తిరుమల :జగన్ ఏమి చేయబోతున్నారు..?
x

తిరుమల :జగన్ ఏమి చేయబోతున్నారు..?

రాష్ట్ర రాజకీయాలకు తిరుమల కేంద్ర బిందువుగా, లడ్డూ ఓ అస్ర్తంగా మారింది. ఈ పరిస్థితుల్లో శ్రీవారి చెంతకు రానున్న జగన్ ఏమి చేయబోతున్నారు?


రాష్ట్ర రాజకీయాలు తిరుమల లడ్డూ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఆ ప్రకంపనలు ఆగడంలేదు టీటీడీ బుధవారం కల్తీ నెయ్యి సరఫరాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆరని వివాదం మంటల్లో మరింత నెయ్యి పోసినట్టుగా మారింది. ఈ పరిస్థితుల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు తమ రాజకీయ వ్యవహారాలను తిరుమల వరకు లాక్కుని రానున్నారు.

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యి కల్తీ జరిగినట్లు సీఎం ఎన్. చంద్రబాబు స్వయంగా ప్రకటించి, ప్రకంపనలు సృష్టించారు. దీనిపై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య వాదోపవాదాలు, ఆరోపణలు తీవ్ర స్థాయిలో సాగుతున్నాయి. ఎవరికి వారు సై అంటే సై అంటున్నారు.
ఈ నెల 28వ తేదీ అన్ని ఆలయాల్లో పూజలు చేయాలని వైసీపీ చీఫ్ వైఎస్. జగన్ పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. అంతేకాకుండా అదే రోజు ఆయన తిరమల పర్యటనకు రానున్నారు. అదే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తిరుమలకు వచ్చే వైఎస్. జగన్ ఏమి చేయబోతున్నారు.
1. శ్రీవారి దర్శనానికి పరిమితం అవుతారా?
2. శ్రీవారి పుష్కరిణిలో స్నానం ఆచరించి, ఆయన కూడా అఖిలాండి వద్ద అనూహ్య సత్య ప్రమాణానికి సిద్దం అవుతారా?
3. అంతకుముందే శ్రీవారికి తలనీలాలు సమర్పిస్తారా? తద్వారా నాకు కూడా హిందు ధర్మంపై అపార విశ్వాసం ఉందని చాటుతారా?
ఏమి చేయబోతున్నారనే చర్చ ప్రారంభమైంది.
ఎందుకు అంటే...
2004-19 మధ్య ప్రతపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర తర్వాత తిరుమల పర్యటనకు ఒక్కరే వచ్చయారు.
2019-24 వరకు అధికారంలో సీఎంగా ఉన్న వైఎస్. జగన్ తిరుమలకు వచ్చారు. గరుడోత్సవం వేళ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
అంతకుముందు
2004 -2009 వరకు సీఎంగా ఉన్న వైఎస్. జగన్ తండ్రి వైఎస్. రాజశేఖరరెడ్డి కూడా తిరుమలకు వచ్చారు. అంతకుముందు వైఎస్ఆర్ ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర సాగించారు. ముగింపు తరువాత ఆయన రైలులో తిరుపతికి చేరుకున్నారు. అలిపిరి పాదాలమండపం నుంచి తిరుమలకు పాదయాత్రగా వెళ్లారు.
అదే పద్దతిలో
2019 ఎన్నికలకు ముందు కూడా వైఎస్. జగన్ ప్రతిపక్ష హోదాలో కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేశారు. అది ముగిశాక తిరుపతికి చేరుకుని అలిపిరి నుంచి నడకమార్గంలో తిరుమలకు చేరుకున్నారు.
వారిద్దరూ ఏ సందర్బంలో కూడా తమ భార్యలను వెంట తీసుకుని వచ్చిన దాఖలాలే లేవు. పూర్తిగా క్రిస్టియన్ మతాన్ని ఆచరించే వారి కుటుంబం తిరుమలలో పాదం మోపిన దాఖలాలు లేవు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిలో గొడ్డు, పంది కొవ్వుతో పాటు చేపనూనె కలిసిందనే సీఎం చంద్రబాబు ఆరోపణలు కాకరేపాయి. దీనిపై వారం నుంచి రాజకీయ వాతావరణం కాకమీదుంది.
ఈ పరిస్థితుల్లో తిరుమల శ్రీవారిపై విశ్వాసం ఉంటే, "వైఎస్. జగన్ సతీసమేతంగా వచ్చి తలనీలాలు సమర్పించి, స్వామివారిని దర్శనం చేసుకోవాలి" అని జనసేనతో పాటు అనేక సంస్ధలు సవాల్ విసిరాయి.
అంతకుముందే "తమ హయాంలో నెయ్యి కల్తీ జరిగిఉంటే నా కుటుంబం రక్తంకక్కుని చావాలి" అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అనూహ్యంగా కొండకు చేరుకుని అఖిలాండం వద్ద సత్యప్రమాణం చేశారు.
ఈ పరిస్థితుల్లో మాజీ సీఎం వైఎస్. జగన్ తిరుమల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 27వ తేదీ రాత్రి ఆయన తిరుమలకు చేరుకుంటారు. 28వ తేదీ శనివారం ఆయన శ్రీవారిని దర్శించుకుంటారు. అని ట్వీట్ చేశారు. పార్టీవర్గాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. దీంతో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అదే రోజు రాష్ట్రంలోని ఆలయాల్లో పూజలు నిర్వహించాలని పిలుపు కూడా ఇచ్చారు.
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన వ్యవహారంలో అపచారం జరిగిందంటూ డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కల్యాణ్ ఇప్పటికే గుంటూరు జిల్లా నంబేరులోని దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలోప్రాయశ్చిత దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.
"జరిగిన పాపాన్నిఆదిలోనే పసిగట్టకపోవడం వల్ల హైందవ జాతికే కళంకం. కలియుగ దైవానికి జరిగిన ఘోరమైన అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతిఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి" అని అన్నారు.
11 రోజుల తరువాత దీక్ష ముగించడానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సెప్టెంబర్ ఒకటిన తిరుపతికి చేరుకుంటారు. అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్లి, బస చేస్తారు. మరుసటి రోజు శ్రీవారిని దర్శించుకుంటారు.
1. ఈయన కూడా అఖిలాండం వద్ద ఏమి చేస్తారు?
2. శాపనార్ధాలు పెడతారా?
3. స్వామివారిని ఏమని ప్రార్ధిస్తారు?
అనే విషయంపై కూడా ఉత్కంఠ ఏర్పడింది.
శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగే మొదటి బ్రహ్మోత్సవాల్లో సీఎం ఎన్. చంద్రబాబు సెప్టెంబర్ నాలుగున తిరుమలకు రానున్నారు.
దీంతో లడ్డూ వ్యవహారం చుట్టూ తిరుగుతున్న రాష్ట్ర రాజకీయాలు తిరుమల కేంద్రంగా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది వేచిచూడాలి.
Read More
Next Story