవరిని బాధ్యులు చేస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ (శ్రీవాణి ట్రస్ట్) ద్వారా రూ. వందల కోట్లు దారి మళ్ళీ ఆయనే ప్రధాన అంశంపై దృష్టి కేంద్రీకరించినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో నిధుల నిధుల వినియోగం ప్రధానమైంది. దానితో పాటు సేవా టికెట్ల మంజూరులో చోటుచేసుకున్న అపసవ్య పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేస్తోంది. వీటన్నిటి కంటే ప్రధానంగా శ్రీవాణి ట్రస్టు ద్వారా దాతలు అందించిన రూ. వందల కోట్లు దారిమళ్లించారనేది ప్రధాన అభియోగం. ఈ వ్యవహారాలను నిగ్గు తేల్చడానికి తీవ్రంగా కసరత్తు జరుగుతోంది.
గత ఐదేళ్లలో టీటీడీలో ప్రధానంగా తిరుమల లో చోటుచేసుకున్న అనేక వ్యవహారాలపై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మాజీ ఈవో ఏవి ధర్మారెడ్డి గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించారనేది బహిరంగ ఆరోపణ. ఆ పార్టీ నాయకులతో అంటకాగిన ఆయన నిధుల మంజూరులో చేతికి ఎముక లేదనే విధంగా వ్యవహరించారని టిడిపి నాయకులు ఆరోపణలు గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం మారింది.
" తిరుమల నుంచే పాలనలో ప్రక్షాళన ప్రారంభిస్తా"
అని సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆ మేరకు రోజుల వ్యవధిలోనే టీటీడీకి ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి జేఏసీ శ్యామలరావును నియమించారు. బాధ్యతలు స్వీకరించిన ఆయన మరుక్షణం నుంచి టీటీడీలో పరిపాలన వ్యవహారాలను అధ్యయనం చేసే దిశగా, క్షణం విశ్రాంతి లేని విధంగా వివిధ శాఖల అధికారులతో ముమ్మరంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అదే నేపథ్యంలో తిరుమలలో చోటు చేసుకున్న వ్యవహారాలపై దర్యాప్తునకు రాష్ట్ర విజిలెన్స్ విభాగం అధికారులు రంగంలోకి దిగారు. ఆర్జిత సేవా విభాగంలో టికెట్ల మంజూరి కేంద్రాన్ని పరిశీలించారు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగం నుంచి అభివృద్ధి పనులకు నిధుల కేటాయించిన వివరాలను సేకరించారు. ఆ మేరకు ప్రాథమిక దర్యాప్తును పూర్తి చేసిన అధికారులు, తొలి దశ దర్యాప్తును చురుగ్గా సాగిస్తున్నారు. వీరి దర్యాప్తులో అత్యంత ప్రధానమైనది శ్రీవాణి ట్రస్టు ద్వారా నిధుల సమీకరణ అంశాలను సునిశితంగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ అంశాలకు సంబంధించి టీటీడీ అధికారులు లాంటి ప్రకటనలు చేయడం లేదు. సమాచారం బయటకు పొక్కనివ్వడం ఇవ్వడం లేదు. టీటీడీసమాచార విభాగం కూడా ఇలాంటి వివరాలు వెల్లడించలేని పరిస్థితిలో ఉంది.
శ్రీవాణి ట్రస్టు ఏంటి?
దేశంలోని ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార కాలనీల్లో ఆలయాల నిర్మాణం, కొన్ని జీర్ణోద్ధరణ కోసం శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో 2019 సెప్టెంబర్ లో ట్రస్ట్ సేవలు ప్రారంభమయ్యాయి. రూ. 10,500 దాతల నుంచి ఆన్లైన్ లో వసూలు చేశారు. ఇందులో దాతకు విఐపీ టికెట్ కోసం రూ. 500 మిగతా సొమ్ము జాతీయ బ్యాంక్ లో ప్రారంభించిన ట్రస్ట్ లో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు.

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల లో ఉన్న పురాతన ఆలయాల జీర్ణోదరణ, ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీల్లో కొత్త ఆలయాల నిర్మాణం, ధూప దీప నైవేద్యాలకు ఏ ప్రతినెల రూ. 5000ఆర్థిక సాయం అందించే లక్ష్యంగా శ్రీవాణి ట్రస్టును ప్రారంభించారు. ఇందులో దాతలు రూ. 10,500 చెల్లించే వారికి ఒక వీఐపీ టికెట్ మంజూరు చేస్తారు. ఇందుకోసం రూ. 500 మినహాయించుకుని, మిగతా రూ. పదివేలు ఆలయ నిర్మాణాలు, జీర్ణోద్ధరణకు వెచ్చించే లక్ష్యంగా శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేశారు. దాతలు అందించిన రు. 10 వేలకు రసీదు ఇవ్వడంతో పాటు ఆ సొమ్ము తిరుపతిలోని జాతీయ బ్యాంకుల తో పాటు ప్రైవేటు బ్యాంకుల్లో కూడా డిపాజిట్ చేశారు. అందులో..

రూ. 1500 కోట్లు ఏమయ్యాయి!?

శ్రీవాణి ట్రస్ట్ పేరిట భక్తులకు కేటాయించిన వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల ద్వారా రూ. 1500 కోట్లు టీటీడీ భక్తుల నుంచి వసూలు చేయగా అందులో రూ. 350 కోట్లు ఆలయాలకు నిర్మాణానికి ఖర్చు చేసినట్లు టీటీడీ లెక్కల్లో తేలింది. మిగిలిన రూ. 1150 కోట్లు ఎవరి ఖాతాలోకి మళ్ళించారు? అనే దిశగా విచారణ జరుగుతోంది. బ్రేక్ దర్శనం టికెట్ కోసం రూ. 500కు రసీదు ఇచ్చి, మిగతా రూ. 10 వేలు ఆలయ నిర్మాణ ట్రస్ట్ కు మళ్ళిస్తున్నట్లు చెప్పినా, లెక్కల్లో మభ్య పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో గత ఏడాది సెప్టెంబర్ నెలలో అప్పటి టీటీడీ చైర్మన్ వైవి. సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డితో కలిసి శ్వేతపత్రం విడుదల చేశారు.


" శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 8.25 లక్షల మంది దాతల నుంచి ఆన్లైన్, ఆఫ్ లైన్ ద్వారా రూ. 860 కోట్లు అందాయి" అని వైవి. సుబ్బారెడ్డి వెల్లడించారు. "దేవాదాయ శాఖతో పాటు 176 ప్రైవేటు ఆలయాల కోసం కేటాయించాం. రూ. 10 లక్షల వంతున వెనుకబడిన ప్రాంతాల్లో 2,273 నిర్మాణం, దేవాదాయ శాఖ ద్వారా 1,953, సమరసత సంస్థ ద్వారా 320 ఆలయాల జీర్ణోద్ధరణ చేయడానికి నిధులు మంజూరు చేశాం" అని వారు స్పష్టం చేశారు.

అప్పటి ఈవో ధర్మారెడ్డి కొన్ని వివరాలు వెల్లడించారు. 2019 అక్టోబర్ లో ట్రస్టు ప్రారంభించిన తరువాత "మొదట ఆఫ్ లైన్ లో రేణిగుంట విమానాశ్రయం, తిరుమల జేఈఓ ఆఫీసులో కౌంటర్ ద్వారా బ్యాంకు సిబ్బందితోనే టికెట్ జారీ చేశాం. వందల సంఖ్య రోజుకు 250 మించిపోయింది. సర్వదర్శనానికి ఇబ్బందులు ఎదురవుతుండడం గమనించి, ఆన్లైలో 500, ఆఫ్ లైన్ లో మరో 500 టికెట్లను జారీ చేశాం" అని ఓ ఇంటర్య్వూలో చెప్పారు. ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, ఫెడరల్, బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఇండియన్ బ్యాంకుతో పాటు ఇంకొన్ని ప్రైవేటు బ్యాంకుల్లో ఫిక్సుడ్ డిపాజిట్ చేసిన రూ. 151 కోట్లకు 36.5 కోట్లు వడ్డీ వస్తోంది " అని వివరించారు.


ట్రస్టుకు రాజధానితో లింకేమిటి?
తిరుమలలో ప్రారంభించిన శ్రీవాణి ట్రస్టుకు రాజధాని అమరావతితో లింకు ఉన్నదనే విషయాన్ని చాలా మంది మరిచారు. ఈ ట్రస్ట్ ద్వారా నిధులు సమీకరించాలని టీడీపీ ప్రభుత్వ కాలంలోనే 2018 ఆగష్టు నెలలో జరిగిన టీటీడీ పాలక మండలి అజెండా లో 388 నంబర్ ద్వారా తీర్మానాన్ని ఆమోదించారు. ఈ ట్రస్ట్ ఏర్పాటుకే కాదు. తీర్మానం చేయించడానికి కూడా బలమైన కారణం ఉందనే విషయం స్పష్టమైంది.
2014 ఎన్నికల తరువాత టీడీపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అమరావతి రాజధానిగా 33 వేల ఎకరాల్లో రాజధానితో పాటు తూళ్లూరు మండలం వెంకటపాళెం వద్ద తిరుమల తరహాలో రూ. 150 కోట్లతో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణికి సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు ప్రణాళిక సిద్ధం చేయించారు. కేంద్రం ఇస్తున్న నిధులతో పాటు రాష్ర్ట ప్రభుత్వ నిధులతో తాత్కాలిక భవనాలను పూర్తి చేయించిన సీఎం చంద్రబాబు హైదరాబాద్ నుంచి సచివాలయాన్ని కూడా ఉండవల్లికి తరలించేశారు. అదే సమయంలో నిర్మాణ పనులు కూడా మరోపక్క సాగుతూనే ఉన్నాయి. అంతమొత్తం నిధులు ఆలయానికి వెచ్చించడం సాధ్యం కాదు. టీటీడీ నుంచి తీసుకునేందుకు కూడా నిబంధనలు అంగీకరించవు. ఆ సమస్యల నుంచి కొత్త ఆలోచన పురుడు పోసుకుంది.
అదే... ఈ ట్రస్టు
సంపద సృష్టికర్తగా, కొంగొత్త ఆలోచనలు చేయడంలో సీఎం ఎన్. చంద్రబాబుది ప్రత్యేక శైలి. ఆలయాల పునరుద్ధరణ, బలహీన వర్గాల కాలనీల్లో ఆలయాల నిర్మాణం కోసం నిధులు సమీకరించాలనే ఆలోచనల నుంచే పుట్టిందే. శ్రీవాణి ట్రస్ట్ అని చెబుతున్నారు. ఇందుకోసం 2018లో టీటీడీ పాలక మండలిలో సీఎం చంద్రబాబు తీర్మానం చేయించారు. అయితే పాలక మండలి, ఈఓ సకాలంలో స్పందించని కారణంగా విధివిధానాలు ఖరారు చేయడంలో తాత్సారం చేశారు. దీంతో 2019 ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 11న వెలువడిన నేపథ్యంలో శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారం మరుగున పడింది.
మాజీ ఈవో ధర్మారెడ్డి "ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో కూడా స్పష్టం చేశారు."
ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రావడం, ఆ తరువాత కేంద్ర రక్షణ శాఖ సర్వీసుల నుంచి డిప్యూటేషన్ పై ధర్మారెడ్డిని రప్పించినసీఎం వైఎస్. జగన్ ఈఓగా నియమించారు. ఇంతవరకు బాగానే ఉంది. విధుల్లో చేరిన నాటి నుంచి ఆయన సాగించిన పాలన అందరి నోటా విమర్శలకు గురైంది. ఇది చాలదని ఊరికే ఉంటే ఊరా పేరా అన్నట్లు శ్రీవాణి ట్రస్ట్ ఉందని గ్రహించిన ధర్మారెడ్డి దానిని అమలు చేయించడానికి విధివిధానాలు తయారు చేయించారు. గతంలో పనిచేసిన అధికారుల తరహాలో తన పేరు కూడా శాశ్వతంగా నిలవాలని భావించారేమో? ఆ ట్రస్టును కార్యాచరణలోకి తీసుకుని వచ్చారు. అమరావతి రాజధానిలో నిర్మిస్తున్న శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయానికి మినహా ఈ ట్రస్టు నిధులు, మిగతా ప్రాంతాల్లో నిర్మాణాలకు వినియోగించినట్లు లెక్కలు చెబుతున్నారు. ఇదీ అసలు శ్రీవాణి ట్రస్ట్ సంగతి. ఆయన చేసిన తీరువల్ల ట్రస్ట్కు ఊపిరి పోసిన టీటీడీ నేతలు హాయిగా ఉంటే, మాజీ ఈఓ ధర్మారెడ్డి, మాజీ సీఎం జగన్ చిక్కుల్లో పడ్డారు.
ఈ ట్రస్టు నిధుల వినియోగంపై కూకటివేళ్లతో సహా వెలికి తీయడానికి దర్యాప్తు జరుగుతోంది. ఇందులో ఏమి తేలుస్తారనేది ఈ నెల 15వ తేదీ తరువాత వెల్లడయ్యే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు.
Read More
Next Story