తిరుమల: గరుడోత్సవంలో భద్రత ఇంత డొల్లా!  మాటలు తప్ప చేతలేవీ?
x
తిరుమలలో ఆదివారం గరుడోత్సవానికి వచ్చిన యాత్రికుల్లో ఓ భాగం...

తిరుమల: గరుడోత్సవంలో భద్రత ఇంత డొల్లా! మాటలు తప్ప చేతలేవీ?

రాంబగీచ ఘటన నేపథ్యంలోె మీడియాపై టీటీడీ ఘాటుగా స్పందించింది.


తిరుమలలో రద్దీని గుర్తించడం ద్వారా అప్రమత్తం చేసే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది. ఏడు వేల మంది పోలీసులు ఉన్నారు. తోపులాటలో కొందరు యాత్రికులు అస్వస్థతకు గురయ్యారు. బారికేడ్లు విరిగాయి. ఓ పోలీస్ అధికారి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రద్దీని నియంత్రించాలనే ఆ అధికారి అత్యుత్సాహం వల్ల మహిళలు కూడా ఇబ్బంది పడ్డారు. తోపులాటలో కొందరు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటనలపై టీటీడీ మీడియాకు ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. అదే సమయంలో భద్రతా చర్యలు పటిష్టంగా ఉన్నాయని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, టీటీడీ సీవీఎస్ఓ కేవి. మురళీకృష్ణను అభినందించారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ప్రతి సంవత్సరంవేలాది మంది యాత్రికులు వస్తారని తెలుసు. ఎన్ని భద్రతా చర్యలు తీసుకున్నా, శ్రీవారి గరుడోత్సవంలో ఆదివారం రాత్రి అపశృతులు తప్పలేదనే విషయం తిరుమలలో అత్యంత కీలకమైన రాంబగీచా అతిథి గృహాల సముదాయం (ఆర్బీజీహెచ్) మార్గంలో చోటుచేసుకున్నాయి.


తిరుమల ఆలయానికి వెళ్లే ప్రధానమార్గం ఆర్బీజీహెచ్ సముదాయం వద్ద జరిగిన సంఘటనలు యాత్రికులను వేదనకు గురి చేశాయి. ఈ ప్రదేశంలో చోటుచేసుకున్న పరిణామాలు అవాక్కయేలా చేశాయి. తోపులాటలో కొందరు అస్వస్థతకు కూడా గురయ్యారు. మచ్చుకు కొన్ని సంఘటనలు వీడియోల ద్వారా స్పష్టం అవుతున్నాయి.

తిరుమల ఆలయం, మాడవీధుల్లో రద్దీ నియంత్రణ ( Crowd Management ) లో టీటీడీ విజిలెన్స్ విభాగం తోపాటు సివిల్ పోలీసులకు వ్యూహం తోపాటు మెళకువలు తెలుసు. టీటీడీ విజిలెన్స్ విభాగానికి ఆ గుర్తింపు ఉంది. ఈ విషయంలో ఆ విభాగాలు ఆదర్శంగా నిలుస్తాయి. పాఠాలు కూడా నేర్పిస్తాయి. అయితే,
తిరుమలో శ్రీవేంకటేశ్వరస్వామి వారు గరుడవాహనంపై ఊరేగే సమయంలో ఆర్బీజీహెచ్ ( Rambageecha Guest House Complex RBGH ) అతిథి గృహాల సముదాయం సమీపంలో పోలీసుల వ్యవహార సరళి విమర్శలకు ఆస్కారం కల్పించింది. స్థానికేతర పోలీసులనే ఇక్కడ నియమించడం వల్ల ఈ పరిస్ధితికి కారణమైందనేది తిరుమలలో వ్యవహారాలను దగ్గరగా పరిశీలించే వారు చెబుతున్నారు.
ఏమి జరిగింది.?
శ్రీవారి ఆలయం వద్దకు వెళ్లడానికి రాంబగీచ అతిథి గృహాల సముదాయంలోని మార్గాలు ప్రధానమైనవి. వీఐపీల వాహనాలు మాత్రమే ఈ మార్గంలో అనుమతిస్తారు. అతిథి గృహాలకు చెంతనే నడకలో సెల్లార్ లో వెళ్లడానికి కూడా అవకాశం ఉంది. ఈ మార్గంలోనే ఆదివారం సాయంత్రం యాత్రికులు మాడవీధుల్లోకి వెళ్లడానికి భారీగా తరలి వచ్చారు. వారందరినీ నియంత్రించడంలో తోపులాట జరిగింది. దీంతో గరుడ వాహనంపై ఊరేగుతున్న శ్రీవారిని చూడాలని వచ్చిన మహిళలు ఇబ్బంది పడ్డారు. బారికేడ్ కు వెలుపల ఉన్న ఓ ఎస్ఐ గేటు పైకి ఎక్కి యాత్రికులకు అడ్డుగా నిలవడానికి చేసిన యత్నంలో కిందపడిపోయారు.

సహచర సిబ్బంది ఆయనను లేపి, సపరిచర్యలు చేశారు. ఆ తరువాత కూడా ఆయన ఆగలేదు. బారికేడ్లు తొలగించి, యాత్రికుల మధ్యకు దూసుకుని పోయారు. మహిళలనే విచక్షణ కూడా మరిచిన ఆయన వ్యవహరించిన తీరు జుగుత్సాకరంగా కనిపించింది. ఇక్కడ రద్దీని నియంత్రించడంలో వైఫల్యం స్పష్టంగా కనిపించింది. మహిళా పోలీసులు, అందులో చిత్తూరు జిల్లా పోలీస్ యంత్రాంగం లేకపోవడం స్పష్టంగా కనిపించింది. పొరుగు ప్రాంతాల వారికి అనుభవం లేదని చెప్పడం కాదు కానీ. స్థానిక పోలీసులకు ఉండే అవగాహన వేరు అనేది తిరుమల వ్యవహారాలు దగ్గర నుంచి గమనించే వారు చెప్ప మాటలు.

కారణం ఏమిటి?
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది 1,500 మంది ఉన్నారు. వారికి అదనంగా ఆరువేల మందిని రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భద్రత కోసం రప్పించారు. గరుడోత్సవం సందర్భంగా అదనపంగా 1500 మందిని నియమించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి నెల కిందటి నుంచే టీటీడీ అధికారులు సమీక్షులు, ఏర్పాట్ల కోసం విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. తిరుపతి జిల్లా పోలీసు అధికారులను కూడా సమాయత్తం చేశారు. ఇందులో తప్పేమీ లేదు. ముందస్తు ఏర్పాట్లకు సమాయత్తం చేయడంలో టీటీడీ అధికారులు సంసిద్ధం కావడం వెనుక ప్రధాన కారణం బ్రహ్మోత్సవాల వేళ యాత్రికులు ఎక్కువగా ఉంటారనేది ఒక కారణం. గరుడోత్సవం రోజు యాత్రికుల సంఖ్య లక్షల్లో ఉంటుందనేది ఓ అంచనా. ఆ మేరకు సన్నాహాలు చేయడంలో టీటీడీ చైర్మన్ బిఆర్. నాయుడు, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి, మళ్లీ తిరుపతి ఎస్పీగా వచ్చిన ఎల్. సుబ్బారాయుడు సమీక్షలతో సన్నాహాలు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది.
ఒత్తిడి కేంద్రాలు
తిరుమలలో అత్యంత ఒత్తిడి ( Pressure points )ఉన్న ప్రదేశాలు
1. ఆర్బీజీహెచ్ ( Rambageecha Guest House Complex RBGH ) మార్గాలు.
2. సాధారణ యాత్రికులు నడిచిరావడానికి ఉన్న ఫుట్ పాసింగ్
3. వరాహస్వామి ఆలయం, తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన కేంద్రానికి వెళ్లే మార్గం.
4. బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి కిందికి దిగివచ్చే ప్రదేశం. ఈ ప్రదేశాల్లో టీటీడీ వ్యవహారాలు తెలిసిన సివిల్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి బాధ్యతలు అప్పగించి, వారి సారధ్యంలో పొరుగు ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసు సిబ్బందిని నియమించడంలో ముందుజాగ్రత్తలు కొరవడినట్లు కనిపిస్తోంది.
ఆర్బీజీహెచ్ ఘటన
రాంబగీచ అతిథి గృహాల సముదాయం వద్ద చోటుచేసుకున్న జుగుత్సాకర ఘటనలు యాత్రికులనే కాదు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. ఇవి శ్రీవారి యాత్రికులను వేదనకు గురి చేశాయనడంలో సందేహం లేదు. తిరుమల వ్యవహారాలు తెలిసిన భద్రతా సిబ్బంది ప్రధానంగా మహిళా పోలిసులు ఆ ప్రదేశంలో లేకపోవడం అనేది లోటుగా కనిపించింది. పురుష పోలీసులు కూడా యాత్రికుల రద్దీ నియంత్రరణలో సహనం కోల్పోయినట్లు కనిపించింది.
శ్రీవారి ఆలయం మాడవీదుల్లోకి వెళ్లే ప్రధానమార్గాల్లో పురుష పోలీసుల తోపాటు మహిళా పోలీసులు లేకపోవడం అనేది ప్రధాన లోటుగా కనిపించింది. గత ఐదేళ్లతో పోలిస్తే ఈ కేంద్రాల వద్ద రద్దీ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన అసాధారణ భద్రత కూడా యాత్రికులకు ఆశించిన స్థాయిలో నియంత్రించడంలో రాంబగీచ అతిథి గృహాల సముదాయంలో చోటుచేసుకున్న పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఇది ఒకటి మాత్రమే వెలుగు చూసింది. ఇవి భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలకు ఎలాంటి పాఠాలు నేర్పిస్తాయనేది కాలమే సమాధానం చెప్పాలి.

గరుడసేవలో జరిగిన సంఘటనలపై టీటీడీ స్పందించింది.

"భక్తులు లేపాక్షి నుంచి నందకం వైపు వెళ్తుండగా, వర్షం రావడం వల్ల ఒకేసారి రాంభగీచా మీదుగా మాడ వీధిలోకి రావడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంలో పోలీసు సిబ్బంది సంయమనం తో, సమర్థవంతంగా భక్తులను నందకం మళ్లించారు. ఎటువంటి తొక్కిసలాట, తోపులాట, గేట్ల ధ్వంసం, లేదా భక్తులకు లేదా పోలీసులకు గాయాలు జరగలేదు. భక్తుల రద్దీ వలన యువతి స్వల్ప అస్వస్థకు గురిఅయింది తప్ప ఎటువంటి తోపులాట లేదు" అని స్పష్టం చేశారు.

పోలీసులకు ఈఓ అభినందన


బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా గరుడోత్సవం రోజు గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ పోలీసుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడును గరుడవాహనం వద్ద ప్రత్యేకంగా ఈఓ అభినందించారు.


పోలీసులతో సమన్వయం చేసుకోవడం ద్వారా విజిలెన్స్ సిబ్బందితో సమర్థవంతంగా పనిచేశారని టీటీడీ సీవీఎస్ఓ కేవి. మురళీకృష్ణను కూడా ఈఓ సింఘాల్ ప్రత్యేకంగా అభినందించారు.

Read More
Next Story