తిరుపతి: దళిత విద్యార్థిపై దాడి వెనుక కథేమిటి?
x
దాడికి గురైన విద్యార్థి జేమ్స్

తిరుపతి: దళిత విద్యార్థిపై దాడి వెనుక కథేమిటి?

తనను చిత్రహింసలకు గురి చేశారు. నిందితులను పోలీసులు తప్పించారని దళిత విద్యార్థి జేమ్స్ ఆరోపిస్తున్నాడు. జగన్ స్పందనతో ఈ కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది?


తిరుపతికి సమీపంలోని శ్రీవిద్యానికేతన్ ఇంజినీరింగ్ కాలేజీలో దళిత విద్యార్థి అనపల్లి జేమ్స్ పై హత్యాయత్నం ఘటన రాజకీయంగా కలకలం రేపింది.

"రౌడీషీటర్లు తనను రెండు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశారు. ఫిర్యాదు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నిందితులను ఎఫ్ఐఆర్ లో చేర్చడంలో కూడా పోలీసులు పక్షపాతంతో వ్యవహరించారు" అనేది బాధితుడు జేమ్స్ ఆరోపణ. దీనిపై మాజీ సీఎం వైఎస్. జగన్ స్పందించిన నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది.
"బాధిత విద్యార్థి జేమ్స్ పై దాడి జరిగింది వాస్తవమే. ఆయనకు తగిలిన దెబ్బలే ఆ సంగతి చెబుతున్నాయి" అని తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ చెప్పారు. ఈ సంఘటనలో ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. బాధితుడు జేమ్స్ పై చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం కేసు కూడా ఉందని వెల్లడించారు.
విషయంలోకి వస్తే..
నెల్లూరు జిల్లా కడవలూరు మండలం రెడ్డిపాలెం దళితవాడుకు చెందిన అనపల్లి జేమ్స్ శ్రీవిద్యానికేతన్ ఇంజినీరింగ్ కాలేజీలో బీ.టెక్ నాల్గవ సంవత్సరం చదువుతున్నాడు. ఆయన అత్తకొడుకు శ్యామ్యూల్ కరకంబాడి సమీపంలోని మరో ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ విద్యార్థి. తనను సూపర్ సీనియర్ యశ్వంత్ నాయుడు కులం పేరుతో దూషించాడు. యశ్వంత్ తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేయించాడు. గదిలో రెండు రోజులు బంధించి, రౌడీషీటర్లతో కలిసి చిత్రహింసలకు గురి చేశాడని జేమ్స్ ఆరోపించడమే కాదు. తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. ఈ నెల 16వ తేదీ కేసు కూడా నమోదు చేసినట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు.
బాధిత దళిత విద్యార్థి జేమ్స్ కథనం ఇదీ..
నేను మూడు రోజులుగా మా మేనత్త కొడుకు శ్యామ్యూల్ స్నేహితుడు రామ్మోహన్ తో పాటు కరకంబాడి సమీపంలోని పెయింగ్ గెస్ట్ హాస్టల్ ఉంటున్నట్లు జేమ్స్ తెలిపారు. అదే సమయంలో పాత గొడవలను దృష్టిలో ఉంచుకుని, ఆ నెల 15వ తేదీ రాత్రి ఒంటి గంటకు శ్రీవిద్యానికేతన్ కాలేజీలో తనకు సూపర్ సీనియర్ అయిన యశ్వంత్ నాయుడు, స్నేహితుడు కిరణ్, ఇంకొందరితో వచ్చారని చెప్పారు. నాతో పాటు నా స్నేహితుడు సాయిరెడ్డిని బలవంతంగా బైక్ లో ఎక్కించుకుని తిరుచానూరుకు సమీపంలోని మామిడికాయల మండీ వద్ద ఉన్న ఓ హోటల్ గదికి తీసుకుపోయారు. అప్పటికే అక్కడ ఉన్న లలిత్, సాయిగౌడ్, జగ్గ, వంశీ తోపాటు ఇంకొందరు తనను బంధించి, చితకబాదారాని బాధితుడు జేమ్స్ ఆరోపించాడు. రాత్రంతా కొడుతూనే ఉన్నారని, మధ్యలో వారిని ఏమార్చిన నా స్నేహితుడు సాయిరెడ్డి తప్పించున్నట్లు జేమ్స్ వివరించాడు. తనను కూడా బైక్ లో తిరుపతి లో తిప్పతూ కొడుతుంటే, తప్పించుకున్నట్లు జేమ్స్ తిరుచానూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించాడు.
గొడవకు కారణం ఏమిటి?
విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ సాగినట్లు పోలీసులు చెబుతున్నారు. విద్యానికేతన్ లో విద్యార్థిగా బీ.టెక్ నాల్గవ సంవత్సరం చదువుతున్న తనను సీనియర్ విద్యార్థి యశ్వంత నాయుడు కులం పేరుతో అవమానించినట్లు జేమ్స్ ఆరోపిస్తున్నాడు. కాలేజీలో కూడా దారుణంగా అవమానించాడని జేమ్స్ చెబుతున్నాడు. తనను బలవంతంగా తీసుకుని వెళ్లి, రెండు రోజుల పాటు గదిలో బంధించి, ఇనుపరాడ్లు, హాకీ స్టిక్ లతో చావబాదడంతో కన్ను కూడా దెబ్బతిన్నదని జేమ్స్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తానికి విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ, గ్యాంగ్ వార్ కు దారితీసినట్లు పోలీసులు సందేహిస్తున్నారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఘాటుగా స్పందించారు.
"దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఓ ఉదాహరణ. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయి." అని మాజీ సీఎం వైఎస్. జగన్ నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకుల డైరెక్షన్లో కక్ష సాధింపు చర్యలో మునిగి తీరుతున్న పోలీసు యంత్రాంగం బాధ్యతలను విస్మరించింది అని కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
కేసు నమోదు చేశాం..

"దాడికి గురైన ఏ. జేమ్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం" అని తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ చెప్పారు.
"బాధితుడు జేమ్స్ స్టేషన్ కు రాలేదు. అతనితో పాటు ఉన్న స్నేహితుడు సాయిరెడ్డి మొదట మా స్టేషన్కు వచ్చాడు. మా మహిళా ఎస్ఐ ఫిర్యాదు తీసుకున్నారు. ఆ సమయంలో నేను బయట ఉన్నాను. బాధితుడిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అని సీఐ సునీల్ కుమార్ చెప్పారు. తాను స్టేషన్కు రాగానే జేమ్స్ తన ఏడుగురిని నిందితులుగా ఫిర్యాదులో రాశారు. వారందరిపై 137 (2), 118 (1), 115 (2 రెడ్ విత్ 3 (5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సీఐ వివరించారు. ఇందులో నిందితులను తప్పించలేదని ఆయన తెలిపారు.
అది అబద్దం
సూపర్ సీనియర్ అయిన యశ్వంత్ వల్ల అవమానం జరిగింది. అతనే తన స్నేహితులతో కలిసి, నన్ను బలవంతంగా బైక్ లో తీసుకుని వెళ్లి గదిలో బంధించి చిత్రహింసలకు దాడి చేయించాడు. ఆ సమయంలో కొందరు రౌడీషీటర్లు కూడా ఉన్నారు. వారందరి పేర్లు ఫిర్యాదులో రాశానని బాధిత దళిత విద్యార్థి ఏ. జేమ్స్ ఓ వీడియో కూడా విడుదల చేశాడు. అధికార పార్టీ ఒత్తిళ్లతోనే కొందరి పేర్లు ఎఫ్ఐఆర్ లో రాయలేదనేది జేమ్స్ ఆరోపిస్తున్నాడు.
చంద్రగరిలో కేసు..
దాడికి గురైన ఏ. జేమ్స్ పై చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం కేసు కూడా ఉందని తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ చెప్పారు. దీనిపై చంద్రగిరి సీఐ సుబ్బరామిరెడ్డి ధృవీకరించారు.
"ఎన్నికల సమయంలో మిత్రులతో కలిసి జేమ్స్ చంద్రగిరికి సమీపంలోని ఓ హోటల్కు వెళ్లాడు. అక్కడ పనిచేస్తున్న ఓ వ్యక్తిపై దాడి చేసి, తలపగులగొట్టాడు. దీంతో జేమ్స్ పై కేసు నమోదు చేశాం" అని చంద్రగిరి సీఐ సుబ్బరామిరెడ్డి స్పష్టం చేశారు.
దాడి, చిత్రహింసలకు గురైన దళిత విద్యార్థి జేమ్స్ ను మెరుగైన చికిత్స కోసం అతని తల్లిదండ్రులు నెల్లూరుకు తీసుకుని వెళ్లినట్లు తెలిసింది. ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ స్పందించడం రాజకీయంగా మలుపు తిరిగే పరిస్థితి ఏర్పడింది. అందుకు ప్రధానంగా నిందితులుగా ఉన్న వారికి టీడీపీ నేతలు అండ ఉందనే నేపథ్యంలో ఈ కేసు, ఘటన ఎలాంటి మలుపు తిరుగుతుందనేది వేచి చూడాలి.
Read More
Next Story