తిరుమల :వారిద్దరి హిందూ సీన్ రక్తికట్టిందబ్బా..   మిగిలింది..జగన్ వంతే !
x

తిరుమల :వారిద్దరి 'హిందూ సీన్' రక్తికట్టిందబ్బా.. మిగిలింది..జగన్ వంతే !

రాజకీయాలకు తిరుమల క్షేత్రాన్ని టీడీపీ కూటమి నేతలు చక్కగా వాడుకున్నారు. జగన్ ముందు వారిద్దరు పెద్దసవాల్ ఉంచడానికి చేసిన ప్రయత్నంలో ఎవరికి ఎవరూ తీసిపోలేదు.


హిందూ ధర్మంపై వైసీపీ చీఫ్ వైఎస్. జగన్ ను డిఫెన్స్ లో పడేయాలనే లక్ష్యాన్ని మొదట డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తాజాగా సీఎం ఎన్. చంద్రబాబు పూర్తి చేశారు. ఇక మిగిలింది వైఎస్. జగన్ వంతే.. ఈ వ్యవహారంలో వారిద్దరూ తిరుమలను చక్కగా వాడుకున్నారు. ఇందులో వారు ఎవరికి ఎవరూ తీసిపోమని నిరూపించుకున్నారు.

తిరుమల శ్రీవారి క్షేత్రం రాజకీయాలకు వేదికగా మారింది. ఎందుకంటే.. తిరుమలకు మాజీ సీఎం వైఎస్. జగన్, అంతకుముందు ఆయన తండ్రి వైఎస్ఆర్ ఒంటరిగానే వచ్చి స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. సతీసమేతంగా ఎప్పుడూ రాలేదు. తిరుమల లడ్డు వ్యవహారంలో దీనిని మతానికి ముడిపెట్టిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైఎస్. జగన్ ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే.
"హిందూమతంపై విశ్వాసం ఉంటే సతీసమేతంగా తిరుమలకు రావాలి. స్వామివారిపై అచంచల భక్తి ఉంది" అని డిక్లరేషన్ ఇవ్వాలి. ఆ తరువాత కొండపై తలనీలాలు సమర్పించాలి" అని టీడీపీ కూటమి నేతలు మాజీ సీఎం వైఎస్. జగన్ ను సవాల్ చేసిన విషయం తెలిసిందే. "ఇవన్నీ పాటించకుంటే, తిరుమలకు రాకుండా అడ్డుకుంటాం" అని భీకర హెచ్చరికలు చేయడం, ఆయన తిరుమల పర్యటన రద్దు చేసుకోవడం" తెలిసిందే.
దీంతో "డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందనే తిరుమలకు రాలేదు" అని టీడీపీ. బీజేపీ, జనసేన నేతలు కొత్త పల్లవి అందుకున్న విషయంపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది.

"మేమే హిందూత్వం, సనాతన ధర్మరక్షణలో ఛాంపియన్లం" అని చెప్పుకోవడానికి లేని ఔన్నత్యాన్ని ప్రదర్శించారు. మాజీ సీఎం వైఎస్. జగన్ టార్గెట్గా అధికార టీడీపీ, జనసేన పార్టీల అధ్యక్షులు ఎవరికి దొరికిన అవకాశాన్ని వారు అస్త్రంగా వాడుకున్నారు. అందులో డిప్యటీ సీఎం పవన్ కల్యాణ్ నోటితే చెప్పకనే చేతల్లో చూపించాను. ఇక నీ సమాధానం ఏమిటి? జగన్ అనే సవాల్ ముందుంచారు.వైఎస్. జగన్ ను మరింతగా ఇరుకున పెట్టాలనే యత్నంలో బీజేపీ గొంతుకగా మారిన పవన్ కల్యాణ్.. తాను "ఫక్తు సనాతన హిందువుడిని" అని ప్రకటించుకున్నారు. తన ఇద్దరు కూతుళ్లలో ఆద్య కాకుండా చిన్న కూతురు కొలేనా అంజనా పవనోజీ పక్షాన డిక్లరేష్ ఇవ్వడం ద్వారా పవన్ కల్యాణ్ విమర్శకుల నోళ్లు మూయించారు.
నేనేమి తక్కువా..

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి రెండు రోజుల పర్యటనకు సీఎం ఎన్. చంద్రబాబు, ఆయన భార్య నారా భవనేశ్వరితో కలిసి శుక్రవారం (అక్టోబర్ 4న) తిరుపతికి వచ్చారు. ఏటా బ్రహ్మోత్సవాల వేళ ఇలా వస్త్రాలు సమర్పించడం సంప్రదాయంగా ఆచరిస్తున్నారు. అయితే,
గతంలో : సాధారణంగా పట్టువస్త్రాల సమర్పణ అనంతరం స్వామివారిని దర్శించుకుని, రాత్రికి తిరుమలలో బస చేసేవారు. మరుసటి రోజు తిరుగుముఖం పట్టేవారు.
తాజాగా: తిరుమలలో శ్రీవారికి సతీసమేతంగా పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు శుక్రవారం సాయత్రం స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆ తరువాత రాత్రి తిరుమల ఆలయ మాడవీధుల్లో నిర్వహించిన పెద్దశేషవాహనసేవలో వారిద్దరూ పాల్గొన్నారు. ఈ విధంగా స్వామివారి వాహనసేవలో పాల్గొనడం మొదటిసారి కావడం గమనార్హం.

దీని వెనుక కథేమిటి?
తిరుమలలో పవన్ కల్యాణ్ తన కూతురి పక్షాన డిక్లరేషన్ ఇవ్వడం వెనక, చంద్రబాబు సతీసమేతంగా స్వామివారి వాహన సేవలో పాల్గొనే వెనక కూడా లోతైన వ్యవహారమే ఉందనేది బహిరంగ రహస్యం.
"తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రం జరిగింది" అని సీఎం చంద్రబాబు మాటల మంటలు రగిల్చారు. దీనికి వైసీపీ పాలనలో జరిగిన వ్యవహారమే అని నిందలు వేశారు. ఇందులో మాజీ సీఎం వైఎస్. జగన్ ను ఇరకాటంలో పెట్టాలనే వ్యూహంలో సఫలమయ్యారు. ఇందులో సందేహం లేదు. దీనికి తోడు..
"వైఎస్. జగన్, ఆయన కుటుంబీకులు క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తారు. జగన్ అంతకుముందు ఆయన తండ్రి వైఎస్ఆర్ మాత్రమే తిరుమలకు వచ్చారు. కుటుంబీకులు ఎవరూ రాలేదు. అంటే వారికి హిందుమతంపై విశ్వాసం లేదు. అనే విషయాన్ని దేశవ్యాపితంగా ప్రజల మనస్సుల్లో చొప్పించడంలో సఫలమయ్యారు.
మేము మాత్రమే హిందూ మతాన్ని, ఆచార వ్యవహారాలు పాటించడంలో ముందున్నాం. అనే సందేశం ఇవ్వడం ద్వారా జగన్ ను మరింతగా కట్టడి చేయాలని కూటమి భాగస్వామ్య నేతలు పవన్, చంద్రబాబు భారీ స్కెచ్ వేశారనేది అర్థం అవుతుంది. డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందనే కారణంతోనే జగన్ తిరుమలకు రాలేదనే విషయాన్ని కూడా వారు ప్రస్తావిస్తున్నారు.
బ్రహ్మోత్సవాలు ముగిసే లోపు, లేదా ఆ తరువాత మాజీ సీఎం వైఎస్. జగన్ తిరుమలకు వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమచారం. ఆయన ఒక్కరే వస్తారా? భార్యతో కలిసి రానున్నారా? ఏమి చేస్తారు? సీఎం, డిప్యూటీ సీఎంకు ధీటుగా ఏమి సమాధానం ఇస్తారు. ఎలా వ్యవహరిస్తారనేది వేచిచూడాలి.
Read More
Next Story