
TTD- SVIMS | సమ్మెకు దిగితే.... ఎస్మా తప్పదు
స్విమ్స్ కు సంబంధం లేని వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తప్పవని టిటిడి హెచ్చరించింది.
శ్రీవారి భక్తులకు సేవలు అందించే కాంట్రాక్ట్ ఉద్యోగులు విధులు నిరసనకు దిగితే చర్యలు తప్పవని టిటిడి హెచ్చరించింది. సమస్యలు పరిష్కరించాలని స్విమ్స్ కాంట్రాక్టు సిబ్బంది నాలుగు రోజులుగా సీపీఎం అనుబంధ కార్మిక సంఘాల సారధ్యంలో నాలుగు రోజులుగా దీక్షలు చేపట్టారు. దీంతో టీటీడీ సీరియస్ గా స్పందించింది. యాత్రికులకు ఇబ్బంది కలిగించే విధంగా ఆందోళనలకు దిగితే, "ఎస్మా చట్టం" అమలు చేయడానికి వెనుకాడబోమని టీటీడీ హెచ్చరించింది. బయటి వ్యక్తలు సేవలకు ఆటంకం కలిగిస్తే, క్రిమినల్ చర్యలు తప్పవని కూడా టీటీడీ అధికారులు బుధవారం హెచ్చరించారు.
టీటీడీలో పారిశుధ్ద్యం, ఆరోగ్యం తదితర శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు విశేష సేవలు అందిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులకు గురి చేసే చర్యలకు పాల్పడవద్దని హితవు పలికింి. భక్తుల సేవలకు ఆటంకం కలిగించే విధంగా ఉద్యోగులు వ్యవహరిస్తే, ముఖ్యమైన సేవల నిర్వహణ చట్టం ( ఎస్మా) టిటిడిలో అమలులో ఉందని గుర్తు చేసింది.
"టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆ శాఖాధిపతులతో సమస్యలపై చర్చించి పరిష్కరించుకోండి. దీనికి యాజమాన్యం కూడా సిద్ధంగా ఉంది" అని టీటీడీ అధికారులు ఉద్యోగులకు స్పష్టం చేశారు.
టిటిడి, స్విమ్స్ యాజమాన్యాలు ఉద్యోగులతో దారుణంగా వ్యవహరిస్తున్నాయని స్విమ్స్ ఆస్పత్రి వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షులు కే. వేణుగోపాల్ అభ్యంతరం తెలిపారు.
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ ( Sri Venkateswara Institute of Medical Sciences SVIMS) సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బంది విధులు బహిష్కరించి నాలుగు రోజులుగా నిరసన దీక్షలు సాగిస్తున్నారు. ఈ ఆందోళనకు సీపీఎం, సీఐటీయు అనుబంధ సంఘాలు మద్దతు తెలిపాయి. వారి నాయకత్వంలోనే రిలేదీక్షలు చేస్తున్నారు. దీంతో
"ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఆధ్యాత్మిక సంస్థలో విధులను బహిష్కరించడం సరికాదని టీటీడీ హితవు పలికింది. నిబంధనలకు వ్యతిరేకంగా సమ్మె చేస్తే ఎస్మా చట్టాన్ని అమలు చేస్తాం" అని స్పష్టం చేశారు. ఎస్ఎల్ఎస్ఎంపీసీ సంస్థ తోపాటు కాంట్రాక్ట్, పలు సొసైటీలలో ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఆ ఉద్యోగులు విధులను బహిష్కరిస్తే ఎస్మా చట్టం ప్రకారం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని టీటీడీ తేల్చి చెప్పింది.
గతంలో టిటిడిలో విధులను బహిష్కరణ చేసినా మానవతా దృక్పథంతో తిరిగి విధుల్లోకి తీసుకున్నామని గుర్తు చేశారు. ఈసారి విధుల నుంచి తొలగించాక ఎలాంటి పరిస్థితుల్లో తిరిగి చేర్చుకోరని టిటిడి తెలిపింది.
స్విమ్స్ లో పనిచేసే సిబ్బంది చట్టప్రకారం వేతనాలు పెంచడంతో పాటు హోదా కూడా మార్చాలనే డిమాండ్లతో నిరసనలకు దిగారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి తెలిపారు.
" రోగులకు అత్యవసర సేవలకు భంగం కలగకుండా, మంగళవారం నుంచి రోజూ గంట పాటు విధులు బహిష్కరించి నిరసన తెలియజేస్తున్నాం" అని కందారపు మురళి చెప్పారు.
"టీటీడీ ఈఓ జే. శ్యామలరావు విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా, ఆయన వచ్చే వరకు సమ్మెకు దిగకుండా, వాయిదా వేసుకున్నాం" అని మురళీ వివరించారు.
సమ్మె నిషేధం
టిటిడిలో భక్తులకు సేవలు అందించే ఉద్యోగులు ధర్నాలు చేయడం, నిరసన నోటీసులు ఇవ్వడం, ఊరేగింపులు చేయడం చట్టప్రకారం నిషేధం. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటాం అని టీటీడీ అధికారులు ప్రకటించారు. ఉద్యోగుల విధులకు టిటిడితో సంబంధం లేని బయట వ్యక్తులు ఆటంకం కల్గిస్తే, క్రిమినల్ చర్యలకు వెనుకాడమని హెచ్చరించింది.
చర్యలు తప్పవు
స్విమ్స్ డైరెక్టర్ ఆర్.వి. కుమార్
టీటీడీకి అనుబంధంగా నిర్వహిస్తున్న స్విమ్స్ సూపర్ స్పాషాలిటీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్ ద్వారా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ. కుమార్ తెలిపారు. అనేక సమస్యలను ప్రస్తావిస్తూ, విధులు బహిష్కరించేందుకు సిద్ధపడుతున్నారు. వారి సమస్యలను టిటిడి యాజమాన్యం సామరస్యంగా పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ఉద్యోగులు సంబంధిత శాఖాధిపతులతో చర్చించి పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
స్విమ్స్ డైరెక్టర్ ఇంకా ఏమన్నారంటే..
" స్విమ్స్ లో ఎస్మా చట్టం అమలులో ఉంది. సమ్మె నోటిస్ ఇవ్వడం చట్టవిరుద్ధం. వైద్య సేవలకు ఆటంకం కలిగిస్తే విధుల నుంచి తొలగించే నిబంధన ఉంది" అని గుర్తు చేశారు. స్విమ్స్ తో సంబంధం లేని బయట వ్యక్తుల ప్రమేయంతో నిరసనలకు దిగితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డాక్టర్ ఆర్వీ. కుమార్ స్పస్టం చేశారు.
దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించడంలో జాప్యం చేయడం వల్లే నిరసనలకు దిగామని స్విమ్స్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కే. వేణుగోపాల్ చెప్పారు.
" మూడు దశాబ్దాలుగా స్విమ్స్ ఆసుపత్రిని నమ్ముకొని పనిచేస్తున్న పేదలు, దళితులు, బడుగు బలహీన వర్గాలకు చెందిన కార్మికులకు అన్యాయం జరుగుతోంది" అని వేణుగోపాల్ చెబుతున్నారు.
"రెండేళ్లుగా యాజమాన్యం చేసిన తప్పును సరిదిద్దుకుని కార్మికులకు న్యాయం చేయకుండా, మాటలతో కాలయాపన చేశారు. రాతపూర్వక ఒప్పందాలు అమలు చేయమని కోరడం. కార్మికులకు మద్దతు ప్రకటించిన వారికి దురుద్దేశాలను ఆపాదించడం అన్యాయం" అని వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.
Next Story