TTD | ఎస్వీ ప్రాణదాన ట్రస్టుతో పేదరోగులకు పునర్జన్మ
x

TTD | ఎస్వీ ప్రాణదాన ట్రస్టుతో పేదరోగులకు పునర్జన్మ

svims ఆస్పత్రిలో ఓ రికార్డు. ఉచిత ఆపరేషన్లకు 1,748 ఎంపిక.


టీటీడీ ఆధ్యాత్మిక కేంద్రమే కాదు. ట్రస్టుల ద్వారా యాత్రికుల ఆకలి తీర్చే అక్షయపాత్రగా మారింది. పేదరోగులకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించే సంజీవనిగా ప్రాణం పోస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ఆస్పత్రుల ద్వారా రికార్డు స్థాయిలో 1,748 మందికి ఖరీదైన శస్ర్తచికిత్సలతో పునర్జన్మ ప్రసాదించాలని సోమవారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

శ్రీవెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ( Sri Venkateswara Institute of Medical Sciences SVIMS ), టీటీడీ బర్డ్స్ ( Balaji Institute of Surgery, Research and Rehabilitation for the Disabled BIRRD) ఆస్పత్రితో పాటు చిన్నపిల్లల హృదయాలయ ఆస్పత్రుల్లో (Sri Padmavathi Children's Heart Hospital) దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న తెలుపు రేషన్ కార్డులు ఉన్న రోగులకు భారీ సంఖ్యలో ఉచితంగా శస్త్రచికిత్సలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఆస్పత్రుల్లో ఎస్వీ ప్రాణదాన ట్రస్టు ద్వారా వైద్య సేవలు ఉచితంగా అందించడం సర్వసాధారణమే కానీ, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్. ఆర్.వి. కుమార్ సారధ్యంలోని కమిటీ తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలుస్తుందనడంలో సందేహం లేదు.

ఆస్పత్రుల అధిపతులతో సమావేశమైన టీటీడీ స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్. ఆర్.వి. కుమార్

టీటీడీ ట్రస్టులు

టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్విమ్స్, బర్డ్స్, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆస్పత్రుల్లో తెలుపు కార్డు ఉన్న పేద రోగులకు ఖరీదైన వైద్యసేవలు అందిస్తోంది. టీటీడీ నిర్వహిస్తున్న అనేక ట్రస్టుల్లో శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన ట్రస్ట్ తర్వాత ఎస్ వి ప్రాణదాన ట్రస్టు కూడా ప్రధానమైంది. ప్రాణదాన ట్రస్టుకు పారిశ్రామికవేత్తలే కాకుండా దాతలు అనేకమంది అందించిన విరాళాలతో పేద రోగులకు టీటీడీ శాస్త్ర చికిత్సలకు అవసరమైన ఖర్చును భరిస్తుంది. ఎస్పీ ప్రాణదాన ట్రస్టుకు వందల కోట్ల రూపాయలు విరాళాలుగా అందాయి. టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే ఎస్పీ ప్రాణదాన ట్రస్టుకు 66.53 కోట్ల రూపాయలు, బర్డ్ ట్రస్ట్ కు 30.02 కోట్ల రూపాయలు దాతల నుంచి టీటీడీకి విరాళాలు అందాయి. ఈ మొత్తం నుంచి వచ్చే వడ్డీని మాత్రమే పేద రోగులకు శాస్త్ర చికిత్సలకు అవసరమైన నిధులు టీటీడీ మంజూరు చేస్తుంది.
పేదరోగుల కోసం..
టీటీడీ నిర్వహిస్తున్న స్విమ్స్, పద్మావతీ ఆస్పత్రిలో చికిత్స చేయించుకునే రోగులకు కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో బిల్లులకు, ఇక్కటి టీటీడీ ఆస్పత్రుల్లో రోగులకు వేసే బిల్లులకు పొంతనే ఉండదు. టీటీడీ ఆస్పత్రుల్లో పేదరోగులకు బిల్లులో 30 శాతం నుంచి 40 శాతం వరకు రాయితీ ఉంటుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు, ప్రధానంగా గుండెజబ్బు, న్యూరాలజీ, యూరాలజీ, జనరల్ సర్జరీ, క్యాన్సర్ రోగులకు అవసరమైన పరీక్షలు చేయడం వారిలో ఆర్థిక స్థోమత లేని రోగుల సంబంధీకులు దరఖాస్తు చేసుకుంటే, ఎస్వీ ప్రాణదాన ట్రస్టు ద్వారా టీటీడీ నుంచి అనుమతి తీసుకుని, ఉచితంగా శస్ర్తచికిత్సలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో శస్ర్తచికిత్సల అనంతరం కూడా టీటీడీ అధికారులకు సిఫారసు చేసి, నిధులు మంజూరు చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి.
శస్త్రచికిత్సలకు 1,748 మంది ఎంపిక
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్న పేద రోగులు 1,748 మందికి ఉచితంగా ఎస్వీ ప్రాణదాన ట్రస్టు ద్వారా శస్త్రచికిత్సలు చేయాలని నిర్ణయించినట్లు శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) డైరెక్టర్ డాక్టర్, శ్రీ పద్మావతీ మెడికల్ కాలేజీ వీసీ ఆర్.వి. కుమార్ వెల్లడించారు. స్విమ్స్ పాత కార్యాలయం కమిటి హాలులో డాక్టర్ ఆర్.వి. కుమార్ అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది.
టిటిడి అడిషనల్ ఎఫ్ఎ అండ్ సీఏఓ రవిప్రసాద్ ,శ్రీపద్మావతి చిన్న పిల్లల హృదయాల డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథరెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ డి.గోపి, గవర్నమెంట్ మెటర్నటీ హాస్పిటల్ ఆర్ఎంఓ. డాక్టర్
శ్రీనివాస్, ఎస్విఆర్ఆర్ ఆస్పత్రి ఆర్ఎంఓ. డాక్టర్ సుబ్బలక్ష్మి, బర్డ్ హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ రామ్మూర్తి, టిటిడి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుసుమకుమారి, స్విమ్స్ విభాగాధిపతులు డాక్టర్లుచ హాజరయ్యారు.
"TTD ఆస్పత్రుల్లో 1,748 మంది పేద రోగులను ఉచిత శస్త్ర చికిత్సలకు ఎంపిక చేశాం" అని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి. కుమార్ వెల్లడించారు. రోగుల ఆరోగ్య స్థితిగతులు, బియ్యం కార్డు ఉన్న దారిద్య్రరేఖకు దిగువన ఉన్న నిరుపేదకు ఉచితంగా శస్ర్తచికిత్సలు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు డాక్టర్ ఆర్.వి.కుమార్ వివరించారు.
టీటీడీ ప్రధానంగా స్విమ్స్ ఆస్పత్రిలోని వివిధ విభాగాల ద్వారా రోగులకు శస్త్రచికిత్సల కోసం ఎంపిక చేసిన వివరాలను డాక్టర్ ఆర్.వి. కుమార్ తెలాపారు. కార్డియాలజీ -45 మంది రోగులకు శస్ర్త చికిత్సలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కార్డియో థొరాసిక్- 142 మందికి, ఇఎన్టిలో తొమ్మది మందికి, ఎండోక్రైనాలజీ ఒకరికి, జనరల్ సర్జరి 88, రేడియాలజీ లో ముగ్గురు, మెడిసిన్- 180, మెడికల్ ఆంకాలజీ -13, న్యూక్లియర్ మెడిసిన్-ఆరుగురు, నెప్రాలజీ-516, న్యూరాలజి -165, న్యూరోసర్జరీ-240, గైనకాలజి-40, ఆఫ్తల్మాలజీలో ఒకరు, సైకియార్టి ఇద్దరు, రేడియేషన్ ఆంకాలజీ- 22, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రీలజీ-245, సర్జికల్ ఆంకాలజీ-26, యురాలజీ నలుగురు పేదలకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయడానికి ఎంపిక చేశారు.
టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టు ద్వారా పేదరోగుల వైద్య సేవలు అందిస్తున్నారు. ఆ మేరకు ఆస్పత్రులకు టీటీడీ ద్వారా నిధులు మంజూరు చేస్తారని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి కుమార్ వివరించారు. దాతలు టీటీడీ ద్వారా ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు అందిస్తున్న విరాళాలతోనే పేద రోగులకు కార్పొరేట్ వైద్య సేవల తోపాటు, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న ఆర్థిక స్థోమత లేని వారి ప్రాణాలు కాపాడడానికి కూడా ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తున్నట్లు డాక్టర్ ఆర్.వి. కుమార్ తెలిపారు.
Read More
Next Story