
తిరుమల :ఈ చోరీల గోల ఏంది స్వామీ?
శ్రీనివాసుడి సన్నిధిలో ఇంటి దొంగల బెడద ఎక్కువైంది? చెన్నై ఆలయంలో చేతివాటం ప్రదర్శించిన అధికారిపై ఆలస్యంగా టీటీడీ వేటు వేసింది.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ప్రపంచంలో అత్యంత సంపన్నుడు. దేశ, విదేశాల నుంచి వచ్చే యాత్రికుల ద్వారా హుండీ కానుకల రూపంలో రోజుకు సగటున 3.50 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటుంది. అందులో విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాల లేక్క వేరుగా ఉంటుంది. ఈ కానుకలు లెక్కించే పరకామణి తోపాటు దేశంలో టీటీడీ నిర్వహిస్తున్న సమాచార కేంద్రాలు, అక్కడి ఆలయాల్లో ఆదాయానికి భద్రత లేకుండా పోయిన వ్యవహారం చాలా ఆలస్యంగా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.
టీటీడీ రాష్ట్రంలోని విజయవాడ, వైజాగ్, దేశంలో హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, వేలూరు, కాంచీపురంతో పాటు చెన్నైలో కూడా సమాచార కేంద్రాలతో పాటు ఆలయాలు కూడా ఏర్పాటు చేసింది. టీటీడీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (Deputy Excutive Officer TTD) స్థాయిలో సూపరింటెండెండ్, సిబ్బందిని నియమించింది. అక్కడి ఆలయాల వద్ద టీటీడీ ప్రచురణల విక్రయం తోపాటు ఆలయానికి వచ్చే యాత్రికులకు సేవలు అందిస్తుంటారు. ఈ కేంద్రాల్లోని ఆలయాలకు కూడా హుండీ ద్వారా కానుకలు సమర్పిస్తూ ఉంటారు. ఈ కానుకలు పకడ్బందీగా పర్యవేక్షణలో లెక్కించిన తరువాత టీటీడీ పరకామణికి చేర్చాలి.
చెన్నైలో ఏమి జరిగింది?
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై టీ. నగర్ వద్ద టీటీడీ సమాచార కేంద్రంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం కూడా ఉంది. ఇక్కడి వ్యవహారాలను పర్యవేక్షించడానికి టీటీడీకి పాలక మండలి ఉన్నట్లే చెన్నైలో సలహా మండలి కూడా అక్కడి వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటుంది. ఈ కమిటీకి ఎలాంటి నిర్ణయాధికారులు లేకున్నా, ఉత్సవాల నిర్వహణ, సహకారం అందించడానికి మాత్రమే పరిమితం చేశారు. కాగా,
చెన్నైలోని టీటీడీ శ్రీవారి ఆలయంలో పరకామణిలో లెక్కింపులో అవకతవకలు జరిగాయి. అక్కడి ఆలయంలో యాత్రికులు సమర్పించిన హుండీ కానుకల్లో టీటీడీ సూపరింటెండెంట్ కృష్ణ కుమార్ చేతివాటం ప్రదర్శించారు. రూ ఆరు లక్షల విదేశీ కరెన్సీని స్వాహా చేసిన ఘటన గత గత సంవత్సరం అక్టోబర్ నెలలో వెలుగు చూసింది. హుండీ లెక్కింపులో విదేశీ కరెన్సీని స్వాహా చేసిన సీనియర్ అసిస్టెంట్ కృష్ణ కుమార్ రూ. 6 లక్షల విదేశీ కరెన్సీ స్వాహా చేశారు.
విజిలెన్స్ విచారణ
ప్రతి నెలా ఒకటో తేదీ పరకామణికి జమ కావాల్సిన నగదు లెక్క తేలకపోవడంతో టీటీడీ విజిలెన్స్ విచారణ జరిపింది. విదేశీ కరెన్సీ గల్లంతైన విషయాన్ని గుర్తించి, టీటీడీ ఉన్నతాధికారులకు నివేదిక కూడా సమర్పించారని తెలిసింది. అయితే, ఆ తరువాత కూడా ఆయన విధుల్లోనే కానసాగుతూ, బదిలీపై తిరుమలకు వచ్చిన కృష్ణకుమార్ వైకుంఠం -2 (సర్వదర్శనం క్యూ కాంప్లెక్స్) విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాగా ఆయనను ఈ నెల ఐదో తేదీ విధుల నుంచి సస్పెండ్ చేస్తూ, టీటీడీ ఈఓ జే. శ్యామలరావు ఆదేశాలు జారీ చేశారు. చెన్నై టీటీడీ సమాచార కేంద్రంలో కానుకల అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటూనే, తిరుమలకు ఎలా బదిలీ అయ్యారనేది చర్చకు దారితీసింది. సుమారు నాలుగు నెలల తరువాత ఆలస్యంగా ఆయనపై శాఖాపరంగా చర్యలు తీసుకున్న వ్యవహారం టీటీడీలో చర్చనీయాంశమైంది. విజిలెన్స్ అధికారులు గుర్తించి, నివేదిక ఇచ్చిన తరువాత కూడా చర్యలు తీసుకోవడంలో జాప్యం వెనుక ఆంతర్యం ఏమిటనేది తేలని పరిస్థితి. ఇదిలా వుండగా
2023 ఏప్రిల్ 29వ తేదీ తిరుమల శ్రీవారి పరకామణి నుంచి టీటీడీ ఉద్యోగి రవికుమార్ వంద కోట్ల రూపాయలు చోరీ చేసిన వ్యవహారం నిగ్గుతేల్చాలని బీజీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ పాలకమండలి సభ్యుడు జీ. భానుప్రకాష్ రెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ఏమైందనేది తేలకుండా పోయింది.
గత ఏడాది నవంబర్ 26న శ్రీవారి స్టీల్ హుండీ నుంచి చోరీ చేసిన వ్యవహారంలో సీసీ టీవీ పుటేజీ పరిశీలించిన సెక్యూరిటీ సిబ్బంది తమిళనాడుకు చెందిన వేణులింగంగా గుర్తించి అరెస్టు చేశారు. కానీ టీటీడీ ఉద్యోగి రవికుమార్ విషయంలో అలా వ్యవహరించలేకపోవడం ద్వారా అపవాదులకు గురవుతున్నారు.
ఈ ఏడాది జనవరిలో కూడా తిరుమల పరకామణిలో 100 గ్రాముల బంగారు బిస్కెట్ చోరీ చేస్తూ, కాంట్రాక్టు ఉద్యోగి వీరిశెట్టి పెంచలయ్య పట్టుబడిన విషయం తెలిసిందే. తిరుమల వన్ టౌన్ పోలీసుల విచారణలో గతంలో చేసిన చోరీలో 555 గ్రాముల బంగారు బిస్కెట్లు, 100 గ్రాముల ఆభరణాలు, 157 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. పెంచలయ్య నుంచి సుమారు 46 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులన్నీ గంటలు, రోజుల వ్యవధిలో విజిలెన్స్, తిరుమల పోలీసులు రోజుల వ్యవధిలో ఛేదించినా, చెన్నై సమాచార కేంద్రంలో ఘటనలో ఆలస్యం వెనుక ఆంతర్యం ఏమిటనేది మిస్టరీగా మారిందని అంటున్నారు.
Next Story