అమరనాథరెడ్డికి.. మంత్రి పదవి దక్కంది అందుకేనా?!
రాజకీయాల్లో చిత్తూరు తీరే వేరు. అమరనాథరెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడానికి కారణం ఏమిటి? మరో పదవి ఆయనను ఊరిస్తోందా? చిరకాల రాజకీయ విరోధిపై సీఎం చంద్రబాబు ఔదార్యం ప్రదర్శించారా?
రాష్ట్ర మంత్రివర్గంలో బెర్త్ ఆశించి, భంగపడిన సీనియర్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. వారి అనుచరులు కూడా స్తబ్దతగా వ్యవహరిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో సీనియర్ ప్రజాప్రతినిధి, పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమరనాథరెడ్డికి రెండు అంశాల్లో ప్రతిబంధకం ఏర్పడిందనే విషయం పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.
కుప్పంపై ఫోకస్ పెట్టి, టీడీపీ శ్రేణులను ఆటాడుకున్న వైఎస్ఆర్ సీపీలో నంబర్- 2గా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఉదాసీనంగా ఉన్నారా? అనేది కూడా చర్చకు వచ్చింది. వారిద్దరికీ వర్సిటీ విద్యాభ్యాసం నుంచి వైరుద్ధ్యం ఉంది. అసలు చిత్తూరు జిల్లాలో ఏ తరహా రాజకీయం సాగుతోందనే విషయం ఆసక్తికరంగా మారింది.
పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమరనాథరెడ్డి తండ్రి చాటుకాకుండా, ఆయన నుంచే రాజకీయ ఓనమాలు దిద్దుకున్నారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలతో రాజకీయ జీవితాన్ని మలుచుకున్నారు. ఎమ్మెల్యే అమర్ తండ్రి నూతనకాల్వ రామకృష్ణారెడ్డి పుంగనూరు ఎమ్మెల్యే, చిత్తూరు ఎంపీగా విజయం సాధించారు. రాజకీయాల్లో పదవీ విరమణ కూడా ఉండాలంటూ, ఆయన 2004లో ఆయన స్వచ్ఛందంగా జిల్లాలో తప్పుకున్న మొదటి వ్యక్తి కూడా.
పార్టీలో నిర్ణయాలు సవ్యంగా లేకుంటే, టీడీపీ చీఫ్,సీఎం ఎన్. చంద్రబాబును చిత్తూరు జిల్లాలో సూటిగా ప్రశ్నించడంలో మాజీ ఎంపీ ఎన్. రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, ఎమ్మెల్యే ఎన్. అమరనాథరెడ్డి ఏమాత్రం సంకోచించరు. అందుకే, వారిద్దరంటే సీఎం చంద్రబాబుకు గౌరవం, అభిమానం ఎక్కువ అనేది పార్టీ వర్గాల్లో వినిపించే మాట.
చిత్తూరు ఎంపీగా పోటీ చేయాలనే పార్టీ నిర్ణయంతో రామకృష్ణారెడ్డి 1996లో పుంగనూరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానానికి జరిగిన ఉపఎన్నిక ద్వారా అమరనాథరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో అరంగేట్రం చేసి, 39,786 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందిన ఆయన ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం కాంగ్రెస్ ప్రభజనం ఉన్నప్పటికీ 2004 ఎన్నికల్లో మాజీ ఐపీఎస్ అధికారి ఆర్. రెడ్డెప్పరెడ్డిపై 62,318 భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా ఆయన పార్టీ శ్రేణులను నడిపించడంలో రాజీపడలేదు. అయితే...
నువ్వక్కడ.. నేనిక్కడ..
రాజకీయాల్లో శత్రుత్వం ఉండకూడని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి వ్యవహారం సాగేదని చిత్తూరు జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ ఉండేది. పెద్దపంజాణి మండలానికి చెందిన అమరనాథరెడ్డి కుంటుబం పుంగనూరులో రాజకీయాలు నెరిపేవారు. టీ.సదుం మండలానికి చెందిన చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీలేరులో రాజకీయాలు సాగించే వారు. రాజకీయంగా వారిద్దరి మధ్య పరస్పర సహకారం ఉండేదని రాజకీయవర్గాల్లో చర్చ ఉంది. పుంగనూరులో పెద్దిరెడ్డి తన మద్దతుదారుల ద్వారా అమరనాథరెడ్డికి సహకారం అందించే వారని చెబుతారు.
పునర్విభజన అనంతరం
2009 లో నియోజకవర్గాల పునర్విభజనతో వారిద్దరి స్థానాలు మారిపోయాయి. పెద్దపంజాణి మండలం పలమనేరులోకి, టీ. సదుం మండలం పుంగనూరులోకి మార్చడంతో ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి తమ సొంత మండలాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల పోటీ చేస్తున్నారు. ఆ కోవలో అమరనాథరెడ్డి 2009లో పలమనేరు నుంచి విజయం సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం 2012లో ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ నుంచి విజయం సాధించినా, 2016లో ఆ పార్టీకి రాజీనామా చేసి, అధికారంలోని టీడీపీలో చేరడంతో పాటు మంత్రి పదవి చేపట్టారు. అయినా, వారి మధ్య సఖ్యత ఉండేదని పార్టీ వర్గాల్లో వినిపించేది.
వీడని బంధం...
టీడీపీలో మంత్రి అయిన తరువాత కూడా అమరనాథరెడ్డి పుంగనూరు తరహాలోనే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మైత్రి నిలకడగానే ఉండేదనే మాటలు తెరపైకి వచ్చాయి. కాంట్రాక్టులు, బిల్లుల మంజూరులో తనవంతు స్నేహహస్తం అందించినట్లు భావిస్తున్నారు. అన్ని ప్రాంతాలు, నేతల వ్యవహార సరళి క్షుణ్ణంగా తెలిసిన టీడీపీ చీఫ్, సీఎం ఎన్. చంద్రబాబు కూడా దీనిని గ్రహించినా, గుంభనంగా వ్యవహరించారనేది పార్టీ వర్గాల సమాచారం.
ఐదేళ్లలో...
2019లో ఓటమి చెందిన అమరనాథరెడ్డి నియోజకవర్గంలో క్యాడర్ పటిష్టం చేసుకునేందుకు సమయం కేటాయించారు. రాష్ర్టంలో టీడీపీ క్యాడర్ లో చాలా మందిపై కేసులు నమోదయ్యాయి. ఆ స్థాయిలో పలమనేరులో లేకున్నా, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర, కుప్పంలో టీడీపీ అధినేత ఎన్. చంద్రబాబు పర్యటనకు పోలీసులు ప్రతిబంధకాలు సృస్టించినప్పడు మాత్రం ఎదుర్కోవడంలో అమరనాథరెడ్డి ఎక్కడా రాజీ పడకపోవడం గమనార్హం. అధికారంలో ఉన్నా, లేకున్నా ఇతర పార్టీల నేతలతో సత్సంబంధాలు కొనసాగించే ఆయన టీడీపీ పటిష్టతలో రాజీపడలేదనే విషయం సుస్పష్టం.
లోకేష్ అంతమాట అన్నారా?
స్కిల్ డెవలప్ మెంట్లో అక్రమాలు జరిగాయంటూ కర్నూలు జిల్లా నంద్యాలలో ఎన్. చంద్రబాబును అరెస్ట్ చేసి, రాజమండ్రి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. దీంతో పార్టీ వ్యవహారాలు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అక్కడి నుంచే సాగించారు. ఆ సమయంలో పరామర్శకు చిత్తూరు జిల్లా నుంచి ఎన్. అమరనాథరెడ్డితో పాటు పాటు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన వారితో పాటు నేతలు కూడా వెళ్లారు. "జిల్లాలో పార్టీని నాశనం చేశారు" అని నారా లోకేష్ వ్యాఖ్యానించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ మాట ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు? అనే విషయం లో చాలా మంది భుజాలు తడుముకున్నట్లు తెలసింది. ఈ పరిస్థితుల్లో..
మంత్రి పదవి దక్కక..
2024 ఎన్నికల్లో విజయం సాధించిన సీనియర్ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి మంత్రి పదవి ఆశించి, భంగపడ్డారు. దీనికి ప్రధానంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డితో నెరిపిన స్నేహం ఒకటి, సొంత తమ్ముడు పార్టీ మారడం కూడా మరో కారణంగా చెబుతున్నారు.
"2019 వరకు మాజీ మంత్రితో సఖ్యత ఉన్నది వాస్తవమే. ఆ తరువాత సత్సంబంధాలు లేవు" అనేది పలమనేరులో వినిపించే మాటలు.
"ఆ ఆరోపణలే వాస్తవం అయితే అమరనాథరెడ్డి ఎందుకు ఓడిపోతారు? తాజా ఎన్నికల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి విధేయుడితోనే మళ్లీ హోరాహోరీ పోరాటం జరిగింది"? అనే లాజిక్కు కూడా గుర్తు చేస్తున్నారు.
ప్రభుత్వం ఏర్పాటైన రోజుల వ్యవధిలోనే.. సీఎం ఎన్. చంద్రబాబునాయుడు స్పందించారు.
"జిల్లాలో నేను ఉన్నాను కదా. మీకేం కావాలో నేను చూసుకుంటా" అనే మాటలు సీనియర్ ఎమ్మల్యే అమరనాథరెడ్డిని ఊరడించలేకపోయాయని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
ఇందులో ఇంకోమాట ఏమిటంటే.. అమరనాథరెడ్డికి పదవి ఇస్తే, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఫీల్ అవుతారని.. ఆయన అన్న బీజేపీ నేత, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా "ఏందబ్బా ఇది" అంటే ఏమి చెప్పుకోవాలనే మొహమాటానికి వెళ్లారని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే అమరనాథరెడ్డికి మళ్లీ మంత్రి యోగం దక్కలేదని భావిస్తున్నారు.
2024 ఎన్నికల పోలింగ్ సమీపించిన వేళ స్వయాన తమ్మడు శ్రీనాథరెడ్డి, ఆయన సతీమణి అనీషారెడ్డి వైఎస్ఆర్ సీపీలో చేరడం కూడా ఎమ్మెల్యే అమరనాథరెడ్డికి ప్రతిబంధకం అయినట్లు చెబుతున్నారు. అనీషారెడ్డి 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి, 63,876 ఓట్లు సాధించి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి చేతిలో ఓటమి చెందారు.
అయితే.. ఇదేంది...
ఎన్నికల వేళ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ చీఫ్ ఎన్. చంద్రబాబు నాయుడు తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలోకి రాగానే భరతం పడతా అని హెచ్చరించారు. "కీలకమైన గనులు, అటవీశాఖలు ఒకే వ్యక్తికి ఇవ్వడం తప్పిదం" అని సోమవారం శ్వేతపత్రం విడుదల సందర్భంలో సీఎం చంద్రబాబు ఆక్షేపణ వ్యక్తం చేశారు. "తిరుపతి, చిత్తూరు, రాయచోటి ప్రాంతాల్లో గనుల దోపిడీ, అటవీ సంపద కొల్లగొట్టారు" అంటూ వివరాలు వెల్లడించిన సీఎం చంద్రబాబు ఏమి ఆదేశాలు జారీ చేశారు? చర్యలకు ఎక్కడా సిఫారసు చేసిన దాఖలాలు లేవనే చర్చకు ఆస్కారం కల్పించింది.
ఈ పరిస్థితుల్లో ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డికి క్యాబినెట్ ర్యాంక్ పదవి దక్కుతుందని ఆశిస్తున్నారు. పదవి ఇవ్వడం ద్వారా ఆయనపై ఉన్న అపోహలను తొలగిస్తారో? మళ్లీ జూనియర్లకు పదవులు ఇచ్చి, సీనియర్లను పార్టీ పటిష్టతకు వాడుకుంటారా? అనేది త్వరలో తేలనుందని భావిస్తున్నారు.
Next Story