
తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ మౌర్యకు టికెట్ ఇస్తున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
తిరుపతి:సాయంత్రం ఐదు ఉచిత బస్సును కదిలించిన మంత్రి ఆనం
త్వరలో ఆర్టినరీ ఏసీ బస్సులు రవాణా శాఖ మంత్రి మండిపల్లి.
తిరుపతి శ్రీహరి ఆర్టీసీ సెంట్రల్ బస్టేషన్ గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రయాణికులతో రద్దీగా ఉంది. అనేక ప్రాంతాల నుంచి బస్సులు వస్తున్నాయి. వెళుతున్నాయి. ఆర్టీనరీ బస్సుల్లో కూడా మహిళా ప్రయాణికులు టికెట్ కొనుక్కుని ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ సిబ్బంది దీనిపై మాట్లాడడం లేదు. మహిళలు కూడా నిలదీసిన సందర్భం కనిపించలేదు.
టీడీపీ కూటమి 2024 ఎన్నికల్లో ప్రకటించిన సూపర్-6 పథకాల హామీల్లోని స్త్రీశక్తి పథకం కింద బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని సాయంత్రం ఐదు గంటలకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభించారు. మొదటి టికెట్ తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎస్. మౌర్యాకు మంత్రి నారాయణరెడ్డి అందించారు.
అంతకుముందు
సాయంత్రం నాలుగు గంటలకు ఆర్టీసీ బస్టాండు ఆవరణలోనే రిజనల్ మేనేజర్ కార్యాలయానికి సమీపంలో షామియానా వేశారు. స్త్రీశక్తి మహిళల ఉచిత ప్రయాణ సదుపాయాన్ని లాంఛనంగా ప్రారంభించడానికి తిరుపతి ఆర్టీసీ ఆర్ఎం జగదీష్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.
రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ చేరుకున్నారు.
టీడీపీ కూటమి సారధి, సీఎం ఎన్ .చంద్రబాబు సూపర్-6 పథకాల్లో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించడానికి దారి తీసిన పరిస్థితిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరించారు.
సాయంత్రం ఐదు గంటలకు వేదిక వద్ద సిద్ధంగా ఉంచిన బస్సులను మంత్రి రామనారాయణరెడ్డి ప్రారంభించారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్నిఅందుబాటులోకి తీసుకుని వస్తూ, జీరో ఫేర్ టికెట్ జారీ చేశారు.
టిమ్స్ యాక్టివేట్
ఆర్టీసీ బస్సుల్లో బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే పథకాన్ని సీఎం ఎన్. చంద్రబాబు తాడేపల్లి వద్ద డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ తో కలిసి ప్రారంభించారు. జిల్లాల్లో మంత్రులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో ప్రధానంగా తిరుపతిలో సాయంత్రం ఐదు గంటల వరకు టిమ్ (Ticket Issuing Mission TIM) లో జీరో ఫేర్ టికెట్ యాక్టివేట్ చేయలేదు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి లాంఛనంగా ప్రారంభించిన తరువాత టిమ్ లో ఆ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
త్వరలో ఏసీ పల్లె వెలుగు బస్సులు
రాయచోటిలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి
ప్రస్తుతం అందుబాటులో ఉన్న బస్సులతో మొదలు పెట్టి, అవసరం మేరకు భవిష్యత్తులో పల్లె వెలుగు కొత్త ఏసీ బస్సుల్లో కూడా ప్రయాణించేందుకు వీలుగా సీఎం ఎన్. చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లె రాంప్రసాదరెడ్డి తెలిపారు.
ఎన్నికల హామీగా టీడీపీ కూటమి ఇచ్చిన "సూపర్ సిక్స్" లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (స్త్రీ శక్తి) హామీ అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ చెప్పారు. రాయచోటి బస్టాండ్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ తో కలిసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ,
"పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీలో ఏదో ఒకటి చూపించి జీరో ఫేర్ టికెట్‌తో ఉచితంగా ప్రయాణించవచ్చు" అని మంత్రి రాంప్రసాదరెడ్డి సూచించారు. దానికోసం ఆర్టీసీలోని 8,458 బస్సుల్లో మహిళలు, యువతులు ప్రయాణం చేయవచ్చని ఆయన తెలిపారు. పథక అమలు కోసం ఏడాదికి రూ.1,942 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరించనుందన్నారు. ప్రయాణికులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను సూచించారు. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్, డిపో మేనేజర్ రాము పాల్గొన్నారు.
Next Story