
Tirumala to Kolhapur | మహాలక్ష్మీ... ఇది శ్రీవారి సారె తల్లీ...
కొల్హాపూర్ లో పట్టువస్త్రాలు అందించిన టీటీడీ చైర్మన్ నాయుడు.
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలతో పాటు దేశంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీవైష్ణవాలతో ఉన్న అనుబంధాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొనసాగిస్తోంది. అందులో భాగంగా మహారాష్ట్రలో ఉన్న కొల్హానూర్ మహాలక్ష్మీ అమ్మవారికి శ్రీవారి ఆలయం నుంచి టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు తో కలిసి పాలక మండలి సభ్యులు సోమవారం పట్టుచీరలు తీసుకుని వెళ్లి సమర్పించారు.
టీటీడీ చైర్మన్ బిఆర్. నాయుడు సారధ్యంలో అధికారులు, వేదపండితులు సోమవారం కొల్హానూర్ చేరుకున్నారు. వారికి మహాలక్షి ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
అంతకుమందు తిరుమల నుంచి అమ్మవారికి సమర్పించడానికి తీసుకుని వెళ్లిన పట్టుచీరలు, పసుపు, కుంకుమ, కంకణాలను పళ్లంలో ఉంచారు. ఈ కానుకలు తట్టను టీటీడీ చైర్మన్ బిఆర్. నాయుడు తలపై ఉంచుకోగా, కొల్హాపూర్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో వేదమంత్రాల మధ్య అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు. అమ్మవారి సన్నిధిలో అర్చకులు మంత్రోచ్ఛారణలతో టీటీడీ చైర్మన్ నాయుడు, పాలక మండలి సభ్యులను వేదాశీర్చచనం అందించారు. ఆ తరువాత పట్టువస్త్రాలను అమ్మవారి వద్దకు చేర్చారు.
ఆ తరువాత జరిగిన వేడుకలో కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయ అధికారులు, బోర్డు సభ్యులు టీటీడీ పాలక మండలి సభ్యులకు వేదికపైనే శ్రీవారి కోసం కానుకలు కూడా అందించారు. టీటీడీ చైర్మన్ వెంటే బోర్డు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే), జీ. భానుప్రకాష్ రెడ్డి, డాలర్స్ దివాకరరెడ్డి, టీడీపీ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి తోపాటు టీటీడీ అధికారుల కూడా ఉన్నారు.
అమ్మవారి దర్శనం తరువాత తిరుమల నుంచి వెళ్లిన టీటీడీ బోర్డు సభ్యులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహాలక్షిఅమ్మవారి చిత్రపటాలను అందించారు. వారికి అక్కడి పండితులు వేదాశీర్చనం చేశారు.