శ్రీనివాసా...సామాన్యులకు వైకుంఠ ద్వారంలో దర్శనం ఉంటుందా?
x

శ్రీనివాసా...సామాన్యులకు 'వైకుంఠ ద్వారం'లో దర్శనం ఉంటుందా?

రెండా.. పది రోజులా.? అంతర్మథనంలో టీటీడీ. 28వ తేదీ బోర్డు మీటింగ్.


తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ఎన్ని రోజులు ఉంటాయనేది శ్రీవారి యాత్రికుల మదిని తొలుస్తున్నాయి. గతంలో మాదిరి రెండు రోజులకు పరిమితం చేయాలా? పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచాలా? అనే విషయంలో టీటీడీ కూడా ఈ వ్యవహారంలో అంతర్మథనంలో పడింది. ఈ నెల 28వ తేదీ నిర్వహించే టీటీడీ పాలక మండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. రెండు రోజులకు కుదిస్తే టీడీపీ కూటమి ప్రభుత్వానికి అపకీర్తి ఆపాదించే అవకాశం కూడా లేకపోలేదు. విభిన్న వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకుని, పది రోజులు కొనసాగించేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.

ఈ ఏడాది డిసెంబర్ 30వ తేదీ ఏకాదశి 31న ద్వాదశి, జనవరి ఒకటో తేదీ నూతన సంవత్సరం ప్రారంభం కానుండడం వల్ల ఏర్పాట్లపై టీటీడీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పాలక మండలి ఏ నిర్ణయం తీసుకోవాలనే విషయంలో మీమాంస ఏర్పడింది. పాత పద్ధతిలో రెండు రోజులు మాత్రమే ద్వారాలు తెరవాలని నిర్ణయిస్తే దాదాపు నాలుగు లక్షల మందికి పైగానే యాత్రికులకు వేదన మిగులుతుంది అనడం సందేహం లేదు. ఆచార, వ్యవహారాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన శ్రీనివాస సరస్వతి అనే ఓ స్వామీజీ సూచించారు.
"వైకుంఠ ద్వార దర్శనాలు రెండు రోజులకు పరిమితం చేయండి" అని శ్రీనివాస స్వామి టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ కు వినతిపత్రం కూడా అందించారు.
ఏకాదశికి ప్రాధాన్యం..
హిందువులు ఏకాదశిని పవిత్రంగా భావిస్తారు. క్యాలెండర్ ప్రకారం సంవత్సరానికి 24 ఏకాదశి తిథులు వచ్చినా, వైకుంఠ ఏకాదశికి ప్రాధాన్యత ఉంటుంది. సూర్యుడు ఉత్తరాయణానికి మారే సమయంలో దానికి ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిగా పరిగణిస్తారు. దీనిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశిగా పిలుస్తుంటారు. ఆ రోజు శ్రీవైష్ణవ ఆలయాల్లో ఉత్తరద్వారం నుంచి వెళ్లడం ద్వారా శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే జన్మ ధన్యమైనట్టు యాత్రికులు భావిస్తారు.
అది వైకుంఠ ద్వారమే..
తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వారం లేదు. ఆ స్థానంలో వైకుంఠ ద్వారం ఏర్పాటు చేశారు. సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి రోజు వేకువ ధనుర్మాస కైంకర్యాలు పూర్తయ్యాక తెరిచే ద్వారాలు రెండో రోజు ద్వాదశి ముగిశాక తలుపులు మూసేసేవారు.
తిరుమల శ్రీవారి క్షేత్రం కలియుగ వైకుంఠంగా ఉంది. ఈ ఆలయం సన్నిధిలో ఏడాదికి ఒకసారి వైకుంఠ ఏకాదశి నాడు తెరిచే ద్వారంలో జీవితంలో ఒకసారైన వెళ్లాలని ప్రతి యాత్రికుడు భావిస్తాడు. దీనివల్ల తమ జన్మ ధన్యమైనట్టు మానసికంగా సంతృప్తి చెందుతారు. కొన్ని దశాబ్దాల పాటు సంవత్సరంలో రెండుసార్లు మాత్రమే ఈ ద్వారాలు తెరుచుకునేవి. దీనివల్ల వీవీఐపీలు, వీఐపీల తాకిడి ఎక్కువ ఉంటుంది. సామాన్య యాత్రికుల సంఖ్య వేలల్లోనే ఉండేంది.
సామాన్య యాత్రికుల కోసం..
శ్రీవైష్ణవ ఆలయాలకు కేంద్రంగా ఉన్న శ్రీరంగం రంగనాథస్వామి ఆలయాన్ని టీటీడీ ఆదర్శంగా తీసుకుంది. 2020 నుంచి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎక్కువ మంది సామాన్య యాత్రికులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని పది రోజుల పాటు తెరిచి ఉంచే పద్ధతిని వైసీపీ ప్రభుత్వంలో అమలు చేశారు. 32 మంది ఆగమశాస్త్ర పండితులు, మఠాధిపతుల సూచన మేరకు నిర్ణయం తీసుకున్నారు. దానికి ముందు కూడా టీటీడీ అధికారులు తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో పరిశీలించాక ఈ విధానం అమలు చేశారు. తిరుమలతో పాటు తిరుపతిలో కూడా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా టోకెన్లు జారీ చేశారు.
టీటీడీలో అంతర్మథనం..
2024లో ఏర్పడిన కూటమి ప్రభుత్వం గత ఏదాడి దీనిని చక్కగా అమలు చేసింది. ఈ ఏడాది జనవరి తొమ్మిదో తేదీ నుంచి పది రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన విధానమే కొనసాగించింది.
2025 జనవరి తొమ్మిదో తేదీ తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏర్పాటు కౌంటర్లలో బైరాగిపట్డెడ, శ్రీవానివాసం యాత్రికుల సముదాయం వద్ద కేంద్రాల్లో తొక్కిసలాట కారణంగా ఆరుగురు మరణించడం, 40 మందికి పైగా గాయపడిన సంఘటన టీటీడీ చరిత్రలో మరకగా మారింది. అయినా 6.75 లక్షల మందికి వైకుంఠ ద్వారా దర్శనం కల్పించడంలో బీఆర్. నాయుడు సారధ్యంలోని పాలక మండలి ఏర్పాట్లు చేసింది.
సీఎం ఆగ్రహంతో..
తొక్కిలసలాట మరణాల నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు తోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా తిరుపతికి చేరుకున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత, వ్యవసాయ శాఖ మంత్రి కే. అచ్చన్నాయుడు, దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తోపాటు పెద్ద సంఖ్యలో మంత్రులు కూడా వచ్చారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలో మాజీ ఈఓ జే. శ్యామలరావు, టీటీడీ చైర్మన్ బిఆర్. నాయుడు తోపాటు, మంత్రులు, టీటీడీ అధికారులతో సీఎం నారా చంద్రబాబు సమీక్షించారు.
"గత ప్రభుత్వం అమలు చేసిన విధానం కొనసాగించాలని ఏముంది? ఇంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తారా" అని సీఎం చంద్రబాబు అధికారులకు అక్షింతలు వేసిన విషయం తెలిసిందే.
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగిసిన తరువాత టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు సారధ్యంలోని పాలక మండలి అత్యవసరంగా సమావేశమై, తొక్కిసలాట మృతులు, గాయపడిన వారికి పరిహారం చెల్లించేందుకు తీర్మానించింది.
2025 డిసెంబర్ 31వ తేదీన వైకుంఠ ఏకాదశిని రెండు రోజులు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. గత ఏడాది వార్షిక ఉత్సవాల క్యాలెండర్ ప్రకటించిన టీటీడీ పది రోజులపాటు ద్వారాలు తెరిచి ఉంచే విధంగా కార్యక్రమం నిర్ణయించారు.
యాత్రికుల రద్దీ నియంత్రణకు టీటీడీలో ప్రత్యేక వ్యవస్థ ఉందనే విషయం తెలిసిందే. వైకుంఠ ద్వార దర్శనాలు పది రోజులు కొనసాగించడమే మంచిదని టీటీడీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నేత వెంకటేశం అభిప్రాయపడ్డారు. యాత్రికులకు ఈ పద్ధతి అలవాటు చేశారు. మరింత కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
వీడని సందిగ్థత
తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనాలు రెండు, రోజులా? పది రోజులా? అనే విషయంలో టీటీడీ అధికారులు నోరు మెదపడం లేదు. దీంతో ఈ వ్యవహారంపై సందిగ్ధత ఏర్పడింది. రెండు రోజులకు కుదిస్తే మాత్రం కనీసంగా నాలుగు లక్షల మంది యాత్రికులు వైకుంఠ ద్వార దర్శనానికి దూరం అవతారంలో సందేహం లేదు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సూచనల మేరకు టీటీడీ పాలక మండలి స్పందించే అవకాశం ఉన్నట్లు ఓ అధికారి చెప్పారు. యాత్రికుల అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని టీటీడీ పాలక మండలిలోని ఓ సభ్యుడు అభిప్రాయపడ్డారు.
"ఈ నెల చివరిలో జరిగే బోర్డు మీటింగులో స్పష్టత వస్తుంది" అని ఆయన తెలిపారు. బోర్డులో జరిగే అంశాలకు సంబంధించి ఎక్కువ మాట్లాడి, గందరగోళం సృష్టించడం కూడా మంచిది కాదన్నారు.
ఎలా సమర్థించుకుంటారో...
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు రెండు రోజులకు కుదించడానికే టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు సుముఖంగా ఉన్నట్లు ఆయన కార్యాలయ వర్గాల సమాచారం. అయితే,
ప్రస్తావించగదలిన అంశాల్లో రెండు ఉన్నాయి.
1. 2020లో పది రోజులు దర్శనం కల్పించాలనే నిర్ణయాన్ని ప్రస్తుత టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ సారధ్యంలోనే అమలు చేశారు. అప్పటి నుంచి సామాన్య యాత్రికులకు ఐదు లక్షల మందికి దర్శనం కల్పించారు.
2. పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు అమలుకు టీటీడీ పాలక మండలి సభ్యుడు చెన్నై కి చెందిన కృష్ణమూర్తి వైద్యనాథన్ కమిటీ చైర్మన్ గా పర్యవేక్షించారు. ఈ పాలక మండలిలో కూడా ఆయన బోర్డు సభ్యుడిగా ఉన్నారు. అత్యంత పటిష్ట వ్యవస్థ కలిగిన టిటిడిలో రద్దీ నియంత్రణలో ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఈ ఏడాది జనవరిలో టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాటను ఆసరాగా చేసుకుని, పది రోజుల దర్శనం కల్పించే విధానం రద్దు చేయడాన్ని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యుడు కృష్ణమూర్తి ఎలా సమర్థించుకుంటారనేది కూడా ఆసక్తికరంగా మారింది.
"యాత్రికుల్లో కొరవడిన సంయమనం వల్ల జరిగిన తప్పిదం వెనుక ఉన్న లోటుపాట్లను సమీక్షించాలి. మళ్లీ అలాంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాని ఆ పద్ధతి రద్దు చేయాలనుకోవడం మంచిది కాదు" అని తిరుమలకు చెందిన సీనియర్ జర్నలిస్టు సూచించారు. "కాలికి దెబ్బతగిలితే మందు వేసుకుంటాం. దానినికి నరికివేయలేం కదా" అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
Read More
Next Story