తిరుమలలో దొరకునా ఇటువంటి సేవ...
x

తిరుమలలో దొరకునా ఇటువంటి సేవ...

తిరుమల శ్రీవారి సేవ ప్రారంభమై ఏడాది నవంబర్ 1 నాటికి 25 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్బంగా ప్రత్యేక కథనం


తిరుపతికి చేరుకునే యాత్రికులకు రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, టీటీడీ వసతి గృహాల సముదాయాల వద్ద మొదట స్వాగతం పలికేది శ్రీవారిసేవకులే. యాత్రికులకు దారి చూపిస్తారు.

తిరుమలకు వెళితే ఆరెంజ్ కలర్ దుస్తుల్లో మెడకు స్కార్ఫ్ ధరించి, నుదుట మూడు నామాలు ధరించిన స్వచ్ఛంద సేవకులు కనిపిస్తారు. శ్రీవారి దర్శనానికి క్యూలో యాత్రికులను క్రమబద్ధీకరించడం, వారికి అన్నప్రసాదాలు, నీరు అందించే సేవల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. కొంతమంది సంవత్సరాలుగా ఈ సేవకోసమే తిరుమల వస్తున్నారు. హైదరాబాద్, చందానగర్ కు చెందిన గృహిణి ఎం శ్రీదేవి (40) ఈ కోవలోకే వస్తారు. తాను పదేళ్లుగా ఈ స్వచ్ఛంద సేవలో పాల్గొంటున్నట్లు ఆమె ‘ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ కుచెప్పారు.

“టీటీడీలో పదేళ్లుగా శ్రీవారిసేవ చేయడానికి వస్తున్నా. నేను తిరుమల వస్తున్నపుడు నా వెంట కొందరు వచ్చారు. వారి అనుభవాలను తెలుసుకున్న తరువాత ఇంకొందరు కూడా పోటీ పడ్డారు. ఇపుడు నేను గ్రూప్ లీడర్. నా నుంచి 300 మంది వరకు శ్రీవారి సేవ చేశారు. ఆ సంఖ్య ఇంకా పెరుగుతుంది,’ అని ఆమె చెప్పారు.

శ్రీవారి దర్శనానికి యాత్రికులు ఎంత ఆసక్తి చూపిస్తారో.. స్వచ్ఛందంగా శ్రీవారి సేవ చేయడానికి వలంటీర్ గా మారేందుకు కూడా అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనితో వలంటీర్ల సంఖ్య బాగా పెరుగుతూ ఉంది. ఫలితంగా వలంటీర్ సేవలను తిరుమల తిరుపతి దేవస్థానాలు నడిపే ఆసుపత్రులకు కూడా విస్తరిపంచేయాలని అధికారులు భావిస్తున్నారు. "తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వచ్చే యాత్రికుల‌కు మ‌రింత మెరుగైన సేవలు అందించాలని నిర్ణయించాం. శ్రీ‌వారి సేవ‌కుల‌కు గ్రూప్ సూప‌ర్ వైజ‌ర్లు, ట్రైనర్స్‌తో నిరంత‌ర‌ శిక్ష‌ణ ఇవ్వ‌డానికి నూత‌న సాఫ్ట్‌వేర్ రూపొందించాం" అని బీఆర్‌.నాయుడు చెప్పారు. అహ్మదాబాద్ ఐఐఎం ప్రతినిధులు శ్రీవారి సేవకులకు శిక్షణకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు టిటిడి ఛైర్మన్ వివరించారు.
దీనికోసం ప్రత్యేక రిక్రూట్ మెంటు నిర్వహిస్తున్నారు. అంతేకాదు, వలంటీర్ కార్యకలాపాలను పర్యవేక్షించే సూపర్ వైజర్లను నియమించబోతున్నారు.దీనికి అహ్మదాబాద్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంటు (IIM-A) సహకరిస్తూ ఉంది.
టిటిడి యంత్రాంగానికి తోడు భక్తులకు దర్శనం, ఇతర సేవల విషయంలో గైడెన్స్ ఇచ్చేందుకు ఉద్దేశించిన ఈ వలంటీర్ కు పెద్ద చరిత్ర ఉంది. టీటీడీ ఉద్యోగులతో సమానంగా తిరుమలలో రోజుకు 3000 వేల మంది స్వచ్ఛంద సేవకులు తిరుమల, తిరుపతిలో యాత్రికులకు దర్శనం, లడ్డూ ప్రసాదం, ఆహారం, వసతి వంటి సేవలు అందిస్తున్నారు. ఈ స్వచ్ఛంద సేవాకార్యక్రమం 2000 సంవత్సరం నవంబర్ లో మొదలయింది. ఈ స్వచ్ఛంద సేవకు ఈ ఏడాది నవంబర్ ఒకటో తేదీకి 25 ఏళ్లు నిండుతాయి. ఈ రెండున్నర దశాబ్దాలలో 17 లక్షల మంది సేవకులు తిరుమలలో సేవలు అందించారు.
ఎలా పునాది పడింది..?
టీటీడీలో 2000 సంవత్సరం నాటికి దాదాపు పది వేలకు మంది పైగానే ఉద్యోగులు సేవలు అందించే వారు. వారితో పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేసే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉండేది. శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికుల సంఖ్య రోజుకు సగటున 60 వేల నుంచి 65 వేల మంది వరకు ఉండేది. ఈ పరిస్థితుల్లో ఆలయంలో యాత్రికులను క్రమబద్ధీకరించడం, క్యూలు, కంపార్టు మెంట్లలో అన్నప్రసాదాలు, నీరు అందించడానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ పరిస్థితులు టీటీడీ అధికారులను ఆలోచనలో పడేశాయి.
దీనికి ప్రేరణ పుట్టపర్తి ప్రశాంతి నిలయం నుంచి వచ్చింది.
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో యాత్రికుల క్రమబ్ధీకరణ, సాయిబాబా నడిచి వచ్చే సమయంలో సేవకులు క్రమశిక్షణతో మెలిగే విధానం, విశ్రాంతి గదుల వద్ద దేశ, విదేశీ యాత్రికులకు సమాచారం ఇవ్వడం చాలా పకడ్బందీగా జరిగేవి. పుట్టపర్తిలో సాయిరాం అని మంతం జపిస్తూ సాయిబాబాను చూసేందుకు వచ్చే యాత్రికులకు సహకరించడానికి భక్తులు చాలా ప్రాధాన్యం ఇస్తారు. అక్కడ ఎక్కడా లేని క్రమశిక్షణ, నిబద్ధత కనిపిస్తింది. ఇది ఆనాటి తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక వర్గం గమనించింది.అలాంటి స్వచ్ఛంద సేవకుల వ్యవస్థ ఎలా తిరుమలో అమలు చేయవచ్చాఅనే చర్చ జరిగింది. దీనిని పరిశీలించేందుకు అధికారలును పంపారు. అప్పటి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి సుభాష్ గౌడ్ పుట్టపర్తి వెళ్లి అక్కడ వలంటీర్ వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించి వచ్చాక తిరుమల అలాంటి వ్యవస్థను అమలుచేయడం కష్టమేమే కాదని నివేదించారు. మొదటి 2000 జయేంద్ర సరస్వతి ద్వారా శ్రీనివాససేవగా ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని తరువాత శ్రీవారిసేవగా మార్పు చేసి, కంచి పీఠాధిపతితో లాంఛనంగా ప్రారంభించారని సుభాష్ గౌడ్ 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' కు తెలిపారు.
అంతకుముందే.. పుట్టపర్తిలో అధ్యయనం చేసిన విశ్రాంత ఈఓ డాక్టర్ పీ.కృష్ణయ్య ఏమన్నారంటే..

శ్రీవారి సేవకుల సంఖ్య ఐదు లక్షలకు చేరడం ఆనందంగా ఉందని ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి, టీటీడీ మాజీ ఈఓ డాక్టర్ పి. కృష్ణయ్య పరమానందపడ్డారు.

"ఆ నాడు కూడా సీఎంగా చంద్రబాబే ఉన్నారు. బ్రహ్మోత్సవాల వేళ, నారాయణ హృదయాలకు సంబంధించి ఉచిత ఆపరేషన్లు పుట్టపర్తి సత్యసాయి ఆస్పత్రిలో పరిశీలించాలని సూచించారు. నా కుటుంబ సమేతంగా వెళ్లి సత్యసాయిబాబాను దర్శించుకున్నా. అక్కడి వంటశాల, అన్నదానం, ఆస్పత్రిలో స్వచ్ఛంద సేవకుల పనితీరును పరిశీలించా. ఆ తరహాలోనే టీటీడీలో శ్రీవారిసేవ ప్రారంభానికి పునాది పడింది" అని ప్రస్తుతం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గా ఉన్న మాజీ ఈఓ కృష్ణయ్య తన భావాలను పంచుకున్నారు.

శ్రీవారిసేవకు తీవ్ర పోటీ..
“శ్రీవారి సేవకు వచ్చే సేవకుల్లో మహిళలు ఆరంజ్ కలర్ చీర, తెలుపు రవిక, మెడకు స్కార్ఫ్, పురుషులు తెలుపు పంచ లేదా ప్యాంటు, చొక్కా ధరించాలి. మెడకు స్కార్ఫ్ కట్టుకునే విధంగా డ్రస్ కోడ్ అమలు చేశారు. 2000 సంవత్సరంలోటిటిగి ఎగ్జిక్యూటివ్ అధికారి పి. కృష్ణయ్య ఈ శ్రీవారిసేవను కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశంకరాచార్య ద్వారా ప్రారంభింప చేశారు,” అని సుభాష్ గౌడ్ చెప్పారు.
"శ్రీవారి సేవ ప్రారంభించాం. దాని లక్ష్యం అర్ధం చేసుకుని వలంటీర్ గా పేర్లు నమోదు చేసుకునేందుకు నిదానంగా స్పందన వచ్చింది. తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద యాత్రికులు తిరుమల వెళ్లే మార్గం చెప్పడం, తిరుపతిలో అతిథి గృహాలకు ఎలా వెళ్లాలనే విషయాల మీద ఈ వలంటీర్లకు శిక్షణ ఇచ్చాం. తిరుమలలో కూడా ఆ శ్రీవారి సేవకులు ప్రత్యేక ఆకర్షణగా మారారు,” అని సుభాష్ గౌడ్ గుర్తు చేసుకున్నారు.
తొలి అనుభవం
"తిరుమల ఆలయం ముందు చంకలో ఓ పెద్ద నోటుపుస్తకం పెట్టుకుని నిలబడ్డా. శ్రీవారి దర్శనం చేసుకుని యాత్రికుల వెలుపలికి వస్తున్న యాత్రికులను పలకరిస్తున్నా. అయ్యా.. మీ పేరు, అడ్రస్, ఫోన్ (ల్యాండ్ ఫోన్) నంబర్ చెబుతారా? మిమ్మలిని శ్రీవారిసేవకు పిలుస్తా.. అని అడిగితే నన్ను ఒక పిచ్చోడు మాదిరి చూశారు" అని సుభాష్ గౌడ్ గుర్తు చేసుకున్నారు. కొన్ని నెలల్లోనే మీడియా ద్వారా చేసిన ప్రచారం వల్ల
తిరుమలలోని ఏపీఆర్ఓ కార్యాలయాలనికి రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తులు రావడం ప్రారంభం అయ్యాయి అని సుభాష్ గౌడ్ వివరించారు. కొద్ది నేలల్లోనే వలంటీర్ గామారాలని ఆసక్తి కనపర్చే వారి సంఖ్యలక్షలోకి మారిందని అపుడు ‘శ్రీవారి సేవ’కు ఓఎస్ డిగా ఉన్న తలారి రవి చెప్పారు.
"శ్రీవారిసేవకు ప్రచారం కల్పించాం. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో లక్షలాది కరపత్రాలు ముద్రించి, పంపిణీ చేశాం. వీటన్నింటికంటే కొత్తగా, వింతగా కనిపించిన డ్రెస్ కోడ్, సేవకులపై మీడియా లో వచ్చిన కథనాల వల్ల మంచి ఫలితం వచ్చింది" అని ఇపుడు చీఫ్ పీఆర్ఓగా ఉన్న రవి గుర్తుచేసుకున్నారు. 200 మందితో ఈ కార్యక్రమం ప్రారంభించిన నెలల వ్యవధిలోనే వందల దరఖాస్తులు సేవకుల నుంచి అందాయి. ఆ సంఖ్య 2008 నాటికి 1.75 లక్షలకు చేరింది,” అని రవి వివరించారు.
ఆన్ లైన్ కోటాలో..
శ్రీవారి సేవ ప్రారంభించినప్పటి నుంచి 2016 సంవత్సరం వరకు పోస్టల్ ద్వారా దరఖాస్తులు తీసుకున్నారు. స్వచ్ఛంద సేవ చేయడానికి రావాలనుకునే వారి సంఖ్య వేల నుంచి లక్షలకు చేరింది. దీంతో ఆన్ లైన్ లో ప్రతి మూడు నెలలకు ఒకసారి కోటా విడుదల చేస్తున్నారు. దరఖాస్తుల సీనియారిటీ ప్రకారం పది నుంచి 15 మంది సభ్యుల బృందాలకు సమయం కేటాయించారు. ఒక వలంటీర్ అనుభవం అనేక మందికి ప్రేరణగా నిల్వడం చూడవచ్చు, ఒక వలంటీర్ అనేకమంది వలంటీర్లుగా మార్చడం మనకు కనపిస్తుంది.

చాలా మంది ఈ సేవలో కష్టాలను మర్చిపోయిన మానసిక శాంతి పొందుతున్నారు. ఉదాహరణకు కర్నాటక చెందిన మండల దివ్య సాహితి(24) తన సాఫ్ట్ వేర్ ఉద్యోగం నుంచి ఉన్న వత్తిడి నుంచి ఈ సేవలో ఉపశమనం పొందుతున్నట్లు చెప్పారు. “శ్రీవారిసేవ అనేది మనిషిలో సేవాభావాన్ని విషయాన్ని బోధిస్తుంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా నిత్యం తలమునకలై ఉంటాం. ఈ సేవ ద్వారా ఆ వత్తిడి నుంచి ఉపశమనం పొందుతున్నా. దీనికి మా కుటుంబీకుల సహకారం కూడా ఉంది. టీటీడీ శ్రీవారిసేవకురాలిగా ఐటీ రంగంలో తన వంతు సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటా,” అని దివ్యసాహితి అన్నారు.
తిరుమలలో సేవ చేయడానికి వచ్చే యాత్రికులకు అక్కడ పీఆర్ఓ కార్యాలయం డార్మెటరీలో వసతి కల్పిస్తారు. తిరుమల ఆలయం, మాడవీధులు, క్యూలో యాత్రికులకు మంచినీరు, అన్నప్రసాదాలు అందించడం, తరిగొండ వెంబమాంబ అన్నదానసత్రంలో సేవలకు వినియోగించుకుంటున్నారు.
శ్రీవారి సేవకు వచ్చే యాత్రికులకు వసతితో పాటు వారి సేవల్లో చివరి రోజు శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదం అందిస్తారు. రవాణా ఖర్చులు సేవకులే భరించుకుంటున్నారు.
తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయాలు, అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గంలో యాత్రికులకు సేవలు అందించడానికి ప్రత్యేకంగా ప్రతి నెలా కోటా టీటీడీ ఆన్ లైన్ కోటా విడుదల చేస్తోంది. అందులో


1. శ్రీవారిసేవ జనరల్ (తిరుపతి, తిరుమల)
2 నవనీత సేవ (మహిళలకు మాత్రమే)
3.పరకామణి సేవ (పురుషులకు
4. గ్రూప్ లీడర్ సేవ. ఇది కొత్తగా ప్రారంభించారు. గత ఏడాది బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సీఎం ఎన్. చంద్రబాబు శ్రీవారిసేవపై టీటీడీ అధికారులకు కొన్ని సూచనలు చేయడంతో టీటీడీ అధికారులు శ్రీసత్యసాయి సేవా సంస్థ (పుట్టపర్తి), ఇషా ఫౌండేషన్ (కోయంబత్తూరు), ఆర్ట్ ఆఫ్ లివింగ్ (బెంగళూరు) సంస్థల్లో కూడా అధ్యయనం చేశారు.
శ్రీవారిసేవను ఆధునీకరించడం ద్వారా మరింత సుక్షితులను చేయడానికి అహ్మదాబాద్ ఐఐటీకి బాధ్యతలు అప్పగించారు. దీంతో మూడు నెలల పాటు తిరుపతి, తిరుమలలో శ్రీవారిసేవపై అధ్యయనం చేసి, నివేదిక సమర్పించారు.
మెరుగైన సేవల కోసం శిక్షణ

మాట్లాడున్న టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు.ఆయనకు కుడిపక్క ఈఓ జే. శ్యామలరావు. అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి(ఎడపక్క)

తిరుమలలో యాత్రికులకు మెరుగైన సేవలు అందించడానికి అహ్మదాబాద్ ఐఐఎం సహకారం తీసుకుంటున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. “గ్రూప్ సూప‌ర్ వైజ‌ర్లు, ట్రైనర్స్‌తో స్వచ్ఛంద సేవ‌కుల‌కు నిరంత‌ర‌ శిక్ష‌ణ ఏర్పాటు చేశాం. దీనికోసం నూత‌న సాఫ్ట్‌వేర్ రూపొందించాం" అని బీఆర్‌నాయుడు చెప్పారు. తిరుమలలో శ్రీవారి సేవ ప్రారంభించిన 25 సంవత్సరాల్లో 17 లక్షల మంది స్వచ్ఛంధంగా సేవలు అందించారని ఆయన వివరించారు.

ఇక పుట్ట పర్తికి చెందిన ఎం ముక్తి(25) ఫిజియోధెరపిస్టుగా నడకమార్గంలో వచ్చే భక్తులకు సేవలు అందించాలని కోరుకుంటూ ఉంది. ముక్తి పుట్టపర్తి సాయిబాబా విద్యాసంస్థ ఫిజియో థెరపి పూర్తి చేశారు. ప్రశాంతి నిలయంలో ఉన్నపుడు అక్కడ వలంటీర్ సేవలను ఆమె గమనించారు. ఇదే స్ఫూర్తిగా ఇపుడు తిరుమలలో వలంటీర్ సేవలందిస్తున్నారు. “మా కుటుంబంలోని వారందరూ ఈ సేవకు వస్తుంటారు. దీనికి మా పెద్దమ్మ శ్రీదేవి స్ఫూర్తి. 25 ఏళ్ల తరువాత శ్రీవారిసేవలో ప్రొఫెషల్స్ కి ప్రాధాన్యత ఇవ్వడం స్వాగతించదగిన విషయం. కాలినడక వెళ్లే యాత్రికులకు మా సేవలు చాలా అవసరం. ఫిజియోథెరపిస్టుగా కూడా నా సేవలు అందిస్తా,” అని ముక్తి చెపారు.

రోజుకు 3,500 మంది సేవలు
యాత్రికులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంగా సంస్కరణలు తీసుకుని వచ్చామని కార్యనిర్వహణాధికారి జే. శ్యామలరావు చెప్పారు. అందులో క్యూలు, ల‌గేజి కౌంట‌ర్లు, అన్న‌ప్ర‌సాద కేంద్రాల్లో శ్రీ‌వారి సేవ‌కుల‌తో నిరంత‌రాయంగా అన్న‌ప్ర‌సాదాల పంపిణీ చేస్తున్నామ‌న్నారు.
శ్రీవారి సేవకుల ట్రైనర్స్‌కు ఐఐఎం అహ్మదాబాద్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా సేవకులకు శిక్షణ ఇస్తాయని శ్యామలరావు తెలిపారు.
గ్రూప్ సూపర్ వైజర్స్
ఈ విభాగంలో 45 - 65 సంవత్సరాల వయసు ఉన్న శ్రీవారి సేవలు పేర్లు నమోదు చేసుకోవాలి. తిరుమలలో సేవకుల పర్యవేక్షించి గ్రేడింగ్ ఇస్తారు. ఆ మేరకు అధికారులకు నివేదిస్తారు. తద్వారా సేవకులు మరింత క్రమశిక్షణ, నిబద్ధతతో సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందనేది టీటీడీ అధికారుల అభిప్రాయం.
సేవాకాల పరిమితి 15 రోజులు, 30 రోజులు, 90 రోజులు
విద్యార్హత: కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
ప్రొఫెషనల్ సేవ: శ్రీవారి సేవకుల సేవలను టీటీడీలో మరింత విస్తృతం చేనున్నారు. టిటిడిలోని స్విమ్స్, బర్డ్, ఆయుర్వేద, చిన్న పిల్లల ఆసుపత్రి, అశ్వినీ ఆసుపత్రులలో రోగులకు ఉచితంగా సేవలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటితో ఆసుపత్రులకు రోగుల మంచి సహకారం లభిస్తుంది. అపుడు ఆసుప్రతులలో వైద్యసేవలందించడం తప్పమిగతా సేవలకు సిబ్బంది లేరు. శ్రీవారి వలంటీర్ వ్యవస్థ ఆసుపత్రులకు విస్తరించే ఈ కొరత దాదాపు తీరుతుంది. విదేశాలలో ఉన్న ఎందరో ఎన్.ఆర్.ఐ నిపుణులు శ్రీవారి సేవలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. వివిధ వృత్తులలో ప్రావీణ్యం కల్గిన నిపుణులకు శ్రీవారి సేవకు అవకాశం కల్పిస్తున్నారు.
Read More
Next Story