రైతుల జీవితాలతో జాక్ పాట్
నిలకడలేని ధరల దోబూచులాట. ప్రభుత్వాలు పట్టించుకోని తీరు మరోపక్క. మార్కెట్లో వ్యాపారుల జాక్పాట్ పద్ధతి. రైతులను కష్టాల కడలిలో ముంచెత్తుతున్నాయి.
నిలకడ లేని ధరలతో ఏడాది మొత్తం లో కొన్ని నెలలు మినహా, మిగతా సందర్భాల్లో టమాటా పండించే రైతులు దారుణంగా నష్టపోతున్నారు. ధరలు ఆశాజనకంగా ఉండే సందర్భాల్లో మార్కెట్లో వ్యాపారులు జాక్పాట్ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు.
ప్రధాన మార్కెట్ కంటే మారుమూల ఉన్న టమాటా కొనుగోలు చేస్తే మార్కెట్లలో పరిస్థితి దారుణంగా ఉన్నట్లు రైతులందరికీ సమాచారం అందుతోంది. జాక్పా ట్ విధానం వల్ల ప్రతి రైతు తాను తెచ్చే ఉత్పత్తిలో 10 శాతం నష్టపోతున్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. పంట దిగుబడి వచ్చే సమయంలో ధరలు ఉంటే రైతుకు కాస్త ఉపశమనం కలుగుతుంది. ఎన్నికల వాతావరణం నేపథ్యంలో ఆ ప్రభావం టమాటా పంట దిగుబడిపై కూడా ప్రభావం చూపించినట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీంతో ధరలు లేక రైతులు నష్టపోయారు.
దేశంలో ఎన్నికల వాతావరణం చల్లబడింది. మారు పది రోజుల నుంచి ధరలు ఆశాజనకంగా ఉంటున్నాయి. ప్రకృతి, మార్కెట్ స్థితిగతులు కరుణించాయని రైతులు సంబరపడ్డారు. పల్లెల నుంచి ఎక్కువగా టమాటాలు మార్కెట్ కి తీసుకొస్తున్నారు. ఇప్పుడు మార్కెట్లో ఏజెంట్ల రూపంలో రైతుల ఆశలకు గడ్డి కొట్టే పరిస్థితి ఏర్పడింది. మార్కెట్కు టమాటాలు ఎక్కువ వస్తుండడంతో వ్యాపారులు జాక్పాట్ కు తెరచేసినట్లు ఆరోపణలు ఎక్కువయ్యాయి. దీంతో తాము నిట్టనిలువునా మునుగుతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆసియాలోనే ప్రఖ్యాతి
రాష్ట్రంలో మదనపల్లె డివిజన్లోని టమాటా ఉత్పత్తికి దేశంలోనే మంచి గిరాకీ ఉంది. ఆసియాలోనే తిరుపతి నుంచి బెంగళూరుకు వెళ్లే 71 జాతీయ రహదారి మార్గం లోని పల్లెలు చిన్నపాటి పట్టణాలు టమాట ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంటుంది. చిత్తూరు జిల్లాలో 14,588 హెక్టార్లలో సాగవుతున్న టమాట తోటల నుంచి ప్రతి సంవత్సరం 2,62,584 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఉత్పత్తికి కాశ్మీర్ ఆపిల్‌కు ఎంత ప్రఖ్యాతి ఉందో.. మదనపల్లె ప్రాంతంలో టమాటాకు అంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ డివిజన్లోని మదనపల్లి, అంగళ్లు, వాల్మీకిపురం, గుర్రంకొండ, చింతపర్తి, పలమనేరు, పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లె ప్రాంతాలలో టమాటా తోటలు సాగు చేస్తున్నారు. పల్లెల్లో కోత అనంతరం టమాటాలను ఆశయాలోనే అతిపెద్ద మార్కెట్ అయినా మదనపల్లి ఆ తర్వాత అంగళ్ళు, గుర్రంకొండ, పలమనేరు, చింతపర్తి మార్కెట్లకు బస్సులు లేదా ఆటోలు ఇతర వాహనాల్లో తరలించడానికి రైతులు వ్యయప్రయాసలకు గురవుతున్నారు.
జాతీయ రహదారి పక్కన ఉన్న మార్కెట్లలో ధరలు, ఏజెంట్ల తీరు ఒకరకంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో మారుమూలముండే చిన్నపాటి మార్కెట్ల వద్ద పరిస్థితి మరో రకంగా ఉంటోంది. కొన్ని సందర్భాల్లో కొనుగోలు చేసే ఏజెంట్లు చెప్పిందే విధంగా సాగుతూ ఉండడం వల్ల అష్టకష్టాలు పడి, పంట సాగు చేసిన రైతులకు కడగండ్ల మిగులుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు పొరుగునే ఉన్న కర్ణాటక, తమిళనాడు, కేరళ తో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు కూడా ఈ ప్రాంతం నుంచి టమాటాలు ఎక్కువగా రవాణా చేస్తుంటారు. ప్రస్తుతం దేశంలో రాజకీయ వాతావరణం చల్లబడింది. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి. ఎంతో చిత్తూరు జిల్లా ప్రాంతంలో అధికంగా టమాటా రైతులు మార్కెట్లకు దిగుబడి తీసుకు వస్తున్నారు. దీనిని అవకాశంగా చేసుకున్న మార్కెట్లోని వ్యాపారులు జాక్పాట్ పద్ధతితో రైతుల శ్రమను దోచుకుంటున్నారని బలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ పరిస్థితిని పరిశీలిద్దాం...
తగ్గిన దిగుబడి.. ధరలు ఆశాజనకం
సాధారణంగా ఏడాదిలో టమాట దిగుబడికి మార్చి నుంచి ఏప్రిల్ లేదా మే నెల వరకు ఉంటుంది. మే, జూన్ తర్వాత దిగుబడి తక్కువగా ఉంటుంది. వాల్మీకిపురం వ్యవసాయం మార్కెట్ కమిటీ పరిధిలో 2000 ఎకరాల్లో టమాటా తోటకు సాగులో ఉన్నాయి. అంచనాల ప్రకారం 700 నుంచి 800 టన్నుల ఉత్పత్తి రావాల్సి ఉండగా, ప్రస్తుతం 350 నుంచి 400 టన్నులు కూడా రావడం లేదు. దీంతో ధరలు కాస్త ఆశాజనకంగా ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
జాక్ పాట్ అంటే ఎలా...?
టమాటా పండించే రైతులు ఉత్పత్తిని మార్కెట్లో తీసుకువస్తారు. మార్కెట్కు వచ్చిన టమాటాలను 25 కిలోల సామర్థ్యం ఉన్న క్రేట్లో నింపుతారు. గ్రేడింగ్ పేరిట 90 క్రేట్లకు కుదిస్తారు. వాటికి వేలంపాట నిర్వహించినప్పుడు జాక్పాట్లు 10 క్రేట్లకు రెండు వంతున 18 క్రట్లను పక్కకు తీసేస్తారు. ప్రస్తుతం మార్కెట్ యార్డ్‌లో టమాటా రూ. 35 నుంచి రూ.40 వరకు పలుకుతోంది. ఆ లెక్కన 100 క్రేట టమాటాలు తెచ్చిన రైతు జాక్పాట్ పేరిట, 25 క్రట్లను నష్టపోతున్నారు. అంటే రైతు మార్కెట్ కు టమాటాలు తీసుకొచ్చిన ప్రతిసారి సుమారుగా 20 వేల వరకు జాక్ పాట్ వల్ల నష్టపోతున్నట్లు అర్థమవుతోంది. పీలేరు నియోజకవర్గ పరిధిలోని వాల్మీకిపురం టమాటా మార్కెట్కు అనుబంధంగా నిర్వహిస్తున్న గుర్రంకొండ వద్ద ఈ వ్యవహారం ఎక్కువ జరుగుతోంది. మిగతా చిన్న మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడిందని సమాచారం.
దీనిపై గుర్రంకొండ మండలం తరిగొండ గ్రామానికి సమీపంలోని బోడిగుట్ట వద్ద ఉన్న చెరువు మూరపల్లెకు చెందిన యువ రైతు కొండేటి రెడ్డి మోహన్ ఫెడరల్ ప్రతినిధితో తన బాధను పంచుకున్నారు. " రెండు రోజుల క్రితం 255 క్రేట్ల టమాటాలు గుర్రంకొండ మార్కెట్కు తీసుకు వెళ్ళాను. ఒక క్రేట్‌కు 20 కిలోలు ఉంటాయి. అందులో 40 బాక్సులు పక్కకు తీసేశారు. మిగతా వాటికి వేలం నిర్వహించి, సొమ్ము చెల్లించారు" అని రెడ్డి మోహన్ చెప్పారు. " 10 కిలోమీటర్లు దూరానికి రేటుకు రూ. 20 లెక్కన రూ.5,100 రవాణా చార్జీలు, టమాటా కోత, ఫోటో నుంచి రోడ్డుపైకి మోసిన 37 మందికి 20 వేలు కూలి చెల్లించా. టమాటా వేలం ద్వారా కమిషన్ ఇతరత్రా అన్ని పోతే.. నా చేతికి అందింది రూ.73 వేలు మాత్రమే" అని రెడ్డి మోహన్ వివరించారు. కొన్ని సందర్భాల్లో స్థానిక అధికారులు నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు. అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు.
జాక్పాట్ వ్యవహారంతో రైతులు నష్టపోతున్నారనే ఆరోపణలపై వాల్మీకిపురం మార్కెట్ కమిటీ కార్యదర్శి కుమారరెడ్డి స్పందించారు. " గుర్రంకొండ మార్కెట్ యార్డులో 50 మంది వరకు బయ్యర్ లైసెన్స్ కలిగిన వ్యాపారులు ఉన్నారు. అన్ సీజన్లో 30 మంది మాత్రమే కొనుగోలు చేస్తుంటారు" అని మార్కెట్ కమిటీ కార్యదర్శి కుమార్ రెడ్డి ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు. "జాక్పాట్ విధానంతో రైతులకు నష్టం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని 50 మంది బయ్యర్ లైసెన్స్ కలిగిన వారికి నోటీసులు జారీ చేశాం" అని కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. " రోజు మధ్యాహ్నం తర్వాత వచ్చే టమాటాలకు సాయంత్రం ఐదు గంటలకు వేలం పాట జరుగుతుందని" ఆయన వివరించారు.
గుర్రంకొండ టమాటా మార్కెట్లో వ్యాపారులు జాక్పాట్ పద్ధతిని అడ్డుకునే వారు లేకుండా పోయారని చెబుతున్నారు. దీంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో గత్యంతరం లేక రైతులు వ్యాపారుల తీరుకు అనుగుణంగా తల ఊపాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై గుర్రంకొండ మార్కెట్లో టమాటా అలా వేలంలో పర్యవేక్షించే యుడిసి శారదా దేవి ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడారు. " మార్కెట్లో జాక్పాట్ ఎంత మాత్రం అనుమతించడం లేదు" అని కరాకండిగా స్పష్టం చేశారు. "వేలం పాటలు జరిగే సమయంలో నేనే దగ్గరుండి పర్యవేక్షిస్తాను. కొనుగోలదారుల ఆటల సాగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాను" అని శారదాదేవి స్పష్టం చేశారు.