తిరుమల: రోడ్డు పక్కన జింకల మూగవేదన
x

తిరుమల: రోడ్డు పక్కన జింకల మూగవేదన

తిరుమల : ఆకలి అనే పదానికి చోటు లేని ప్రదేశం. అడవుల్లో స్వేచ్ఛగా తిరగాల్సిన వన్యప్రాణులు రోడ్డు పక్కన ఎందుకు ఉన్నాయి. వాటి మూగవేదన ఏమిటి?


తిరుమల నుంచి తిరుపతికి వచ్చేటప్పుడు రోడ్డు సమీపానికి వచ్చే జింకలు, దుప్పి వంటి వన్యప్రాణులు పిల్లలకే కాదు. పెద్దలను కూడా అలరిస్తున్నాయి. వాటిని దగ్గరగా చూసే వారు అలా ఫీల్ అవుతున్నారు. వాటి కళ్లలో తొణకిసలాడే దైన్యాన్ని గమనించడం లేదు. వైద్యులకు మనుషుల మానసిక వైద్యం తెలుస్తుంది. అటవీశాఖాధికారులకు మాత్రమే జంతువుల కదలికలు, వాటి స్వభావం అర్ధం చేసుకునే నైపుణ్యం ఉంటుంది. అది వారికి ఇచ్చే శిక్షణలో భాగం. థియరీ కూడా ఉంటుంది.


తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కొండముచ్చులకు నిలయం. శ్రీనివాసుని చెంతకు వెళ్లే స్థానికులు ప్రత్యేకంగా అరటిపళ్ళు కొని, రోడ్డు పక్కన వాటికి అందిస్తుంటారు.

రెండవ ఘాట్లో రోడ్డు పక్కన చేరే వన్యప్రాణులు అలమటిస్తున్నాయి. తమను కరుణించే యాత్రికుల కోసం దైన్యమైన చూపులతో నిరీక్షిస్తున్నాయి.
ఇవన్నీ అటవీ, టీటీడీ అధికారులకు నిత్యం కళ్లముందే కనిపిస్తుంటాయి. వారికి తెలియనివి ఏమీ కాదు. అయినా, అటవీశాఖ ఏర్పాటు చేసిన బోర్డులు మాత్రం విడ్డూరంగా కనిపిస్తాయి.
తిరుమల దిగువ ఘాట్ రోడ్డు పక్కన చెట్ల మధ్య మెలికలు తిరిగిన కొమ్ములతో ఆ సాధు జంతులు సంచరిస్తూ ఉంటాయి. వాటిని చూడడానికి యాత్రికులు వాహనాలు ఆపడమే తరువాయి. అవి దగ్గరికి వస్తాయి. ఆబగా మెడచాచి నోరుతెరుస్తుంటాయి. సందర్శకులకు ఇది సరదాగా కనిపించవచ్చు. కానీ వాటి దయనీయ పరిస్థితి అర్థం చేసుకోవడం లేదు. వారి వద్ద ఉన్న మిగిలిన పళ్లు అందిస్తే, మెరిసే కళ్లతో తింటూ ఉం డడం సర్వసాధారణంగా కనిపించే దృశ్యాలు ఘాట్ రోడ్డులో కనిపిస్తాయి.

ఈ పరిస్థితికి కారణం

అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే కాలిబాటలో ఉదయం నుంచి రాత్రి వరకు కనీసం రోజుకు 20 వేల మంది నడకదారిలో వెళుతుంటారు. ఏడు మైలు సమీపంలోని ఆంజనేయస్వామి విగ్రహం దాటిన తరువాత దాదాపు 25 ఏళ్ల కిందట దాదాపు అడవిలోనే 300 ఎకరాల్లో జింకలపార్కు ఏర్పాటు చేశారు. అందులో కొన్ని జీవులను వదిలారు. నడకమార్గాన్ని ఆనుకునే ఈ పార్కు ఉంటుంది.

అక్కడ చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారు పైనాపిల్, బొప్పాయి, కీరకాయల ముక్కలు కోసం విక్రయిస్తుంటారు. నడకమార్గంలో వెళ్లే వారు దుకాణదారుల నుంచి కొనుక్కుని, జింకల నోటికి అందిస్తుంటారు. గతంలో ఇక్కడ ఫొటోలు తీసుకునేందుకు ఇస్టపడే వారు. ప్రస్తుతం సెల్ ఫోన్లు అందుబాటులో ఉండడంతో సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇనపకంచెల మధ్య పార్కుగా ఏర్పాటు చేసిస ప్రదేశంలో ఈ జింకలకు టీటీడీ లారీలో గ్రాసం అందించేది. నీటి కొరత లేకుండా తొట్టెలు కూడా నిర్మించింది. కొంతకాలం వాటి పరిస్థితి సవ్యంగానే ఉండేది. బెరుకుదనం పోయి, అవి మనుషులకు బాగా అలవాటుపడ్డాయి. ఇదిలా ఉంటే..
దాదాపు 15 ఏళ్ల కిందట ఉన్నఫలంగా కొన్నింటిని తిరుపతి ఎస్వీ జూపార్కుకు తరలించారు. ఇంకొన్నింటిని అధికారులు వాటికి స్చేచ్ఛను ప్రసాదించినట్లు అడవిలోకి వదిలారు. అలా వాళ్లు అనుకున్నారు. జనజీవనంలో కలవడానికి ఆస్కారం లేని వాటి పరిస్థితి ఇప్పడు దారుణంగా మారింది.
తిరుమల నుంచి తిరుపతికి వచ్చే ఘాట్ రోడ్డు పక్కనే అడవిలో చెల్ల మధ్య భిక్షాటన చేస్తున్నట్లుగా అవి మోరలు ఎత్తుకుని, యాత్రికుల జాలి, దయ కోసం అర్రులు చాస్తున్నాయి.
నోరు ఉంది. మాటలు ఉండవు. అవి జంతువులు కాబట్టి. వాటి కళ్లలోకి సూటిగా చూస్తే, ఎన్నో మాటలు వినిపిస్తాయి. వాటి వేదన అర్థం అవుతుంది. అడవుల్లో స్వచ్ఛగా గడ్డి మేస్తే, సెలయేటి నీరు తాగుతూ తమ వాటి మానాన అవి జీవించేవి. అలాంటి సాధు జంతువులను జనజీవనానికి అలవాటు చేశారు. అర్ధంతరంగా వాటిని మళ్ళీ అడవిలోకి వదిలారు. ఈ పరిస్థితుల్లో అవి అడవిలోకి వెళ్లలేక, జనంలో సంచరించే వీలులేని స్థితిలో దైన్యంగా యాత్రికుల వైపు చూస్తున్నాయి. మాటలు రాని ఆ జంతువుల మూగమనసులు వేదనకు గురవుతున్నాయి.
అటవీశాఖ ఏమంటోంది...

అలిపిరి కాలిబాటతో పాటు, ఘాట్ రోడ్డులో కూడా టీటీడీ ఏర్పాటు చేసిన బోర్డులు విచిత్రంగా అనిపిస్తుంది. "వెళ్లిపో మానవా... నాకు నీ ఆహారం వద్దురా" అని నినాదాలు రాశారు. దీనిపై అభ్యంతరం చెప్పడానికి వాటికి మాటలు రావు. చదువు అంటే ఏంటో కూడా తెలియదు. ఎందుకంటే అవి జంతువులు. కనీసం వారైనా వాటికి ఆహారం అందిస్తారా? అంటే అదీ లేదు. " అమ్మ పెట్టదు... అడుక్కోనివ్వదు" అనే సామెను అక్షరసత్యం చేస్తున్నారు. అయితే,
"టీటీడీ అధికారులకు గుర్తుకు వచ్చినప్పుడు మాత్రమే గడ్డి అందిస్తుంటారు" అని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో అవి రోడ్డు పక్కన యాత్రికుల పక్కన దైన్యంగా చూస్తున్నాయి. వాటిని టీటీడీ, అటవీశాఖ అధికారులు ఏమేరకు కరుణిస్తాయనేది చూడాలి.
Read More
Next Story