
టిటిడి: ఆలయాల్లో 20న దీపావళి ఆస్థానం
ఆర్జిత, వాహనసేవల రద్దు.
తిరుమల శ్రీవారి ఆలయం తోపాటు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఈ నెల 20వ తేదీ దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. అనుబంధ ఆలయాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలోని శ్రీపుండరికవళ్ళి అమ్మవారి ఆలయం నుంచి సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల మధ్య నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి స్వామివారికి సమర్పిస్తారు. అనంతరం దీపావళి ఆస్థానం నిర్వహిస్తారు.
రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. సోమవారం రాత్రి 7 గంటలకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీకోదండరామస్వామివారికి సమర్పిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేకంసేవ, హనుమంత వాహనసేవను టిటిడి రద్దు చేసింది.
తిరుమల, తిరుపతి తోపాటు టీటీడీ అనుబంధ ఆలయాలు కార్వేటినగరంలోని శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయంలో సాయంత్రం ఐదు గంటలకు దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 8 నుంచి 9 గంటల వరకు శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరుగనుంది. సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు.
Next Story