
TTD | తిరుపతిలో 30న ఉగాది పంచాగ శ్రవణం
శ్రీవారి ఆలయాన్ని పుష్ఫశోబితం చేశారు తిరుపతిలో కూడా ఈసారి పంచాగ శ్రవణం జరుగుతుంది. టీటీడీ ఆ మేరకు ఏర్పాట్లు చేసింది.
తెలుగువారి పండుగల్లో అత్యంత ప్రధానమైనది ఉగాది. తెలుగువారికి ఇది మొదటి పండుగ. ఉగాది నుంచి తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ నెల 30వ తేదీ ఉగాదిని పురస్కరించుకుని పంచాంగ శ్రవణం చేయడం ఆనవాయితీ, సంప్రదాయంగా భావిస్తారు. శ్రీవిశ్వవసు నామ పంచాంగాన్ని తిరుమలలో ఆవిష్కరించారు. ఉదయం 10 గంటలకు పంచాగ శ్రవణానికి ముహూర్తంగా నిర్ణయించారు.
ఈ ఏడాది తెలుగు సంవత్సరం ప్రారంభం ఉగాదిని టీటీడీ ఘనంగా నిర్వహిస్తుంది. ఈ నెల 30వ తేదీ తిరుమల శ్రీవారి ఆలయం తోపాటు తిరుపతి మహితి ఆడిటోరియంలో కూడా పంచాగ శ్రవణం నిర్వహించడానికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయాన్ని పుష్పశోభితం చేశారు దేశ, విదేశాల నుంచి తెప్పించిన పూలతో ప్రత్యేకంగా అలంకరించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
మహితి ఆడిటోరియంలో
టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, సంక్షేమ విభాగం సంయుక్తంగా శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు మార్చి 30వ తేదీ తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా జరుగనున్నాయి. ఉదయం 9.30 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ విద్యార్థులు వేదపారాయణం నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు ప్రముఖ పండితులు పంచాంగ శ్రవణం చేస్తారు. అనంతరం అష్టావధానం, టీటీడీ ఉద్యోగుల పిల్లలతో ”తెలుగు వైతాళికులు” వేషధారణ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేస్తారు. అనంతరం ఉగాది పచ్చడి ప్రసాద వితరణ ఉంటుంది.
పంచాంగం ఆవిష్కరణ
తిరుమల పెద్దజీయర్ మఠంలో హిందూ ధర్మం ఛానల్ రూపొందించిన శ్రీవిశ్వవసు నామ సంవత్సర పంచాంగాన్ని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు శుక్రవారం ఆవిష్కరించారు. తిరుమలలోని పెద్ద జీయర్ మఠంలో పెద్ద జీయర్ స్వామితో కలిసి బీఆర్. నాయుడు పంచాంగాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు మఠంలోని మందిరంలో పంచాంగాలకు పూజలు నిర్వహించారు. చైర్మన్ బీఆర్. నాయుడును పెద్దజీయర్ స్వామి పట్టువస్త్రంతో సత్కరించి, ఆశీర్వాదం అందజేశారు. పంచాంగంలోని విశేషాలను జీయర్ స్వామి వివరించారు.
30న పంచాగ శ్రవణం
తెలుగువారి మొదటి పండుగ ఉగాదిని ఘనంగా నిర్వహించడానికి టీటీడీ (TTD) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ పర్వదినానికి ముందు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించిన విషయం తెలిసిందే. ఉగాది రోజు తిరుమలలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో బంగారు వాకిలి వద్ద ఆదివారం ఉగాది ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం పంచాగ శ్రవణం జరుగుతుంది. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తెలుగు సంవత్సరంలో ఎలాంటి మార్పులు, పరిస్థితులు ఉంటాయనే విషయాలను వివరించనున్నారు.
టిటిడి ఆలయాల్లో ఉగాది వేడుకలు
టిటిడి స్థానిక ఆలయాల్లో ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. దీనికోసం ఆగమశాస్త్రం ప్రకారం నిర్ణయాలు అమలు చేయడం ఆనవాయితీ. అదేవిధంగాపంచాంగ శ్రవణం సమయాన్ని కూడా టీటీడీ వెల్లడించింది. స్థానిక ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీకోదండరామాలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి.
తిరుచానూరు : శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు స్నపనతిరుమంజనం వైభవంగా జరుగనుంది. సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు పుష్పపల్లకీలో అమ్మవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు.
శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు ఉగాది ఆస్థానం నిర్వహిస్తారు.
తిరుపతి: శ్రీకోదండరామాలయంలో మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జీయర్ స్వామివారు మూలవర్లకు, ఉత్సవర్లకు వస్త్రసమర్పణ చేయనున్నారు.
కార్వేటినగరం : శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయంలో ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు ఆలయంలో ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం ర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు.
అప్పలాయగుంట : శ్రీప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉదయం 9 నుంచి 10 గంటల వరకు పంచాంగ శ్రవణం ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు.
Next Story