
Garimella Prasad | వినరో భాగ్యమూ.. స్వరం ఆగింది...
టీటీడీ ఆస్థానం విధ్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ తిరుపతిలో ఆదివారం కన్నుమూశారు.
వినరో భాగ్యము.. విష్ణుకథా అని తిరుమల శ్రీవారిని కీర్తించిన ఆ స్వరం నుంచి వెలువడిన కీర్తన అజరామరం. వీనుల విందుగా ఆలకించడం ద్వారా ఆయన శ్రీవారి భక్తులను మైమరమించారు. అలాంటి టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (76) ఆదివారం తిరుపతిలో కన్నుమూశారు. ఈ నెల 11 వ తేదీ మంగళవారం ఉదయం కరకంబాడి మార్గంలోని గోవిందధామంలో అంత్యక్రియలు జరుగుతాయని గరిమెళ్ల కుటుంబీకులు తెలిపారు.
ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (76) తుదిశ్వాస విడిచారనే సమాచారం తెలియగానే టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు సంతాపం తెలిపారు. తిరుపతి నగరం భవానీనగర్ ప్రాంతంలోని దేవేంద్ర థియేటర్ కు వెనుక భాగంలో ఉన్న నివాసానికి వెళ్లిన టిటిడి మాజీ చైర్మన్
టిటిడి ఆస్థాన విధ్వాంసుడు ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ భౌతికకాయానికి నివాళులర్పించారు.
ఎవరీ గరిమెళ్ల
టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా దశాబ్దాల కాలంపాటు సేవలు అందించిన ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ 600 పైగానే అన్నమాచార్య కీర్తనలకు స్వరకల్పన చేసి, తిరుమల శ్రీవారి వైభవాన్ని చాటడంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ తల్లిదండ్రులు కృష్ణవేణి, నరసింహారావు దంపతులకు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ రాజమండ్రిలో జన్మించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) లో 1978 నుంచి 2006 వరకు ఆస్థాన గాయకుడిగా గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఉన్నారు. 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు గరిమెళ్ల వారు స్వరకల్పన చేశారు.
తిరుమల శ్రీవారిని స్తుతిస్తూ, పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య రచించిన కీర్తనలను గరిమెళ్ల స్వరపరిచి, ఆలపించారు. అందులో "వినరో భాగ్యము విష్ణుకథ..", "జగడపు చనువుల జాజర..", "పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు.." వంటి సుప్రసిద్ధ కీర్తనలకు స్వరాలను సమకూర్చారు. సంప్రదాయ కర్ణాటక సంగీతంలో, లలిత సంగీతంలో, జానపద సంగీతంలోనూ గరిమెళ్ల ప్రపంచ ప్రఖ్యాతి సాధించారు.
తీరని లోటు
టిటిడి ఆస్థాన గాయకుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ మృతి దిగ్భ్రాంతి కలిగించిందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అన్నమయ్య రచించిన సంకీర్తనలలో ఆరువందల సంకీర్తనలను స్వరపరచి శ్రీవెంకటేశ్వర స్వామి వైభవాన్ని ప్రపంచ నలుదిశలా వ్యాప్తి చేసిన గొప్ప గాయకులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ అని ఆయన కొనియాడారు. గరిమెళ్ళ మృతి శ్రీవారి భక్తులతో పాటు సంగితప్రియులకు తీరని లోటని ఆయన చెప్పారు. గరిమెళ్ల స్వరపరిచిన అన్నమయ్య కీర్తనలు వినే ప్రతి సందర్భంలోనూ శ్రీవారి కళ్లముందే సాక్షాత్కరించినట్లు ఉంటుంది అని ఔత్సాహిక కళాకారుడు మదనపల్లెకు చెందిన పవార్ రెడ్డివినోద్ శ్రద్ధాంజలి ఘటించారు.
Next Story