
విషాదంతో చిన్నబోయిన 'చిత్తూరు' పట్టణాలు..
ఐదుగురు చిత్తూరు వాసులే. 23 మందికి గాయాలు.
కలత చెందిన రవాణాశాఖ మంత్రి మండిపల్లి
చింతూరు ప్రమాద మృతులకు రూ. 5 లక్షల పరిహారం
మృతదేహాలు తరలించేందుకు చిత్తూరు కలెక్టర్ ఏర్పాట్లు
మరో 24 గంటలు గడిచి ఉంటే, తీర్థయాత్రలకు బయలుదేరిన 35 మంది యాత్రికుల బృందం క్షేమంగా చిత్తూరుకు చేరుకునేది. ఊహించని విధంగా చింతూరు వద్ద ఘాట్ రోడ్డులో బస్సు లోయలో పడిన ఘటనలో తొమ్మిది మంది మరణించడం, 23 మంది గాయపడిన ఘటన చిత్తూరు జిల్లాలో పెనువిషాధం నింపింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు వద్ద ప్రయివేటు ట్రావెల్స్ బస్సు లోయలో పడిన ప్రమాదంతో
చిత్తూరు జిల్లాలోని మూడు పట్టణాలను కన్నీటి పర్యంతం చేసింది. చిత్తూరు నగరంలో ముగ్గరు, పలమనేరులో భార్యా,భర్త, తవణంపల్లో మరొకరు మరణించారు. తెనాలి, బెంగళూరుకు చెందిన వారితో పాటు మరో ఇద్దర ఉన్నారు.
చిత్తూరు జిల్లాలో మరణించిన, గాయపడిన వారి కుటుంబాలకు సమాచారం అందించామని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు, గాయపడిన వారికి రెండు లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలు పరిహారం ప్రకటించింది. సమాచారం తెలిసిన వెంనే ఘటనా స్థలాన్నిపరిశీలించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి బాధితులను పరామర్శించారు.
బాధితుల కోసం ఏర్పాట్లు
చింతూరు వద్ద ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనపై చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పందించారు.
"మృతదేహాలను చిత్తూరుకు తరలించడానికి ఫ్రీజర్ బాక్సులతో అంబులెన్సులు ఏర్పాటు చేశాం. గాయాలతో చికిత్స తీసుకుంటున్న వారికి కూడా వైద్య సహాయం అందించే విధంగా అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తో సమన్వయం చేసుకుంటున్నాం" అని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చెప్పారు.
కన్నీటి రోదన
చింతూరు వద్ద జరిగిన ప్రమాదంలో కుటుంబీకులు మరణించారనే సమాచారం తెలిసిన సంబంధీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.
చిత్తూరు నగరం గిరింపేట మరాఠా వీధికి చెందిన నాగేశ్వరరావు, శ్రీకళ, తవణంపల్లికి చెందిన దొరబాబు మరణించారు. దీంతో గిరింపేటలో తీవ్ర విషాదం ఏర్పడింది. సంబంధీకుల మృతదేహాల కోసం నిరీక్తిస్తున్నారు.
ఈ వయసులో నాకెంత బాధ
చింతూరు బస్సు ప్రమాదంలో మరణించిన వారిలో పలమనేరుకు చెందిన మునినారాయణశెట్టి వీధికి చెందిన దంపతులు సునంద (45), శివశంకర్ రెడ్డి (51) ఉన్నారు. ఈ విషాద వార్త తెలియగానే శివశంకరరెడ్డి తల్లి ఇంద్రాణమ్మ (75) తల్లడిల్లుతోంది. తీర్థయాత్రలకు వెళ్లి, కనిపించని లోకానికి వెళ్లావా కొడుకా అని ఆ ముసలి తల్లి వేదనకు గురవుతోంది. తిరుపతి బీడీఎస్ చదువుతున్న శివశంకరరెడ్డి కొడుకు సాయి వెంకట్, పలమనేరులో ఉన్న బాబాయ్ రాజేష్ తో కలిసి శుక్రవారం మధ్యాహ్నం చింతూరు బయలుదేరి వెళ్లనట్లు అక్కడి నుంచి తెలిసిన సమాచారం వారితో పాటు తెనాలి, బెంగళూరుకు చెందిన వారితో పాటు మరో ఇద్దరి కుటుంబాలకు సమాచారం అందించామని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.
గాయపడిన వారి వివరాలు
బస్సుు డ్రయివర్లు
పోకల ప్రసాద్ డ్రైవర్, చిత్తూరు
మధుశ్రీను డ్రైవర్
యాత్రికులు
పి. విజయమ్మ కుప్పం
కే నలిని పుంగనూరు
రుక్మిణి పిళ్ళై చిత్తూరు పాకాల
రామస్వామి పిళ్ళై కె చిత్తూరు పాకాల
కే ఉషారాణి బెంగళూరు
సిహెచ్ చంద్రారెడ్డి బెంగళూరు
తిమ్మలచెరువు చంద్రగోపాలరెడ్డి హైదరాబాద్
చిత్తూరు నగరం గిరింపేటకు చెందిన వారిలో..
భారతమ్మ, పరార జవహరి, వెంకట నరసింహారెడ్డి, ఎస్ అమ్ములు భాయ్, కల్లూరి ప్రత్యూష, తలపులపల్లి రమణమ్మ, తలపులపల్లి గోపిరెడ్డి , ఎన్ స్వర్ణలత, Sk అహ్రఫ్ (భర్త పేరు రహమాన్) గిరింపేట, బొజ్జ పద్మజ చిత్తూరు గిరింపేట, రాశి రెడ్డి మధుమతి, ఎస్కే ముంతాజ్ బేగం, పాపారా రమేష్ బాబు, వెంకట నరసింహారెడ్డి గాయపడ్డారు. వారిలో కొందరికి చింతూరు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తల, నడుముకు తీవ్రంగా గాయాలైన వారిని భద్రాచలం ఆస్పత్రికి తరలించారని చిత్తూరు జిల్లా కలెక్టరేట్ అధికారవర్గాల సమాచారం.
బాధితులకు అండగా...
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాక ఘాట్ రోడ్డులో చిత్తూరుకు చెందిన విజ్ఞేశ్వర ట్రావెల్స్ ప్రమాద ఘటనపై చిత్తూరు జిల్లా కలెక్ట సమిత్ కుమార్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, వివరాలు వెల్లడించారు.
చిత్తూరు నుంచి మూడు రోజుల క్రితం విజ్ఞేశ్వర ట్రావెల్స్ బస్సు ద్వారా 35 మంది యాత్రికులతో చిత్తూరు నుంచి అరకు, మారేడుమిల్లి, భద్రాచలం విహార యాత్రకు బస్సు బయల్దేరిందని తెలిపారు. ఆ బస్సు భద్రాచలం నుంచి అన్నవరం వెళుతుండగా శుక్రవారం వేకువజామున సుమారు 4.30 గంటలకు చింతూరు మండలం తులసిపాక ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురికావడంతో 9 మంది మరణించారన్నారు.
ఈ దుర్ఘటన తెలియగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అందుతున్న సహాయక చర్యల వివరాలను తెలుసుకున్నారు. ఉన్నతాధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని అవసరమైన అన్నీ శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
చిత్తూరు జిల్లా కలెక్టర్ ఏమి చెప్పారంటే..
"ప్రమాదం జరిగిన వెంటనే అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ నుంచి జిల్లాకు సమాచారం అందింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణీకులతో పాటు డ్రైవరు, క్లీనర్ తో కలిపి 37 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదం కారణంగా ఇప్పటి వరకు 9 మంది మరణించగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి" అని కలెక్టర్ సుమిత్ కుమార్ వివరించారు. బాధితులకు సహాయక చర్యల కోసం కాకినాడ నుంచి ఎన్డిఆర్ఎఫ్ బృందం వెళ్ళిందని ఆయన తెలిపారు.
ఐటీడీఏ పీఓ పర్యవేక్షణ
చింతూరు వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు ఐటీడీఏ పీఓ పర్యవేక్షిస్తున్నట్లు తమకు సమాచారం అందించారని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. అల్లూరి సీతారామారాజు జిల్లా కలెక్టర్ ప్రదీప్ కుమార్ తోపాటు ఆ జిల్లా అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించడంతో పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న వారికి మెరుగైన వైద్యం అందించడంలోనే కాకుండా, సీరియస్ గా ఉన్న వారికి భద్రచలం ఆస్పత్రికి తరలించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
"మృతదేహాలకు త్వరంగా పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. మృతదేహాల తరలింపునకు చిత్తూరు నుంచి ఫ్రీజర్ బాక్స్ లతో కలిపి ఐదు అంబులెన్స్ లు ఏర్పాటు చేశాం. యాత్రికులను చిత్తూరుకు చేర్చడానికి రవాణా ఏర్పాట్లు చేస్తున్నాం" అని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ వివరించారు. సహాయక చర్యలతో పాటు, బాధితులకు వెంటనే సేవలు అందించే విధంగా ఓ బృందం ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. మృతదేహాలు శనివారం చిత్తూరుకు తరలించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు.
కలత చెందిన మంత్రి
చింతూరు వద్ద ప్రయివేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడిన ఘటనలో గాయపడిన బాధితులను చూసి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చలించిపోయారు.
"అనుకోని రోడ్డు ప్రమాదాలు నిండు ప్రాణాలు బలిగొంటున్నాయి" అని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు లోయలో పడిందని సమాచారం తెలియగానే రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీష్ దేవి, అల్లూరి జిల్లా సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ ఉన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారిని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ పరామర్శించారు. చింతూరు ఆస్సత్రిలో చికిత్స తీసుకుంతున్న బాధితులనుఎమ్మెల్యే మిరియాల శిరీష్ దేవి తో కలిసి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై వాకబు చేశారు.
చిత్తూరు నగరానికి చెందిన మరణించిన వారిలో ఐదుగురు కుటుంబాలకు ఒక్కొక్కరికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించనున్నట్లు మంత్రి రాంప్రసాదరెడ్డి ప్రకటించారు.
"బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేశాం. కేంద్ర ప్రభుత్వం నుంచి బాధితులకు రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తాం. క్షతగాత్రులకు రూ. 50 వేలు చెల్లించనున్నాట్లు" మంత్రి రాంప్రసాద్ ప్రకటించారు.
Next Story

