పర్యాటకానికి యాంకర్ హబ్ గా తిరుపతి
x
రాయలసీమలోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలను వివరిస్తున్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

పర్యాటకానికి యాంకర్ హబ్ గా తిరుపతి

టీటీడీతో కలిసి అభివృద్ధి చేయాలనే అలోచన ఉందంటున్న మంత్రి దుర్గేష్.


తిరుపతిని యాంకర్ హబ్ గా చేసి జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల గమ్యస్థానంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ధి చేసే దిశగా కూడా అడుగులు వేస్తోంది. పర్యాటక అభివృద్ధి కోసం అటవీ, దేవాదాయ, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయానికి సీఎం నారా చంద్రబాబు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

టూరిజం ఇన్వెస్టర్ల సదస్సును ప్రారంభిస్తున్న రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్, చిత్రంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్

టూరిజం ఇన్వెస్టర్ల సదస్సును ప్రారంభిస్తున్న రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్, చిత్రంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం, పెట్టుబడులు ఆకర్షించేందుకు శుక్రవారం తిరుపతిలోని తాజ్ హోటల్ లో రీజనల్ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, 2024-29 పర్యాటక విధానాన్ని వివరించారు.

రాష్ట్రంలో కారవాన్ టూరిజంతో పాటు హోంస్టే ఏర్పాటుపై రానున్న క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. తిరుపతి, సమీప ప్రాంతాలను అనుసంధానం చేయడం ద్వారా పర్యాటక రంగ అభివృద్ధితో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, స్టార్ హెటళ్ల ఏర్పాటుకు సింగిల్ విండో పద్ధతిలో ఇచ్చే అనుమతుల వివరాలను వెల్లడించారు.
"రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి, పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడానికి చర్యలు తీసుకుంటున్న విధాన నిర్ణయాలు" మత్రి దుర్గేష్ వివరించారు. నూతన పర్యాటక పాలసీలో పర్యాటకరంగంలో పెట్టుబడులు పెట్టే వారికి భూ కేటాయింపుల కోసం తిరుపతిలో ఉన్న అవకాశాలను వివరించారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టే వారితో పాటు హోం స్టే ఆపరేటర్స్ తో ఆయన చర్చలు జరిపారు. ఏడాదిలోనే దాదాపు రూ.12,000 కోట్లు పర్యాటక పెట్టుబడులు సాధించామంటే ఇన్వెస్టర్లలో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసం స్పష్టమవుతోందని మంత్రి దుర్గేష్ అన్నారు.
టెంపుల్ టూరిజం
రాయలసీమలో ప్రత్యేకించి తిరుపతిలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. ఆయన ఏమన్నారంటే..
మాట్లాడుతున్న రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్

మాట్లాడుతున్న రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్

" తిరుపతిలో తోపాటు స్థానికంగా ఉన్న ప్రకృతి సౌందర్య ప్రాంతాలు, వాటర్ ఫాల్స్, టైగర్ రిజర్వ్, పర్యాటకులను ఆకర్షించే పర్యాటక ప్రదేశాలు, పురాతన కట్టడాలు, చారిత్రాత్మక కోటలకు విస్తృత ప్రచారం కల్పించాలి. వాటిని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది" అని మంత్రి దుర్గేష్ అన్నారు. వీటన్నింటిని కలిపి టూరిజం సర్క్యూట్ గా చేయాలన్నదే తమ ఉద్దేశమన్నారు. దీనికోసం కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఇప్పటికే విశాఖపట్టణం, అరకువ్యాలీ, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతిలో యాంకర్ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. పీపీపీ విధానంలో పర్యాటక అభివృద్ధి చేస్తామన్నారు.
టూరిజం సర్క్యూట్ ..
తిరుపతి దర్శనానికి వచ్చే వారు యాత్రికుడిగా మారి రెండు, మూడు రోజులు సమీపంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా ప్రణాళిక రూపొందించాం అని మంత్రి దుర్గేష్ చెప్పారు. చంద్రగిరి పోర్ట్, శ్రీ వెంకటేశ్వర జువాలాజికల్ పార్క్, తలకోన జలపాతం, సూళ్లూరుపేట నేలపట్టులో పక్షుల విహార కేంద్రాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెంచాలనేది తమ లక్ష్యమని ఆయన వివరించారు. పర్యాటకుల వసతికి అవసరమైన స్టార్ హోటళ్లు, రిసార్ట్ లు, కాటేజీల నిర్మాణం చేపడుతున్నామన్నారు.
క్యాబినెట్ లో ఆమోదం..
"తిరుపతిని వ్యూహాత్మక పర్యాటక ప్రదేశంగా ప్రభుత్వం భావిస్తుంది. తిరుపతి నుంచి సమీప ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు పర్యాటక పెట్టుబడిదారులను ఆహ్వానించాం" అని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. అందులో భాగంగా స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) ద్వారా రూ.3482 కోట్ల విలువైన హాస్పిటాలిటీ ప్రాజెక్టులకు కేబినెట్ లో ఆమోదం లభించిందన్నారు. హోటళ్లలో 2698 గదుల ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. అంతేగాక దాదాపు 11,645 మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఇప్పటికి రాష్ట్ర పర్యాటక రంగంలో రూ.10,280 కోట్ల పర్యాటక పెట్టుబడులు వచ్చాయన్నారు. తద్వారా 1,466 రూమ్ లు ఏర్పాటుకు గ్రౌండింగ్ చేస్తున్నామన్నారు.
తిరుపతిలో నక్షత్ర హోటళ్లు
తిరుపతి సమీపంలో అట్ మోస్పియర్, నోవాటెల్, మారియట్, ఒబెరాయ్, లెమన్ ట్రీ, మహేంద్ర తదితర సంస్థలు రిసార్ట్స్, హోటళ్లు నిర్మించేందుకు ఎంఓయూలు చేసుకున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. దుబాయ్ తరహాలో మీటింగ్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్ (మైస్) టూరిజంను అభివృద్ధి చేస్తున్నామన్నారు. తిరుపతిలో డెస్టినేషన్ వెడ్డింగ్ లు సైతం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. టీటీడీతో కలిసి పర్యాటకంగా కొన్ని కార్యక్రమాలు చేపడితే డెస్టినేషన్ వెడ్డింగ్ కు అవసరమైన కళ్యాణ మండపాలు, సదుపాయాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కారవాన్ టూరిజం..
తిరుపతిలోనే కాకుండా, రాష్ట్రంలో కారవాన్ టూరిజం ఏర్పాటు కావాలనే సీఎం ఎన్. చంద్రబాబు ఆకాంక్ష అని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాయలసీమలోని శేషాచలం అడవుల్లో అడ్వెంచర్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్, ట్రెక్కింగ్ తదితర ప్రక్రియను ప్రవేశపెట్టడానికి ఆలోచిస్తున్నామన్నారు. ఎర్రచందనం లభిస్తున్న ఈ ప్రాంతంలో ఎక్స్ పీరియన్స్ సెంటర్ ఏర్పాటుకు ప్రణాళిక చేస్తున్నామన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా తర్వాత అత్యధిక అడవులున్న ప్రాంతంగా పేరుగాంచిన తిరుపతి అటవీ ప్రాంతంలో ఎకో టూరిజం అభివృద్ధికి అటవీశాఖతో సమన్వయం చేసుకుంటామన్నారు. పర్యాటక అభివృద్ధికి పర్యాటక, అటవీ, దేవాదాయ, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయానికి సీఎం చంద్రబాబు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి దుర్గేష్ గుర్తుచేశారు.
చట్టబద్ధ హోంస్టేలు
రాష్ట్రంలో 10వేల హోమ్ స్టేలు తీసుకొచ్చేందుకు ఓ విధానంపూ రానున్న క్యాబినెట్ లో ఆమోదిస్తామన్నారు. పాలసీ మేరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కేబినెట్ లో ఆమోదం తరువాత పోర్టల్ ను రూపొందిస్తామన్నారు. కోనసీమలో మండువా లోగిళ్లలో ఉండేందుకు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. అదే తరహాలో తిరుపతిలో పాతకాలం నాటి ఇళ్లలో, పురాతన కట్టడాలలో హోమ్ స్టేలు ఏర్పాటు చేస్తామన్నారు.
స్పష్టమైన ప్రతిపాదన, ఆలోచనతో పర్యాటక అభివృద్ధికి ముందుకు వచ్చే ఇన్వెస్టర్లకు ప్రభుత్వం అవసరమైన భూమి, రాయితీలు,ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు త్వరితగతిన జారీ చేస్తామన్నారు. ఇన్వెస్టర్లపై భారం పడకుండా తక్కువ ఖర్చయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో హోమ్ స్టే,పర్యాటక పాలసీపై మార్గదర్శకాలను ఎండీ ఆమ్రపాలి కాట ఇన్వెస్టర్లకు వివరించారు. స్టాంప్ డ్యూటీ రీయింబర్స్ మెంట్, ల్యాండ్ కన్వర్షన్ చార్జీలు, క్వాలిటీ సర్టిఫికేషన్, పవర్ చార్జీలు, జీఎస్టీ తదితర అంశాలను వివరించారు. ఈ సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, టూరిజం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీటీడీసీ ఎండీ, ఏపీటీఏ సీఈవో ఆమ్రపాలి కాట,జిల్లా అధికార యంత్రాంగం, నరసింహ యాదవ్, సుగుణమ్మ,డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, టూర్ ఆపరేటర్స్ అసోయేషన్ అధ్యక్షులు విజయ్ మోహన్, సీఐఐ దామోదర నాయుడు, ఔత్సాహిక ఇన్వెస్టర్లు పాల్గొన్నారు.
Read More
Next Story