
పట్టపురాణి పద్మావతికి తిరుమల శ్రీవారి సారె..
కిటకిటలాడుతున్న తిరుచానూరు.
తిరుచానూరు పద్మావతీ అమ్మవారికి తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తీసుకుని వచ్చే సారె మధ్యాహ్నం సమర్పించనున్నారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి నూతన వస్త్రాలు, ఆభరణాలు, పసుపు, కుంకుమ ఇతర వస్తువుల సారె వెదురుబుట్టల్లో తీసుకున్న టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి తోపాటు బోర్డు సభ్యులు తిరుచానూరుకు మంగళవారం ఉదయం బయలుదేరారు.
తిరుమల శ్రీవారికి తిరుచానూరు అలుమేలు మంగమ్మ (పద్మావతీ అమ్మవారు పట్టపురాణి. తిరుచానూరులో జరిగే ప్రతి విశేషమైన సందర్భాల్లో ఆరణాలు, పసుపు, కుంకుమ తీసుకుని వచ్చి, సమర్పించడం ఆనవాయితీ. దీనిని కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం చక్రస్నానం నిర్వహించనున్న నేపథ్యంలో సారెతో బయలుదేరారు. ప్రతి సంవత్సరం టీటీటీ అధికారులు చారిత్రక సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
తిరుమల నుంచి..
తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తిరుచానూరుకు పంచమి సారె తీసుకున్న టీటీడీ పాలక మండలి సభ్యులు, అధికారులు బయలుదేరారు. టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తోపాటు బోర్డు సభ్యులు, అధికారులు, తిరుమల వేదపండితులు అలిపిరి వద్దకు చేరుకుంటారు. అమ్మవారికి సమర్పించడానికి శ్రీవారి ఆలయం నుంచి తీసుకుని బయలుదేరిన సారెలో పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు, అభరణాలతో కూడిన ఇతర వస్తువులన్నీ కొత్తవెదురు బుట్టల్లో నింపారు. ఆభరణాలను సీల్ వేసిన స్టీల్ బాక్సులో ఉంచిన తరువాత టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, ఈఓ సింఘాల తలపై ఉంచుకుని మంగళవాయిద్యాల మధ్య ఆలయం నుంచి వెలుపలికి వచ్చారు.
అలిపిరి నుంచి...
తిరుమల నుంచి తీసకుని వస్తున్న సారెను అలిపిరి పాదాల మండపం వద్దకు చేరుస్తారు. అక్కడ హారుతులు సమర్పించిన తరువాత ఏనుగు అంబారీపై ఉంచి, తిరుచానూరు పనుపు మండపం దాకా వైభవంగా సారె ఊరేగింపుగా తీసుకుని వస్తారు. పసుపు మండపం నుంచి సారెకు ప్రత్యేక పూజలు నిర్చహించడం ఆనవాయితీ. అక్కడి నుంచి కళాకారుల నృత్యాలు, కోలాటాల మధ్య మంగళ వాయిద్యాలతో సారెను పుష్కరిణి వద్దకు తీసుకెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులతో పాటు అధికారులు కూడా పాల్గొన్నారు.
అమ్మవారికి సమర్పణ
తిరుచానూరు పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 12.10 గంటలకు కుంభ లగ్నంలో చక్రస్నానం నిర్వహించడానికి వేదపండితులు ఏర్పాట్లు చేశారు. ఆ కార్యక్రమానికి ముందే తిరుమల నుంచి తీసుకుని వచ్చిన సారెను పద్మావతీ అమ్మవారికి సమర్పించనున్నారు.
యాత్రికులతో నిండిన తిరుచానూరు
కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం చక్రస్నానం నిర్వహించనున్నారు. అదే సమయంలో పద్మ పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేయడానికి యాత్రికులు భారీగా తిరుచానూరు చేరుకున్నారు. పద్మావతీ అమ్మవారి ఆలయానికి సమీపంలోని ఐదు హోల్డింగ్ పాయింట్లలో నిలువరించిన టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ విభాగంతో పాటు పోలీసులు రద్దీ నియంత్రణపై దృష్టి సారించారు. యాత్రికులకు ఇబ్బంది లేకుండా టీటీడీ ఏర్పాటు చేసిన అల్పాహారం శ్రీవారి సేవకులు, టీటీడీ ఉద్యోగులు వేకువజాము నుంచే విధుల్లోకి వచ్చారు. కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించాలనే కోరికతో భారీగా యాత్రికులు చేరుకున్నారు.
Next Story

