12 గంటలు మూత పడనున్నఆలయ ద్వారాలు
x

12 గంటలు మూత పడనున్నఆలయ ద్వారాలు

ఆదివారం మధ్యాహ్నం నుంచి చంద్రగ్రహణం ఎఫెక్ట్.


తిరుమలతో పాటు టీటీడీ ఆలయాల తలుపులు ఈ నెల ఏడో తేదీ 12 గంటల పాటు మూతపడనున్నాయి. యాత్రికులను కూడా దర్శనానికి అనుమతించరు. ఆ రోజు రాత్రి 9.50 గంటల నుంచి 8వ తేదీ (సోమవారం) వేకువజామున 1.31 గంటల వరకు చంద్ర‌గ్రహణ ప్రభావం ఉంటుంది. దీంతో ఏడో తేదీ మధ్యాహ్నం 2.15 గంటలకు మూసేసి, ఎనిమిదో తేదీ ఉదయం నాలుగు గంటలకు తెరిచి, యాత్రికులను దర్శనానికి అనుమతించనున్నారు.

చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి తిరుమల తోపాటు టిటిడి స్థానిక ఆల‌యాలు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీకోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్ప‌లాయిగుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యాల త‌లుపులు మూసివేస్తారు.
ఆదివారం రాత్రి 9.50 గంటల నుంచి 8వ తేదీ సోమవారం వేకువజామున 1.31 గంటల వరకు చంద్ర‌గ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ.
తిరుచానూరు: శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయాన్ని ఏడో తేదీ ఆదివారం మధ్యాహ్నం 02.15 గంటలకు మూసివేస్తారు. 8వ తేదీ సోమవారం ఉదయం 4 గంటలకు ఆలయాన్ని తెరిచి శుద్ధి, పుణ్యవచనం చేస్తారు. ఉదయం 8 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
శ్రీ గోవిందరాజు స్వామి ఆలయం:
ఈ ఆలయంలో 7వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 03.00 గంటల వరకు శుద్ధి, పూలంగి సేవ, శాత్తుమొర తదితర సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. 8వ తేదీ సోమవారం ఉదయం 4.30 గంటల నుంచి పలు సేవలు అనంతరం ఉదయం 09.30 గంటలకు సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు.
శ్రీనివాసమంగాపురం: శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని 7వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 3.00 గంటల వరకు కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహించి 03.30 గం.లకు ఆలయాన్ని మూసివేస్తారు. 8వ తేదీ సోమవారం ఉదయం 04.45 గంటలకు తెరుస్తారు. ఏకాంతసేవల తర్వాత ఉదయం 8.30 గం.లకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
కపిలతీర్థం ఆలయం: శ్రీకపిలేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం మద్యాహ్నం 01.30 గంటల నుంచి సోమవారం ఉదయం 3.00 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. ఆలయశుద్ధి, సుప్రభాతం, అభిషేకం, అర్చన సేవల తదుపరి ఉదయం ఏడు గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
అమరావతిలోని ఎస్వీ ఆలయం, నారాయణవనం, కార్వేటినగరం, కడప, ఒంటిమిట్ట తదితర ఆలయాలను ఆదివారం మధ్యాహ్నం 1.50 గంటలకు మూసివేసి, 8వ తేదీ సోమవారం ఉదయం 3.00 గంటలకు తెరుస్తారు.
Read More
Next Story