
నెల్లూరు మైపాడు బీచ్ వద్ద సముద్రంలో మునిగి మరణించిన విద్యార్థులు
నెల్లూరు మైపాడు సాగర తీరాన విషాదం...
ఈతకు వెళ్లిన ముగ్గురు మిత్రుల మృతి
మొంథా తుపాను కోస్తా తీరాన్ని వణికించింది. అలల కారణంగా మైపాడు వద్ద సముద్రం 50 మీటర్లు ముందుకు చొచ్చుకుని వచ్చింది. ఈ పరిస్థితుల్లో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో సముద్రతీర ప్రాంతంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్ వద్ద జరిగింది. మైపాడు వద్ద ఉన్న సముద్రం వద్దకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు సరదా కోసం నీటిలోకి దిగారు. అలల తాకిడికి కొట్టుకుని పోయి మరణించారు. ఈ సంఘటనతో మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
నెల్లూరు నగరానికి బంగాళాఖాతం సమీపంలోనే ఉంటుంది. నెల్లూరు నగరానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైపాడు బీచ్ పర్యాటక ప్రాంతం. ఇక్కడ మత్స్యకారులు చేపల వేటకు అనువైన ప్రదేశం. ఇదే సమయంలో మైపాడు బీచ్ ను పర్యాటకంగా కూడా అభివృద్ధి చేస్తున్నారు. సెలవు రోజుల్లో మైపాడు బీచ్ వద్దకు వెళ్లే సందర్శకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడి వెళుతుంటారు.
సరదా కోసం వెళ్లి...
ఆదివారం సెలవు దినం కావడంతో చాలా మంది మైపాడు బీచ్ వద్దకు వెళ్లారు. వారిలో నగరంలోని ఇంటర్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు కూడా ఉన్నారు. అలల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ సముద్రంలోకి ఈతకు వెళ్లిన విద్యార్థులు నీటిలోకి దిగారు. సముద్రం నుంచి వచ్చిన కెరటాల దెబ్బకు ముగ్గురు విద్యార్థులు కొట్టుకుని పోయారు. ఒడ్డునే ఉన్న స్థానికులు అప్రమత్తమై వెంటనే సముద్రంలోకి దూకారని తెలిసింది. తీవ్ర గాలింపు అనంతరం ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు.
వారు ముగ్గురు స్నేహితులే..
ఆదివారం మధ్యాహ్నం ముగ్గురు విద్యార్థులు స్నేహితులు మైపాడు బీచ్ కు వెళ్ళారు. బీచ్ వద్ద సముద్రం అలలు తాకుతుండగా కేరింతలు కొడుతూ ఈత కొడుతున్నారు. పెద్ద అల రావడంతో ముగ్గరు నీటిలో కొట్టుకుని పోతూ, కేకలు వేశారు. సమీపంలో ఉన్న మెరైన్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. అయినా ఫలితం లేకుండాపోయింది.
మృతులు నెల్లూరు జిల్లా కోటమిట్టకు చెందిన హుమాయూన్, సమీర్, నారాయణరెడ్డిపేటకు చెందిన తాజీమ్ గా గుర్తించారు. తుపాను ప్రభావం తగ్గినా సముద్రంలో అలల అలజడి తగ్గలేదు. సముద్రం ఉధృతంగా ఉండడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కోవూరు సీఐ సుధాకరరెడ్డి, ఎస్ఐ నాగార్జునరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
సముద్రంలో అలల ధాటికి కొట్టుకుపోయి మరణించిన ముగ్గురి విద్యార్థుల మృతదేహాలను నెల్లూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Next Story

